క్రిమినల్ కేసులు: వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై 31, చింతమనేని ప్రభాకర్‌పై 26 - ప్రెస్ రివ్యూ

వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్
ఫొటో క్యాప్షన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్

ఏపీ అసెంబ్లీ బరిలో ఉన్నవారిలో అత్యధికంగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై 31, టీడీపీ దెందులూరు అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌పై 26 కేసులున్నాయంటూ ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

నామినేషన్ల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ప్రస్తుతం ఏపీ ఎన్నికల బరిలో ఉన్నవారిలో 171మంది నేరచరితులున్నారు. వీరిలో వైఎస్ జగన్‌పై 11 సీబీఐ కేసులతో పాటు ఈడీ, అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ నిరోధక చట్టం, పరువునష్టం దావా, వర్గాలను రెచ్చగొట్టడం, అనుచిత ప్రవర్తన వంటి మొత్తం 31 కేసులున్నాయి. టీడీపీ నేత ప్రభాకర్‌పై మహిళలపై దౌర్జన్యం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం, ప్రభుత్వ అధికారుల విధులకు ఆంటకం, హత్యాయత్నం, కోడి పందేలు, అరెస్టు చేయకుండా అడ్డుకోవడం, దళితులను కులం పేరుతో దూషించడం వంటి మొత్తం 26 కేసులున్నాయి. చంద్రబాబు నాయుడుపై బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక కేసు ఉంది. మొత్తంగా 97మంది వైసీపీ, 49మంది టీడీపీ, 25మంది జనసేన అభ్యర్థులు నేరచరితులేనని ఈనాడు తెలిపింది.

రాందాస్ అథవాలే

ఫొటో సోర్స్, FACEBOOK/RAMDASATHAWALE

ఫొటో క్యాప్షన్, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే

ఐటీ దాడులంటే భయమెందుకు?

ఆదాయపు పన్ను కట్టలేదనే అనుమానం ఉంటే ఐటీ అధాకారులు దాడులు చేస్తారని, దానికి భయమెందుకని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ప్రశ్నించారని సాక్షి తెలిపింది.

అనుమానం వస్తే దాడులు చేయడం వారి డ్యూటీ. ఐటీ దాడులకు, ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆదాయపు పన్ని చెల్లించి ఉంటే, అన్ని వ్యాపార వ్యవహారాలను ఐటీ శాఖకు చూపించి ఉంటే ఇంక భయపడాల్సిన అవసరం ఏముంటుందని అథవాలే వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులపై జరుగుతున్న ఐటీ దాడులకు, ప్రభుత్వానికీ ఎలాంటి సంబంధం లేదన్నారు. దాడులు చేయకుండా ఉండాలంటే పన్నులు చెల్లించమని చంద్రబాబు వారి నాయకులకు చెబితే సరిపోతుందని మంత్రి సూచించారని సాక్షి వెల్లడించింది.

ఆర్టీసీ బస్సులు

ఫొటో సోర్స్, Getty Images

హైదరాబాద్ నుంచి ఏపీకి జనజాతర

ఈ నెల 9, 10 తారీఖుల్లో ఓట్ల సంక్రాంతి జరుగుతోందని ఆంధ్రజ్యోతి ఓ కథనం రాసింది.

11వ తేదీన ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో 9, 10 తారీఖుల్లో 2000 వరకూ ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు ఏపీ బాట పట్టనున్నాయి. ఎన్నికల దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ అదనంగా 25 బస్సులను నడపాలనుకుంటోంది. ఏపీఎస్ఆర్టీసీ 310 బస్సుల ఏర్పాటకు సిద్ధమైంది. 1000కి పైగా ప్రైవేటు బస్సులు కూడా ఎన్నికల కోసం అదనంగా ఏపీకి వెళ్లనున్నాయి. వీటికి రెగ్యులర్‌గా తిరిగే బస్సులను కలుపుకుంటే ఈ రెండు తేదీల్లో మొత్తం 3440 సర్వీసులు ఆంధ్ర ప్రదేశ్‌ బాట పట్టనున్నాయి. వీటికి కార్లు, వ్యాన్లు జీపుల వంటి వాహనాలు, రైళ్లు అదనం అని ఆంధ్రజ్యోతి తెలిపింది. జీహెచ్ఎంసీ పరిథిలో దాదాపు 10 లక్షల మంది ఏపీకి ఓటు వెయ్యడానికి వెళ్లనున్నారని అంచనా.

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

నేటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు

ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఐఐటీ మెయిన్ ఆన్‌లైన్ పరీక్షలు నేటినుంచి ప్రారంభం కానున్నాయని నమస్తే తెలంగాణ ఓ వార్త ప్రచురించింది.

ఆదివారం నాడు ప్రారంభమవుతున్న ఈ ప్రవేశ పరీక్షలు ఈనెల 12 వరకూ కొనసాగుతాయి. దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు హాజరవుతున్నారని అంచనా. డౌన్‌లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డుతో పాటు పాస్‌పోర్టు సైజు ఫొటో కూడా ప్రతి అభ్యర్థీ పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని, వారిని మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారని అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)