బీజేపీలోకి విజయశాంతి రీఎంట్రీ.. ముహూర్తం ఫిక్స్ - Press Review

ఫొటో సోర్స్, Vijayashanthi/Facebook
తెలంగాణ కాంగ్రెస్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుందని.. రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు విజయశాంతి దూరంగా ఉంటున్నారు. దుబ్బాకలో హాట్‌హాట్‌గా ఉప ఎన్నికల ప్రచారపర్వం జరుగుతున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయమని పిలుపు ఇవ్వలేదు.
దీంతో రాములమ్మ కాంగ్రెస్‌కు దూరం కానున్నట్లు ప్రచారం జరిగింది. అన్నట్టుగానే ఆమె త్వరలో కమలం గూటికి చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు.
ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు అరగంట పాటు ఈ భేటీ జరిగినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
అంతేకాకుండా ఈ సమావేశానికి కొద్ది రోజుల కిందట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా విజయశాంతితో భేటీ అయినట్లు సమాచారం. నవంబర్ 10 లోపు ముహూర్తం చూసుకుని రాములమ్మ బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. దిల్లీ పెద్దల సమక్షంలో విజయశాంతి కమలం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ: దసరా మూడు రోజుల్లో రికార్డు స్థాయిలో ఎంత మద్యం అమ్ముడుపోయిందో తెలుసా?
దసరాకు లిక్కర్ విక్రయాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చిందని వెలుగు దినపత్రిక తెలిపింది.
ఈ నెల 22, 23, 24 తేదీల్లో మద్యం డిపోల నుంచి రూ. 406 కోట్ల విలువైన మద్యాన్ని వైన్ షాపులకు తరలించారు.
22న రూ.131 కోట్లు, 23న రూ.175 కోట్లు, 24న రూ.100 కోట్ల లిక్కర్ బయటకొచ్చింది. ఇందులో 4.71 లక్షల కేసుల లిక్కర్, 4.44 లక్షల కేసుల బీర్లున్నాయి.
ఈ లిక్కర్‌ను పండుగ సమయంలో, సోమవారం అమ్మారు.
సాధారణంగా ఒక రోజులో రూ. 70 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు సేల్స్ జరుగుతుంటాయి.
ఇక ఈ నెలలో 24వ తేదీ వరకు రూ. 1,979 కోట్ల మద్యాన్ని అమ్మారు. గతేడాది ఇదే సమయంలో రూ. 1,374 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయి.

ఫొటో సోర్స్, Malvi Malhotra
పెళ్లికి నిరాకరించిందని నటిపై కత్తితో దాడి
తనతో వివాహానికి నిరాకరించిందని బుల్లితెర నటి మాల్వీ మల్హోత్రాపై ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడని ఈనాడు తెలిపింది.
ఫేస్‌బుక్ ద్వారా ఆమెకు పరిచయమైన అతడు కత్తితో దాడి చేశాడు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ముంబయి వెర్సోవా ప్రాంతంలోని ఓ కేఫ్ నుంచి నటి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కుమార్ మహిపాల్ సింగ్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతడు చిత్ర పరిశ్రమలో నిర్మాత అని తెలిసింది.
‘కారులో వెళ్తున్న సింగ్.. కేఫ్ సమీపంలో ఉన్న నటిని అడ్డగించాడు. తనను ఎందుకు దూరం పెట్టావని, ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం సింగ్ నటి పొట్ట భాగంలో, చేతులపై కత్తితో దాడి చేసి, పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఐపీసీ సెక్షన్ 307 (హత్యాయత్నం)తోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం’ అని వెర్సోవా పోలీసు స్టేషన్‌కు చెందిన సీనియర్ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర ఠాకూర్ తెలిపారు.
ఫేస్‌బుక్ ద్వారా సింగ్ పరిచయం అయ్యాడని, ఏడాదిగా అతను తెలుసని నటి పోలీసులకు చెప్పారు. అతడు తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని, కానీ దానికి తిరస్కరించానని పేర్కొన్నారు.
మాల్వీ ‘ఉడాన్’, ‘హోటెల్ మిలాన్’ టీవీ షోలతో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం కోకిలబెన్ అంబానీ ఆసుపత్రితో ఆమెకు చికిత్స జరుగుతోంది.

