‘పద్మావత్’ విడుదలను అడ్డుకోలేరు: సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Twitter/deepika padukone
పద్మావత్ సినిమాను దేశంలోని అన్నిరాష్ర్టాల్లో విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఏ రాష్ర్టమూ ఈ సినిమా విడుదలపై నిషేధం విధించడానికి వీల్లేదని పేర్కొంది.
ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సినిమాను నిషేధించిన రాష్ర్టాల్లోనూ విడుదల చేయాల్సిందేనని ఈ మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్‌లు ఏఎం ఖాన్విల్కర్, చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సినిమా విడుదలను నిషేధిస్తూ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హరియాణా ప్రభుత్వాలు విడుదల చేసిన నోటిఫికేషన్లపైనా కోర్టు స్టే విధించింది.
శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందేమోనని ఈ నాలుగు రాష్ర్టాల్లో సినిమాను నిషేధించిన సంగతి తెలిసిందే.
వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న పద్మావత్ చిత్రం గత కొన్నిరోజులుగా వివాదంలో నలిగిపోతోంది.
పద్మావత్ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. రాజ్‌పుత్ మహారాణి పద్మావతి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
రాజ్‌పుత్ కుటుంబాల గౌరవం, సంప్రదాయాలు ఇనుమడించేలా పద్మావత్ చిత్రం ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









