ప్రెస్ రివ్యూ: ఈ ఏడాది చివరిలో ఒకేసారి ఎన్నికలు?

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఏడాది చివర్లో లోక్‌సభకు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపితే మేలని బీజేపీలో జోరుగా అంతర్మథనం సాగుతున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ వార్తాపత్రిక కథనం ప్రచురించింది.
నిజానికి సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్-మేల్లో జరగాల్సి ఉంది. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకూ అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. మరో మూడు పెద్ద రాష్ట్రాలు- రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల కాలపరిమితి 2019 జనవరిలో ముగుస్తుంది.
ఇక సిక్కిం అసెంబ్లీ పదవీకాలం 2019 మేలోను, అరుణాచల్ ప్రదేశ్‌ది జూన్ 1న పూర్తవుతుంది. ఈ రీత్యా లోక్‌సభ ఎన్నికలను ఏపీ, తెలంగాణ, ఒడిశా, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలనూ ఓ నాలుగైదు నెలలు ముందుకు జరిపి మొత్తం ఎనిమిది రాష్ట్రాలకూ ఒకేసారి ఎన్నికలు జరిపిస్తే తమకు రాజకీయంగా బాగుంటుందన్న విషయంపై బీజేపీలో చర్చలు సాగుతున్నాయి.
జమిలీ ఎన్నికలు వీలవకపోతే నవంబరులో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఇవి మూడూ బీజేపీ పాలిత రాష్ట్రాలు. రాజకీయంగా ఆ పార్టీకి అత్యంత కీలకం.
ఒకవేళ నవంబరులో ఈ మూడింటికే గనుక అసెంబ్లీ ఎన్నికలు జరిగి ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఆ దెబ్బ లోక్‌సభ ఎన్నికలపై కచ్చితంగా పడుతుంది. ఈ దృష్ట్యా జమిలీకి వెళితే- చాలా వరకూ ఈ వ్యతిరేకతను తట్టుకోవచ్చన్నది కమలనాథుల ఊహ.
అయితే విపక్షాలు జమిలీ ఎన్నికలకు ససేమిరా అంటున్నాయి. కాలావధి పూర్తికాకుండా ఎన్నికలు నిర్వహించడం తమకు సమ్మతం కాదని-కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం స్పష్టం చేశాయి.
''ఎన్నికల వ్యయం తగ్గించడానికి జమిలీ బెటరని మోదీ బయటకు అంటున్నప్పటికీ ఆయనదంతా రాజకీయ ఎత్తుగడే. ప్రభుత్వ వ్యతిరేకత వెల్లువలా ఉన్నపుడు ఇలాంటి ఆలోచనలే వస్తాయి.
అదీ కాక- వేసవిలో నిర్వహిస్తే తమ ప్రభుత్వ వైఫల్యాలు మరింతగా బయటపడతాయన్నది ఆయన భయం'' అని సోమవారం నాడు సిబ్బంది, వ్యవహారాలు, న్యాయ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం విపక్ష నేతలు వ్యాఖ్యానించారు.
నిజానికి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ, లోక్ సభకూ కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన కేంద్రం చాలాకాలంగా చేస్తోంది. కొన్ని రాష్ట్రాలు ఈ విషయంపై కేంద్రంతో ఏకీభవించినట్లు కూడా సమాచారం.
కనీసం పాక్షికంగా నైనా ఈ ఆలోచనను అమలు చేస్తే క్రమంగా 2024 నాటికి అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించేందుకు రంగం సిద్దం చేయవచ్చని బిజెపి భావిస్తోంది.
1951-52లో లోక్ సభకూ, దేశంలోని అన్ని అసెంబ్లీలకూ ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1957, 1962, 1967 ఎన్నికల్లోనూ ఇదే ప్రక్రియను అనుసరించారు. 1970లో లోక్‌సభ రద్దు కావడం, తర్వాత 1977లో లోక్ సభ పదవీకాలాన్ని పొడిగించడంతో అంతా తారుమారయ్యింది.
