శస్త్రచికిత్స చేస్తుంటే సన్నాయి వాయించిన వృద్ధురాలు

కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌, సన్నాయి

ఫొటో సోర్స్, King's College Hospital NHS Trust

ఫొటో క్యాప్షన్, బ్రిటన్‌కు చెందిన డెనిస్ బేకన్‌కు 2014లో పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధరణ అయింది.
    • రచయిత, డేనియల్ సెక్స్టన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న 65 ఏళ్ల మహిళ 'మెదడు శస్త్రచికిత్స' సమయంలో సన్నాయిని వాయించారు.

బ్రిటన్‌లో తూర్పు ససెక్స్‌లోని క్రౌబరోకు చెందిన డెనిస్ బేకన్ మెదడుకు ఎలక్ట్రికల్ కరెంట్‌ను అందించినప్పుడు ఆమె వేలి కదలికలో తక్షణ మెరుగుదల కనిపించిందని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లోని వైద్యులు చెప్పారు.

2014లో ఆమెకు పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధరణ అయింది. ఈ వ్యాధి ఆమె నడవడం, ఈత కొట్టడం, నృత్యం చేయడం, సన్నాయి వాయించే సామర్థ్యాన్ని ప్రభావితం చేసింది.

4 గంటల పాటు జరిగిన ఆపరేషన్‌లో న్యూరో సర్జన్ ప్రొఫెసర్ కీయుమర్స్ అష్కాన్ 'డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్)' అనే ప్రక్రియను నిర్వహించారు. డీబీఎస్ అనేది మెదడులో ఎలక్ట్రోడ్‌లను ఉంచే చికిత్స, పార్కిన్సన్స్ వంటి రుగ్మతలతో బాధపడుతున్న కొంతమంది రోగులకు ఇది అనుకూలంగా ఉంటుంది.

అయితే, శస్త్రచికిత్స సమయంలో బేకన్ మేల్కొనే ఉన్నారు. ఆమె నెత్తిమీద స్పర్శ లేకుండా చేయడానికి మాత్రమే అనస్తీషియా ఇచ్చారు. ఆపరేటింగ్ టేబుల్‌పైనే ఆమె వేళ్లు మెరుగుపడ్డాయి, సన్నాయిని సులభంగా వాయించగలిగారామె.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎవరీ బేకన్?

డెనిస్ బేకన్ ఈస్ట్ గ్రిన్‌స్టెడ్ కాన్సర్ట్ బ్యాండ్‌లో సన్నాయి వాయించేవారు. కానీ, ఆమె ఐదు సంవత్సరాల కిందట పార్కిన్సన్ లక్షణాల కారణంగా ఆపేశారు.

"స్టిమ్యులేషన్ ప్రారంభమైనప్పుడు, నా కుడి చేయి తేలిగ్గానే కదిలింది. దీంతో, సన్నాయి వాయించడం సులువైంది. నేను నిజంగా సంతోషంగా ఉన్నాను" అని బేకన్ అన్నారు.

తన నడకలో మెరుగుదల కనిపిస్తోందని, మళ్లీ ఈత కొట్టడం, నృత్యం చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఆమె చెప్పారు.

డెనిస్ బేకన్

ఫొటో సోర్స్, BBC/Nic Small

ఫొటో క్యాప్షన్, డెనిస్ బేకన్

వైద్యులు ఏమంటున్నారు?

బేకన్ పుర్రెలో '5 పెన్స్ నాణెం' పరిమాణంలో సగమంత రంధ్రాలు చేశామని ప్రొఫెసర్ అష్కాన్ చెప్పారు.

ఖచ్చితమైన కొలతలతో కూడిన ఒక ప్రత్యేక ఫ్రేమ్ ఆమె తలకు అమర్చినట్లు తెలిపారు. ఆమె మెదడులోని సరైన స్థానానికి వైద్యులు ఎలక్ట్రోడ్లను పంపడంలో సహాయపడటానికి 'సాట్ నావిగేషన్' మాదిరి ఇది పనిచేస్తుందని చెప్పారాయన.

"ఆమె చేతి కదలిక తక్షణమే మెరుగుపడటం చూసి చాలా సంతోషించాం. ఇది ఆమె సన్నాయి వాయించడానికి సహాయపడింది" అని అష్కాన్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)