'టిక్ టాక్‌లో ఇదే నా చివరి వీడియో' అంటూ పురుగుల మందు తాగిన వివాహిత :ప్రెస్ రివ్యూ

Tik Tok

ఫొటో సోర్స్, Getty Images

'టిక్‌ టాక్‌' యాప్‌ వినియోగించవద్దని భర్త మందలించడంతో వివాహిత ఆత్మహత్య చేసుకుందని ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

తన ఆత్మహత్య ప్రయత్నాన్నీ ఆ మహిళ టిక్‌టాక్‌లో పెట్టడం సంచలనంగా మారింది. తమిళనాడులోని అరియలూరు జిల్లా సెందురైలోనున్న వంగారం గ్రామానికి చెందిన 24 ఏళ్ల అనితతో పళనివేలుకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది.

వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పళనివేలు సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరు పిల్లలతో అనిత పెరంబలూరులో ఉంటోంది. ఈ నేపథ్యంలో అనితకు 'టిక్‌ టాక్‌' యాప్‌పై ఆసక్తి అధికమైంది.

పిల్లలను సరిగ్గా పట్టించుకోకుండా డ్యాన్స్‌ చేయడం, పాటలు పాడడం, మేకప్‌ వేసుకోవడం వంటి వీడియోలను నిత్యం యాప్‌లో పెట్టేది. ఈ విషయంపై బంధువులు పలువురు ఆమె భర్తకు ఫోన్‌లో చెప్పారు.

దీంతో భర్త ఆమెను మందలించారు. అనంతరం కొన్ని రోజుల క్రితం ఆడుకుంటున్నప్పుడు మోనీష కిందపడటంతో గాయాలయ్యాయి. కుమార్తెను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా అనిత నిర్లక్ష్యంగా వ్యవహరించింది.

విషయం తెలుసుకున్న పళనివేలు... ఫోన్‌ చేసి భార్యను గట్టిగా మందలించారు. దీంతో మనస్తాపం చెందిన అనిత ఇంట్లోనున్న పురుగుల మందు తాగుతూ ఇదే నా ఆఖరి 'టిక్‌ టాక్‌' వీడియో అని పేర్కొంటూ యాప్‌లో అప్‌లోడ్ చేస్తూ స్పృహ కోల్పోయింది.

వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మృతి చెందిందని ఈనాడు దినపత్రిక పేర్కొంది.

కేసీఆర్

ఫొటో సోర్స్, facebook/kcr

‘కాళేశ్వరానికి ముహూర్తం ఖరారు’

కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ముహూర్తం ఖరారైందని నమస్తే తెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

రాష్ట్రంలోని దాదాపు 13 జిల్లాల్లో సుమారు 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు జీవం పోసేందుకు నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సిద్ధమైంది. జూన్ 21న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

కన్నెపల్లి పంపుహౌస్‌లో నీటి ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణకు ఎగువన ఉన్న మహారాష్ట్ర, దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రానుండటం అద్భుతమైన చారిత్రక ఘట్టంగా చెప్పుకోవచ్చు.

గోదావరి బేసిన్‌లోని కీలక పొరుగు రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు.

త్వరలోనే ముంబై వెళ్లి దేవేంద్ర ఫడ్నవీస్‌ను స్వయంగా ఆహ్వానించాలని, అదేవిధంగా విజయవాడ వెళ్లి ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డిని ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

రాజకీయాలకు అతీతంగా ఒక నదీ బేసిన్‌లోని ఎగువ, దిగువ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావడమనేది బహుశా దేశచరిత్రలో ఇదే తొలిసారి అని సాగునీటిరంగ నిపుణులు అంటున్నారు.

ఈ నెల 21న అధికారికంగా కన్నెపల్లి పంపుహౌస్‌లోని మోటర్ల వెట్న్ ప్రారంభం కానున్నది. ప్రస్తుతం ఎగువనుంచి ఇన్‌ఫ్లోలు లేకపోవడంతో ఒకేసారి మోటర్లను నడిపేందుకు ఆస్కారం లేకుండాపోయింది.