జమిలీ ఎన్నికల నిర్వహణ మంచిదేగానీ- పాక్షికంగానైనా సరే.. డిసెంబరులో జరపడం అసాధ్యమని, 2024 వరకూ కూడా జరపలేమని అంటున్నారు మాజీ సీఈసీ టీఎస్ కృష్ణమూర్తి.
''మనం బ్రిటిష్ (వెస్ట్ మినిస్టర్) తరహా వ్యవస్థను రూపొందించుకున్నాం. అమెరికన్ తరహా వ్యవస్థ అయితే నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. ఎవ్వరినైనా దించేసినా మరొకర్ని ఎన్నుకునే పరిస్థితి అది. ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రభుత్వమైనా కూలిపోతే (విశ్వాస పరీక్షలో ఓడిపోతే) నిర్దిష్ట కాలావధిలోగా ఎన్నికలు జరుపుతుంటాం.. లోక్‌సభకూ అంతే. జమిలీ తెస్తే ఇలా కుదురుతుందా? ఇలా కుదరాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. 2024లో కానీ అది వీలుపడదు'' అని ఆయన హైదరాబాద్‌లో అన్నట్లు ’ఆంధ్రజ్యోతి’ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
కోడి పందేలపై ఆదేశాలు అపహాస్యం!
ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా కోడి పందేలు జరగడానికి వీల్లేదంటూ తాము ఇచ్చిన ఆదేశాలను కేవలం కాగితాలకే పరిమితం చేశారని, ఇది తమ ఆదేశాలను అపహాస్యం చేయడమేనని, ఇది అత్యంత దురదృష్టకరమని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు ‘సాక్షి’ కథనం తెలిపింది.
కోడి పందేలు జరగడానికి వీల్లేదని ఆదేశించినా పందేలు యథాతథంగా జరిగాయని, స్వయంగా ప్రజా ప్రతినిధులే పందేలకు హాజరయ్యారని కోర్టు వ్యాఖ్యానించింది. జరిగిన కోడి పందేలను ప్రపంచమంతా చూసిందని పేర్కొంది. అరుదుగా టీవీలు చూసే తమకే, టీవీల్లో కోడి పందేల దృశ్యాలు పదే పదే కనిపించాయని తెలిపింది.
'కోడి పందేల విషయంలో ఏమీ చేయలేమంటూ మీరు నిస్సహాయత వ్యక్తం చేస్తే, ఆ విషయాన్ని మాకే చెప్పాలి.. అప్పుడు మిగిలిన సంగతులను మేం చూసుకుంటాం' అని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), ఏపీ డీజీపీలను ఉద్దేశించి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.
కోడి పందేలు జరిగిన తీరును చూస్తుంటే మా ఆదేశాలను అధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోడి పందేలు జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదికలు ఇవ్వాలన్న తమ ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని తప్పుపట్టింది.
నివేదికలు ఇవ్వకపోవడమే కాక, మరింత గడువు కోరడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. తమ ఆదేశాల ప్రకారం నివేదికలు సమర్పించనందుకు అటు సీఎస్ దినేష్‌కుమార్, ఇటు డీజీపీ ఎం.మాలకొండయ్యను స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది.
ఎందుకు నివేదికలు సమర్పించలేదో వివరణ ఇవ్వాలని వారికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గత ఏడాది సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలం, వెంప, శ్రీరాంపురం గ్రామాలలో కోడి పందేల పేరుతో జూదం, అశ్లీల నృత్యాలు, వ్యభిచారం నిర్వహించారని, ఈ సంక్రాంతి సందర్భంగా ఇవేమీ జరగకుండా తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ కలిదిండి రామ చంద్రరాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక అసమానతల్లో భారత్ పరిస్థితి దయనీయం
ఆర్థిక అసమానతలు, అభివృద్ధి అంశాల్లో పొరుగు దేశాల కంటే భారత్ ధైన్యస్థితిలో ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్), ఆక్స్‌ఫామ్ సంస్థలు వేర్వేరుగా విడుదల చేసిన తమ నివేదికల్లో పేర్కొన్నట్లు ’ప్రజాశక్తి’ దినపత్రిక కథనం వివరించింది.
