న్యూజెర్సీలో కాల్పులు... తెలంగాణకు చెందిన వ్యక్తి మృతి

ఫొటో సోర్స్, Sunil Family
తెలంగాణలోని మెదక్ పట్టణానికి చెందిన 61 ఏళ్ళ సునీల్ ఎడ్ల అమెరికాలో హత్యకు గురయ్యారు. న్యూజెర్సీలోని మేస్ లాండింగ్ ప్రాంతంలో ఒక పదహారేళ్ల కుర్రాడు ఆయన మీద కాల్పులు జరిపారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
కాల్పులు జరిపిన టీనేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు.
ఘటనా స్థలం నుంచి కనిపించకుండా పోయిన సునీల్ కారును పోలీసులు అట్లాంటిక్ సిటీ నిఘా కేంద్రం సహాయంతో స్వాధీనం చేసుకున్నారు.
అట్లాంటా కౌంటీ ప్రాసిక్యూటర్ డామన్ జి టైనర్ చెప్పిన వివరాల ప్రకారం, న్యూజెర్సీలోని నాష్విల్ అవెన్యూలో నివాసం ఉంటున్న సునీల్ స్థానిక కాలమానం ప్రకారం నవంబర్ 15న రాత్రి 8 గంటల ప్రాంతంలో తన ఇంటి వద్దే హత్యకు గురయ్యారు.

ఫొటో సోర్స్, FACEBOOK
క్రిస్మస్ పండగకు మెదక్‌లోని తన ఇంటికి రావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న సునీల్ హత్యకు గురికావడం వారి కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. క్రిస్మస్‌తో పాటు తన తల్లి 95వ జన్మదిన వేడుకలకు మెదక్‌లో ఉండాలని ఆయన భావించారు. తన కుటుంబ సభ్యుల కోసం ఆయన కానుకలు కూడా కొని పెట్టుకున్నారు. కానీ, ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగింది.
దాదాపు మూడు దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్న సునీల్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి ఈ మధ్యే పెళ్ళి చేశారు. అట్లాంటిక్ సిటీలోని రెస్టారెంట్‌లో పని చేస్తున్న సునీల్ చర్చిలో పియానో కూడా వాయించేవారు.

ఫొటో సోర్స్, Sunil Family
ఆయన ముగ్గురు సోదరుల్లో ఒకరు మెదక్‌లోనే ఉంటున్నారు. మిగతా ఇద్దరు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. సునీల్ అక్క మెదక్‌లోనే తల్లితో కలిసి ఉంటున్నారు. కుటుంబలో అందరికన్నా చిన్నవాడైన సునీల్ మరణవార్త విని విషాదంలో మునిగిపోయారు.
"అయితే, సునీల్ తల్లికి మాత్రం ఇంకా ఆ విషయం చెప్పలేదని, మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించే విషయమై వారు అధికారులతో మాట్లాడుతున్నారని" మెదక్ మిషన్ కాంపౌండులోని సునీల్ ఇంటి పక్కనే ఉంటున్న నేలపాటి వికాస్ బీబీసీకి తెలిపారు.
సునీల్ కుటుంబానికి దూరపు బంధువు కూడా అయి వికాస్, "సునీల్ వస్తారని ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్న ఆయన కుటుంబ సభ్యులను ఆయన మరణవార్త విషాదానికి గురి చేసింది" అని చెప్పారు.
అమెరికాలోని సునీల్ కుమారుడు మోరిసన్, "నాకు మాట పెగలడం లేదు. కారు కోసం వచ్చిన వాడు కారు తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా... మా నాన్నను ఎందుకు చంపాలి" అని చెప్పినట్లు ఎన్‌బీసీ ఫిలడెల్ఫియా.కామ్ రిపోర్ట్ చేసింది.
అమెరికాలోనే అంత్యక్రియలు
సునీల్ అంత్యక్రియలు అమెరికాలోనే జరిపేందుకు ఆయన భార్యా పిల్లలు నిర్ణయించారని సునీల్ బంధువు సువన్ తెలిపారు.
బుధవారం మధ్యాహ్నం( స్థానిక కాలమానం ప్రకారం) అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
ఈ ఏడాది జూలైలో కాన్సస్ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన కాల్పుల్లో వరంగల్‌కు చెందిన కొప్పు శరత్ అనే విద్యార్థి మృతి చెందాడు.
2017 ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల కూడా కాన్సస్‌లోనే ఇలాగే కాల్పులకు బలయ్యారు. జాతివివక్ష కారణంగా జరిగిన ఆ హత్య కేసులో నేరస్థుడికి జీవిత ఖైదు విధించారు.
ఇవి కూడా చదవండి:
- కాన్సస్: శ్రీనివాస్ కూచిబొట్ల హంతకుడికి 78 ఏళ్ల జీవితఖైదు
- కాన్సస్ కాల్పులు: ‘అవును.. కూచిభొట్ల శ్రీనివాస్‌ను నేనే చంపా’
- నాసా సదస్సుకు ఎంపిక కావాలంటే కార్పొరేట్ స్కూల్స్‌లోనే చదవాలనేం లేదు!
- ఈ పసిశోకం అమెరికా వలసల కన్నీటి కథకు సంకేతం
- శ్రీదేవి భౌతికకాయాన్ని దుబాయ్ నుంచి భారత్‌కు పంపించిన అష్రఫ్ ఎవరు?
- అమెరికాలో సెక్స్ రాకెట్.. టాలీవుడ్‌పై నీలి నీడలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









