గుజరాత్‌: చెత్త ఏరుకుని బతికే దళితుడిని కొట్టి చంపేశారు

గుజరాత్‌లో దళితుడిపై దాడి

ఫొటో సోర్స్, TWITTER @ JIGNESHMEVANI

    • రచయిత, బిపిన్ టంకారియా
    • హోదా, బీబీసీ కోసం

గుజరాత్‌లో ఓ దళిత యువకుడిని కొందరు వ్యకులు అత్యంత దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటన రాజ్‌కోట్‌ జిల్లాలోని షపర్ పారిశ్రామిక ప్రాంతంలో ఆదివారం జరిగింది.

మృతుడి భార్యతో పాటు, ఇతర కుటుంబ సభ్యులను కూడా ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా కొట్టారు.

చెత్త ఏరుకునేందుకు వెళ్తే..

ముకేష్ వానియా, తన భార్య జయా బెన్, తల్లి సవితతో కలిసి ఆదివారం ఉదయం షపర్ పారిశ్రామిక ప్రాంతానికి వెళ్లారు.

"ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఐదుగురు వ్యక్తులు మమ్మల్ని తీవ్రంగా కొట్టారు. వాళ్లు ఎవరో మాకు తెలియదు. మేం ఆ కంపెనీలో దొంగతనం చేశామంటూ ఒక్కసారిగా వచ్చి బెల్టుతో తీవ్రంగా కొట్టడం మొదలుపెట్టారు. ఫ్యాక్టరీ దాకా మమ్మల్ని లాక్కెళ్లారు, నా భర్తను లోపలికి పట్టుకుపోయారు. నన్ను, మా అత్తను బెల్టుతో కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోవాలని గదిమారు" అని జయాబెన్ బీబీసీకి వివరించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

దళిత యువకుడిపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను వడ్‌గామ్ ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేష్ మేవానీ ట్విటర్‌లో షేర్ చేశారు.

ముకేష్‌ను తాడుతో కట్టేసి ఓ వ్యక్తి రాడ్డుతో తీవ్రంగా కొడుతున్నట్టుగా ఆ వీడియోలో కనిపిస్తోంది.

ఇద్దరు బాధిత మహిళలు ఇంటికి వెళ్లగానే ఆ ఫ్యాక్టరీ వద్ద జరిగిన విషయాన్ని ఇరుగుపొరుగు వారికి చెప్పారు. చుట్టుపక్కల వాళ్లంతా అక్కడికి పరుగుపరుగున ముకేష్‌పై దాడి జరిగిన రాడాదియా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లారు.

వాళ్లు వెళ్లేసరికి ముకేష్ తీవ్రమైన గాయాలతో నేలపై పడి ఉన్నారు. వెంటనే అతన్ని మోటార్ సైకిల్ మీద ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం 108 అంబులెన్సులో రాజ్‌కోట్ సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. ముకేష్ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు.

ముకేష్ వానియా

ఫొటో సోర్స్, COPYRIGHT BIPIN TANKARIA

ఫొటో క్యాప్షన్, ముకేష్ వానియా

పోస్టుమార్టం అనంతరం ముకేష్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామం పార్నాలకు తీసుకెళ్తారు.

మృతుడి భార్య జయాబెన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు(ఒకరు మైనర్) నిందితులను అరెస్టు చేశారు. ఐపీసీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అన్ని విధాలా సాయం చేస్తామని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది.

ముకేష్ భార్య జయాబెన్

ఫొటో సోర్స్, COPYRIGHT BIPIN TANKARIA

ఫొటో క్యాప్షన్, మృతుడి భార్య జయాబెన్

గుజరాత్‌లో దళితులపై దాడులు

2018 మే ప్రథమార్ధం: పెళ్లి కార్డులో పేరులో 'సిన్హా' అనే పదాన్ని వాడినందుకు ఓ దళిత కుటుంబానికి కొందరు వ్యక్తుల నుంచి హెచ్చరికలు వచ్చాయి. సాధారణంగా రాజ్‌పూత్ సముదాయానికి చెందిన వారి పేర్ల చివర సిన్హా అని ఉంటుంది.

2018 మార్చి: గుర్రంపైకి ఎక్కినందుకు ఓ యువకుడిని హత్య చేశారు. అయితే, ఆ యువకుడు ఓ యువతిని వేధించాడని పోలీసులు పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యులు మాత్రం ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని, రాజ్‌పూత్ సముదాయానికి చెందిన వ్యక్తిపై ఫిర్యాదు చేశారు.

2017 అక్టోబర్: మీసాలు పెంచుకున్నారంటూ గాంధీ నగర్‌లో దళిత యువకులపై కొందరు దాడి చేశారు.

2017 అక్టోబర్: గర్బా నృత్యాన్ని చూస్తున్నాడన్న కారణంతో ఓ దళిత యువకుడిని కొట్టి చంపారు. ఈ కేసులో పాటీదార్ సముదాయానికి చెందిన ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

2016 జులై: ఉనాలో చనిపోయిన ఆవు చర్మాన్ని వొలుస్తున్న నలుగురు దళితులపై 'అగ్రకులాల వారు' తీవ్రంగా దాడి చేశారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)