అమృత్‌సర్ సమీపంలో పేలుడు... ముగ్గురు మృతి, 19 మందికి గాయాలు

పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు 10 కిలోమీటర్ల దూరంలోని అజ్నాలా పట్టణంలో జరిగిన పేలుడులో ముగ్గురు చనిపోయారని పోలీసులు తెలిపారు. మరో 19 మంది గాయపడ్డారని అమృత్‌సర్ నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేఎస్ సంఘా బీబీసీకి చెప్పారు.
అమృత్‌సర్ నుంచి విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ఉన్న నిరంకారీ భవన్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఆదివారం అనుమానిత వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి, భారీగా గుమికూడిన నిరంకారీలపై గ్రెనేడ్‌ను విసిరేసి పారిపోయారని ఐజీ సురిందర్ పాల్ చెప్పారు.
గాయపడిన వారిని అమృత్‌సర్‌లోని గురునానక్ ఆస్పత్రికి తరలించారు.
కొన్ని వారాల క్రితం పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలోనూ ఇలాంటి దాడే జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు పోస్ట్‌పై గ్రెనేడ్ విసిరి వెళ్లారు.

ఫొటో సోర్స్, Getty Images
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం
మృతుల కుటుంబాలకు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడ్డారికి ఉచితంగా చికిత్స చేయిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించిన ఆయన హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, నిఘా విభాగ డైరెక్టర్ జనరల్‌లను వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేయాలని ఆదేశించారు.

సిక్కు- నిరంకారీల మధ్య టెన్షన్
మతపరమైన నమ్మకాల విషయంలో నిరంకారీలకు, సంప్రదాయ సిక్కులకు మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. బతికున్న మనిషి (బాబా)లోనే దైవం ఉంటుందని నిరంకారీలు నమ్ముతారు. అలాగే, సిక్కు మత పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహెబ్‌ను కూడా నమ్ముతారు.
సంప్రదాయ సిక్కులేమో బతికున్న మనిషిలో దైవాన్ని నమ్మరు. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న ప్రధాన వైరుధ్యం అదే.
1978లో సంప్రదాయ సిక్కులకు, నిరంకారీలకు మధ్య జరిగిన తీవ్రమైన ఘర్షణల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆ తర్వాత 1980 ఏప్రిల్‌లో నిరంకారీల నేత గురుబచన్ సింగ్‌ను సంప్రదాయ సిక్కు అయిన రంజిత్ సింగ్ దిల్లీలో హత్య చేశారు. ఆ ఘటన ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతను పెంచింది.
అయితే, గత దశాబ్ద కాలంగా ఇరువురూ ప్రశాంతంగానే ఉంటూ వచ్చారు.

పంజాబ్‌లో హై అలర్ట్
పంజాబ్‌లోకి తీవ్రవాదులు చొరబడి ఉండొచ్చన్న సమాచారంతో గతవారమే నిఘా వర్గాలు హై అలర్ట్ ప్రకటించాయి.
పాకిస్తాన్‌లోని జైష్- ఏ- మహమ్మద్ సంస్థకు చెందిన ఆరేడుగురు తీవ్రవాదులు సరిహద్దు దాటి పంజాబ్‌లోకి చొరబడ్డట్లు, వాళ్లు ఫెరోజ్‌పూర్ ప్రాంతంలో దాక్కుని ఉండే అవకాశం ఉందని తాజాగా వార్తలు వచ్చాయి. వారిలో ఆరుగురు సూసైడ్ బాంబర్లు ఉండొచ్చని కథనాలు వచ్చాయి.
పఠాన్‌కోట్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ట్యాక్సీని హైజాక్ చేసి ఎత్తుకెళ్లిన ఘటన తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఇవి కూడా చదవండి:
- అమృత్‌సర్ విషాదం: ‘రైలు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడనే ప్రచారం అబద్ధం'
- అమృత్‌సర్ విషాదం: రైల్వే ట్రాక్ మీద పోగొట్టుకున్న బిడ్డను కలిసిన తల్లి కథ
- న్యూజెర్సీలో కాల్పులు... తెలంగాణకు చెందిన వ్యక్తి మృతి
- అమృత్‌సర్ రైలు ప్రమాదం: చెల్లీ! ఏమయ్యావు? అన్నయ్య ఆరాటం
- ఆపరేషన్ బ్లూ స్టార్: ‘కాల్పుల శబ్దం ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతోంది’
- 'జలియన్‌వాలాబాగ్ నరమేధానికి బ్రిటన్ క్షమాపణ చెప్పాల్సిందే'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








