ప్రెస్ రివ్యూ: హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ ఒక్కటేనా!

ఫొటో సోర్స్, NOAH SEELAM/Getty images
హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ ఒక్కటేనా!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక వస్తున్నారన్న కారణంతో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో రూ.40 కోట్లతో రోడ్లను తీరిదిద్దారని ఈనాడు రాసిన కథనం పేర్కొంది.
బాగున్న రోడ్లపై మళ్లీ తారుపోసి అందంగా మార్చారు. అదే నగరంలోని వందలాది కాలనీలకు దారితీసే రోడ్లను మాత్రం అలానే వదిలేశారు.
వీటిపై స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
నగరంలో ఏటా రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.500 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది మాత్రం రోడ్ల నిర్మాణాన్ని గాలికి వదిలేశారు.
హైటెక్ సిటీ మినహా నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా మారినా అధికారులు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారంటూ ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది.

ఫొటో సోర్స్, CHANDAN KHANNA/Getty Images
మందుకొట్టి బండి నడిపారా.. ఇక అంతే!
ఈ ఏడాదిలో నవంబర్ వరకు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డ 162 మంది లైసెన్సులను సస్పెండ్ చేస్తూ కోర్టులు తీర్పునిచ్చాయని 'నమస్తే తెలంగాణ' ప్రచురించిన ప్రత్యేక కథనం తెలిపింది.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రతి ఉల్లంఘనను డేటాబేస్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఒకసారి పట్టుబడ్డ వ్యక్తి మరోసారి అదే తప్పు చేస్తూ దొరికి పోతే వెంటనే తెలిసిపోతుంది.
దీంతో రెండోసారి పట్టుబడ్డ వారికి జైలు శిక్షతోపాటు కొందరి లైసెన్సులను ఆరు నెలలు, మరికొందరివి ఏడాది, మరికొంతమందివి 2, 3 ఏండ్ల వరకు తాత్కాలికంగా రద్దు చేస్తూ న్యాయస్థానం ఆదేశించింది. మూడోసారి పట్టుబడ్డ వారి లైసెన్సులను పూర్తికాలం రద్దు చేస్తున్నాయి.
ఇలా ఈ ఏడాది నవంబరు వరకు 17,550 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా వారిలో పదే పదే తప్పు చేస్తున్న 162 మంది లైసెన్సులను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ఇందులో 10 మంది లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేస్తూ తీర్పునివ్వడం గమనార్హం.
లైసెన్సు రద్దులో ఉండగా వాహనం నడిపితే మరో నేరం అవుతుంది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన నేరంగా పరిగణించి కేసు నమోదు చేస్తారు. జరిమానాతోపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది.
లైసెన్స్ సస్పెండ్ అయ్యిందని, కొత్త లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుందామనుకుంటే తప్పులో కాలేసినట్టే. ట్రాఫిక్ పోలీసుల వద్ద ఉన్న డేటాబేస్‌లోని వివరాలు ఆర్టీఏ విభాగానికి కూడా వెళ్తాయి.
న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయగానే ఎవరెవరి లైసెన్సులు తాత్కాలికంగా, శాశ్వతంగా రద్దు చేయాలో జాబితా ఆర్టీఏకు వెళ్తుంది. ఆర్టీఏ విభాగం అధికారులు ఆ లైసెన్సులను కోర్టు ఆదేశాల ప్రకారం సస్పెండ్ చేస్తారు.
దీంతో శిక్ష కాలంలో కొత్త లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నా వెంటనే తెలిసిపోతుంది. వెంటనే ఆ దరఖాస్తులను తిరస్కరిస్తారని 'నమస్తే తెలంగాణ' రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
త్వరలో కొలువుల జాతర!
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నియామక ప్రక్రియలను వేగవంతం చేస్తోందని 'ఈనాడు' ఓ కథనం ప్రచురించింది.
ఈ నెలాఖరులోగా జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, క్లర్క్ పోస్టులతో కూడిన గ్రూప్-4, వసతిగృహ సంక్షేమ అధికారులు, రెవెన్యూలోని వీఆర్‌వో పోస్టులకు ప్రకటనలు జారీ చేయనుంది.
గ్రూప్-4 కింద దాదాపు వెయ్యివరకు పోస్టులు రానున్నాయి. 700కు పైగా వీఆర్‌వో ఉద్యోగాలతో పాటు సంక్షేమ విభాగాల్లో 240కి పైగా సంక్షేమ అధికారుల పోస్టులకు ప్రకటనలు వెలువడనున్నాయంటూ 'ఈనాడు' తన కథనంలో తెలిపింది.

