కంగనా రనౌత్: 'నాతో ఎవరైనా బ్లూఫిల్మ్ తీస్తారేమోనని మా అమ్మ భయపడింది'

ఫొటో సోర్స్, Manikarnika film poster
- రచయిత, నవీన్ నేగీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
2009లో - "ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే అమ్మాయిలు తమకు తాము ఒక సెక్స్ ఆబ్జెక్ట్‌లా మారిపోతారు. వారు యాక్టింగ్ కంటే ఎక్కువ తమ లుక్స్ గురించి ఆందోళన చెందుతుంటారు."
2019లో - "నలుగురు చరిత్రకారులు మణికర్ణికను చూసి పాస్ చేశారు. కర్ణి సేన నా సినిమాను వ్యతిరేకిస్తే, నేను కూడా రాజ్‌పుత్‌నే, వారి అంతు చూస్తాను."
సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న 10 YEAR CHALLENGE ట్రెండ్ లాగే మనం పైన ఉన్న రెండు వాఖ్యల్లో తేడాను కూడా గమనిస్తే, గత పదేళ్లలో ఏ నోటి వెంట ఈ మాటలు వచ్చాయో, అవి కాలంతోపాటూ ఎంత పదునెక్కాయో తెలుస్తుంది.
ఈ పదనైన కత్తుల్లాంటి మాటలు కంగనా రనౌత్ నోటి నుంచే వచ్చాయి. ఆమె మాటల ఆ పదునుకు ఫిల్మ్ ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద నటులు, దర్శకులే తీవ్రంగా గాయపడ్డారు.
ఇదే కంగన తన సినిమా ప్రయాణంలో ఒకప్పుడు రాణిగా, ఇంకోసారి తనూగా, మరోసారి సిమ్రన్‌గా సినిమా హాళ్లలో చప్పట్లు కొట్టించుకున్నారు, విజిల్స్ వేయించుకున్నారు.
ఈ చప్పట్లు, విజిల్స్ హోరు కూడా కంగన మాటల వాడిని తగ్గించలేకపోయాయి. ఆమె బాలీవుడ్‌లో బంధుప్రీతి గురించి బహిరంగంగా మాట్లాడగలరు. తన బంధాలలో వచ్చిన గొడవను చెబుతూ అవతలివారిని ధైర్యంగా కడిగిపారేయగలరు.
కెరీర్లో నిలదొక్కుకోడానికి నటీనటులు సాధారణంగా ఎవరో ఒక గాడ్ ఫాదర్‌ను వెతుక్కునే సమయంలో కంగనా బాలీవుడ్‌లో తనకు తాను ఒక రెబల్ అనిపించుకున్నారు.
ఆమె సినీ ప్రపంచంలో మెరుస్తున్న ఒక తార. కానీ, ఇరుకు సందుల్లో రాసిన స్క్రిప్ట్‌లో తను ఉండాలని ఆమె కోరుకుంటుంది. తన డైలాగ్ తానే ఎంచుకుంటుంది. దర్శకత్వం పగ్గాలు కూడా చేతుల్లోకి తీసుకుంటుంది.
కానీ, సినీ ప్రపంచంలో ఆ రంగుల జీవితాన్ని తెలుసుకునే ముందు ఆమె ఉన్న ఆ పర్వతాలపైకి ఒకసారి నడిచొద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
పర్వత ప్రాంతం అమ్మాయి, పుట్టుకే ఒక విషాదం
హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో 1987 మార్చ్ 23న అమరదీప్ రనౌత్, ఆశా రనౌత్ ఇంట్లో ఒక పాప పుట్టింది. కానీ ఇంట్లో సంతోషం బదులు విషాదం నెలకొంది. దానికి కారణం ఈ ఇంట్లో అంతకు ముందే ఒక అమ్మాయి ఉంది. కుటుంబంలో అందరూ ఇంట్లో మగబిడ్డ పుట్టాలనుకున్నారు.
ఏ ఇంట్లో అయినా అబ్బాయిలు, అమ్మాయిల మధ్య తేడా ఎలా ఉంటుందో చెప్పడానికి కంగన తన ఇంటినే ఉదాహరణగా చెబుతారు. తను పుట్టాక ఇంట్లో విషాద వాతావరణం ఏర్పడిందని ఆమె ఓపెన్‌గా చెప్పారు. ఎవరైనా చుట్టాలు వస్తే, తను ఎలా 'అన్ వాంటెడ్ చైల్డ్' అయ్యిందో ఇంట్లో వాళ్లు అందరికీ కథలా చెప్పేవారని అన్నారు.
