ఉత్తమ్ కుమార్‌రెడ్డి: పైలట్ గెలిచారు.. పార్టీ ఓడిపోయింది

ఫొటో సోర్స్, Uttam Kumar Reddy/Facebook
నలమంద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. అనే కన్నా కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటే చాలా మందికి తెలుస్తుంది. భారత వాయుసేనలో యుద్ధ విమాన పైలట్‌గా పనిచేసిన ఉత్తమ్‌కుమార్.. ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీకి సారథిగా ఉన్నారు.
జననం: 1962 జూన్ 20న తెలంగాణలోని సూర్యాపేట
విద్య: బీఎస్‌సీ
వృత్తి: భారత వాయుసేనలో పైలట్‌గా పనిచేశారు. మిగ్ 21, మిగ్ 23 యుద్ధ విమానాలకు పైలట్‌గా ఉన్నారు. 1990లో రాష్ట్రపతి భద్రతా వ్యవహారాల బాధ్యతలు నిర్వర్తించారు.
వివాహం: ఉత్తమ్‌కుమార్ వాయుసేనలో ఉండగానే ఆర్కిటెక్ట్ పద్మావతితో 1990లో వివాహమైంది.

ఫొటో సోర్స్, Uttam kumar reddy/Facebook
రాజకీయ ప్రవేశం...
1994లో వాయుసేన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరటం ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు.
అదే సంవత్సరం జరిగిన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మొదటిసారి పోటీచేశారు కానీ విజయం సాధించలేకపోయారు.
అనంతరం 1999, 2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా రెండుసార్లు కోదాడ నుంచి గెలిచారు ఉత్తమ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి, అంచనాల కమిటీకి చైర్మన్‌గా పనిచేశారు.
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ఫొటో సోర్స్, Uttam Kumar Reddy
తెలంగాణ కాంగ్రెస్ తరఫున చర్చలు...
తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం 2011లో ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశాలకు తెలంగాణ కాంగ్రెస్ తరఫున హాజరయ్యారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు.
2014లో కూడా హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరుసగా నాలుగోసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ప్రకటించింది ఆ పార్టీ అధిష్టానం.
2015 ఫిబ్రవరిలో టీపీసీసీ అధ్యక్షుడి బాధ్యతలను ఉత్తమ్‌కు అప్పగించింది.

ఫొటో సోర్స్, Uttam kumar reddy/Facebook
భార్య కూడా అసెంబ్లీకి...
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి కూడా రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన పద్మావతి మొదటిసారే విజయం సాధించారు. ఉత్తమ్, పద్మావతి - భార్యాభర్తలిద్దరూ ఒకే సభలో ఎమ్మెల్యేలుగా ఉండటం విశేషం.
మరో విశేషమేమిటంటే.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2016లో విడుదలైన ‘టెర్రర్’ అనే సినిమాలో అతిథి పాత్రలో నటించారు. అందులో ఆయన పోషించిన పాత్ర ముఖ్యమంత్రి.
కొంత కాలం కిందట ఆయన ఒక శపథం కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ తాను గడ్డం తీయనన్నారు. ఇటీవల.. ‘డిసెంబర్ 12వ తేదీన గడ్డం తీస్తా’నని ధీమాగా చెప్పారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత జరుగుతున్న రెండో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యూహాత్మకంగా నడుస్తున్నారు. కాంగ్రెస్‌ను ఆగర్భ శత్రువుగా భావించే తెలుగుదేశం పార్టీతో సహా కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రజాసమితి, సీపీఐ తదితర పార్టీలతో మహాకూటమిగా ఏర్పడి.. టీఆర్ఎస్ మీద యుద్ధం ప్రకటించారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








