అభిప్రాయం : సాక్షులు కోర్టులో సాక్ష్యాలు టీవీలో

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘అది 2013 నవంబర్.. ఆ రాత్రి అసలేం జరిగింది? ఈ వీడియోలో చూడండి.. లోపలికెళ్లింది ఎవరు? బయటకు వచ్చినపుడు వారి బట్టలు ఎలా ఉన్నాయ్? మసకగా ఉన్న ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి.. అక్కడ కదులుతున్న చేతులు ఎవరివి?' అంటూ.. ఓ న్యూస్ చానెల్ ఒక సీసీటీవీ ఫూటేజ్‌ను ప్రసారం చేసింది.
అది ఓ అత్యాచార ఘటనకు చెందిన సీసీటీవీ ఫూటేజ్.
ఐదేళ్ల క్రితం గోవాలో.. తన సహోద్యోగినిపై లిఫ్ట్‌లో అత్యాచారం చేశాడంటూ.. అప్పటి తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌పై ఆరోపణలున్నాయి. ఈ కేసుపై కోర్టు విచారణ కొనసాగుతోంది.
ఈ సంఘటనకు సంబంధించిన కీలకమైన సీసీటీవీ ఫూటేజ్‌ను గోవా పోలీసులు కోర్టుకు అందించారు. 2-3 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను ఓ న్యూస్ చానెల్.. రెండు గంటలపాటు ప్రసారం చేసింది.
'సీసీటీవీ ఫూటేజ్‌ను బాగా పరీక్షించాక మీకు ఏం అర్థమవుతోంది? ఎవరి వాదనతో ఏకీభవిస్తారు? నిందితుడి వాదనతోనా లేక బాధితురాలి వాదనతోనా? మళ్లీ చూడండి..!' అంటూ రిపీట్ చేస్తూ ఆ వీడియోను ప్రసారం చేసింది.
ఈ కేసు విచారణ చాలా రహస్యంగా జరుగుతోంది. విచారణ సమయంలో ప్రజలకు, మీడియాకు అనుమతి లేదు. ఐపీసీ సెక్షన్ 327(2) ప్రకారం 'అత్యాచార కేసుల విచారణను బహిరంగంగా చేపట్టరాదు. విచారణ సమయంలో న్యాయమూర్తి, కక్షిదారులు, వారి తరఫు న్యాయవాదులు, సాక్షులు మాత్రమే అక్కడ ఉండాలి.'
ఈ విధానాన్ని 'ఇన్ కెమెరా' విచారణ అంటారు. ఐపీసీ సెక్షన్ 372(3) ప్రకారం.. కేసుకు సంబంధించిన ఏ ఆధారాలనూ.. 'రాతపూర్వకమైన కోర్టు అనుమతి' లేనిదే ఎవ్వరూ ప్రచురించరాదు, ప్రసారం చేయరాదు.
ఈ నిబంధనను ఎవరైనా మీరితే ఇన్ కెమెరా ఉద్దేశం నెరవేరదు. అలా ప్రవర్తించడం చట్టాన్ని ఉల్లంఘించడమే.
కానీ కేసు లోని ఈ కీలక ఆధారాన్ని టీవీలో చూపించడమే కాకుండా, ఎవరి వాదనతో ఏకీభవిస్తారు అన్న ప్రశ్నలతో.. కోర్టు తీర్పు వెలువడక ముందే, ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేలా చేశారు.
కోర్టులో న్యాయమూర్తి, ఇరు వర్గాల న్యాయవాదులు, బాధితులు, నిందితుల మధ్య జరగాల్సిన విచారణ, చర్చ.. టీవీ స్టుడియోలో జరిగింది. ఈ పరిణామం అత్యంత ప్రమాదకరం.

ఫొటో సోర్స్, Getty Images
లోక్ సభ ఎంపి శశిథరూర్ భార్య సునంద హత్య కేసులో కూడా ఇలాగే జరిగింది.
కోర్టులో కేసు విచారణ దశలో ఉండగానే, కొన్ని ఆధారాలపై.. న్యూస్ చానెళ్లు ఏర్పాటు చేసిన కోర్టులో దర్యాప్తు జరిగింది. గతంలో జరిగిన పొరబాట్లను చూసి కూడా.. మీడియా వైఖరి మారలేదు.
2008లో జరిగిన ఆరుషి తల్వార్, హేమ్‌రాజ్ జంటహత్యల కేసులో కూడా సాక్షులను ఇంటర్వ్యూ చేసిన మీడియా, ఆధారాలన్నింటినీ పరిశీలించి ఓ నిర్ణయానికి వచ్చేసింది.
ప్రశ్నించే హక్కుకు, సాక్షులను, సాక్ష్యాధారాలను పరిశీలించి, విచారించడంలో మీడియా స్వేచ్ఛపై స్పష్టత లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఏది నైతికత?