'అన్ వాంటెడ్ చైల్డ్' అంటే కుటుంబం వద్దని అనుకున్నా వారి జీవితాల్లోకి వచ్చిన బిడ్డ. కంగన స్వభావం మెల్లమెల్లగా రెబల్ కావడానికి బహుశా అదే కారణమేమో. హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కంగన తన బాల్యం గురించి "నేను చిన్నప్పటి నుంచీ మొండిదాన్ని, రెబల్‌గా ఉండేదాన్ని. మా నాన్న నాకు బొమ్మ , మా తమ్ముడి కోసం ప్లాస్టిక్ తుపాకి తెస్తే నేను ఆ బొమ్మ నాకు వద్దని చెప్పేసేదాన్ని. అలా తేడాలు చూపడం నాకు నచ్చేది కాదు" అని చెప్పారు.
కంగన హిమాచల్ నుంచి మొదట చండీగఢ్ చేరుకున్నారు. తర్వాత 16 ఏళ్ల వయసులో దిల్లీ వచ్చారు. కొంతకాలం తర్వాత ఆమెకు మోడలింగ్ ఆఫర్లు రావడం మొదలయ్యాయి. దాంతో కంగన మెల్లమెల్లగా కొండల నుంచి దిగి మైదానంలో మెరవడం మొదలైంది. కొన్ని నెలలు ఆమె అస్మితా థియేటర్ గ్రూప్‌లో నటన కూడా నేర్చుకున్నారు.
కంగన ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె కుటుంబం షాక్ అయ్యింది. దాని గురించి కంగన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. "నాకు మొదటి ఫిల్మ్ ఆఫర్ వచ్చినపుడు నేను సంతోషంగా ఇంట్లో చెప్పాను. కానీ, ఆ సినిమాను మర్డర్ సినిమా తీసిన డైరెక్టర్ తీస్తున్నాడని తెలీగానే మా అమ్మకు కంగారు మొదలైంది. ఎవరైనా నా బ్లూ ఫిల్మ్ తీసేస్తారేమోనని భయపడింది" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అవార్డుల క్వీన్ అవార్డు అంటేనే భయపడింది
కంగన మొదటి సినిమా 'గ్యాంగ్‌స్టర్'. అందులో రింగుల జుట్టుతో ఉన్న బక్క పలచటి అమ్మాయి, స్పష్టంగా హిందీ కూడా మాట్లాడలేకపోతోంది. అప్పట్లో కంగనను చూసిన జనాలకు ఒక రోజు ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద మహా నటులకు వ్యతిరేకంగా గళం వినిపిస్తుందని ఊహించి ఉండరు.
2006లో 'గ్యాంగ్‌స్టర్'తోపాటు 'రంగ్ దే బసంతి', 'లగేరహో మున్నాభాయ్', 'ఫనా' లాంటి పెద్ద సినిమాలు వచ్చాయి. కానీ కంగనా తన మొదటి సినిమాలో ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డ్ గెలుచుకున్నారు.
మొదటి సినిమాతో మొదలైన అవార్డుల పరంపర అలా కొనసాగింది. 'ఫ్యాషన్' సినిమాలో దారితప్పిన, మద్యం మత్తులో మునిగితేలే ఒక అహంకార మోడల్ రోల్‌ను కంగన ఎంత అద్భుతంగా చేశారంటే ఆమెకు ఆ సినిమాకు జాతీయ అవార్డు లభించింది.
ఆ తర్వాత కంగన క్వీన్, తనూ వెడ్స్ మను సినిమాలకు 2015, 2016లో కూడా జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు.
అయితే, ఈ మధ్యలో 2014లో కంగనా రనౌత్ రకరకాల ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసే అవార్డుషోలన్నింటినీ బాయ్‌కాట్ చేశారు. ఆమె ఆ అవార్డులకు ఎలాంటి ఆధారాలు ఉండవని ఆరోపించారు.
