‘పద్మావత్’పై అహ్మదాబాద్‌లో హింస; వాహనాలు దగ్ధం

ఫొటో సోర్స్, Alamy
'పద్మావత్' సినిమాకు నిరసనగా గుజరాత్ ముఖ్య నగరం అహ్మదాబాద్‌లో మూడు మల్టిప్లెక్స్‌ల ఎదుట హింస జరిగింది.
మూడు ప్రాంతాల్లోనూ నిరసనకారులు వాహనాలను ధ్వంసం చేశారు. మరి కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు.
థల్‌తేజ్ ప్రాంతంలోని ఎక్రోపొలిస్ మాల్, గురుకుల్ మేమ్‌నగర్‌లోని హిమాలయా మాల్, వస్త్రాపుర్‌లోని అల్ఫా వన్ మాల్‌ల ఆవరణలో హింస, విధ్వంసం జరిగాయి.

కొవ్వొత్తుల ప్రదర్శన తర్వాత మొదలైన హింస
ఈ సినిమాకు వ్యతిరేకంగా ఇస్కాన్ మందిరం దగ్గర నుంచి ఎక్రోపొలిస్ మాల్ వరకు ఒక కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన పూర్తవగానే హింస మొదలైందని బీబీసీ గుజరాత్ ప్రతినిధి సాగర్ పటేల్ తెలిపారు.
సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన 'పద్మావత్' సినిమా కథాంశం తమ కుల గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉందంటూ రాజ్‌పుత్‌లు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాపై రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో నిషేధం విధించాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తిని మంగళవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
అంతకు ముందు సెన్సార్ బోర్డు చేసిన సూచనపై ఈ సినిమా పేరును 'పద్మావతి'కి బదులు 'పద్మావత్'గా మార్చడంతో పాటు, మరి కొన్ని దృశ్యాలను కత్తిరించారు.

హిమాలయా, అల్ఫా వన్ మాల్‌లు వస్త్రాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాయి. రెండు ప్రాంతాల్లోనూ పోగైన గుంపులు హింసకు పాల్పడ్డాయని పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎంఎం జడేజా బీబీసీ ప్రతినిధి రాక్సీ గాగ్డేకర్‌తో చెప్పారు.
హిమాలయా మాల్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని ఆయనన్నారు. అల్ఫా వన్ వద్ద నిరసనకారులను ముందే అడ్డుకోవడంతో ఎక్కువ నష్టం జరగలేదని ఆయనన్నారు.

మా పాత్ర లేదు: కర్ణీ సేన
ఈ హింసలో తమ ప్రమేయం ఏమీ లేదని 'శ్రీ రాష్ట్రీయ రాజపుత్ కర్ణీ సేన' రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ షెఖావత్ అన్నారు. ఆయన ఈ హింసను ఖండించారు.
"కర్ణీ సేనకు ఈ ఘటనలతో సంబంధం లేదు. 'పద్మావత్' సినిమాకు వ్యతిరేకంగా కర్ణీ సేన కొవ్వొత్తుల మార్చ్ నిర్వహించింది. అక్కడే ఈ హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇదంతా గుంపులు చేసిన పని. గుంపుల మనస్తత్వం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. కర్ణీ సేన పేరుతో ఎవరైనా ఏదైనా చేస్తే దానికి బాధ్యత కర్ణీ సేనది కాదు" అని రాజ్ షెఖావత్ బీబీసీతో అన్నారు.
"ఈ హింస వెనుక అసామాజిక శక్తులు ఉండొచ్చని నేననుకుంటున్నా. కర్ణీ సేన గానీ, రాజ్‌పుత్‌లు గానీ ఇలా చేయరు. పరిస్థితుల నుంచి లబ్ధి పొందాలని చూసేవాళ్లుంటారు. కర్ణీ సేన హింసను ప్రోత్సహించదు. గుంపు అదుపు తప్పితే చాలా కష్టం. మేం హింస వద్దని శాంతి సందేశం ఇచ్చాం" అని ఆయన చెప్పారు.

తగిన పోలీసు బందోబస్తు లేనందువల్లే...
హింస జరిగిన వెంటనే ఎక్రోపొలిస్ మాల్ వద్దకు చేరుకున్న బీబీసీ ప్రతినిధి సాగర్‌కు రోడ్డు మీద పగిలిపోయిన అద్దాలు, కాలుతున్న వాహనాలు కనిపించాయి.
కొవ్వొత్తుల ప్రదర్శనలో దాదాపు వెయ్యి మంది పాల్గొన్నారు. అయితే దీనికి తగిన పోలీసు బందోబస్తు లేకపోవడం వల్లే హింసకు దారి తీసి ఉండొచ్చని అక్కడి వారన్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఫైర్ బ్రిగేడ్ వచ్చి మంటలను ఆర్పేసింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








