మియన్మార్‌లో పెరుగుతున్న బలవంతపు సైనిక నియామకాలు..

మియన్మార్, అంతర్యుద్ధం
ఫొటో క్యాప్షన్, ఆచూకీ గల్లంతైన వారిలో పురుషులు, బాలురే ఎక్కువగా ఉన్నారు.
    • రచయిత, గ్యావిన్ బట్లర్
    • హోదా, బీబీసీ బర్మీస్ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

మియన్మార్‌లోని దక్షిణ కరెన్ రాష్ట్ర రాజధాని హ్పా ఆన్‌లో యువకులు, శారీరకంగా దృఢంగా ఉన్నవారు చీకటి పడిన తర్వాత బయటకు వెళ్లకూడదని అక్కడ ఇటీవలి కాలంలో సాధారణంగా వినిపిస్తున్న హెచ్చరిక.

అయితే, జావ్‌‌మిన్‌ అనే యువకుడికి మాత్రం బయటకు వెళ్లక తప్పని పరిస్థితులు ఉన్నాయి.

"నాకు భయంగానే ఉంటుంది. కానీ పని కోసం బయటకు వెళ్లాలి" అని ఆ 26 ఏళ్ల టుక్ టుక్ డ్రైవర్ అన్నారు. తన భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనతో తన అసలు పేరు వెల్లడించవద్దని ఆయన కోరారు.

"ప్రయాణికులను మరీ దూరంగా తీసుకెళ్లవద్దని, ఎవరిని ఎక్కించుకుంటున్నానో జాగ్రత్తగా చూసుకోవాలని నా కుటుంబ సభ్యులు తరచూ ఫోన్ చేసి చెబుతుంటారు. నేను ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు భయాందోళనల్లో ఉన్నారు. నాకు తెలిసిన కొందరిని తీసుకెళ్లిపోయారు" అని ఆయన అంటున్నారు.

మియన్మార్ సైనిక పాలకుల అనుచరులు, సాధారణ దుస్తుల్లో ఉన్న వారి మద్దతుదారులు హ్పా ఆన్ వీధుల్లో తిరుగుతూ, టీనేజీ వయసులో ఉన్నవారినీ, 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కుల వారిని విచక్షణారహితంగా అరెస్టు చేసి సైన్యంలోకి బలవంతంగా తీసుకెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బీబీసీ బర్మీస్ పరిశీలించిన లీకైన పత్రాల ప్రకారం, వివిధ ప్రాంతాల్లో సైనిక నియామకాల లక్ష్యాలను కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. జాతి ఆధారిత సాయుధ మిలీషియాలు, ప్రజాస్వామ్య అనుకూల బృందాలు, పౌరుల నేతృత్వంలోని ప్రతిఘటన ఉద్యమాలతో సుదీర్ఘ యుద్ధాన్ని ఎదుర్కొంటున్న సైనిక పాలకులు తమ సైనిక బలగాలను పెంచుకునేందుకు ఈ చర్యలు చేపడుతున్నారు.

తోబుట్టువులలో జావ్ మిన్ ఒక్కరే సైన్యంలో చేరాల్సిన వయసులో ఉన్న వ్యక్తి. తన వయసున్న అనేకమంది యువకులు థాయ్‌లాండ్‌కు లేదా దూర ప్రాంతాల్లో నివసించే బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారని ఆయన చెబుతున్నారు. స్వస్థలంలోనే ఉండిపోయిన యువకులు సూర్యాస్తమయానికి ముందే ఇంటికి చేరుకోవాలని తల్లిదండ్రుల నుంచి కఠినమైన ఆదేశాలు ఎదుర్కొంటున్నారు.

మియన్మార్‌లో 2021 ఫిబ్రవరి నుంచి అంతర్యుద్ధం కొనసాగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకురాలు ఆంగ్ సాన్ సూచీని తిరుగుబాటు ద్వారా అధికారం నుంచి తొలగించింది సైన్యం.

వరుస పరాజయాలు, సైనికుల నైతిక స్థైర్యం తగ్గడం, సైన్యం నుంచి పారిపోయేవారి సంఖ్య పెరగడంతో మూడేళ్ల తర్వాత సైనిక పాలకులు తప్పనిసరి సైనిక నియామకాల చట్టాన్ని అమలు చేశారు. దీని ప్రకారం 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు, 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు కనీసం రెండేళ్లపాటు సైనిక అధికారుల ఆధ్వర్యంలో సేవలందించాలి. ఈ నిబంధనను పాటించని వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

"సైనిక తిరుగుబాటు తర్వాత మొత్తం పౌర సమాజంపై ప్రభావం చూపిన అత్యంత తీవ్రమైన చర్యల్లో ఈ చట్టం ఒకటి" అని మియన్మార్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూట్ (ఎండీఎస్‌ఐ)లో సైనిక వ్యవహారాల అధికారి మేజర్ నాంగ్ యో చెప్పారు. ఆయన గతంలో సైన్యంలో పనిచేసి, బయటికి వచ్చిన తర్వాత సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఉద్యమంలో చేరారు.

