రంపచోడవరం అటవీ ప్రాంతంలో మరోసారి ఎదురుకాల్పులు, మెట్టూరి జోగారావు సహా ఏడుగురు మావోయిస్టులు మృతి..

ఫొటో సోర్స్, ANI
ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరం అటవీ ప్రాంతంలో బుధవారం నక్సల్స్, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారని ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు.
ఇందులో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు వెల్లడించారు.
మృతుల్లో ఒకరిని మెట్టూరి జోగారావు అలియాస్ "టెక్ శంకర్"గా పోలీసులు గుర్తించినట్లు మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు.
జోగారావు శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన వ్యక్తని లడ్డా చెప్పారు.
మిగిలిన ఆరుగురు మృతుల వివరాలు, గుర్తింపు కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.


ఫొటో సోర్స్, ANI
ఛత్తీస్‌గఢ్‌లో కొంతకాలంగా ఒత్తిడి పెరుగుతుండటంతో అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాలని ఇటీవల మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారని మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. దీంతో వారి కదలికలపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు.
నవంబరు 17న కీలకమైన ఆపరేషన్ చేపట్టగా, మంగళవారం మారేడుమిల్లిలో జరిగిన ఎదురుకాల్పుల్లో హిడ్మాతో పాటు మరో అయిదుగురు చనిపోయారని లడ్డా వెల్లడించారు.
ఈ క్రమంలో ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో మంగళవారం 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
‘‘ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల నుంచి 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశాం. వీరిలో ముగ్గురు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, 23 మంది ప్లటూన్ సభ్యులు, అయిదుగురు డివిజనల్ కమిటీ సభ్యులు, 19 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. ఎక్కడా ఎవరికీ ప్రమాదం జరగకుండా వీరిని అరెస్ట్ చేశాం.
వారి వద్ద నుంచి 45 ఆయుధాలు, 272 రౌండ్ల బుల్లెట్లు, 2 మేగజైన్లు, 750 గ్రాముల వైర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం.
మా ఫీల్డ్ సిబ్బంది కచ్చితమైన ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ పూర్తి చేసింది' అని మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు.

'లొంగిపోవాలని మావోయిస్టులను కోరుతున్నా'
మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వారు లొంగిపోవాలని మాజీ దళ సభ్యుడు, ఇటీవలే లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు.
‘‘గత కొన్ని రోజులుగా ఎన్‌కౌంటర్‌ల సమాచారం వింటున్నాం. కొంతమంది ఇప్పటికే తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు పొద్దున్నుంచి ఎన్‌కౌంటర్ సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో నేను మీ అందరికీ ఇదే చెప్పాలనుకుంటున్నా. దాదాపు నెలన్నర క్రితం మేం ఆయుధాలు వదిలేశాం. ఎందుకంటే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ ఆయుధాలతో సంఘర్షణ చేయలేమని భావించి జనజీవన స్రవంతిలో కలిశాం. ఇప్పుడు మేం ప్రజా సమస్యలను రాజ్యాంగబద్ధంగా పరిష్కరించేందుకు పని చేయగలం.
ఆయుధాలతో చాలా కోల్పోవాల్సి వచ్చింది. చాలా నష్టపోయాం. ఇప్పుడు ప్రపంచం మారింది. దేశం మారింది. పరిస్థితులు మారుతున్నాయి. అందుకే ఆయుధాలతో పోరాటానికి బదులుగా జనజీవన స్రవంతిలో కలిసి రాజ్యాంగబద్ధంగా పోరాడాలి. ఇదే మన ముందున్న మంచి ప్రత్యామ్నాయం’’ అని ఆయన తన వీడియో మెసేజ్‌లో తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