ఒక ఇంటర్వ్యూలో కంగన వాటి గురించి "ఈ అవార్డుల ఉద్దేశం కేవలం తమ వీకీపీడియా పేజిని నింపడమే. మొదట్లో నేను చాలా బాగా తయారై ఈ అవార్డు షోలకు వెళ్లేదాన్ని. కానీ ఒకసారి నాకు 'లైఫ్ ఇన్ ఎ మెట్రో' సినిమాకు అవార్డు తీసుకోవాలి. కానీ నేను వెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాను. నేను ఆ ఫంక్షన్‌కు వెళ్లేసరికి నా అవార్డును సోహా అలీఖాన్‌కు ఇచ్చేశారు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Twiter/rangoli chandel
కంగన సోదరి రంగోలీపై యాసిడ్ అటాక్
కంగనా రనౌత్‌కు అత్యంత సన్నిహితురాలు ఆమె అక్క రంగోలీ చందేల్ అని చెబుతారు. ప్రతి పురుషుడి వెనకా ఒక మహిళ ఉన్నట్టే, తన విజయం వెనక కూడా ఒక మహిళే ఉన్నారని కంగన స్వయంగా చెప్పారు. రంగోలీపై యాసిడ్ అటాక్ జరిగింది. 'పింక్ విలా వెబ్‌సైట్‌తో మాట్లాడిన రంగోలీ తనపై జరిగిన ఘటన గురించి చెప్పారు.
2006లో రంగోలీ 23 ఏళ్ల వయసులో డెహ్రాడూన్‌లోని ఒక కాలేజీలో చదివేవారు. ఆ సమయంలో ఆమెపై యాసిడ్ అటాక్ జరిగింది. రంగోలీని వన్ సైడ్ లవ్ చేసిన ఒక అబ్బాయి ఆమెపై యాసిడ్ దాడి చేశాడు.
కంగనా రనౌత్ కెరీర్ అప్పుడే ప్రారంభమైంది. చికిత్స చేయించినా రంగోలీ ఒక కంటికి 90 శాతం చూపు పోయింది. ఆమె ఒక స్తనానికి చాలా నష్టం జరిగింది.
ఆ దాడి తర్వాత మూడు నెలల వరకూ అద్దంలో తన ముఖం చూసుకునే ధైర్యం చేయలేకపోయానని రంగోలీ చెప్పారు. అప్పుడు తనను కంగనే చూసుకుందని, ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించిందని తెలిపారు.
ప్రస్తుతం కంగన మీడియా మేనేజ్‌మెంట్ బాధ్యతను రంగోలీనే చూసుకుంటున్నారు. కంగనా సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. దాంతో రంగోలీ ఆమెకు వచ్చే అప్ డేట్స్ అన్నీ అందిస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
బాలీవుడ్ రియల్ రెబల్ స్టార్ కంగన
కరణ్ జోహార్ తన కాఫీ విత్ కరణ్ షో ద్వారా మూవీ మాఫియాను, సినిమాల ద్వారా బంధుప్రీతిని ప్రమోట్ చేస్తున్నారని కంగన అతడి షోలో అతడిపైనే ఆరోపణలు చేశారు.
ఈ ఇంటర్వ్యూ తర్వాత బాలీవుడ్లో బంధుప్రీతి గురించి తీవ్రంగా చర్చ జరిగింది. ఫిల్మ్ ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోయి కనిపిస్తోంది. కరణ్ జోహార్, ఆయన సన్నిహితులు చాలా మంది కంగనను దూరం ఉంచారు.
ఈ ఇంటర్వ్యూ తర్వాత కంగనా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడం కష్టం అని, ఆమెకు ఇక సినిమాలే రావని చాలా మంది భావించారు.
అలాంటి ఆలోచనలతో కంగన మాటల వాడి తగ్గిపోలేదు. ఫిల్మ్ ఇంటస్ట్రీలో తనకు ఖాన్లు లేదా కపూర్ల అవసరం లేదని ఆమె మరోసారి అన్నారు.
కంగన తన వ్యక్తిగత బంధాల గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడుతారు. వయసులో తనకంటే పెద్దవాడైన ఆదిత్య పంచోలీ, కంగన మధ్య జరిగిన గొడవ మీడియాలో చాలా రోజులపాటు చర్చనీయాంశంగా నిలిచింది.
ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన కంగన ఆదిత్య పంచోలితో తన బంధం గురించి కూడా మాట్లాడింది. "నేను అప్పుడు ముంబైకు పూర్తిగా కొత్త. 18 ఏళ్లు కూడా లేవు. ఒక హాస్టల్లో ఉండేదాన్ని. అప్పుడు ఆదిత్య పంచోలి నాకు ఒక ఫ్లాట్ ఇచ్చారు. కానీ, ఆయన అక్కడ నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. నేను ఆ విషయం గురించి ఆయన భార్యతో మాట్లాడాను. కానీ, ఆమె కూడా నాకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. నేను చాలా కష్టపడి కిటికీలోంచి దూకి ఆ ఇంటి నుంచి తప్పించుకున్నాను. తర్వాత నాకు అనురాగ్ బసు, ఆయన భార్య సాయం చేశారు. అనురాగ్ 15 రోజుల వరకూ నన్ను తన ఆఫీసులో దాచి ఉంచారని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటికీ బాలీవుడ్‌లో చిరునవ్వులు
కంగన ఆరోపణలపై ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన ఆదిత్య పంచోలి, తనపై చేసిన ఆరోపణలన్నీ అబద్ధం అన్నారు. అప్పుడే ఒక జర్నలిస్ట్ పంచోలీని "ఇప్పుడు కంగనే మీ ముందుకు వస్తే మీరు ఏం చెబుతారని" అడిగినప్పుడు, సమాధానం ఇచ్చిన ఆదిత్య పంచోలీ చేతులు జోడించి నవ్వుతూ "నమస్తే క్వీన్, నన్ను క్షమించు అంటాను" అన్నారు.
"కంగన ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినపుడు నేను నా కళ్లతో ఆమె స్ట్రగుల్ పడడం చూశా. ఈరోజు ఆమె నాపై ఇలా ఆరోపణలు చేయడం నాకు బాధగా ఉంది. ఆమె తన సినిమాను ప్రమోషన్ చేసుకోవాలి. అందుకే ఇలా 15 ఏళ్ల పాత విషయాలను ఇప్పుడు తప్పుడు పద్ధతిలో మీడియా ముందుకు తెస్తోంది" అన్నారు.
నటుడు హృతిక్ రోషన్‌తో తన సాన్నిహిత్యం గురించి కూడా కంగన స్పష్టంగా చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో కంగన హృతిక్‌ను 'సిల్లీ ఎక్స్' అన్నారు.
ఆ తర్వాత ఇద్దరి మధ్య నడిచిన చాలా ఈమెయిల్స్ బయటపడ్డాయి. బాలీవుడ్ మరోసారి ఎన్నో వర్గాలుగా చీలిపోతూ వచ్చింది. అంతేకాదు, అప్పుడు కంగన చరిత్రపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు.
ఒకప్పుడు కంగనా రనౌత్ ప్రేమికుడు అయిన అధ్యయన్ సుమన్ కూడా "ఆమె నాపై మాయలు మంత్రాలు ప్రయోగించిందని" అన్నాడు.
అయితే, ఇన్ని ఆరోపణలు-వివాదాల తర్వాత కూడా కంగన ఇప్పటికీ బాలీవుడ్లోనే ఉన్నారు. చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు.
ఆమె నటించిన క్వీన్ సినిమా ఆఖరి సీన్‌లో రాణి విజయ్ చేతికి ఉంగరం తిరిగి ఇచ్చేసి థాంక్యూ చెప్పి ముందుకు నడుస్తుంది.
సరిగ్గా అలాగే కంగన తన పదునైన మాటలతో విమర్శకులు, ప్రత్యర్థులకు కూడా థాంక్యూ రూపంలో ఉన్న ఎన్నో ఉంగరాలను అందించారు.
ఇవి కూడా చదవండి:
- ట్విటర్ సంచలనం: ఒక్క ట్రిక్కుతో 50 లక్షల రీట్వీట్లు
- నమ్మకాలు-నిజాలు: కాపురాలు కూల్చేసే తెల్లబట్ట
- పదేళ్ల నుంచి కోమాలో ఉన్న మహిళ ప్రసవం... ఆస్పత్రి సిబ్బందికి డీఎన్ఏ పరీక్షలు
- హరప్పా నాగరికతలో పురాతన ‘దంపతుల’ సమాధి చెప్తున్న చరిత్ర
- విపరీతంగా షేర్ అవుతున్న ఈ ఫొటోలు వాస్తవానికి భారతీయ సైనికులవి కాదు
- అంతరిక్షం నుంచి మళ్లీ అవే సంకేతాలు? ఎవరు పంపారు?
- కోడిపందేల చరిత్ర తెలిసి ఉండొచ్చు.. మరి కోడి చరిత్ర తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








