తెలంగాణ ఆర్టీసీ సమ్మె: మూడ్రోజుల్లో బస్సులన్నీ రోడ్డెక్కాలన్న కేసీఆర్.. 19న బంద్‌కు పిలుపునిచ్చిన కార్మికసంఘాలు

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆర్టీసీ సమ్మె కారణంగా, తెలంగాణ విద్యా సంస్థలకు ఈనెల 19వ తేదీ వరకూ సెలవులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సెలవులకు బదులు రెండో శనివారాలు పనిచేయాలని సదరు విద్యా సంస్థలకు ప్రభుత్వం సూచించింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ మరో మూడు రోజుల్లో బస్సులన్నీ తిరగాలనీ, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్టు సీఎంఓ ఒక ప్రకటన విడుదల చేసింది.
"సమ్మె, కార్మిక సంఘాల విషయంలో ప్రభుత్వ వైఖరిలో ఏ మార్పూ లేదు. చట్ట విరుద్ధంగా జరుగుతున్న సమ్మెను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించదు. సమ్మె చేస్తున్న వారితో చర్చలు కూడా జరపదని సీఎం స్పష్టం చేశారు. తమంతట తాముగా అనధికారికంగా విధులకు గైర్హాజరైన వారిని, ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకునే ప్రసక్తే లేదని సీఎం ప్రకటించారు. సమ్మెలో పాల్గొనకుండా విధులు నిర్వర్తిస్తున్న వారికి సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు" అని సీఎం కార్యాలయం ఆ ప్రకటనలో తెలిపింది.

అంతేకాదు, అద్దె బస్సుల కోసం నోటిఫికేషన్లతో పాటు, ప్రైవేటు బస్సులను స్టేజి కారియర్లుగా అనుమతించేలా చర్యలు తీసుకోవాలని, రూట్ పర్మిట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు ప్రకటనలో తెలిపారు.
మూడు రోజుల్లో నూటికి నూరు శాతం బస్సులు నడిచి తీరాలని, కానీ అలా బస్సులు పునరుద్ధరించడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉండడంతో విద్యా సంస్థలకు సెలవు ఇస్తున్నామని ముఖ్యమంత్రి కార్యాలయం తమ ప్రకటనలో చెప్పింది.
ఆర్టీసీ సమ్మెపై కొందరు మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
''ఆర్టీసీలో వంద శాతం బస్సులను పునరుద్ధరించాలి. దీనికోసం అవసరమైన సిబ్బందిని వెంటనే తీసుకోవాలి. రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్లు, రిటైర్డ్ పోలీస్ డ్రైవర్లను ఉపయోగించుకోవాలి. బస్సులు, భారీ వాహనాలు నడిపిన అనుభవం ఉన్న వారిని పనిలోకి తీసుకోవాలి. అధికారులు రేయింబవళ్లు పనిచేసి, మూడు రోజుల్లో నూటికి నూరు శాతం బస్సులు నడిచేలా చూడాలి'' అని సీఎం ఆదేశించినట్టు ఆ ప్రకటన పేర్కొంది.

''యూనియన్ నాయకులు బాధ్యతారాహిత్యంతో వ్యవహరించి వేల మంది కార్మికుల ఉద్యోగాలు పోయేలా చేశారు. విధులకు హాజరుకాని వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశమే లేదు. వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదు, ఆ ప్రశ్నే రాదు. పండుగ సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసి, ఆర్టీసీకి నష్టాలు తెచ్చిన కార్మికులను క్షమించే ప్రసక్తే లేదు. అసలు వారు చేస్తున్నది సమ్మె కాదు. అది ప్రజలకు అసౌకర్యం కల్పించే చట్ట విరుద్ధమైన చర్య మాత్రమే. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది'' అని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనలో చెప్పింది.
సమ్మెకు బీజేపీ మద్దతివ్వడాన్ని ముఖ్యమంత్రి తప్పు పట్టారు.
''కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, భారత రైల్వేను ప్రైవేటీకరిస్తోంది. ఎయిర్ లైన్స్‌ను ప్రైవేటీకరించింది. చివరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను కూడా ప్రైవేటీకరించింది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించడం ద్వారా నిధులు సమకూర్చుకుంటామని కేంద్రం బడ్జెట్లోనే చెప్పింది. అక్కడ కేంద్ర ప్రభుత్వం అలా చేస్తుంటే, ఇక్కడ ఆ పార్టీ నాయకులు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు'' అని కేసీఆర్ అన్నట్లు సీఎంఓ ప్రకటించింది.
''బస్సులు అడ్డుకుని, బస్ స్టాండ్లు, డిపోల వద్ద అరాచకం చేద్దామని చూస్తే సహించేది లేదు. గూండాగిరి నడవదు. ఇప్పటి వరకు ప్రభుత్వం కాస్త ఉదాసీనంగా ఉంది. ఇకపై కఠినంగా వ్యవహరిస్తుంది. బస్ స్టాండ్లు, డిపోల వద్ద ఎవరు బస్సులను ఆపినా, విధ్వంసం సృష్టించినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది'' అని ముఖ్యమంత్రి అందులో చెప్పారు. డిపోల దగ్గర భద్రత పెంచాలని డీజీపీని ఆదేశించారు.

మరోవైపు కార్మిక సంఘాల జేఏసీ కూడా సమ్మెను ఉధృతం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈరోజు బస్ భవన్ దగ్గర ఆందోళన చేసిన కార్మిక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇటు, ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న అఖిలపక్షంలో పాల్గొన్న పార్టీలు తమ కార్యాచరణను ప్రకటించాయి. ఈనెల 19న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి.
అక్టోబరు 13న వంటా వార్పు, 14న డిపోల ముందు బైఠాయింపు, ఇందిరాపార్కులో బహిరంగ సభ, 15న రాస్తారోకో, మానవ హారం, 16న విద్యార్థి సంఘాల ర్యాలీ, 17న ఉద్యోగ కార్మిక సంఘాల ఆందోళనలు, 18న బైక్ ర్యాలీలు, 19న తెలంగాణ బంద్ చేయాలని అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న రాజకీయ పక్షాలు పిలుపునిచ్చాయి.
ఇవి కూడా చదవండి:
- బంగ్లాదేశ్ జైలులో విజయనగరం జిల్లా మత్స్యకారులు
- ‘80 రూపాయలకే ఇల్లు పథకం’
- తెలంగాణ ఆర్టీసీ: సమ్మెకు సై అంటున్న కార్మికులు... విధుల నుంచి తొలగిస్తామంటున్న యాజమాన్యం
- 'ఐఫోన్ నన్ను 'గే'గా మార్చింది' అంటూ యాపిల్ కంపెనీపై కేసు వేసిన రష్యన్
- ‘జీవితంలో మొదటిసారి నన్ను నేను ముస్లింగా భావించుకోవాల్సి వస్తోంది‘
- వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్‌కు సహకరించదు'
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
- ఈ అక్కాచెల్లెళ్లు కన్నతండ్రినే హత్యచేశారు.. కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








