కాన్సస్: శ్రీనివాస్‌ కూచిబొట్ల హంతకుడికి 78 ఏళ్ల జీవితఖైదు

శ్రీనివాస్

ఫొటో సోర్స్, FACEBOOK

అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కూచిబొట్ల శ్రీనివాస్‌ను హత్య చేసిన పురింటన్‌కు కాన్సస్ ఫెడరల్ కోర్టు జీవితఖైదు విధించింది.

2017 ఫిబ్రవరి 22న శ్రీనివాస్ కూచిబొట్ల, అతని స్నేహితుడు అలోక్ కాన్సస్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఉండగా అమెరికా పౌరుడు పురింటన్ వారిపై కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో శ్రీనివాస్ మృతిచెందగా అలోక్ తీవ్రంగా గాయపడ్డారు.

కాల్పులు జరపడానికి ముందు "మా దేశం విడిచిపోండి" అని పురింటన్ నినాదాలు చేశాడు.

ఈ కేసును విచారించిన కాన్సస్‌లోని ఫెడరల్ కోర్టు జాత్యహంకారంతోనే పురింటన్ కాల్పులు జరిపినట్లు నిర్ధరించింది.

నిందితుడు పురింటన్‌ 78 ఏళ్లు జైల్లోనే ఉండాలని శిక్ష విధించినట్లు కాన్సస్ సిటీ న్యూస్ అండ్ వెదర్ న్యూస్ చానల్ పేర్కొన్నట్లు పీటీఐ చెప్పింది.

అతనికి వందేళ్లు వచ్చే వరకు పెరోల్ కూడా ఇవ్వొద్దని ఆదేశించింది.

శ్రీనివాస్

ఫొటో సోర్స్, FACEBOOK

ఫెడరల్‌ కోర్టు తీర్పు ప్రకారం పురింటన్ ఇక జీవితమంతా జైలులోనే గడపాల్సి ఉంది.

కోర్టు తీర్పును శ్రీనివాస్ భార్య స్వాగతించారు.

కోర్టు తీర్పుతో చనిపోయిన తన భర్త తిరిగిరాడు. కానీ మరొకసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఒక ప్రకటనలో ఆమె కోరారు.

శ్రీనివాస్ కూచిబొట్ల స్వస్థలం హైదరాబాద్‌. అమెరికాలో ఏవియేషన్ సిస్టమ్స్‌ ఇంజనీర్‌గా పని చేసేవారు.

బార్

ఫొటో సోర్స్, AUSTINS BAR & GRILL

శ్రీనివాస్ హత్య కేసుతో పాటు పురింటన్‌పై మరో రెండు కేసులు ఉన్నాయి.

అతనిపై ఉన్న జాత్యాంకార అభియోగాల కేసు మే 21న విచారణకు రానుంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.