ఆర్టీసీ సమ్మె: నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి

ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందారు. హైదరాబాద్‌‌లోని కంచన్‌బాగ్‌లో ఉన్న అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

అపోలో ఆస్పత్రి వర్గాలు ఈ విషయాన్ని బీబీసీతో ధృవీకరించాయి.

శనివారం ఖమ్మంలో శ్రీనివాస్ రెడ్డి ఒంటి మీద కీరోసిన్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను తొలుత ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారని అపోలో ఆస్పత్రి వైద్యులు ఆదివారం తెలిపారు.

శ్రీనివాస్ రెడ్డి మృతి నేపథ్యంలో ఆస్పత్రి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆస్పత్తి వద్ద ఆందోళనకు దిగిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తీవ్రంగా కాలిన గాయాలతోనూ ఆస్పత్రి బెడ్ మీద '48 వేల మంది కార్మికులు బాగుండాలా' అని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

శ్రీనివాస్ రెడ్డి సొంతూరు ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం. ఖమ్మంలోని రాపర్తి నగర్‌లో 25 ఏళ్లుగా ఉంటున్నారు. ఖమ్మం ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌‌గా పనిచేస్తున్నారు.

ఆయన ఇద్దరు కుమారుల్లో ఒకరు భారత ఆర్మీలో, మరొకరు భారత వాయు సేనలో పనిచేస్తున్నారు.

ఆర్టీసీ సమ్మె
ఫొటో క్యాప్షన్, తొమ్మిది రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి

ఆత్మహత్యలు వద్దు: కోదండరాం

శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోదండరాం అన్నారు. ఎవరూ అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టేలా మాట్లాడటం మానుకోవాలని కోదండరాం సూచించారు.

శ్రీనివాస్ రెడ్డి మరణంతోనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆదివారం మధ్యాహ్నం ఒక ప్రకటన విడుదల చేశారు.

‘‘ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి సమ్మెలో పాల్గొంటూ ఆత్మహత్యకు పాల్పడి కంచన్‌భాగ్‌లోని అపోలో ఆస్పత్రిలో మృతి చెందారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. బీజేపీ రాష్ట్ర శాఖ తరపున సంతాపం తెలియజేస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. ధైర్యం కోల్పోవద్దని బీజేపీ విజ్ఞప్తి చేస్తోంది’’ అని ఆ ప్రకటనలో లక్ష్మణ్ పేర్కొన్నారు.

ఎవరూ ధైర్యం కోల్పోవద్దు: పొన్నం

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందారన్న వార్త తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చెప్పారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని పొన్నం అన్నారు.

"ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, కార్మికులు ఎవరు ధైర్యం కోల్పోవద్దు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆర్టీసీ కార్మికుల ఉసురు కేసీఆర్ తగులుతుంది. శ్రీనివాస్ రెడ్డిది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్యే" అని వ్యాఖ్యానించారు.

సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపు నిచ్చింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)