తనుశ్రీ దత్తా ఆరోపణలపై స్పందించిన నానా పాటేకర్

ఫొటో సోర్స్, Getty Images
'హార్న్ ఓకే ప్లీజ్' అనే సినిమా చిత్రీకరణ సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ తనను లైంగికంగా వేధించారని నటి తనుశ్రీ దత్తా ఆరోపించారు. ఈ ఆరోపణలు బాలీవుడ్‌లో సంచలనంగా మారాయి.
2009లో ఈ సినిమా విడుదలైంది. దీని కోసం పనిచేస్తున్న సమయంలోనే పాటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని తనుశ్రీ దత్తా ఆరోపించారు. నిజానికి, పదేళ్ల క్రితమే ఆమె ఈ ఆరోపణలు చేసినా, తాజాగా దానిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం చర్చనీయాంశమైంది.
ఈ ఘటనపై నటుడు నానా పాటేకర్ స్పందించారు. ‘ఈ విషయంపై నన్నేమీ మాట్లాడొద్దని మా లాయర్ చెప్పారు. అందుకే, ప్రస్తుతం దీని గురించి ఏమీ చెప్పను’ అని పత్రికా సమావేశంలో పాటేకర్ చెప్పారు.
పదేళ్ల క్రితమే తాను ఈ ఆరోపణలు అసత్యమని చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. సత్యం ఎప్పటికీ అలానే ఉంటుందనీ, పదేళ్ల తరువాత నిజం అబద్ధంగా మారదని ఆయన చెప్పారు. ఈ విషయం గురించి వివరంగా చెప్పమని మీడియా ఎంత ఒత్తిడి చేసినా ఆయన స్పందించలేదు.
నిజం నిగ్గుతేలినప్పుడు తన అభిప్రాయాన్ని బయటపెడతానని ఆయన అన్నారు.

తనుశ్రీ దత్తా ఆరోపణలపై బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ లాంటి వాళ్లు కూడా స్పందించడానికి నిరాకరించారు.
‘పూర్తి వివరాలు తెలియకుండా నేను దేనిపైనా స్పందించను. కానీ, ఒకటి మాత్రం చెప్పగలను... వేధింపులు ఎక్కడ ఎదురైనా అది బాధాకరమైన విషయమే. కానీ పాటేకర్, తనుశ్రీల విషయంలో మాత్రం నేను ఇప్పుడేమీ మాట్లాడను’ అని ఆమిర్ ఖాన్ అన్నారు.
ఇదే అంశంపై అమితాబ్ బచ్చన్ స్పందనను కోరినప్పుడు... ‘నేను తనుశ్రీ దత్తాను కాదు, నానా పాటేకర్‌ను కూడా కాదు. దీనిపై నేనెలా స్పందించను?’ అని ఆయన పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ కూడా ఇదే తరహాలో జవాబిచ్చారు.
సోషల్ మీడియాలో కొందరు ఈ మొత్తం వ్యవహారాన్ని భారతీయ #MeToo క్యాంపైన్‌గా పేర్కొంటున్నారు.
ప్రస్తుతం అమెరికాలో ఉంటోన్న తనుశ్రీ దత్తా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ‘ఆషిక్ బనాయా ఆప్నే’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తనుశ్రీ గతంలో బాలకృష్ణతో తెలుగులో ‘వీరభద్ర’ సినిమాలో నటించారు.
ఇవి కూడా చదవండి
- రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే ఉండాలని అంబేడ్కర్ నిజంగానే అన్నారా?
- నేను వేశ్యగానే ఉంటా : వ్యభిచార వృత్తిలో కొనసాగే హక్కు కోసం పోరాడిన మహిళ
- మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో ఏడాదిన్నర పాటు తిరిగిన ఒక మహిళా ప్రొఫెసర్ అనుభవాలు
- తెలంగాణ: ఓటింగ్‌పై తీర్మానాలు.. మసీదులో ప్రతిజ్ఞలు
- భారత మార్కెట్లో 'వెబ్‌సిరీస్'ల జోరు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








