సంఝౌతా రైలు పేలుళ్ల కేసులో నలుగురు నిందితులూ నిర్దోషులే.. తీర్పుపై పాక్ నిరసన

PTI

ఫొటో సోర్స్, PTI

సంఝౌతా రైలు పేలుళ్ల కేసులో నలుగురు నిందితులనూ నిర్దోషులుగా తేల్చుతూ పంచ్‌కులలోని ఎన్ఐఏ కోర్టు తీర్పు ఇచ్చింది.

సంఝౌతా ఎక్స్‌ప్రెస్ భారత్-పాకిస్తాన్ మధ్య వారానికి ఒకరోజు నడుస్తుంది.

2007 ఫిబ్రవరి 18న దిల్లీ నుంచి పాకిస్తాన్‌లోని లాహోర్ వెళ్తుండగా ఆ రైలులో పేలుడు జరిగింది. 68 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది పాకిస్తాన్ పౌరులే.

ఈ కేసులో ఎన్ఐఏ 290 మంది సాక్షులను విచారించింది. ముస్లింలే లక్ష్యంగా ఆ దాడి జరిపారని తమ చార్జిషీటులో తెలిపింది.

హిందుత్వ సంస్థ 'అభినవ భారత్' సభ్యుడు అసీమానంద్‌కు ఆ పేలుడులో ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ కేసులో ప్రాసిక్యూషన్ ఆధారాలను చూపలేకపోయిందని అసీమానంద్ తరఫు న్యాయవాది చెప్పారు.

హరియాణా పోలీసులు ఈ కేసు నమోదు చేయగా.. 2010లో దీని దర్యాప్తును ఎన్‌ఐఏ‌కి అప్పజెప్పారు.

అనంతరం ఎన్ఐఏ 2011లో ఈ కేసుకు సంబంధించి 8 మందిపై అభియోగపత్రం దాఖలు చేసింది.

వీరిలో స్వామి అసీమానంద్, లోకేశ్ శర్మ, కమల్ చౌహాన్, రాజిందర్ చౌదరి కోర్టు ముందు హాజరై తర్వాత కొంత కాలం జైల్లో ఉన్నారు.

ఈ కేసులో సూత్రధారి అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ జోషి 2007లో హత్యకు గురయ్యాడు.

అసీమానంద్ బెయిలుపై విడుదల కాగా.. మరో ముగ్గురు జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

పేలుడు అనంతరం సంఝౌతా రైలు

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ నిరసన

సంఝౌతా రైలు పేలుళ్ల కేసులో నలుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించడంపై పాకిస్తాన్ నిరసన వ్యక్తం చేసింది.

అక్కడ ఉన్న భారత హై కమిషనర్‌ని పిలిపించి నిరసన తెలిపింది.

పాకిస్తాన్ తాత్కాలిక విదేశాంగా శాఖ కార్యదర్శి ఈ రోజు భారత హైకమిషనర్‌ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

గతంలో ఈ అంశంపై ముందడుగు పడలేదని చెబుతూ పలుమార్లు భారత్ వద్ద లేవనెత్తామని చెప్పారు.

ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)