దేశంలో గతేడాది ఉత్పత్తి అయిన మొత్తం సంపదలో 73 శాతం సంపద కేవలం ఒక్క శాతంగా ఉన్న శతకోటీశ్వర్ల వద్దే పోగుబడిందని, జనాభాలో సగానికై పైగా ఉన్న 63 కోట్ల మంది సంపద గతేడాది ఒక్క శాతమే పెరిగిందని ఆక్స్‌ఫామ్ పేర్కొంది.
సంపదంతా కొద్దిమంది సంపన్నుల వద్దే పోగుబడటంతో ప్రపంచవ్యాప్తంగానూ ఆర్థిక అసమానతలు బాగా పెరిగిపోయాయని తెలిపింది. ఈ ఆర్థిక అసమానతలకు పన్ను ఎగవేతలను ప్రధాన కారణంగా పేర్కొన్న ఆక్స్‌ఫామ్.. కార్పొరేట్లకు ఇస్తున్న రాయితీలను రద్దు చేసి, వారి ఆదాయాలపై పన్నులు పెంచాలని ప్రభుత్వాలకు సూచించింది.
జీవనప్రమాణాలు, పర్యావరణం వంటి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని డబ్ల్యుఇఎఫ్ రూపొందించిన సమ్మిళితాభివృద్ధి సూచీలోనూ భారత్ అధోస్థితిలో నిలిచింది. పొరుగునున్న చైనా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకంటే బాగా వెనుకబడిన భారత్ ఈ జాబితాలో 62వ స్థానానికి దిగజారిందని పేర్కొంది.
దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు నేపథ్యంలో విడుదలైన ఈ రెండు సర్వేలు భారత్ ఆర్థిక దుస్థితికి దర్పణం పట్టాయి.
ఆర్థిక ప్రగతి విషయం లోనూ పొరుగుదేశం పాకిస్తాన్ కంటే భారత్ బాగా వెనుక బడివుందని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. ఈ జాబితాలో చైనా 26వ స్థానంలోనూ, పాకిస్తాన్ 47వ స్థానంలోనూ నిలవగా భారత్ 67వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
భారత్‌లో ఒక శాతం మేర వున్న ధనికుల సంపద గతేడాదిలో రూ.20.9 లక్షల కోట్లకు పెరిగిందని ఇది 2017-18లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌కు సమానమని ఆక్స్‌ఫామ్ ఇండియా తన నివేదికలో వివరించింది.
భారత్‌లో సగటు గ్రామీణ కార్మికుడు ఒక కంపెనీ ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగి సంపాదన సాధించటానికి కనీసం 941 ఏళ్లు పడుతుందని ఆక్స్‌ఫామ్ అధ్యయన నివేదిక అభిప్రాయపడింది. అదే అమెరికాలో ఒక సామాన్య కార్మికుని ఏడాది సంపాదనను ఒక సంస్థ సిఇఓ ఒక్క రోజులో సంపాదిస్తున్నాడని వివరించింది.
భారత్‌లో గత ఏడాది కాలంలో కొత్త 17 మంది శతకోటీశ్వరులు అవతరించారని, దీనితో ఇప్పుడు వారి సంఖ్య 101కి చేరిందని వివరించింది. వీరి సంపద గత ఏడాది వున్న రు.4.89 లక్షల కోట్ల స్థాయి నుండి ప్రస్తుతం రు.20.7 కోట్ల స్థాయికి దాటిందని నివేదిక వెల్లడించింది.
