BBC News తెలుగు: ఒక ఏడాది.. కొన్ని అనుభవాలు

రంగులద్దని వార్తలు రాజీలేని రిపోర్టింగ్‌తో బీబీసి తెలుగు సర్వీస్ ఆరంభించి ఇవ్వాల్టికి ఏడాది. తారీఖులు దస్తావేజులు వాటికవిగా గతించిన కాలానికి అద్దం పట్టకపోవచ్చుగానీ పనితీరును బేరీజు వేసుకోవడానికైతే ఇదొక కీలక సందర్భం.
వ్యాపార ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు లేని స్వతంత్ర మీడియా సంస్థను ప్రజలు ఆదరిస్తారన్న మా నమ్మకం నిజమైంది.
ఏ పార్టీకో ఏ భావజాలానికో అక్షరాన్ని బానిస చేయకుండా సత్యానికి కట్టుబడి కచ్చితమైన సమాచారంతో తెలుగు సమాజానికి నమ్మకమైన మీడియా నేస్తంగా ఉండాలని నిరుడు గాంధీ జయంతి నాడు సర్వీస్ ఆరంభంలో సంకల్పించాం. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మాధ్యమాల్లో కీలకమైన www.bbc.com/telugu వెబ్‌సైట్‌తో పాటు @BBCNewsTelugu పేరిట ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో సర్వీస్ నిరుడు ఇదే రోజు ఆరంభించాం.

అదే రోజు రాత్రి బీబీసి ప్రపంచం పేరుతో తెలుగు టీవీ బులెటిన్‌ను మా ప్రసార భాగస్వామి ఈనాడు గ్రూప్‌కు చెందిన ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ చానెళ్లలో రాత్రి 10.30 కి ఆరంభించాం. సోదర భారతీయ భాషలు మరాఠీ, గుజరాతీ, పంజాబీల్లో కూడా సర్వీసులు అప్పుడే ఆరంభమయ్యాయి. అప్పటికే హిందీ తమిళ భాషల్లో బీబీసి సర్వీసులున్నాయి. బెంగాళీ, ఉర్దూలను మినహాయించినా ప్రస్తుతం ఆరు భారతీయ భాషల్లో బీబీసి సర్వీసులందిస్తున్నది.
అనుకుంటున్నారు, చెపుతున్నారు, వినవస్తున్నది, భోగట్టా అనే పేరుతోనూ విశ్లేషకులు, వ్యాఖ్యాతలు, విమర్శకులు అనే ఆకాశరామన్నల మాటునా తమ అభిప్రాయాలనే వార్తలుగా చెలామణి చేసే తంతు బీబీసి తెలుగులో కనిపించదు. వార్తలకు అభిప్రాయాలకు స్పష్టమైన విభజన రేఖ పాటించాం. పాటిస్తాం. బీబీసి తెలుగు వార్తలతో పాటు విశ్లేషణలను, అభిప్రాయాలను కూడా ఇస్తుంది. అది పలానా వారి అభిప్రాయం, విశ్లేషణ, కామెంట్ అని చెప్పి మరీ ఇస్తుంది. రెంటినీ కలగాపులగం చేయదు. కాళిదాసు కవిత్వం కొంత సొంత పైత్యం మరికొంత అన్నట్టు సూపర్ లీడ్స్ పేరుతో కవిత్వాలు రాసేస్తూ వార్తకు సొంత అభిప్రాయాలు అద్దే తంతుకు బీబీసి తెలుగు దూరంగా ఉంటుంది.

మండలస్థాయిని దాటి మేజర్ గ్రామపంచాయితీ వరకు కూడా ప్రతినిధులను నియమించుకుని హైపర్ లోకల్ ఎజెండాతో వెడుతున్న మార్కెట్‌లో ఉన్నప్పటికీ మా ఎజెండా సార్వజనీనం. హైపర్ లోకల్ ఎజెండాకు భిన్నంగా జనజీవితాలను ప్రభావితం చేసే ప్రధానమైన అంశాలనే మేం ఎంపిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఘటనలకే పరిమితం కాకుండా వాటి వెనుక దాగిన పరిణామాలను పట్టించే ప్రయత్నం చేస్తున్నాం. ఘటన జరిగిన మరుక్షణం ఊహాగానాలను కలగలిపి వార్తలు వండి వార్చే తంతుకు దూరంగా ఉండాలని అనుకున్నాం. నిర్దిష్టంగా నిర్దుష్టంగా వివరాలు సేకరించి మాత్రమే బీబీసి రిపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ పరుగుపందెంలో దూరి హడావుడిగా తెలిసీ తెలియని అరకొర సమాచారం ఇవ్వడం కంటే సాధికారికంగా వివరంగా ఇవ్వడం బాగుంటుందనే దృక్పథంతో కథనాలు అందిస్తున్నాం.
ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి వ్యతిరేకమైన మగపెత్తనం, కులపెత్తందారీతనం లాంటి వివక్షలకు సంబంధించిన ఘటనలు జరిగినపుడు విశ్లేషణాత్మకమైన కథనాలు, అభిప్రాయాలు అందిస్తున్నాం. బీబీసి తెలుగు యాక్టివిస్ట్ పాత్ర పోషించదు. సంస్థగా దానికి రాజకీయ పరమైన భావజాలం లేదు. కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఘటనలు పరిణామాలు జరిగినపుడు రిపోర్ట్ చేయడం, కథనాలు అందించడం పాత్రికేయ కర్తవ్యం అని భావిస్తున్నాం.

