ప్రెస్ రివ్యూ: కశ్మీర్ జర్నలిస్టు హత్యకు నిరసనగా ఖాళీ సంపాదకీయాలు

ఫొటో సోర్స్, Greater kashmir
"రైజింగ్ కశ్మీర్" ఎడిటర్ షుజాత్ బుఖారీ హత్యకు నిరసనగా జమ్మూ కశ్మీర్‌లోని వార్తాపత్రికలు మంగళవారం బ్లాంక్ ఎడిటోరియల్స్‌ను ప్రచురించాయని 'నవతెలంగాణ' పేర్కొంది.
హత్యకు నిరసనగా జర్నలిస్టులందరూ శ్రీనగర్‌లో మౌన ప్రదర్శన చేసిన తరువాతి రోజు వార్తాపత్రికల్లో ఈ చర్యకు ఉపక్రమించాయి.
నిరసన తెలుపడంలో భాగంగా తమ ఎడిటోరియల్ కాలమ్‌ను వార్తాపత్రికలు ఖాళీగా వదిలేశాయి. బుఖారీ హత్య పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రంపై జరిగిన దాడిగా "కశ్మీర్ పర్చమ్" (రైజింగ్ కశ్మీర్ అనుబంధ పత్రిక) పబ్లికేషన్ ఎడిటర్ రషీద్ మక్బూల్ అభివర్ణించారు.
ఈనెల 14న షుజాత్ బుఖారీని కొందరు దుండగులు శ్రీనగర్‌లో హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య జరిగిన తర్వాతి రోజు ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, జర్నలిస్టు హత్యను జమ్మూ కశ్మీర్‌లోని వేర్పాటువాద నాయకులు ఖండించారని నవతెలంగాణ వెల్లడింది.

ఫొటో సోర్స్, utamkumar reddy/facebook
'ఉత్తమ్ నాయకత్వంపై అసంతృప్తి'
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై పార్టీలో అసంతృప్తి క్రమంగా సెగలుగక్కుతోందని 'సాక్షి' పేర్కొంది.
పీసీసీ పీఠంపై కన్నేసిన ఆశావహులు పలువురు ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఉత్తమ్ మూడున్నరేళ్ల పనితీరు బాగా లేదని, ప్రజల్లోనూ శ్రేణుల్లోనూ పార్టీ పట్ల నమ్మకం సడలుతోందని అధ్యక్షుడు రాహుల్‌కు, ఇతర పెద్దలకు వివరించాలని నిశ్చయించారు.
రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్కతో పాటు గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, రాజగోపాల్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు సహా దాదాపు 21 మంది నేతలు మంగళవారం ఢిల్లీ వచ్చారు.
వారంతా బుధవారం ఉదయం 10.15కు ఆయనతో భేటీ అవనున్నారు. పార్టీ పరిస్థితిని వీలైతే రాహుల్‌కే నేరుగా చెప్పాలని, లేదంటే పార్టీ పెద్దల వద్ద ప్రస్తావించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఉత్తమ్‌ను తప్పించేందుకు అవసరమైతే అంతా ఏకం కావాలని నేతలంతా మంగళవారం మంతనాలు సాగించినట్టు సమాచారమని సాక్షి వెల్లడించింది.
తమ కలను సాకారం చేసుకునేందుకు దిల్లీ చేరుకున్న తెలంగాణ గిరిజన విద్యార్థులు
తెలంగాణకు చెందిన 84 మంది షెడ్యూల్డు తెగల విద్యార్థులు కాలేజీ అడ్మిషన్ల కోసం దిల్లీకి చేరుకున్నారని 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ఓ వార్త ప్రచురించింది.
30 గంటల పాటు రైలు ప్రయాణం చేసిన వీళ్లంతా దిల్లీలోని వివిధ కాలేజీల్లో ప్రవేశం కోసం దేశ రాజధానికి చేరుకున్నారు.
వీరంతా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకులాల్లో ఇంటర్ పూర్తి చేసిన వారే.
ఈ గురుకులాల్లో చదువుకున్న 12 మంది విద్యార్థులు నిరుడు మొట్టమొదటిసారి దిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందారు.
మిరాండా హౌజ్, హన్సరాజ్, హిందూ కాలేజీల్లో చదువుతున్న ఈ విద్యార్థులు ఇప్పుడు అడ్మిషన్ కోసం వచ్చిన వారికి సాయపడుతున్నారని ఈ విద్యార్థుల వెంట వచ్చిన ఫిజికల్ డైరెక్టర్ వీరయ్య నాయక్ తెలిపారు.
"వీరి చదువుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తోంది. ఐదో తరగతి నుంచి అండర్‌గ్రాడ్యుయేట్ స్థాయి దాకా ఈ రెసిడెన్షియల్ స్కూళ్లలో బలహీన, గిరిజన సముదాయాలకు చెందిన విద్యార్థులకు ఉచితంగా విద్యాబోధన జరుగుతుంది" అని నాయక్ చెప్పారని 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' వెల్లడించింది.

ఫొటో సోర్స్, Ganta srinivasrao/facebook
మంత్రి గంటా మనస్తాపం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో సీనియర్ సభ్యుడు గంటా శ్రీనివాసరావు మనస్తాపానికి గురయ్యారంటూ 'ఈనాడు' ఒక కథనాన్ని ప్రచురించింది.
వెలగపూడి సచివాలయంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఆయన అమరావతికి రాకుండా విశాఖపట్నంలోనే ఉండిపోయారని తెలుసుకున్న కొందరు నాయకులు ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని సమాచారం.
గత రెండేళ్లుగా తనకు వ్యతిరేకంగా పార్టీలో కొన్ని పరిణామాలు జరుగుతున్నా... వాటిని ఎప్పటికప్పుడు అధినాయకత్వం దృష్టికి తీసుకెళుతున్నా ఫలితం లేకపోయిందని మంత్రి గంటా తన సన్నిహితులతో కొంతకాలంగా చెబుతున్నారు.
తాజాగా సర్వే పేరుతో తనను అప్రతిష్టకి గురి చేసేలా, సొంత నియోజకవర్గంలో తనకు వ్యతిరేకత ఉందనేలా ప్రచారం జరగటానికి పార్టీయే ఆస్కారమిచ్చినట్లు మంత్రి భావిస్తున్నట్లు తెలిసింది.
విశాఖపట్నం భూముల కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక ప్రభుత్వానికి చేరిందని, అందులో తన పాత్ర లేనట్లు తేలినా... దాన్ని బయటపెట్టక పోవటం కూడా తనను ఇబ్బంది పెట్టేందుకేనన్నట్లుగా ఆయన సందేహిస్తున్నారని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్నట్లుగా ప్రచారం సాగుతుండటం మనస్తాపానికి గురి చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాల కథనమని ఈనాడు పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