దుబ్బాక ఉపఎన్నిక: ‘‘నోటీసులు ఇచ్చే... తనిఖీలు చేశాం’’
దుబ్బాక ఉపఎన్నికల కోసం అక్రమంగా నగదు నిల్వ ఉంచారనే సమాచారం మేరకు సిద్దిపేట పట్టణంలో మూడుచోట్ల తనిఖీలు నిర్వహించగా... సురభి అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షల నగదు గుర్తించామని, ముందుగా ఆయనకు నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (తహసీల్దార్), ఏసీపీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించామని సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ మంగళవారం తెలిపినట్లు సాక్షి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని, ఎవరు సమాచారం ఇచ్చినా, అనుమానం ఉన్న ప్రతి ఇంటిని తనిఖీ చేస్తామన్నారు.
సోమవారం నాలుగు ప్రదేశాల్లో సోదాలు చేయగా అంజన్‌రావు ఇంట్లో రూ. 18.67 లక్షల నగదును దొరికిందని, సోదాల సమయంలో ప్రతి అంశాన్ని ఫోటోలు, వీడియో తీయడం జరిగిందని తెలిపారు.
అంజన్‌రావు సమక్షంలోనే సోదాలు నిర్వహించామన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే పోలీసులతో గొడవకు దిగి సీజ్ చేసిన డబ్బులను లాక్కున్నారన్నారు.
సిద్దిపేట సంఘటనపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి ఫోన్‌లో వివరించామని, సిద్దిపేటకు వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, రావొద్దని ఆయనకు ముందుగానే చెప్పా మన్నారు.
అయినా ఎంపీ సిద్దిపేటకు వచ్చే ప్రయత్నం చేయగా అదుపులోకి తీసుకుని తి రిగి కరీంనగర్ పంపించామన్నారు. ఉపఎన్నికల ప్రచారం కోసం వచ్చే ఎవరినీ అడ్డుకోవడం లేదన్నారు. పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పకడ్బందీగా దుబ్బాక ఉపఎన్నికలు నిర్వహించేలా జిల్లా యంత్రాంగం పని చేస్తోందన్నారు.

ఫొటో సోర్స్, I&PR Telangana
దత్తత గ్రామమే ధరణి వేదిక
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతోందని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.
ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్ ఈ నెల 29న ఇక్కడి తహసీల్దార్ కార్యాలయంలో ప్రారంభించనున్నారు. అనంతరం గ్రామ శివారులో బహిరంగ సభ నుంచి ‘ధరణి’ సందేశం ఇవ్వనున్నారు.
సీఎస్ సోమేశ్‌కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్‌రావు, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, మేడ్చల్ కలెక్టర్ డా.వాసం వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్ విద్యాసాగర్, సీపీ సజ్జనార్ మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు.
రాష్ట్ర ప్రజలకు పారదర్శకమైన రెవెన్యూ సేవలను అందించాలనే సంకల్పంతో కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా ధరణి పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.
నగరానికి అత్యంత చేరువలో ఉన్నా అభివృద్ధికి నోచుకోని మూడుచింతలపల్లిని మూడేండ్ల కిందట ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్నారు. మండల కేంద్రంగా మార్చడంతోపాటు ముఖ్యమంత్రి స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి రూ.28.71కోట్లతో అభివృద్ధి చేశారు.
ఇవి కూడా చదవండి:
- వైఎస్ జగన్: సుప్రీంకోర్టు జడ్జిపై ఆరోపణలతో భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన ఏపీ సీఎం
- సుప్రీంకోర్టు ‘సంక్షోభం’: న్యాయమూర్తుల లేఖలో ఏముందంటే..
- బీబీసీ ఇంటర్వ్యూ: ‘న్యాయవ్యవస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టాలి’
- రంజన్ గొగోయ్: భారత రాజకీయాల్లో అయోధ్యకాండకు 'ముగింపు' పలికిన చీఫ్ జస్టిస్
- ఆర్టీఐ పరిధిలోకి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం
- ఇటీవలి కాలంలో సుప్రీం కోర్టు తీర్పులు వివాదాలకు దారి తీస్తున్నాయా
- "సీజేఐ వేధించారంటున్న ఆ మహిళ మరి సుప్రీంకోర్టునే ఎందుకు నమ్మారు"
- న్యాయమూర్తులపై జగన్ ఫిర్యాదు: ‘జడ్జిలకు రాజ్యాంగం మినహాయింపు ఇవ్వలేదు.. వారిని ప్రశ్నించాల్సిందే’ - అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