'అనాథల నాన్న' ఇన్నారెడ్డి కథనం 80లు 90ల్లో సాగిన పరిణామాల వల్ల మారిన సామాజిక వ్యవస్థా రూపం వల్ల ఒకప్పటి సాయుధ గెరిల్లాలు విముక్తి మార్గం నుంచి సేవా మార్గం పట్టడం అనేది ఎలా పెరిగిందో సూచిస్తుంది. ఒకప్పటి ఆలయ వ్యభిచార వ్యవస్థకు అవశేషంగా ఇంకా కొనసాగుతున్న జోగినిల పిల్లలు స్కూళ్లలోనూ బయటా తండ్రిపేరు చెప్పలేక స్కూల్ మానేస్తున్న అవస్థలపై కథనం మనల్ని వెన్నాడుతున్న గతాన్ని చూపిస్తుంది. పీరియెడ్స్‌లో ఉన్న మహిళలు, బాలింతలు ఊరికి దూరంగా ఏ కనీస సౌకర్యమూ సాయమూ లేకుండా గుడిసెల్లో రోజులు- నెలల తరబడి గడపడం అనే ఆచారం దక్షిణాంధ్రలో కొన్ని కులాల్లో ఎలా పాతుకుని ఉందో చూపించే కథనం స్ర్తీల పట్ల కొనసాగుతున్న సామాజిక వివక్షను ఎత్తి చూపిస్తుంది. ప్లాస్టిక్ గ్లాస్ గ్రామాల్లో రెండు గ్లాసుల విధానంపై చూపించిన సానుకూల ప్రభావం సమాజంలో కొనసాగుతున్న కుల వ్యవస్థ గురించిన ఒక పార్శ్వాన్ని పట్టిస్తుంది.

అంతర్జాతీయ ఘటనలను పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుగు సమాజానికి అందివ్వడంలో ముందున్నాం. ఉత్తరకొరియా పరిణామాలు కావచ్చు, సిరియా అంతుర్యుద్ధం కావచ్చు, అమెరికా చైనా పన్నుల యుద్ధం కావచ్చు, పరిణామాలు ఏవైనా వాటి పూర్వాపరాలు అర్థయయ్యేలా సవివరమైన కథనాలు అందివ్వగలిగాం. తాజాగా కామెరూన్ లో మానవహననం జరిపిన సైనికులను పరిశోధించి గుర్తించిన తీరు బీబీసి జర్నలిజంలోని శక్తిని సృజనాత్మకతను చాటి చెప్పే మచ్చుతునక.
దేశవ్యాప్తంగా జనజీవితంపై ప్రభావం చూపే కీలకమైన ఘటనలపై బీబీసీ తెలుగు విస్తృతమైన కవరేజ్ అందించింది. ఆధార్ వివాదం మొదలుకొని కేరళ వరదలు, అసోం ఎన్ ఆర్ సి సంక్షోభం దాకా ప్రతి పరిణామాన్నీ విస్తృతంగా చర్చించింది. జాతీయ అంతర్జాతీయ అంశాల్లో సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వీలైన వివరణాత్మక కథనాలను(ఎక్స్‌ప్లెయినర్స్) అందించాం. అలాగే బిజినెస్, కెరీర్ అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు విశ్లేషణలను అందిస్తున్నాం. యువతకోసం, విద్యార్ధుల కోసం ఇంగ్లిష్ నేర్పే కోర్సును రెగ్యులర్‌గా అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి పాతుకుపోయిన నమ్మకాలను శాస్ర్తీయమైన కోణం నుంచి చర్చించే ఆరోగ్యకాలమ్ నమ్మకాలు-నిజాలు ఇవాళే ఆరంభించాం.