ఫొటో సోర్స్, AFP
తెలుగు రాష్ట్రాల్లో అవినీతికి రెక్కలు
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం (డిసెంబరు 9) సందర్భంగా 'ఇంటర్నేషన ల్ ట్రాన్స్‌పరెన్సీ' ఇండియా విడుదల చేసిన నివేదిక వివరాలను 'నవతెలంగాణ' ప్రచురించింది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకీ లంచగొండితనం పెరిగిపోతోందని సర్వేలో పాల్గొన్నవారు ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి పెరిగిందని తెలంగాణాలో 47 శాతం మంది చెప్పగా, 37 శాతం మంది పరిస్థితిలో పెద్దగా మార్పేమీ లేదన్నారు. ఏపీలో 62 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్రాల్లో అవినీతి అన్ని స్థాయిల్లో పెరిగిపోయిందని నివేదిక హెచ్చరిం చింది. అవినీతిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని సర్వేలో పాల్గొన్న 51 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని తమ పనులు అవడానికి ఈ ఏడాది దేశంలోని 45 శాతం మంది లంచం ఇచ్చుకోవాల్సి వచ్చింది.
11 రాష్ట్రాల్లో సర్వే జరపగా, కనీసం ఒక్కసారైనా లంచం ఇచ్చామని 45 శాతం మంది తెలియజేశారు. గతేడాదితో పోల్చితే (43 శాతం), ఈ ఏడాదిలో అవినీతి పెరిగింది. 34,696 మంది సర్వేలో పాల్గొనగా, అందులో 37 శాతం మంది అవినీతి పెరిగిందని భావించారు.
కేవలం 14 శాతం మంది మాత్రమే తగ్గిందని చెప్పారు. పరిస్థితుల్లో ఎలాంటి మార్పూలేదన్నవారు 45 శాతం మంది. పశ్చిమ్ బెంగాల్, మధ్యప్రదేశ్‌లోని 71 శాతం మంది ప్రజలు తమ రాష్ట్రంలో అవినీతి పెరిగిందని తెలిపారు.
గతంతో పోల్చితే పరిస్థితిలో మార్పు లేదని మహారాష్ట్రలో 64 శాతం మంది, యూపీలో 53 శాతం మంది చెప్పారు. ఈ అంశంలో ఢిల్లీవాసుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. 33 శాతం మంది అవినీతి పెరిగిందంటే, 38 శాతం మంది మార్పులేదని అన్నారు.
అయితే అవినీతి తగ్గుముఖం పట్టిందని 28 శాతం మంది చెప్పటం గమనార్హం. 9 రాష్ట్రాల్లో అసలు లోకాయుక్త వ్యవస్థే లేదని సర్వే వ్యాఖ్యానించింది.
మున్సిపాల్టీ, పోలీస్ శాఖల్లో, పన్ను వసూళ్లు, విద్యుత్ శాఖ, ఆస్తి రిజిస్ట్రేషన్, టెండర్లు నిర్వహణ...మొదలైన వాటిల్లో అవినీతి అత్యధికంగా ఉందని సర్వే అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పోల్చితే, స్థానికంగా ఉండే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఇష్టారాజ్యంగా నడుస్తున్నదని 'నవతెలంగాణ' కథనం తెలిపింది.

ఫొటో సోర్స్, Science Photo Library
ఒక మనిషికి రెండు గుండెలు!
గుండె జబ్బుతో బాధపడేవారికి గుండె మార్పిడి చేయకుండానే శరీరంలో మరో హృదయాన్ని అమర్చే దిశగా ప్రయోగాలు ఊపందుకున్నాయంటూ 'ఆంధ్రజ్యోతి' ఓ కథనం ప్రచురించింది.
చెన్నైలోని ఫ్రాంటియర్ లైఫ్‌లైన్ ఆస్పత్రికి చెందిన వైద్యులు రెండు కుక్కలపై చేసిన ప్రయోగం సత్ఫలితాలు ఇచ్చింది.
రెండు శునకాల పొత్తికడుపులో మరో రెండు కుక్కల నుంచి సేకరించిన గుండెలను అమర్చారు. అలా పెట్టిన రెండో గుండె రక్తనాళాలను మొదటి గుండె రక్తనాళాలతో జత చేశారు. ఆపరేషన్ తర్వాత పరిశీలించగా.. మొదటి గుండెకు అది సహాయకారిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.
రెండో గుండె అద్భుతంగా పనిచేసినట్లు గుర్తించినట్లు డాక్టర్ మధు శంకర్ తెలిపారు.
రిక్కుతో కూడిన హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ జోలికి వెళ్లకుండా, రెండో గుండెను అమర్చితే ఖర్చు కూడా తగ్గుతుందని వైద్యులు వివరించారు.
దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ కోసం అనుమతి కోరుతూ ప్రభుత్వానికి వైద్యులు దరఖాస్తు చేసుకున్నారని 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








