ఎస్సీ, ఎస్టీ చట్టంపై 2018 తీర్పును సమీక్షించనున్న సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images
ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని వివిధ కఠిన నిబంధనలను సడలిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై సమీక్ష కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు అంశాలవారీగా అనుమతించింది. ఈ మేరకు తన మునుపటి తీర్పును రద్దు చేసింది.
జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం గత ఏడాది ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ ''సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి మార్గదర్శకాలనూ రూపొందించజాలదు, అది చట్టసభల పని'' అని వ్యాఖ్యానించింది.
ఈ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ''చట్టసభలు చేయలేకపోయిన పనులను న్యాయస్థానం చేయద''ని తన తీర్పులో పేర్కొంది.
''ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారు ఇప్పటికీ వివక్షకు, దూషణలకు గురవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న కారణంతో ఆ చట్టాన్ని నీరుగార్చడం తగదు'' అని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
2018 మార్చి 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మంగళవారం(01.10.2019) త్రిసభ్య ధర్మాసనం పక్కనపెట్టింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదైన కేసులలో ప్రభుత్వ ఉద్యోగులనూ అరెస్టు చేయొచ్చని సూచించింది. అయితే, అలాంటి సందర్భంలో వారి అరెస్టుకు ముందు సంబంధిత అధికారుల అనుమతులు తప్పనిసరని స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, AFP
గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని దళితులు, గిరిజనులు వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. హింసలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
నిర్ణయాన్ని సమీక్షించాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది.
నాడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నివారణ చట్టం దుర్వినియోగం కావడం పట్ల నిరుడు తీర్పు సందర్బంగా సుప్రీంకోర్టు విచారం వ్యక్తంచేసింది. ఈ కేసుల్లో తక్షణ అరెస్టు కూడదని, ప్రాథమిక దర్యాప్తు తప్పనిసరని స్పష్టం చేసింది.
నాటి ఆదేశాల్లోని ముఖ్యాంశాలు:
1. ఈ చట్టం కింద ఏ వ్యక్తి పైనైనా కేసు నమోదైతే ఏడు రోజుల్లోగా ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేయాలి.
2. ప్రాథమిక దర్యాప్తు జరిగినా, కేసు నమోదైనా నిందితుడి అరెస్టు అనివార్యం కాదు.

ఫొటో సోర్స్, Getty Images
3. నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి అయితే, అతడిని అరెస్టు చేయడానికి అతడిని ఉద్యోగంలో నియమించిన వ్యక్తి అనుమతి తప్పనిసరి.
4. నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి కాకపోతే అరెస్టు చేయడానికి ఎస్ఎస్‌పి స్థాయి అధికారి ఆమోదం తప్పనిసరి.
5. ఎస్‌సీ/ఎస్‌టీ అట్రాసిటీ చట్టం సెక్షన్ 18 ప్రకారం ముందస్తు బెయిలుకు వీలు లేదు. కోర్టు తన ఆదేశంలో ముందస్తు బెయిల్‌కు అనుమతి ఇచ్చింది. అయితే ఈ చట్టం కింద పెట్టిన కేసు దురుద్దేశపూరితంగా పెట్టిందని న్యాయ సమీక్షలో తేలితే ముందస్తు బెయిల్‌కు వీలు ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీంకోర్ఠు తీర్పు వల్ల ఎస్సీ, ఎస్టీలపై దురాగతాలను అధికార యంత్రాంగం పట్టించుకోదని, వీరిపై హింస ఇంకా పెరుగుతుందనే ఆందోళనలు నాడు వ్యక్తమయ్యాయి.
కులాల సంబంధ హింస భారత ప్రధాన సమస్యల్లో ఒకటి. అధికార గణాంకాల ప్రకారం- 2016లో 'నిమ్న కులాలు'గా చెప్పే కులాలపై 40 వేలకు పైగా నేరాలు నమోదయ్యాయి.
దళితులు, గిరిజనులపై నేరాల నివారణకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.
దళితులపై, గిరిజనులపై నేరానికి పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చిన వ్యక్తిపై వెనువెంటనే క్రిమినల్ కేసుల నమోదుకు, తక్షణ అరెస్టుకు ఇది వీలు కల్పిస్తుంది. బెయిలు అవకాశాలు చాలా పరిమితం.
నిందితుడి ఆస్తుల జప్తు లాంటి కఠిన చర్యలకు కూడా చట్టం వీలు కల్పిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్, గో రక్షణ, మూకదాడులు, మతాంతర వివాహాలపై గాంధీ అభిప్రాయాలేంటి?
- దళితులు: వివక్ష, కట్టుబాట్ల మీద పెరుగుతున్న ధిక్కారానికి కారణమేమిటి? ఈ ఘర్షణలు ఎటు దారితీస్తాయి?
- తాజ్‌మహల్ కన్నా ఈ మురికి వాడకు వచ్చే సందర్శకులే ఎక్కువ
- సౌదీ అరేబియా: ఇక విదేశీ పర్యటకులకు సుస్వాగతం
- 30 ఏళ్ల కిందట సౌదీ కోట నుంచి దొంగిలించిన ఆభరణాలు ఏమయ్యాయి, ఆ దొంగ ఏమంటున్నాడు
- తమిళనాడు తవ్వకాల్లో బయల్పడిన 2,600 ఏళ్ల నాటి పట్టణ నాగరికత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








