సుజిత్ విల్సన్: బోరు బావిలో 88 అడుగుల లోతులో బాలుడు, ‘కాపాడేందుకు మరో 12 గంటలు’ ఆపరేషన్

తమిళనాడు తిరుచ్చిలోని నడుకాట్టుపట్టి గ్రామంలో సుజిత్ విల్సన్ అనే రెండేళ్ల బాలుడు శుక్రవారం ఇంటి పెరట్లో ఆడుకుంటూ అక్కడే ఉన్న బోరుబావిలో పడిపోయాడు.
మొదట 26 అడుగుల లోతులో పడిన బాలుడు, తర్వాత కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు 88 అడుగుల లోతుకు జారిపోయాడు.
తల్లిదండ్రులు పోలీసులు, అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి చిన్నారిని కాపాడే ప్రయత్నాలు ప్రారంబించారు.
బోరుబావిలోకి ఒక పైపుతో ఆక్సిజన్ సరఫరా చేస్తున్న ఎన్డీఆర్ఎఫ్ లోపల బాలుడి పరిస్థితిని గమనించేందుకు ఒక సీసీటీవీ కెమెరాను లోపలికి వేసింది.
ఎన్డీఆర్ఎఫ్‌కు చెందిన మరో ఆరు దళాలు, రాష్ట్ర విపత్తు స్పందన దళం సుజిత్‌ను కాపాడేందుకు నిర్విరామంగా ప్రయత్నిస్తున్నాయి.

రాళ్ల మధ్య ఇరుక్కున్న సుజిత్
శనివారం సాయంత్రం ఘటనాస్థలానికి వచ్చిన తమిళనాడు ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ అధికారులు, తల్లిదండ్రులను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
"మొదట బాలుడి చేతులు పైకి కనిపించడంతో, వాటిని తాళ్లతో కట్టి, పైకి లాగాలని ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు కానీ, కుదరలేదు.సుజిత్ రాళ్ల మధ్య ఇరుక్కుపోయి ఉన్నాడు. మేం అతడిని కాపాడేందుకు వేరే పద్ధతులు కూడా ఉపయోగిస్తున్నాం" అని చెప్పారు.
తర్వాత అధికారులు చిన్నారిని కాపాడేందుకు తను ఉన్నంత లోతుకు సమాంతరంగా గుంత తవ్వాలని నిర్ణయించారు. శనివారం అర్థరాత్రి ఒక రిగ్ తెప్పించారు. కానీ, 10 అడుగులకే రాళ్లు పడడంతో రెండో మెషిన్ తెప్పించి మరింత లోతుగా తవ్వుతున్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK
వర్షంలోనూ రెస్క్యూ ఆపరేషన్
రాత్రి తమిళనాడు డిప్యూటీ సీఎం ఓ.పన్నీర్ సెల్వం సహాయ కార్యక్రమాలు జరుగుతున్న ప్రాంతానికి వచ్చారు. "ఇప్పటివరకూ అధికారులు 35 అడుగుల లోతు తవ్వారు. ఇంకా 45 అడుగులు తవ్వాలి. బోరు వేసిన వాళ్లు, నీళ్లు పడకపోవడంతో దాన్ని మూసేశారు. ఈ మధ్య వర్షాలు పడడంతో బోరుపై ఉన్న మట్టి కొట్టుకుపోయింది. దాంతో బాలుడు పడిపోయాడు" అని చెప్పారు.
ప్రస్తుతం 1 మీటర్ వ్యాసంతో రెండో మెషిన్ సమాంతర గుంత తవ్వుతోంది. అది తవ్వడం పూర్తికాగానే, రెండు గుంతలకు మధ్య అడ్డంగా ఒక రంధ్రం చేసి బాలుడిని కాపాడ్డానికి అగ్నిమాపక శాఖ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.
"సహాయ కార్యక్రమాలను ఆపివేయడం ఉండదు. వర్షం వచ్చినా అవి కొనసాగుతాయి. ఇప్పుడు సుజిత్ 88 అడుగుల లోతులో ఉన్నాడు. ఇప్పటివరకూ 40 అడుగులు తవ్వాం. ఇదే వేగంతో తను ఉన్న పాయింట్ వరకూ తవ్వాలంటే మరో 12 గంటలు పడుతుంది" అని రెవెన్యూ శాఖ కమిషనర్ రాధాకృష్ణన్ సోమవారం మీడియాకు చెప్పారు.
అధికారులతోపాటు దేశ సినీ, రాజకీయ ప్రముఖులు కూడా సుజిత్ బోరుబావి నుంచి క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీ దూకుడుకు ప్రాంతీయ పార్టీలు కళ్లెం వేయగలవా?
- భారత్‌లో వ్యాపారం ఎంత ఈజీగా మారిపోయిందంటే..
- తిర్హుత్ ప్రైవేటు రైల్వే: గాంధీ కోసం మూడో తరగతి బోగీలో టాయిలెట్, నెహ్రూ కోసం 'ప్యాలెస్ ఆన్ వీల్స్'
- కేకులు, బన్నులు తింటే కేన్సర్ వస్తుందా?
- నెయిల్ ఎక్స్టెన్షన్: గోళ్లను అతికించుకోవడం ఇప్పుడో ట్రెండ్
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
- గుజరాత్: బ్రెజిల్‌కు ఆనాడు ఆవుల్ని, ఎద్దుల్ని ఇచ్చి.. ఇప్పుడు వీర్యం అడుగుతోంది
- ఇస్లామిక్ యోగా: యోగా క్లాసుల్లో అల్లా ప్రార్థనలు చేస్తున్న గుజరాత్ ముస్లిం మహిళలు
- మోదీ వల్ల పాకిస్తాన్లో కశ్మీర్‌పై చర్చ స్వరూపమే మారిపోయిందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