ఈ నెల 21న రెండు మోటర్లకు వెట్న్ నిర్వహిస్తారని, ఒక్క మోటర్‌ను అరగంట పరీక్షించే క్రమంలో 0.004 టీఎంసీలు అంటే 10.80 కోట్ల లీటర్ల గోదావరి జలాల్ని ఎత్తిపోయవచ్చని ఇంజినీర్లు తెలిపారు.

గోదావరికి పూర్తిస్థాయి వరద మొదలైన తర్వాత జూలైలో రోజుకు 2 టీఎంసీల చొప్పున గోదావరిజలాల్ని ఎత్తిపోసేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారని నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది.

పోలవరం
ఫొటో క్యాప్షన్, స్పిల్ వే నిర్మాణ పనులు

పోలవరానికి 3 వేల కోట్లు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 3 వేల కోట్లు విడుదల చేయడానికి కేంద్ర జల వనరుల శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

'నాబార్డు' ద్వారా ఈ నిధులను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. మరో రూ.1,810.04 కోట్ల మంజూరుపై కసరత్తు చేస్తోంది.

నిధుల వినియోగానికి సంబంధించిన యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లను(యూసీలు) ఎప్పటికప్పుడు పంపిస్తే, ప్రాజెక్టుకు వ్యయం చేసిన మొత్తాన్ని రీయింబర్స్‌ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

గత ఏడాది జూలై 26న పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. 2014 ఏప్రిల్‌ 1వ తేదీకి ముందు పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధులపై ఆడిట్‌ చేయించి, ఆడిటెడ్‌ స్టేట్‌మెంట్‌ పంపితే నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది.

కానీ, 2014 ఏప్రిల్‌ 1వ తేదీకి ముందు చేసిన వ్యయంపై ఆడిట్‌ చేయించడానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది.

కేంద్ర జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) పదేపదే ఒత్తిడి తేవడంతో వ్యయానికి సంబంధించిన ఆడిట్‌ స్టేట్‌మెంట్‌ను మాత్రమే రాష్ట్ర జలవనరుల శాఖ కేంద్రానికి పంపింది.

భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ అమలుకు 2014కు ముందు చేసిన వ్యయం రూ.1,397.19 కోట్లకు సంబంధించిన ఆడిట్‌ స్టేట్‌మెంట్‌ను పంపలేదు.. గత నెల 31న విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఇదే అంశాన్ని పీపీఏ సీఈవో ఆర్కే జైన్‌ లేవనెత్తారు.

ఆడిట్‌ స్టేట్‌మెంట్‌ను పంపితేనే నిధులు విడుదల చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తేల్చిచెప్పినట్లు సాక్షి కథనం పేర్కొంది.

గండ్ర వెంకటరమణా రెడ్డి

ఫొటో సోర్స్, facebook/Gandra Venkataramana Reddy

‘మేం గొర్లమా, బర్లమా?’

''అమ్ముడు పోవడానికి మేము బర్లు, గొర్లం కాదు. భయపెడితే భయపడటానికి చిన్నపిల్లలం కాదు. ప్రలోభాలకు లొంగేవాళ్లం కాదు'' అని టీఆర్ఎస్‌లోకి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో...

నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం కోసమే తాము టీఆర్‌ఎస్‌లోకి మారాలన్న నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదన్నారు. కాంగ్రెస్‌ శాసన సభాపక్షం నుంచి టీఆర్‌ఎస్‌ శాసన సభాపక్షంలో విలీనమైన 12 మంది ఎమ్మెల్యేలు బుధవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

శాసనసభాపక్షంలో మూడింట రెండొంతుల మంది కోరుకుంటే విలీనం చేయొచ్చని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో ఉందని, దాని ప్రకారమే ఈ నెల 6న స్పీకర్‌ను కలిసి లేఖ ఇచ్చామని గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు.

సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గ పరిస్థితులకు అనుగుణంగా కేసీఆర్‌కు మద్దతు ఇస్తామని గతంలో చెప్పామని, అందులో భాగంగానే ఈ నెల 6న స్పీకర్‌ను కలిసి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వంపై తమ అసంతృప్తిని చాలా సందర్భాల్లో వెలిబుచ్చామని గండ్ర వెంకట రమణారెడ్డి చెప్పినట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)