ప్రపంచ జనాభాలో దాదాపు సగం మేర వున్న 370 కోట్ల మంది నిరుపేదల సంపదలో ఎటువంటి మార్పూ లేదని, గత ఏడాది ప్రపంచంలో ఉద్భవించిన సంపదలో 82 శాతం జనాభాలో 1 శాతం మేర వున్న ధనికుల చేతుల్లో చేరిందని వివరించింది.
'మన ఆర్థిక వ్యవస్థలు లక్షలాది మంది ప్రజల శ్రమను గుర్తించటానికి బదులు సంపన్నుల చేతికే సంపదను అందిస్తున్నాయ’న్న విషయాన్ని తమ అధ్యయనం మరోసారి రుజువు చేసిందని ఈ నివేదికను విడుదల చేసిన ఆక్స్‌ఫామ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బ్యాన్యిమా వ్యాఖ్యానించినట్లు ’ప్రజాశక్తి’ కథనం తెలిపింది.

ఫొటో సోర్స్, wikipedia
విద్యార్థుల ఆత్మహత్యలపై లేఖతో హైకోర్టు విచారణ
తెలుగు రాష్ట్రాల్లోని పలు కార్పొరేట్ కాలేజీల్లో తరచు విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంపై అందిన లేఖను ఉమ్మడి హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించినట్లు ‘ఈనాడు’ దినపత్రిక కథనరం ప్రచురించింది.
పలు ప్రైవేటు కాలేజీలు, ఐఐఐటీల్లో తరచు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటూ ప్రకాశం జిల్లా లోక్‌సత్తా ఏజిటేషన్ సొసైటీ అనే సంస్థకు చెందిన దాసరి ఇమ్మాన్యుయేల్ ఈ లేఖ రాశారు.
ఏపీ మంత్రికి చెందిన కాలేజీల్లోనూ, మరికొందరు మంత్రులకు సంబంధించిన బంధువుల విద్యాసంస్థల్లోనూ ఆత్మహత్యలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడంలేదన్నారు. దీనిపై ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును కోరారు. ఆత్మహత్యలకు కారణాలపై నిమ్స్, స్విమ్స్‌తో అధ్యయనం చేయించాలన్నారు.
ఏపీ మంత్రికి చెందిన కొన్ని కాలేజీల్లో ఆత్మహత్యలు జరిగాయని, ఆయా విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా లేదంటూ విద్యాశాఖ మంత్రి వెల్లడించినట్లు పత్రికల్లో వచ్చిందన్నారు. ఇంటర్ బోర్డు సమర్పించిన నివేదిక ప్రకారం చైతన్య, నారాయణ సహా అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్న కాలేజీల మూసివేతకు చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
ఈ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, విద్యాశాఖ, హోంశాఖ ముఖ్యకార్యదర్శులు, ఇంటర్మీడియట్ బోర్డులు నిమ్స్, స్విమ్స్ డైరెక్టర్లతోపాటు నారాయణ, చైతన్య కాలేజీల కరస్పాండెంట్ లేదా డైరెక్టర్లను ప్రతివాదులుగా చేర్చినట్లు ‘ఈనాడు’ కథనం వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు 69 లక్షలు
ఎన్నికల సంఘం (ఈసీ) తాజా జాబితా ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు 69,28,873 అని తేలినట్లు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక తెలిపింది.
నిరుడు ముమ్మర ఓటర్ల జాబితా సవరణ (ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్) కార్యక్రమంలో భాగంగా తొలిగించిన ఓట్లలో అత్యధికం నిజంగా బోగస్‌వేనని స్పష్టమైంది. పొరపాటున తొలిగించిన ఓట్లు తిరిగి జాబితాకెక్కిస్తూ ఈసీ తాజా జాబితాను సోమవారం ప్రకటించింది.
