ఈ కానిస్టేబుల్ కండలు చూస్తే చాలు నేరగాళ్లకు వణుకుపుడుతుంది

కిషోర్ ధ్యానేశ్వర్ ఢానే

లావుగా ఉండే పోలీసులపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లతో ఫోటోలు పెట్టడం తరచూ చూస్తుంటాం. అలానే పోలీసుల పొట్ట, వాళ్ల ఫిట్‌నెస్ విషయంలో ఒక్కోసారి ఫిర్యాదులు కూడా వస్తుంటాయి. కానీ జాల్నా ప్రాంతానికి చెందిన కిశోర్ అనే పోలీస్ కానిస్టేబుల్ మాత్రం ఇలాంటి కామెంట్లు కానీ, ఫిర్యాదులు కానీ ఎదుర్కొనే అవకాశం లేనేలేదు.

కారణం... కండలు తిరిగిన శరీరంతో అంతర్జాతీయ స్థాయి బాడీ బిల్డర్‌గా ఆయన పేరు తెచ్చుకోవడమే.

''పోలీస్ ఫోర్స్ అంటేనే ఫిట్‌నెస్ ఫోర్స్. అందుకే అందరికీ అవగాహన కల్పించడానికి ఇలా ఏదో ఒకటి చేయాలి అనిపించింది. ఫిట్‌గా ఉండే శరీరంపై ఖాకీ డ్రెస్ ఉంటే చాలా బాగుంటుంది'' అని చెబుతున్న కిశోర్ గురించి మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూడండి..

వీడియో క్యాప్షన్, కండల శరీరంపై ఖాకీ డ్రెస్సు

''నా పేరు కిశోర్ ధ్యానేశ్వర్ డాంగె. జాల్నా పోలీస్ డిపార్టుమెంటులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నా. నేను హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ ష్క్వాజ్‌నెగ్గర్ నుంచి స్ఫూర్తి పొందాను. ఆర్నాల్డ్ లాంటి వ్యక్తి మూడు రంగాల్లో పేరు తెచ్చుకున్నప్పుడు అదే పని భారత్‌లో నేనెందుకు చేయలేను.. అనిపించింది. బాడీబిల్డింగ్ చరిత్రలోనే ఒక మార్పు తీసుకురావాలి అనుకున్నాను. అందుకే ఇందులో అడుగుపెట్టాను'' అని కిశోర్ చెబుతున్నారు.

అనేక దేశాల్లో 'వరల్డ్ పోలీస్ ఫైర్ గేమ్స్' లో పాల్గొని భారత్ కు ఎన్నో పతకాలు సాధించి పెట్టారు కిశోర్.

'ఈ కండల కోసం ఆటో నడిపాను..'

''మా నాన్న కూడా పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. ఆరోజుల్లో ఆయన జీతం కేవలం మూడు వేల రూపాయలు. దాంతో 2003లో నేను ఆటో నడిపాను. అలా వచ్చిన డబ్బును బాడీ బిల్డింగ్‌కు సరిపడే డైట్ కోసం ఉపయోగించేవాణ్ని. బాడీ బిల్డింగ్‌కు డైట్, వర్కవుట్, రెస్ట్.. ఈ మూడూ చాలా ముఖ్యం.''

కిశోర్ ప్రేరణతో మహారాష్ట్ర పోలీసు శాఖలో దాదాపు 40-50 మంది బాడీ బిల్డర్లుగా తయారయ్యారు.

భారత్‌ తరఫున మిస్టర్ ఒలింపియా ట్రోఫీ సాధించాలనేది కిశోర్ కల.

''పోలీసు డిపార్టుమెంటులో 24 గంటలూ టెన్షన్ ఉంటుంది. డ్యూటీ అయిపోయాక బాడీ బిల్డింగ్ చేయాలంటే మానసికంగా ఎంతో ఒత్తిడి ఉంటుంది. అయితే మా పై అధికారులకు, సహచరులకు నాలో ఉన్న టాలెంట్ ఏమిటో తెలుసు. వారంతా నాకు సాయం చేస్తుంటారు. దాని వల్లనే, 2013లో జరిగిన వరల్డ్ పోలీస్ ఫైర్ గేమ్స్‌లో 77 దేశాలను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించగలిగాను'' అని కిశోర్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)