ఈ విధమైన రిపోర్టింగ్ (దర్యాప్తు) సరైనదేనా? ఇలాంటి వార్తలు, ప్రసారాలు పారదర్శకంగా జరగాల్సిన విచారణను ప్రభావితం చేయవా?
మీడియా పరిధి ఏమిటి? కోర్టు విచారణలో ఉన్న కేసు సాక్షులను టీవీల్లో ఇంటర్వ్యూ చేయడం కక్షిదారులను అవమానించినట్లు కాదా? అత్యాచార కేసుల్లో ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది.
తరుణ్ తేజ్‌పాల్ కేసులో.. ‘అసలేం జరిగుంటుందని భావిస్తున్నారు?’ లాంటి ప్రశ్నలను సదరు టీవీ చానెల్ అడిగినపుడు బాధితురాలు ఎంత ఇబ్బంది పడివుంటారు?
అత్యాచారం జరిగిందని ఆరోపిస్తున్న సమయానికి ముందు, తర్వాత అంటూ బాధితురాలి ఫోటోలను ప్రసారం చేయడం మరింత ఘోరమైన విషయం.
ఫోటోల్లో బాధితురాలి ముఖం కనిపించకుండా మసక చేసినా.. ఆ సంఘటనను, సందర్భాన్ని బహిర్గతం చేశారు కదా!
వీడియో ఫూటేజ్‌ను టీవీలో ప్రసారం చేసిన మరుసటి రోజు.. యూట్యూబ్ నుంచి ఆ కార్యక్రమం ఫూటేజ్‌ను తొలగించారు. కానీ ఆ చానెల్ నైతికత గురించి సోషల్ మీడియాలో చాలా మంది ప్రశ్నించారు.
ఈవిధమైన ప్రసారాలు చట్టవ్యతిరేకం అని, ఆ చానెల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని.. 'నెట్‌వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా', 'ఎ కలెక్టివ్ ఆఫ్ ఉమెన్ జర్నలిస్ట్స్ ఇన్ ఇండియా' సంస్థలు.. ఓ బహిరంగ లేఖను విడుదల చేశాయి. కానీ అప్పటికే.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
2004లో 'గుడియా' కథ..
గుడియా అనే మహిళ భర్త భారత్ సరిహద్దులు దాటి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత చాలా కాలానికి ఆమె మరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంతకాలానికి మొదటి భర్త తిరిగొచ్చాడు.
ఆ సందర్భంలో 'గుడియా ఎవరి భార్య?' అంటూ ఓ చానెల్.. 'న్యాయస్థానం' పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. న్యాయస్థానం కార్యక్రమంలో గుడియా కేసు విచారణ జరిగింది. ఇద్దరిలో ఎవరు కావాలన్న ప్రశ్నకు సమాధానంగా.. మొదటి భర్తను ఎంచుకుంది గుడియా.
ఆ తర్వాత చాలా మంది రిపోర్టర్లు గుడియాను ఇంటర్వ్యూ చేశారు.
ఆ కార్యక్రమం సమయంలో తనపై చాలా ఒత్తిడి ఉండేదని, అందుకే తాను మొదటి భర్తనే ఎంచుకున్నానని చెప్పింది. కానీ తన ఎంపికతో సంతృప్తిగా లేనని గుడియా వివరించింది.
న్యాయస్థానాలను ఏర్పాటు చేసి, విచారణ చేపట్టేందుకు మీడియాకు హక్కు ఉందా?
గత 15 సంవత్సరాల్లో పరిస్థితి మరింత దిగజారింది.
ప్రశ్నించే హక్కు ముసుగులో ఆరోపణలు, అనుమానం, సిద్ధాంతాలు అన్నీ పక్కదారి పడుతున్నాయి. నిజాన్ని వెలికితీసే దారిలో చీకట్లు కమ్ముకుంటున్నాయి.
ఇలాంటి సందర్భాలు, బాధితులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ వార్తలను చూస్తున్న, చదువుతున్న వీక్షకులు, పాఠకులు ప్రశ్నించడం మానేసి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. కానీ.. వారు కూడా మోసపోయే అవకాశాలున్నాయి.
ఇవి కూడా చదవండి
- ఆఫ్రికన్ చారిత్రక గాథ: వాంఛ తీర్చుకుని చంపేస్తుంది: కాదు, జాతి పోరాట యోధురాలు
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: పొగంగేట్రం నుంచి ఉపసంహారం దాకా
- పొగాకు వ్యతిరేక దినోత్సవం: ఎక్కువగా పొగ తాగే దేశాలివే
- ఊళ్లలో కుల వివక్షను పేపర్ కప్ బద్దలుకొడుతోందా-
- కోబ్రాపోస్ట్: ఇంత పెద్ద వార్తను మీడియా ఎందుకు ఇవ్వలేదు?
- అబ్బాయిల ముందు అమ్మాయి ఎందుకు ఎక్కువ తినదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








