ప్రొటోకాల్ ఉల్లంఘించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీనేనా, ఇందులో నిజమెంత? :Fact Check

ఫొటో సోర్స్, Twitter/@MEAIndia
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌ను దిల్లీ విమానాశ్రయంలో ఆలింగనం చేసుకున్న ఫొటోను "ప్రధాని మోడీ ప్రొటోకాల్ ఉల్లంఘించారని" చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
మహమ్మద్ బిన్ సల్మాన్ రెండు రోజుల భారత పర్యటన కోసం మంగళవారం రాత్రి 10 గంటలకు దిల్లీ చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలకడానికి స్వయంగా ప్రధాని మోదీ ఎయిర్ పోర్ట్‌కు వెళ్లారు.
మహమ్మద్ బిన్ సల్మాన్‌ను ప్రధాని మోదీ ఇలా హత్తుకుని స్వాగతం పలకడంపై భారతీయ జనతా పార్టీ విమర్శకులు, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
"మోదీ క్రౌన్ ప్రిన్స్‌కు స్వాగతం పలకడానికి ప్రభుత్వ ప్రొటోకాల్ ఉల్లంఘించారంటూ" పీఎం మోదీ ఫొటోను ఫేస్‌బుక్, ట్విటర్‌లో మంగళవారం రాత్రి నుంచి కొన్ని వేల సార్లు షేర్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్ అకౌంట్‌లో, కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు.

ఫొటో సోర్స్, Twitter/@INCIndia
"మోదీ ప్రొటోకాల్ ఉల్లంఘించి సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్‌కు స్వాగతం పలికే ఫొటో ఆయన మన అమర జవాన్ల బలిదానాలకు ఎంత గౌరవం ఇస్తున్నారో చెబుతోంది. ఆయన స్వాగతం పలుకుతున్న వారు కొన్ని గంటల ముందే పాకిస్తాన్‌కు భారీ ఆర్థిక సాయం చేశారు" అన్నారు.

ఫొటో సోర్స్, Twitter/@rssurjewala
ప్రతిపక్షం ట్వీట్లు ఆధారంగా కొంతమంది "ప్రొటోకాల్ ఉల్లంఘించి విదేశీ అతిథులను ఆహ్వానించడానికి విమానాశ్రయానికి వెళ్లిన మోదీ, అలా చేసిన తొలి ప్రధాన మంత్రిగా నిలిచారు" అని సోషల్ మీడియాలో రాశారు.
కానీ ఈ వాదన నిజం కాదు. ఎందుకంటే 2004- 2014 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధాన మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ కూడా ఇలా 5 సార్లు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images/PRAKASH SINGH
మన్మోహన్ సింగ్ స్వాగతం పలికినపుడు...
భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఐదు వేరు వేరు సందర్భాల్లో విదేశీ అతిథులకు స్వాగతం పలకడానికి స్వయంగా విమానాశ్రయానికి వెళ్లారు. ప్రభుత్వ ప్రొటోకాల్ అని చెబుతున్న దానిని ఉల్లంఘించారు.
అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మొట్టమొదట 2006లో సౌదీ అరేబియా కింగ్, క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తండ్రి అయిన బిన్ అబ్దుల్ అజీజ్‌ను ఆహ్వానించడానికి ఈ ప్రొటోకాల్ ఉల్లంఘించారు,
2006లోనే రెండోసారి ప్రొటోకాల్ పట్టించుకోని మన్మోహన్ సింగ్ అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్‌కు స్వాగతం పలకడానికి తనే ఎయిర్‌పోర్టుకు వెళ్లారు.

ఫొటో సోర్స్, Getty Images/PRAKASH SINGH
2006లో భారత్ వచ్చిన నేపాల్ ప్రధాన మంత్రి సుశీల్ కొయిరాలా, 2013లో వచ్చిన జపాన్ చక్రవర్తి అకీహితోకు స్వాగతం పలికే సమయంలో కూడా మన్మోహన్ సింగ్, అందరూ చెబుతున్న ప్రొటోకాల్‌ను పక్కనపెట్టారు. అతిథులకు ఆహ్వానించడానికి ఎయిర్ పోర్టుకు వెళ్లారు.
ఐదోసారి అంటే చివరి సారి 2010లో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు స్వాగతం పలకడానికి అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తన భార్య గురుశరణ్ కౌర్‌తో కలిసి దిల్లీ విమానాశ్రయానికి వెళ్లారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రొటోకాల్, ప్రిన్స్ స్వాగతం
బుధవారం ఉదయం కాంగ్రెస్ ప్రతినిధి ప్రియాంక చతుర్వేదీ #PulwamaTerrorAttack అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఒక స్క్రీన్ షాట్ షేర్ చేశారు.

