ఇండియా టుడే సర్వే: మోదీ గెలుపు కష్టమే, కేసీఆర్, జగన్, నవీన్ మద్దతిచ్చినా డౌటే - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ మళ్లీ గెలవడం అసాధ్యమేనని, బీజేపీకి సొంతంగా కాదు కదా.. ఎన్‌డీఏగా కూడా సాధారణ మెజారిటీ దక్కడం అనుమానమేనని తాజా సర్వేలు తేల్చి చెప్పాయని 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల తర్వాత హంగ్ లోక్‌సభ ఏర్పడుతుందని ఇండియా టుడే-కార్వీ; ఏబీపీ-సీవోటర్ సర్వేలు తేల్చి చెప్పాయి. కేసీఆర్, జగన్, నవీన్ పట్నాయక్, పళనిస్వామి తదితరులు మద్దతు ఇచ్చినా ఎన్‌డీఏ మళ్లీ అధికారం చేపట్టలేదని అంచనా వేశాయి.
బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ 237 స్థానాల్లో విజయం సాధిస్తుందని మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే అంచనా వేసింది. 2014 ఎన్నికలతో పోలిస్తే 99 సీట్లను కోల్పోనుంది.
గత ఎన్నికల్లో కేవలం 60 స్థానాలు సాధించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఈసారి తన సీట్లను 166కు పెంచుకుంటుందని తెలిపింది.
ఎన్‌డీఏ, యూపీఏ కూటముల్లో లేని పార్టీలు 140 సీట్లను సాధిస్తాయని పేర్కొంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇవి 13 సీట్లను కోల్పోనున్నాయి.
ఏ పార్టీ కానీ, కూటమి కానీ మేజిక్ మార్కు అయిన 272 సీట్లు సాధించే అవకాశం లేదని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే హంగ్ పార్లమెంటు ఏర్పడుతుందని అంచనా వేసింది.
ఎస్‌పీ, బీఎస్‌పీ, పీడీపీ, టీఎంసీ పార్టీలు యూపీఏకు మద్దతు ఇస్తే దానిదే అధికారమని విశ్లేషించింది.
ఎన్‌డీఏకు కేసీఆర్, పళనిస్వామి, జగన్‌రెడ్డి, నవీన్‌పట్నాయక్ కలిసినా మేజిక్ మార్కుకు ఒక సీటు దూరంలో ఆగిపోతుందని అంచనా వేయడం గమనార్హం.
యూపీఏ 33 శాతం ఓట్లను సాధిస్తే.. ఎన్‌డీఏ 35 శాతం ఓట్లను దక్కించుకుంటుందని తెలిపింది.
ఈ సంస్థ దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 97 లోక్‌సభ నియోజక వర్గాల్లో 13,179 మందిని సర్వే చేసింది. జనవరి ఏడో తేదీన కేంద్ర కేబినెట్ ఆర్థిక బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేసింది. వాటి ప్రభావం ఈ సర్వేలో ప్రతిఫలించే అవకాశం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఫిబ్రవరి 1 నుండి ఈబీసీ కోటా: కేంద్రం ఆదేశాలు
జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈబీసీ) కల్పించిన రిజర్వేషన్లు ఫిబ్రవరి 1వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వ నియామకాలన్నింటికీ వర్తిస్తాయంటూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం ఆదేశాలు జారీ చేసిందని 'ప్రజాశక్తి' దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
రిజర్వేషన్ల ప్రయోజనాలు లేని జనరల్ కేటగిరీ వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల చట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన విధి విధానాలతో సమగ్ర నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేస్తామని ఈ ప్రకటనలో తెలిపింది.
జనవరి 9వ తేదీన పార్లమెంట్ ఆమోదించిన 124వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం విద్య, ఉద్యోగావకాశాలలో 10 శాతం మేర జనరల్ కేటగిరీలోని పేదలకు రిజర్వ్ అవుతాయని ఈ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం అమలులో ఉన్న ఎస్సీ, ఎస్టీ, సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతో రిజర్వేషన్లు వర్తించని, కుటుంబ వార్షికాదాయం ఏడాదికి రూ. 8 లక్షల లోపు ఉన్న వారిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాని (ఈబీసీ)కి చెందిన వారుగా గుర్తించి వారికి రిజర్వేషన్లను వర్తింపచేస్తామని సామాజిక న్యాయం, సాధికారిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన మరో ప్రకటనలో వెల్లడించింది.
అదే విధంగా ఐదెకరాలు, అంతకు మించిన సాగుభూమి, నోటిఫైడ్ మునిసిపాలిటీలలో వెయ్యి చదరపు అడుగుల నివాస స్థలం, లేదా 100 చదరపు గజాల నివాస భవనం, నాన్ నోటిఫైడ్ మునిసిపాలిటీలలో 200 గజాల నివాస స్థలం ఉన్న వారిని కుటుంబ వార్షికాదాయంతో సంబంధం లేకుండా ఈబీసీ రిజర్వేషన్ల నుండి మినహాయిస్తామని ఈ ప్రకటనలో ప్రభుత్వం వివరించింది.