అలాగే చాలా మీడియా సంస్థలు నిషిద్ధంగా భావించే అంశాలను సైతం బీబీసీ నిర్మొహమాటంగా చర్చించింది. స్ర్తీలకు సంబంధించినవి, ఎల్జీబీటీలకు సంబంధించినవి, కులపరమైనవి చాలానే ఉన్నాయి. చాలామంది చిన్న చిన్న బృందాల్లో మాత్రమే విచ్చలవిడిగా చర్చిస్తూ పెద్ద పెద్ద సమూహాల దగ్గరకు వచ్చేసరికి సైలెంట్ అయ్యే విషయాలను బీబీసి తెలుగు శాస్ర్తీయంగా చర్చించింది. బీబీసి షి, హర్ చాయిస్, హిజ్ చాయిస్, అన్ సీన్ లైవ్స్ సీరీస్ కథనాలు ఈ కోణంలో ముఖ్యమైనవి. దీనికి సంబంధించి మొదట్లో కొన్ని విమర్శలు కూడా కొందరినుంచి ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ నెమ్మదిగా అందులో ఉన్న శాస్ర్తీయ కోణాన్ని అర్థం చేసుకుంటారని మా ఆశాభావం.
బీబీసీ ఏ అంశాన్నీ అంటరానిదిగా చూడదు. జీవితంలోని ముఖ్యమైన కోణాలు అన్నీ చర్చార్హమైనవే. మనో వికారాలను రెచ్చగొట్టేట్టు రాస్తున్నామా లేక శాస్ర్తీయమైన జ్ఞానాన్ని పెంపొందించేట్టు రాస్తున్నామా అనేదే ముఖ్యం. వాస్తవానికి బహిరంగ చర్చకు దూరంగా ఉంచడం వల్ల సమాచారం అందాల్సిన పద్ధతిలో అందక అశాస్ర్తీయ భావనలు రాజ్యమేలడం చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. నిషిద్ధాలు ప్రజా స్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.

సమస్యలు, సంక్షోభాలు మాత్రమే కాదు. ఉత్తేజమిచ్చే ఉత్సాహం నింపే కథనాలను కూడా అనేకం అందించాం. గొంతు కేన్సర్ పేషెంట్లకు ఒక వైద్యుడు కేవలం అరవైరూపాయలలోపే పరికరం ఎలా కనిపెట్టాడో చెప్పాం. చుట్టూ మంచున్నా నీటికి కటకటా అనే ప్రాంతంలో మంచు పిరమిడ్ ఐడియా గురించి చాటాం. శాస్ర్త సాంకేతిక రంగాల్లో ఆర్ అండ్ డీలో భారత్ వెనుకబడిందనే భావన ఉన్నా నిరంతరం ఏదో ఒక ప్రయోగంలో మునిగి తేలే జుగాడ్ శాస్ర్తవేత్తను పరిచయం చేశాం. బుల్లెట్ నడపాలనే జీవిత కాలపు కోరికను నెరవేర్చుకున్న మధ్యతరగతి మహిళ అంతరంగాన్ని ఆవిష్కరించాం. మగవాయిద్యంగా పేరుబడిన మృదంగంపై పట్టుసాధించి భళా అనిపించుకున్న కళాకారిణి గురించి చాటి చెప్పాం. సాధారణ ఇల్లాలు పాత్రలో వంటలో ప్రయోగాలు చేస్తూ ఆ హాబీతో కోట్లాది మందిని అభిమానులుగా మార్చకున్న హెబ్బార్స్ కిచెన్ సృష్టికర్తను పాఠకుల ముందుంచాం.
పాఠకుల నుంచి వచ్చే విమర్శలను సూచనలను బీబీసీ తెలుగు గౌరవంతో స్వీకరిస్తుంది. అందులో హేతుబద్ధమైన సూచనలను అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది. అంతర్జాతీయ జాతీయ అనువాద వార్తలు అందిస్తున్నపుడు భాష ఇంకా మెరుగుపడాల్సి ఉందనే సూచనను అలాగే స్వీకరించాం. సొంత అభిప్రాయము, అలాంటి అర్థచాయ ఉన్న పదాలు వాడతామేమో అన్న సందేహం తెనుగు వాడుకకు అడ్డంకి కానక్కర్లేదు. వార్తల కవరేజ్ ఇంకా విస్తృతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం.

ఆ చానెల్ చూసిన తర్వాత ఈ చానెల్, ఈ పేపర్ చదివింతర్వాత ఆ పేపర్, ఆ వెబ్ సైట్ చూసింతర్వాత ఇంకో వెబ్ సైట్, ఇట్లా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా సరైన ప్రత్యామ్నాయాన్ని అందించగలిగితే ప్రజలు ఆదరిస్తారని మా నమ్మకం. తెలుసుకునే ఇస్తాం, తెలిసిందే ఇస్తాం అని సత్యానికి ప్రాధాన్యమిచ్చే మీడియాను తెలుగు ప్రజలు ఆదరిస్తారనే మా నమ్మకం వమ్ము కాలేదు.
ప్రతిరోజూ లక్షల సంఖ్యలో మా వెబ్ సైట్‌ని ఆదరిస్తున్న పాఠకులు/వీక్షకులు మాకు మరింత ఉత్సాహమిస్తున్నారు. అందులోనూ యువత ప్రధానంగా ఉండడం భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నది. మీ ప్రోత్సాహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెబుతూ...
(జి ఎస్ రామ్మోహన్, ఎడిటర్,బీబీసీ తెలుగు)
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








