శ్రీదేవి భౌతికకాయాన్ని దుబాయ్ నుంచి భారత్‌కు పంపించిన అష్రఫ్ ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమితాభ్ భట్టాశాలి
- హోదా, బీబీసీ ప్రతినిధి, కోల్‌కతా
శ్రీదేవి మృతదేహం దుబాయ్ నుంచి భారత్‌కు రావడానికి దాదాపు మూడు రోజులు పట్టింది. ఇంతకూ ఆమెను భారత్‌కు సాగనంపింది ఎవరు?
దుబాయ్‌లో చనిపోయిన సినీ నటి శ్రీదేవి కోసం భారత్‌లో లక్షలాది మంది అభిమానులు ఎదురు చూశారు.
ఆ దేశ నిబంధనల ప్రకారం ఒక మృతదేహం భారత్‌కు రావాలంటే చాలా క్లియరెన్సులు అవసరం. శ్రీదేవి మృతదేహం తరలింపుకు అవసరమైన ఏర్పాట్లు చేసిన వ్యక్తితో బీబీసీ కోల్‌కతా ప్రతినిధి అమితాభ్ భట్టాశాలి మాట్లాడారు. ఆ వివరాలు అమితాభ్ మాటల్లోనే..
ఎవరీ అష్రఫ్?
శ్రీదేవి భౌతిక కాయాన్ని భద్రపరచిన వివరాలను తెలియచేసే ఎంబాల్మెంట్ సర్టిఫికేట్‌లో, అష్రఫ్ అనే వ్యక్తి శ్రీదేవి కాయాన్ని రిసీవ్ చేసుకున్నారని ఉంది. పక్కనే అతడి ఫోన్ నంబర్ కూడా ఉంది.
ఆ నంబర్ ఆధారంగా ఆ వ్యక్తి వివరాలను కనుగొన్నాను. ఆ నంబర్ యు.ఎ.ఈ లోని అజ్మన్ నగరం లోనిది. ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే.. లైన్ బిజీ వచ్చింది. తర్వాత కాసేపటికి ఆ నంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది.
తిరిగి ఫోన్ చేశాను. అటువైపున అష్రఫ్ మాట్లాడారు.
''నేను పోలీస్ కార్యాలయం దగ్గర ఉన్నాను. ఎవరో చనిపోయారట. 15 నిమిషాలు ఆగి మళ్లీ ఫోన్ చేస్తారా?'' అని అష్రఫ్ అడిగారు.
ఈలోగా అష్రఫ్ గురించి మరింత సమాచారం సేకరించి, మళ్లీ ఫోన్ చేశాను.
అతని పేరు అష్రఫ్ తమరచ్చెరి. అతను కేరళకు చెందిన వ్యక్తి. యుఏఈలోని అజ్మన్ నగరంలో ఓ మోటర్ గ్యారేజ్‌ను అష్రఫ్ నిర్వహిస్తున్నారు.
అయితే అరబ్ దేశాల్లో నివసించే చాలా మందికి ఇతనే చివరి మజిలీ!