ఫొటో సోర్స్, Twitter/@priyankac19
ఇందులో "ప్రధాని మోదీ ప్రభుత్వ ప్రొటోకాల్ ఉల్లంఘించారు" అని చెప్పారు. ఆమె షేర్ చేసిన ఆ స్క్రీన్ షాట్‌లో "విదేశీ అతిథులకు సంబంధించిన ప్రొటోకాల్" అని రాసుంది.
కాంగ్రెస్ ప్రతినిధి షేర్ చేసిన స్క్రీన్ షాట్‌లో ఉన్నవి అధికారిక పత్రాలు కాదని" విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి బీబీసీకి చెప్పారు. దానిని సోషల్ మీడియా సైట్ 'కోరా'లో ఎవరో ఒక యూజర్ రాసిన సమాధానం అన్నారు.
అధికారికంగా భారత్ వచ్చే విదేశీ అతిథులకు స్వాగతం పలకడానికి ప్రభుత్వ ప్రొటోకాల్ ఎలా ఉంటుంది అనే విషయానికి సంబంధించిన పత్రాలు విదేశాంగ మంత్రిత్వ శాఖ సైట్‌లో లేవని ఆయన తెలిపారు. గోప్యంగా ఉంచే పత్రాల విభాగంలో అవి కూడా ఉన్నాయన్నారు.
దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం బీబీసీ భారత మాజీ దౌత్యవేత్త కృష్ణ చంద్ర సింగ్‌తో మాట్లాడింది. ఆయన "విదేశీ అతిథులకు స్వాగతం పలకడానికి సంబంధించిన ప్రొటోకాల్ అనేది, దేశ ప్రధానిని అడ్డుకునే రాతి గోడేం కాదు" అన్నారు.
"ఇప్పుడు ప్రధాన మంత్రి మోదీ చేసిందే, అప్పుడు మన్మోహన్ సింగ్ కూడా చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ప్రధాని విమానాశ్రయానికి వెళ్లి విదేశీ అతిథులకు స్వాగతం పలికే సంప్రదాయం పెరిగింది" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రత్యేక అతిథులకే ప్రధాని స్వాగతం
"ఎవరైనా దేశ ప్రముఖులు లేదా విదేశాల నుంచి వచ్చే పెద్ద నేతలకు స్వాగతం పలకడానికి భారత ప్రధాన మంత్రి వెళ్లాలా, వద్దా అనేది వస్తున్న ఆ అతిథి మనకు ఎంత ప్రత్యేకం అనేదానిపై ఆధారపడి ఉంటుంది" అని కేసీ సింగ్ చెప్పారు.
"అలా ప్రతిసారీ చేయడం అనేది కుదరదు. ఎందుకంటే ఇలా ప్రతి అతిథికి స్వాగతం పలకడానికి వెళ్తుంటే, అందులో ఎలాంటి ప్రత్యేకతా లేకుండా పోతుంది" అన్నారు.
"విదేశీ అతిథులకు ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలికే సంప్రదాయం మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ చివరి పదవీకాలం వరకూ చాలా సీరియస్‌గా పాటించేవారు. ఆ సమయంలో అతిథులందరి కోసం ప్రధాని ఎయిర్ పోర్ట్ చేరుకునేవారు. కానీ ప్రపంచవ్యాప్తంగా భారత్ స్థాయి పెరిగేకొద్దీ దేశానికి విదేశీ అతిథుల రాకపోకలు పెరిగాయి. దీంతో 90వ దశకంలో కేవలం ఎంపిక చేసిన అతిథుల కోసం మాత్రమే ప్రధాని ఎయిర్‌పోర్టుకు వెళ్లాలని, అలా వారికి తామెంత ప్రాధాన్యం ఇస్తున్నామో చూపించాలని నిర్ణయించారు" అని కేసీ సింగ్ చెప్పారు.
సాధారణంగా విదేశీ అతిథి కోసం ప్రధాన మంత్రి, రాష్ట్రపతి భవన్‌లో వేచిచూస్తారు. ఎందుకంటే అతిథికి స్వాగతం పలికే అధికారిక కార్యక్రమాలు అక్కడే ఏర్పాటు చేస్తారు" అన్నారు కేసీ సింగ్.
సుమారు ఐదేళ్లు పదవిలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కంటే పదేళ్లు భారత ప్రధాన మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఎక్కువ సార్లు విదేశీ అతిథులను ఆహ్వానించడానికి విమానాశ్రయానికి వెళ్లారని మీడియా కథనాలు కూడా చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ దాడి: పుల్వామా మారణహోమం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు
- ప్రేమికుల రోజు వెనకున్న కథేంటి?
- ప్రేమికులు ప్రేమలో పడటానికి, వారిలో రొమాన్స్‌కు కారణం ఇదే
- సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట.. వేలంటైన్స్‌డే ముందు రోజు..
- తెలుగు సంస్కృతి దారిలో బ్రిటన్: నెలసరి మొదలైందా... చలో పార్టీ చేసుకుందాం
- చంద్రబాబు నాయుడు: ‘12 గంటల దీక్షకు 11 కోట్లు ఖర్చు’ నిజానిజాలేంటి?
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
- పాకిస్తాన్ 'దుర్మార్గమైన అజెండా': చర్చల రద్దుకు దారి తీసిన ఈ స్టాంపులపై ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








