భారతదేశ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి.. ‘తప్పును సరిదిద్దాం’ - కిషన్ రెడ్డి : ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Survey of India
భారత రాజకీయ పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి గుర్తింపు దక్కింది అంటూ ఈనాడు సహా అన్ని ప్రధాన పత్రికలూ కథనాలు ప్రచురించాయి.
జమ్ము కశ్మీర్ మ్యాప్ తయారీ సమయంలో జరిగిన పొరపాటును సరిదిద్ది కేంద్ర హోంశాఖ తాజాగా ఈ చిత్రపటాన్ని విడుదల చేసింది. హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చొరవతో హోంశాఖ ఈ తప్పును సరిదిద్దింది.
కేంద్రం ఇటీవల విడుదల చేసిన రాజకీయ చిత్రపటంలో అమరావతికి స్థానం లభించని విషయాన్ని గుంటూరు తెదెపా ఎంపీ గల్లా జయదేవ్ గురువారం జీరో అవర్‌లో ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా ఆ నగర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రికి కూడా ఇది అవమానం అని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై స్పందించిన హోంశాఖ సహాయమంత్రి దిద్దుబాటుకు ఉపక్రమించారు.
శుక్రవారం హోంశాఖ అధికారుల ద్వారా సర్వే ఆఫ్ ఇండియా అధికారులను పిలిపించి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చేర్పించారు.
ఇది కేవలం పొరపాటు వల్ల జరిగిన తప్పిదమే తప్ప ఇందులో మరో ఉద్దేశం లేదని మంత్రి వ్యాఖ్యానించారని ఈనాడు చెప్పింది.
జమ్ముకశ్మీర్ నూతన మ్యాప్ తయారీ సమయంలో జరిగిన పొరపాటును సరిదిద్ది కొత్త మ్యాప్ అప్ డేట్ చేయించినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. పదేళ్లవరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండొచ్చని విభజన చట్టంలో నిబంధన ఉన్న కారణంగా అమరావతిని ఏపీ రాజధానినిగా చూపలేదనడంలో వాస్తవం లేదన్నారు.
అమరావతిని రాజధానిగా పేర్కొంటూ ఇదివరకే జీవో విడుదలైన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారని కథనంలో రాశారు.
‘అమరావతి మ్యాప్ నుంచి మిస్ అయిందని ఎంపీలు గురువారం లేవనెత్తిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని నేను ఈ అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. తప్పును సరిదిద్దాం’ అని పేర్కొంటూ నూతన మ్యాప్‌ను జత చేశారు. ఈ ట్విటర్ పోస్టును ఆయన జయదేవ్ గల్లా, మిథున్‌రెడ్డిలకు ట్యాగ్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images/BBC
ఆర్టీసీ ప్రైవేటీకరణకు సమర్థించిన హైకోర్టు
టీఎస్ ఆర్టీసీలో 5,100 ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వాలంటూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు ధర్మాసనం సమర్థించిందని ఆంధ్రజ్యోతి సహా అన్ని ప్రధాన పత్రికలూ రాశాయి.
మోటారు వాహనాల సవరణ చట్టం ప్రకారం ఈ విషయంలో ప్రభుత్వానికి విశేషాధికారాలు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసిందని చెప్పాయి.
ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వడానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా హైకోర్టు వివరించింది. ప్రైవేటు ఆపరేటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించవచ్చని, అయితే, అది 50 శాతానికి మించరాదని తెలిపింది.
5100 ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వడానికి కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టివేసింది.
''చట్ట నిబంధనలు పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మోటారు వాహనాల చట్టం-1988లోని సెక్షన్ 102 ప్రకారం ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకుని ఏదేని నిర్ణయం తీసుకునే విశేషాధికారాలు ప్రభుత్వానికి ఉంటాయి. నిబంధనల ప్రకారం.. ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వాలంటే చట్ట సవరణకు సంబంధించి తొలుత గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. దానిపై అభ్యంతరాలు స్వీకరించేందుకు స్థానిక పత్రికల్లో 30 రోజులు గడువు ఇస్తూ ప్రకటన ఇవ్వాలి. ప్రజల నుంచి, ఆర్టీసీ నుంచి అభ్యంతరాలు స్వీకరించాలి. ఈ నిర్ణయంతో నష్టపోయే ఆర్టీసీ అభిప్రాయాన్ని తీసుకోవాలి'' అని కోర్టు నిర్దేశించినట్లు ఆంధ్రజ్యోతి కథనంలో రాశారు.
ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
బార్ల లైసెన్సులు రద్దు చేసిన ఏపీ సర్కారు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సాక్షి కథనం ప్రచురించింది.