గత ఏడాది సెప్టెంబర్‌లో ఇంటింటి సర్వే నిర్వహించి సుమారు 21.15 లక్షల బోగస్ ఓట్లను తొలిగించారు. దీనిపై ఆరోపణలు వెల్లువెత్తడంతో గత నవంబర్‌లో తిరిగి రీసర్వే నిర్వహించగా, తొలిగించిన 21 లక్షల్లో దాదాపు 17.5 లక్షల ఓట్లు నిజంగా బోగస్‌వేనని తేలింది. మిగిలిన 3.61 లక్షల ఓట్లను పొరపాటుగా తొలిగించినట్టు గుర్తించి వారిని యథాతథంగా జాబితాలో చేర్చారు.
బోగస్ ఓట్లలో హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లోనే 5.82 లక్షల ఓట్లు ఉండడం విశేషం. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఓటర్ల తుదిజాబితాను విడుదలచేశారు.
ట్యాబ్‌లకు జియోట్యాగింగ్‌తో సర్వే గత ఏడాది సెప్టెంబర్‌లో ముమ్మర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేపట్టారు. ఇందులో 1000 నుంచి 1200 మంది ఓటర్లతో పోలింగ్ కేంద్రాల సరిహద్దులను ఖరారుచేసి వాటి నజారీ నక్షా మ్యాప్‌లను రూపొందించారు.
సిబ్బందికి ట్యాబ్‌లను సమకూర్చి సర్వే నిర్వహించారు. నిజంగా ఇంటింటికీ సర్వే నిర్వహించారా లేదా? అనేది తెలుసుకునేందుకు సిబ్బందికి సమకూర్చిన ట్యాబ్‌లను జియోట్యాగింగ్ చేశారు.
ఈ విధంగా గత ఏడాది నవంబర్‌లో సర్వేను పూర్తిచేసి ముసాయిదాను విడుదలచేశారు. ముసాయిదా ప్రకారం గ్రేటర్‌లోని 23 నియోజకవర్గాల్లో 21 లక్షల బోగస్ ఓట్లను తొలిగించి 65,68,491 ఓటర్లు ఉన్నట్టు తేల్చారు. ఓటర్ల తొలిగింపు నేపథ్యంలో సర్వేలో భారీగా అవకతవకలు జరిగినట్టు ఫిర్యాదులు వచ్చాయి.
ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 7,73,425 ఓట్లను బోగస్ ఓట్లుగా గుర్తించి తొలిగించడంపై రాజకీయవర్గాల్లో దుమారం రేగింది. మొత్తం తొలిగించిన ఓట్లలో దాదాపు 85 శాతం ఓటర్లు యథావిథిగా ఆయా చిరునామాల్లో ఉన్నారని వివిధ రాజకీయ పార్టీలు పేర్కొన్నాయి.
రాజకీయపార్టీల ఫిర్యాదుతో తొలిగించిన ఓట్లను తిరిగి పరిశీలించాలని, డిసెంబర్ 30వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో అధికారులు తొలిగించిన ఓట్ల పరిశీలనకోసం మళ్లీ ఇంటింటి సర్వే నిర్వహించారు.
డిసెంబర్‌లో రీసర్వే నిర్వహించగా సుమారు 3.61లక్షల ఓటర్లు నిజంగానే ఉన్నట్టు గుర్తించి తుదిజాబితాలో వారికి స్థానం కల్పిస్తూ గ్రేటర్‌లో 69,28,873 మంది ఓటర్లున్నట్టు తేల్చారు.
ఈ వివరాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోదముద్ర వేసిన తరువాత 20న తుది జాబితాను విడుదల చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇంకా జాబితాపై ఏమైనా అభ్యంతరాలు, సూచనలు, తప్పొప్పులు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని, నిరంతర ఓటర్ల నమోదు ప్రక్రియ, సవరణలో భాగంగా అన్నీ సరిచేస్తామని వారు తెలిపినట్లు ‘నమస్తే తెలంగాణ’ కథనం పేర్కొంది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








