పశ్చిమ బెంగాల్లో నిపా వైరస్ కేసులు : విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ కట్టుదిట్టం చేసిన థాయ్‌లాండ్, నేపాల్

నిపా వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, నిపా వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది.
    • రచయిత, కెల్లీ ఎన్‌జీ

పశ్చిమ బెంగాల్‌లో ప్రాణాంతక నిపా వైరస్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి.

దీంతో అప్రమత్తమైన పలు ఆసియా దేశాలు విమానాశ్రాయల్లో స్క్రీనింగ్ పరీక్షలను

కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చే విమానాలు దిగే మూడు విమానాశ్రయాలలో థాయ్‌లాండ్

స్క్రీనింగ్ పరీక్షలను మొదలుపెట్టింది.

మరోపక్క కాఠ్‌మాండ్ విమానాశ్రయంతో సహా భారత్‌‌తో ఉన్న సరిహద్దు ప్రాంతాలలోనూ నేపాల్ ప్రభుత్వం స్క్రీనింగ్ చేయిస్తోంది.

కిందటి నెల ప్రారంభంలో పశ్చిమ బెంగాల్లో ఐదుగురు ఆరోగ్య కార్యకర్తలు ఈ వైరస్ బారిన పడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని కలిసిన 110మందిని క్వారంటైన్ చేశారు.

నిపా వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఇది ప్రాణాంతకమైనది. 40 నుంచి 75 శాతం మరణాలు సంభవించే అవకాశం ఉంది. దీని చికిత్స లేదు. మందులు, వాక్సీన్లు లేవు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నిపా వైరస్ లక్షణాలను ఎలా గుర్తించాలి

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇవి నిపా లక్షణాలు
ఫొటో క్యాప్షన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇవి నిపా లక్షణాలు

పందులు, గబ్బిలాల వంటి వాటి నుంచి నిపా వైరస్ మనుషులకు వ్యాపిస్తుంది. కలుషిత ఆహారం ద్వారా కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది.

నిపా కూడా మహమ్మారిగా మారే ప్రమాదం ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాను ప్రధానంగా దృష్టి సారించిన 10 వ్యాధుల జాబితాలోకోవిడ్, జీకాతో సహా నిపాను కూడా చేర్చింది.

వైరస్ సోకిన సమయం నుంచి లక్షణాలు కనపడడానికి 4 నుంచి 14 రోజులు పడుతుంది.

ఈ వైరస్ సోకిన వారు అనేక లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఏ లక్షణాలు కనపడవు.

జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు గొంతులో నొప్పి వంటివి ప్రారంభ లక్షణాలు. కొంతమందిలో మెల్లగా తలతిరుగుడు, స్పృహ కోల్పోవడం, నిమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కొన్ని తీవ్రమైన కోసుల్లో మెదడు వాపువంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తే ప్రమాదముంది.

అయితే ఈ వ్యాధికి ఇప్పటి వరకు ఎలాంటి టీకా చికిత్సా అందుబాటులో లేదు.

నిపా గ్రామంలో మొదటి కేసు...

మలేసియాలో కొందరు పందుల పెంపకదారుల్లో 1998లో మొదటిసారి నిపా కేసులు నమోదయ్యాయి.

తరువాత పోరుగు దేశం సింగపూర్‌కు ఈ వైరస్ వ్యాపించింది.

దీన్ని మొదట ఏ గ్రామంలో గుర్తించారో ఆ గ్రామం పేరే ఈ వైరస్‌కు పెట్టారు.

ఆ సమయంలో 100 మందికి పైగా ఈ వైరస్ బారిన పడి మరణించారు.

దీన్ని నియంత్రించేందుకు దదాపు లక్ష పందులను హతమార్చారు.

దీని వల్ల ఎందరో రైతులు, జంతువు పెంపకదారులు ఆర్థిక నష్టాలను చవిచూశారు.

ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌లో ఈ వైరస్ స్వైరవిహారం చేసింది. 2001 సంవత్సరం నుంచి ఆ దేశంలో ఈ వైరస్ సోకి 100మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఈ వైరస్‌ను భారత్‌లో కూడా గుర్తించారు.

పశ్చిమ బెంగాల్‌లో 2001, 2007 సంవత్సరాలలో కేసులను గుర్తించారు.

ఇటీవల కేరళలో కూడా నిపా వైరస్ కేసుల ఎక్కువగా నమోదవుతున్నాయి. 2018లో 18 కేసులు నమోదవ్వగా, వీరిలో 17 మంది మరణించారు. 2023లో ఆరు కేసులను గుర్తించగా అందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం ఏం జరుగుతోంది

బరసాత్ ప్రాంతంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కిందటివారం వరకు 5 కేసులు నిర్థరణ అయ్యాయి. ఇద్దరు నర్సులకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి.

ప్రస్తుతానికి ఇతర దేశాల్లో నిపా కేసులు నమోదు కాలేదు. కాని పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ముందుజాగ్రత చర్యలు తీసుకుంటున్నాయి.

థాయ్‌లాండ్ ప్రభుత్వం ఆదివారం నాడు బ్యాంకాక్, ఫుకెట్ నగరాల్లోని మూడు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పరీక్షలు నిర్వహించడం ప్రారంభించింది .

వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే విమాన ప్రయాణికులను తమ ఆరోగ్య పరిస్థితిని వివరించవలసిందిగా ఆ దేశ ప్రభుత్వం కోరింది.

థాయ్‌లాండ్ పార్క్స్ అండ్ వైల్డ్‌లైఫ్‌ శాఖ రద్దీగా ఉండే పర్యావరణ పర్యటక ప్రాంతాల్లో సైతం పరీక్షలను ప్రారంభించింది.

థాయ్‌లాండ్‌లో నిపా వైరస్ ప్రవేశించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని వ్యాధి నియంత్రణ విభాగ ప్రతినిధి జురాయ్ వోంగ్స్‌వాస్డీ బీబీసీకి తెలిపారు.

మరోపక్క తైవాన్ ప్రభుత్వం నిపా వైరస్‌ను కేటగిరి 5 వ్యాధిగా పరిగణించాలని ప్రతిపాదించింది. అక్కడ కేటగిరి 5 వ్యాధి అంటే అరుదైన లేదా అప్పుడిప్పుడే ఉద్బవిస్తున్న, ప్రజారోగ్య ప్రమాదాలకు ముప్పును తెచ్చే అంటువ్యాధి. వీటిని తక్షణమే నమోదు చేయడం, నియంత్రణ కోసం ప్రత్యేక నివారణా చర్యలు తీసుకోవడం కీలకం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)