బార్లతోపాటు స్టార్ హోటళ్లు, మైక్రో బ్రూవరీల లైసెన్సులు కూడా రద్దు కానున్నాయి. దశల వారీ మద్యనిషేధం, నియంత్రణలో భాగంగా ప్రస్తుతం ఉన్న 797 బార్లలో 40 శాతం(319) మూసేయనున్నారు. మిగిలిన 60 శాతం (478 బార్లు)కు జనవరి 1 నుంచి కొత్తగా లైసెన్సులు జారీ చేయనున్నట్లు ఇందులో చెప్పారు.
అదేవిధంగా కొత్త బార్లకు లైసెన్సు ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచింది. ఈ మేరకు బార్ల రద్దు, కొత్త బార్ల పాలసీకి సంబంధించి ప్రభుత్వం శుక్రవారం వేర్వేరుగా ఉత్తర్వులు ఇచ్చింది.
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి.. 2021 డిసెంబర్ 31 వరకు రెండేళ్లపాటు కొత్త బార్ల పాలసీ అమల్లో ఉంటుంది. దీని ప్రకారం.. బార్ లైసెన్స్ దరఖాస్తు ఫీజును రూ.10 లక్షలుగా నిర్ణయించారు.
దరఖాస్తు చేసుకున్నవారికి బార్ లైసెన్సు వచ్చినా, రాకున్నా ఈ రుసుం తిరిగి చెల్లించరు. బార్లలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే మద్యం సరఫరా చేస్తారు. ఆహార పదార్థాలను 11 గంటల వరకు అందిస్తారు.
త్రీస్టార్, ఆపై స్థాయి హోటళ్లలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం అందుబాటులో ఉంటుంది. ఆహారాన్ని అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వ్ చేస్తారు అని సాక్షి చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
పింక్ బాల్ టెస్టులో భారత్ జోరు
భారత టెస్టు క్రికెట్‌లో చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్‌లో విరాట్‌సేన చేలరేగిపోయిందని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.
డే అండ్ నైట్ టెస్టులో తమ డేంజరస్ బౌలింగ్‌తో బంగ్లాను బెంబేలెత్తించిన టీమ్‌ఇండియా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ విజృంభించింది.
ఫలితంగా ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజే మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది.
సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ (5/22), ఉమేశ్ యాదవ్ (3/29), షమీ (2/36) నిప్పులు చెరగడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటైంది.
అనంతరం మొదటి ఇన్నిగ్స్ ప్రారంభించిన టీమ్‌ఇండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 46 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.
కెప్టెన్ విరాట్ కోహ్లీ (93 బంతుల్లో 59 బ్యాటింగ్; 8 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (55; 8 ఫోర్లు) హాఫ్‌సెంచరీలతో ఆకట్టుకున్నారు.
చేతిలో 7 వికెట్లున్న భారత్ ప్రస్తుతం బంగ్లా స్కోరుకంటే 68 పరుగుల ముందంజలో ఉంది. కెప్టెన్‌తో పాటు ఉపసారథి అజింక్యా రహానే (23) క్రీజులో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి:
- విశాఖ, కాకినాడ తీరాల్లో మోహరించిన భారత్, అమెరికా సైనిక బలగాలు
- ‘తెలంగాణలో అమిత్ షా, కేసీఆర్‌ల రాజ్యం నడుస్తోంది’ - వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్
- భారత ఆర్థిక వ్యవస్థలు సైబర్ దాడుల్ని తట్టుకోగలవా?
- ప్రణబ్ ముఖర్జీ: ‘నేను బాల్ థాకరేను కలవటం సోనియా గాంధీకి నచ్చలేదు’
- ఒక్క అంగుళాన్ని కూడా వదులుకోం.. భారత సైనికులు వెనక్కి వెళ్లాలి: నేపాల్ ప్రధాని కేపీ ఓలీ
- విరాట్ కోహ్లీ: ‘ఆ బాధను ఎవరితోనూ పంచుకోలేక కుమిలిపోయా.. క్రికెట్‌ను వదిలేయాలన్న ఆలోచనలూ వచ్చాయి’
- భారత బ్యాంకుల్లో వేల కోట్ల కుంభకోణాలు... ఈ మోసాలు ఎందుకు పెరుగుతున్నాయి
- భారత నగరాలు ప్రపంచంలోనే అత్యంత కలుషితమైనవి ఎందుకయ్యాయి
- మీ ఆహార వృథాను అరికట్టటానికి ఆరు మార్గాలు: ప్రపంచ ఆకలిని తగ్గించటంలో మీ వంతు పాత్ర పోషించండిలా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