అక్కడ మరణించే వ్యక్తుల మృతదేహాలను స్వదేశాలకు పంపేందుకు అష్రఫ్ సహాయం చేస్తారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లనూ ఈయనే చూసుకుంటారు.
17 సంవత్సరాలుగా అష్రఫ్ ఈ పని చేస్తున్నారు. అది కూడా స్వచ్ఛందంగా!
''2000 సంవత్సరంలో షార్జాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నా మిత్రుడ్ని చూడటానికి వెళ్లాను. అతడ్ని పలకరించి బయటకు వస్తున్నపుడు ఇద్దరు వ్యక్తులు గుండెలు అవిసేలా ఏడుస్తుండటం చూశాను. వారిది మా కేరళ రాష్ట్రమే'' అని బీబీసీకి వివరించారు అష్రఫ్.
ఆ ఇద్దరు మళయాళీల తండ్రి అంతకు కాసేపటి ముందే మరణించారు. కానీ తమ తండ్రి మృతదేహాన్ని కేరళకు ఎలా తీసుకుపోవాలో తెలీదని అఫ్రఫ్‌కు చెప్పారు.
''ఒక మృతదేహాన్ని స్వదేశానికి ఎలా పంపాలో అప్పటికి నాక్కూడా తెలీదు. కానీ 4-5 రోజులపాటు వారికి తోడుగా.. అన్ని ఆఫీసులకూ వెళ్లి, వారి తండ్రి మృతదేహాన్ని కేరళ పంపేందుకు అన్ని ఏర్పాట్లూ చేశాను. అదే మొదలు. ఆ తర్వాత ఓ బంగ్లాదేశీయుడు మరణించాడు. అతడి మృతదేహాన్ని కూడా అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసి, బంగ్లాదేశ్‌కు పంపించాను'' అని అష్రఫ్ తెలిపారు.

ఇప్పటికి 4,700 మృతదేహాలను సాగనంపాను..
అప్పటి నుంచి.. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌తో పాటుగా మొత్తం 88 దేశాలకు చెందిన 4,700 మృతదేహాలు అష్రఫ్ చేతుల మీదుగానే స్వదేశాలకు చేరాయి.
''చాలా సంధర్భాల్లో మృతదేహాలతోపాటు వెళ్లడానికి ఎవ్వరూ ఉండరు. అలాంటపుడు నేనే స్వయంగా ఆ మృతదేహాలను వారి బంధువుల వద్దకు తీసుకుపోతాను. పోయిన వారం చెన్నైలో ఉన్నాను. అంతకు ముందు కోల్‌కతాకు కనీసం నాలుగు సార్లు వెళ్లుంటాను. అసోం, ఒడిశా.. ఇలా చాలా చోట్లకు మృతదేహాలతోపాటు ప్రయాణించాను.''
ఒక్క రూపాయి కూడా ఆశించకుండా అష్రఫ్ తమరచ్చెరి ఈ పని చేస్తున్నారు.

''ఈ మధ్య నా గ్యారేజ్‌ను చూసుకోవడానికి కూడా తీరిక లేదు. ఎవరో ఒకరి మృతదేహాన్ని స్వదేశానికి పంపే పనుల తోటే సరిపోతోంది. నా గ్యారేజ్‌ను మా బావ చూసుకుంటున్నారు. గ్యారేజ్ నుంచి వచ్చే ఆదాయంతో నా కుటుంబం సాఫీగానే నడుస్తోంది.''
ఈ పని చేస్తున్నందుకు చాలా కుటుంబాలు నన్ను ఆశీర్వదిస్తున్నాయి. నాకు, నా కుటుంబానికి వారి ఆశీర్వచనాలే కానుక. నాకది చాలు..''
దుబాయ్ హోటల్‌లో శ్రీదేవి మరణించాక, భారతీయ దౌత్య కార్యాలయం అష్రఫ్‌ను సంప్రదించింది.
''శ్రీదేవి మరణం గురించి నాకు సమాచారం అందాక, ఆ పనులపై మూడు రోజుల పాటు అక్కడే గడపాల్సి వచ్చింది. శ్రీదేవి మరణించిన రోజే మరో నలుగురు భారతీయులు కూడా మరణించారు. అందులో ఒకరు చెన్నై, మరొకరు అహ్మదాబాద్‌కు చెందిన వారు. మరో ఇద్దరు మా కేరళ వాసులు. ఆ నలుగురి మృతదేహాలను స్వదేశానికి పంపడానికి నేనే ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది'' అని అష్రఫ్ వివరించారు.
''శ్రీదేవి బతికున్నపుడు ఎంత అందంగా ఉన్నారో.. చనిపోయినపుడు కూడా అంతే అందంగా ఉన్నారు!'' అని తన గుర్తు చేసుకున్నారు అష్రఫ్ తమరచ్చెరి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