ఆదాయం, ఆస్తుల ధృవీకరణకు తాసిల్దార్ స్థాయి అధికారి నుండి ధృవీకరణ పత్రం పొందాల్సి ఉంటుందని తెలిపింది. విద్యాసంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేస్తుందని వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
బ్యాలెట్ ఓటును మళ్లీ తీసుకురాం.. ఈవీఎంలపై కావాలనే బురదచల్లుతున్నారు: సీఈసీ
దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు బదులుగా బ్యాలె ట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న కొన్ని రాజకీయ పక్షాల డిమాండ్‌కు తలొగ్గబోమని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా స్పష్టం చేశారని.. మళ్లీ బ్యాలెట్ బాక్సులను వినియోగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారని 'సాక్షి' దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. ఈవీఎంల విశ్వసనీయతపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో సీఈసీ దిల్లీలో 'మేకింగ్ అవర్ ఎలక్షన్స్ ఇన్‌క్లూజివ్ అండ్ యాక్సెసబుల్' అనే కార్యక్రమంలో మాట్లాడుతూ స్పందించారు. ఈవీఎంలను కొందరు ఫుట్‌బాల్‌లా ఆడుకుంటున్నారనీ, వాటి పనితీరుపై ఉద్దేశపూర్వకంగానే బురద చల్లుతున్నారని మండిపడ్డారు.
''ఇప్పుడే కాదు.. భవిష్యత్‌లో కూడా మేం బ్యాలెట్ పేపర్ల విధానానికి మొగ్గుచూపబోం. మనుషుల సాయంతో బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లడం, కౌంటింగ్‌లో తీవ్రమైన ఆలస్యం.. ఇదంతా పోలింగ్ సిబ్బందికి నరకంలా ఉంటుంది. రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి విమర్శలు, సలహాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇదే సమయంలో బెదిరింపులు, ఒత్తిడి, విజ్ఞప్తులకు తలొగ్గి ఈవీఎంలను వదిలి బ్యాలెట్ విధానానికి మళ్లే ప్రసక్తే లేదు'' అని స్పష్టంచేశారు.
ఈవీఎంల సమర్థతపై స్పందిస్తూ.. ''2014 లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్నిరోజులకే దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, త్రిపుర, నాగాలాండ్, మిజోరంతో పాటు తాజాగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్.. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా ఎన్నికల ఫలితాలు నమోదయ్యాయి. నిజంగా ఈవీఎంలలో సమస్య ఉంటే ఇక్కడంతా ఒకేరకమైన ఫలితాలు రావాలి కదా?'' అని సీఈసీ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, facebook/vangaveeti radha krishna
జగన్ పదే పదే అవమానించారు.. గాలికి కొట్టుకుపోతావనేవారు: వంగవీటి రాధా
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు ఎన్నో అవమానాలు జరిగాయని, వాటన్నింటినీ భరించినా ఇంకా అనేక రకాలుగా వేధింపులకు గురిచేస్తుండటం వల్లే రాజీనామా చేసి బయటకు వచ్చానని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఆరోపించినట్లు 'ఈనాడు' దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
ఆ పార్టీలో తానే సర్వస్వం, తాను చెప్పిందే వేదం, ఎవరైనా నా కిందోడే అనేలా జగన్ తీరు ఉంటోందని కూడా ఆయన విమర్శించినట్లు పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. తనను చంపుతామంటూ, అంతు చూస్తామంటూ సామాజిక మాధ్యమాల ద్వారా వైకాపాకు చెందిన వాళ్లు బెదిరింపులకు సైతం దిగారని వంగవీటి రాధా విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ఆరోపించారు.
కేవలం తండ్రి లేని వాడివనే జాలితోనే వైకాపాలో ఉండనిస్తున్నానని, వదిలేస్తే గాలికి కొట్టుకుపోతావంటూ జగన్ తనను పదే పదే అవమానిస్తూ వచ్చారన్నారు. తన తండ్రిపై అభిమానంతో కొందరు విగ్రహం పెడుతుంటే.. ఆ కార్యక్రమానికి తాను వెళ్లడం తప్పని, ఎవరికి చెప్పి వెళ్లావంటూ తనను జగన్ నిలదీయడంతోపాటు అవమానకరంగా మాట్లాడారన్నారు.
ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోయినా తాను బాధపడలేదని, కానీ.. సూటిపోటి మాటలతో వేధించి బయటకు వెళ్లేలా చేశారన్నారు. ప్రజలు తమపై చూపించేది జాలి కాదని, తన తండ్రి చనిపోయి.. 30 ఏళ్లయినా అదే అభిమానం నేటికీ ఉందంటే.. అది ఆయన గొప్పతనమన్నారు.
రంగాను చంపిన పార్టీలోకి ఎలా వెళ్తావంటూ కొందరు ప్రశ్నిస్తున్నారని.. అయితే కొందరు వ్యక్తులు చేసిన పనిని.. తెదేపాకు ఆపాదించడం సరికాదని రాధా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద మనసుతో తనను పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు. తాను ఏ పార్టీలో చేరుతున్నాననే విషయంపై మాత్రం రాధా స్పష్టత ఇవ్వలేదు.
- కంగనా రనౌత్: 'నా మణికర్ణిక చిత్రాన్ని కర్ణిసేన వ్యతిరేకిస్తే వారి అంతు చూస్తా'
- పదేళ్లుగా కోమాలో ఉన్న మహిళ ప్రసవం... మగ నర్సుని అరెస్ట్ చేసిన పోలీసులు
- హిజ్రాలు సన్యాసం స్వీకరించవచ్చా.. కుంభమేళాలో వారి అఖాడా ఎందుకు ప్రత్యేకం
- అఘోరాలు ఎవరు... ఎందుకలా శవాల మధ్య గడుపుతారు...
- ఈ మహిళలు చైనాలో లైవ్ సెక్స్‌క్యామ్ రాకెట్ కోరల నుంచి ఎలా తప్పించుకున్నారంటే..
- Fact Check: 2014 తర్వాత భారత్‌లో భారీ తీవ్రవాద దాడులు జరగలేదా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








