న్యూజీలాండ్: రూ.17లక్షలకు పైగా విలువైన ఎగ్ లాకెట్ మింగిన వ్యక్తి, ఎలా బయటకు తీశారంటే...

బంగారు లాకెట్, నగలు, ఆభరణాలు

ఫొటో సోర్స్, New Zealand Police

    • రచయిత, కెల్లీ ఎన్‌జీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

న్యూజీలాండ్‌లో ఒక వ్యక్తి దొంగిలించడానికి ప్రయత్నించి.. మింగేసిన వజ్రాలు పొదిగిన లాకెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

33,585 న్యూజీలాండ్ డాలర్లు అంటే సుమారు రూ. 17. 8 లక్షల విలువైన ‘ఫాబెర్జ్ ఎగ్’ లాకెట్‌ను దొంగిలించిన వ్యక్తి నుంచి స్వాధీనపరుచుకున్నారు పోలీసులు.

‘సహజ మార్గం’లోనే దానిని బయటకు తీశామని, వైద్యసాయం అవసరం రాలేదని న్యూజీలాండ్ పోలీసులు తెలిపారు.

లాకెట్ మింగిన నిమిషాల వ్యవధిలోనే 32 ఏళ్ల ఆ వ్యక్తిని సెంట్రల్ అక్లాండ్‌లోని ప్యాట్రిడ్జ్ జ్యువెలరీ షాపులో పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల తర్వాత ఆ లాకెట్ అతని కడుపులోంచి బయటకువచ్చింది.

జువెలరీ షాప్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం, మింగేసిన లాకెట్‌లో 60 తెల్ల వజ్రాలు, 15 నీలమణులు పొదిగి ఉన్నాయి. దాన్ని తెరిచిచూస్తే 18 క్యారెట్ల బంగారంతో చేసిన చిన్న ఆక్టోపస్ కనిపిస్తుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బంగారు లాకెట్, నగలు, ఆభరణాలు

ఫొటో సోర్స్, Fabergé

లాకెట్ మింగిన ఆ వ్యక్తిపై చోరీ కేసు నమోదు చేశారు.

ఈవారం ప్రారంభం నుంచి ఆ వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించి, నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చామని న్యూజీలాండ్ పోలీసులు తెలిపారు.

"అతను పోలీసుల అదుపులో ఉన్నందున, పర్యవేక్షించడం మా బాధ్యత" అని పోలీసులు అన్నారు.

‘ఆక్టోపసీ ఎగ్’ 1983 జేమ్స్ బాండ్ సినిమాకు ప్రేరణ. అందులో ఫాబెర్జ్ ఎగ్ సంస్థ తయారు చేసిన లాకెట్‌ను దొంగిలించడమే కథాంశం.

ఫాబెర్జ్ ఒక ప్రపంచ ప్రసిద్ధ ఆభరణాల తయారీ సంస్థ . రెండు శతాబ్దాల కిందట రష్యాలో దీన్ని స్థాపించారు. రత్నాలు, బంగారం, వెండి వంటి విలువైన లోహాలతో తయారు చేసిన ఎగ్ షేప్ లాకెట్స్ తయారుచేయడంలో ఈ సంస్థ ప్రసిద్ధి చెందింది.

నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న లాకెట్‌ను ఫాబెర్జ్‌ సంస్థకు తిరిగి ఇస్తామని ప్యాట్రిడ్జ్ జ్యువెలర్స్ చెప్పినట్టు రేడియో ఎన్‌జెడ్ వెల్లడించింది.

నిందితుడు డిసెంబర్ 8న మళ్లీ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.

బీబీసీ పరిశీలించిన చార్జ్‌‌షీట్ల ప్రకారం, ఆ నిందితుడు నవంబర్ 12న అదే ఆభరణాల దుకాణం నుంచి ఐప్యాడ్‌ను దొంగిలించాడు.

ఆ తర్వాత రోజు ఒక ఇంటి నుంచి పెంపుడు జంతువుల ఒంటి మీద ఉండే గోమార్ల వంటి పారసైట్లను నిరోధించే మందులు, పిల్లుల దాణాను దొంగిలించినట్లు అభియోగాలున్నాయి.

వీటి విలువ సుమారు 100 న్యూజీలాండ్ డాలర్లు (సుమారు రూ. 5 వేలు) వరకు ఉంటుందని చార్జ్‌షీటులో పేర్కొన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)