యాసిడ్ దాడి బాధితురాలిగా దీపికా పదుకొణె ‘ఛపాక్’ : ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, @deepikapadukone
''ఎక్కువ మంది నాయికలకు వెండితెరపై అందమే పెట్టుబడి.. అందవిహీనమైన ముఖంతో తెరపై కనిపించే సాహసం కొందరే చేస్తారు.. దానికి మాత్రం చాలా తెగువ, ఎంతో ఆత్మవిశ్వాసం ఉండాలి. అలాంటి లక్షణాలు దీపికా పదుకొణెలో కనిపిస్తున్నాయి'' అంటూ ఆమెను బాలీవుడ్ అంతా ప్రశంసలతో ముంచెత్తుతోందని ఈనాడు దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథతో వస్తోన్న 'ఛపాక్'లో దీపిక నటిస్తున్నారు. 'రాజీ'తో విజయాన్ని అందుకున్న మేఘనా గుల్జార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో దీపిక ఎలా ఉండబోతుందో అనే ఆసక్తికి తెరదించుతూ తాజాగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రాన్ని దీపికాయే నిర్మించడం మరో విశేషం.
''నాతో చిరకాలం ఉండే పాత్ర 'మాలతి'. ఈ రోజే చిత్రీకరణ మొదలైంది. 2020 జనవరి 10న చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని దీపిక ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
అదానీపై అంతులేని ప్రేమ: 'విద్యుత్' ప్రాజెక్టుకు సెజ్ హోదా కట్టబెట్టిన మోదీ సర్కారు
జార్ఘండ్‌లోని 'అదానీ విద్యుత్' ప్రాజెక్టుకు కేంద్రంలోని మోదీ సర్కార్ 'ప్రత్యేక ఆర్థిక మండలి' (ఎస్‌ఈజెడ్) హోదా కట్టబెట్టిందని.. తద్వారా విద్యుత్ ప్రాజెక్ట్‌కు అన్ని రకాల పన్ను మినహాయింపులు, పన్ను డ్యూటీ మాఫీ ప్రయోజనాలు దక్కనున్నాయని నవ తెలంగాణ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. 'ఎస్‌ఈజెడ్'లో ఉండటం వల్ల అన్ని రకాల 'క్లియరెన్స్'లు వేగంగా అందజేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రతీ ఏటా 'క్లీన్ ఎనర్జీ సెస్' కింద కంపెనీ కట్టాల్సిన పన్ను రూ. 320 కోట్లు మాఫీ అయినట్టే.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కేవలం 12 రోజుల ముందు అదానీ విద్యుత్ ప్రాజెక్టుకు 'ఎస్‌ఈజెడ్'హోదా ఇవ్వాలన్న నిర్ణయాన్ని మోదీ సర్కార్ తీసుకోవటం జాతీయ మీడియాలో పెద్ద చర్చనీయాంశమైంది.
విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను మార్చి, చట్టాన్ని సవరించి.. 'అదానీ కంపెనీ'కి పెద్ద ఎత్తున ప్రయోజనాలు కట్టబెట్టడంపై విమర్శలు వెలువడుతున్నాయి.
గుజరాత్‌కు చెందిన బడా కార్పొరేట్ 'గౌతం అదానీ'కి మోడీతో ఉన్న వ్యక్తిగత సంబంధాలే, ఆ కంపెనీకి ఎస్‌ఈజెడ్ హోదాను తెచ్చిపెట్టిందని విద్యుత్‌రంగ నిపుణులు భావిస్తున్నారు. ఇందుకోసం ఏడాదిముందే చట్టాన్ని సవరించి, మార్గదర్శకాల్ని మార్చి మొదటిసారిగా ఓ విద్యుత్ కంపెనీకి ఈ హోదా కట్టబెట్టారని వారు విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Getty Images
మాకంటే 34 వేలు తక్కువే: రాహుల్ 'ఆదాయ హామీ'పై అరుణ్ జైట్లీ
ఆదాయ హామీ పథకం' అమలుతో పేదరికంపై తుదిసమరం చేయనున్నామన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారని ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. ఎన్నికలు సమీపించడం తో ప్రజలను మభ్యపెట్టేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని జైట్లీ ఎద్దేవా చేశారు.
మోదీ సర్కారు వివిధ సంక్షేమ పథకాల కింద ఏటా రూ. 5.34 లక్షల కోట్లు వెచ్చించిందని.. దీంతో ఒక్కో కుటుంబానికి ఏటా సగటున రూ.1.06 లక్షల లబ్ధి చేకూరిందని ఆయన పేర్కొన్నారు.
రాహుల్‌గాంధీ ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 72 వేలే ఇస్తామన డం దారుణమన్నారు. ఆదాయ హామీ పథకం తో ప్రజలకు సంక్షేమ లబ్ధి సగటున రూ. 34 వేలు తగ్గుతుందన్నారు.
సంక్షేమ బడ్జెట్‌ను రూ. 5.34 లక్షల కోట్ల నుంచి రూ. 3.6 లక్ష కోట్లకు తగ్గించాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. మోదీ ప్రభుత్వ బడ్జెట్‌లో ఇది 2/3వ వంతేనన్నారు.

ఫొటో సోర్స్, YSRCongress
నా భర్త హత్య కేసును స్వతంత్ర సంస్థకు అప్పగించండి: వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పిటిషన్
తన భర్త వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా సాగుతోందని వై.ఎస్.సౌభాగ్యమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని ‘సాక్షి’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. తన భర్త హత్య కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేని స్వతంత్ర సంస్థ చేత చేయించాలని లేదా హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలివ్వాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు.
ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కడప ఎస్‌పీ, ప్రత్యేక దర్యాప్తు బృందం అదనపు డీజీ, పులివెందుల ఎస్‌హెచ్‌వో, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఈ పిటిషన్ సోమవారం విచారణకు రాగా, పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ, ఇదే అంశంపై పిల్ దాఖలైందని, అది మంగళవారం విచారణకు రానున్నదని, తమ వ్యాజ్యాన్ని ఆ పిల్‌కు జత చేయాలని కోర్టును కోరారు. ఇందుకు న్యాయమూర్తి జస్టిస్ విజయలక్ష్మి అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