మియన్మార్, అంతర్యుద్ధం
ఫొటో క్యాప్షన్, మియన్మార్‌లో మహిళలు, పురుషులు ఒక వయసులో మిలిటరీ సేవల్లో పాల్గొనాలి.

గత రెండున్నరేళ్లలో సుమారు లక్ష మంది యువకులు ఇలా బలవంతపు సైనిక నియామకాలలో చిక్కుకున్నట్లు అంచనా. వీరిలో చాలామందిని బెదిరింపులు, బలవంతం, డబ్బు వసూలు, అపహరణల ద్వారా సైన్యంలోకి తీసుకెళ్లారు. తాజాగా హ్పా ఆన్ ప్రాంతం కూడా ఈ పరిధిలోకి వచ్చింది.

"యువత కదలికలను భద్రతా బలగాలు గమనిస్తున్నాయి. చట్టప్రకారం సైన్యంలో చేరాల్సిన అర్హత ఉందనే సాకుతో వారిని అరెస్టు చేసి బలవంతంగా విధుల్లోకి తీసుకుంటున్నాయి. నిర్బంధిస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఇళ్లలో అతిథుల వివరాలను తనిఖీ చేసే సమయంలోనూ వ్యక్తులను అరెస్టు చేస్తున్నాయి" అని నాంగ్ యో తెలిపారు.

ఈ కథనంలో ప్రస్తావించిన ఘటనలు, ముఖ్యంగా బలవంతపు సైనిక నియామకాలు, ఇటీవలి నెలల్లో జరిగినట్లు చెబుతున్న అపహరణలపై వివరణ కోరుతూ మియన్మార్ ప్రభుత్వంలోని ప్రజలను సైనిక సేవకు పిలిచే కేంద్ర సంస్థను బీబీసీ సంప్రదించింది. అయితే, ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించడానికి అధికారులు నిరాకరించారు.

తప్పనిసరి సైనిక నియామకాల చట్టంతో సైనిక పాలకులు తమ సాయుధ బలగాలకు అవసరమైన మనుషులను సమకూర్చుకునేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇది పనిచేసినట్లే కనిపిస్తోంది. అదనపు సైనిక బలగాలు రావడంతో ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోగలిగిందని పరిశీలకులు చెబుతున్నారు. మియన్మార్‌లోని అనేక ప్రాంతాల్లో ప్రతిఘటన బలగాలు ప్రస్తుతం ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

అయితే, యుద్ధం ఇంకా ముగియలేదు. సైనిక నియామకాలను తప్పించుకునేందుకు యువత ప్రయత్నిస్తుండటంతో, సొంత దేశ పౌరులతోనే పోరాడటానికి ఇష్టపడక కొందరు ప్రతిఘటన ఉద్యమాల్లో చేరుతుండగా, మరికొందరు సాయుధ ఘర్షణలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో సైనిక పాలకులు యువతను నియమించుకునేందుకు మరింత తీవ్రమైన పద్ధతులను అనుసరిస్తున్నారు.

మియన్మార్ సైన్యం పౌరులను అపహరించి బలవంతంగా సైన్యంలోకి తీసుకుంటోందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్, ఫోర్టిఫై రైట్స్ వంటి అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆరోపించాయి.

జులైలో ‘మియన్మార్ విట్‌నెస్’ అనే ఓపెన్ సోర్స్ పరిశోధనా సంస్థ 2021 నుంచి 2025 మధ్య ఆచూకీ గల్లంతైన వందలాది వ్యక్తుల గురించి ఫేస్‌బుక్‌లో ప్రచురించిన ప్రకటనలను విశ్లేషించినట్లు వెల్లడించింది. జనవరి నెలలో ఆచూకీ గల్లంతైన వ్యక్తుల ప్రకటనలు 2021లో నాలుగు ఉండగా, తప్పనిసరి సైనిక నియామకాల చట్టం అమలులోకి వచ్చిన తర్వాత 2025లో 82కు పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు.

"ఆచరణలో మియన్మార్ సైన్యం నియామక ప్రక్రియలో అధికారిక పిలుపుల కంటే నిర్బంధం, బలవంతం, వ్యక్తుల అదృశ్యానికి సంబంధించిన ఘటనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వడం లేదు" అని పరిశోధకులు నిర్ధరించారు.

ఆచూకీ గల్లంతైన వారిలో పురుషులు, బాలురే ఎక్కువగా ఉన్నారు.

మియన్మార్, అంతర్యుద్ధం
ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం తన భర్త ఎక్కడ ఉన్నారో మో మో సాన్ పాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తెలియదు

"నేనే నా భర్తను అమ్మేశానంటూ మా ప్రాంతమంతా అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారు" అని మో మో సాన్ పాన్ అనే మహిళ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు.

2025 మే 8న ఉదయం తన భర్త ఫ్యో వైను చివరిసారిగా చూసిన సందర్భాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు.

"మా మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయారు. నేను బాధపడి జరిగిన విషయాన్ని నా బంధువుకు చెప్పాను" అని ఆమె వివరించారు.

ఆ బంధువు స్థానిక వార్డు పరిపాలనా కార్యాలయంలో పనిచేసేవారు. తన భర్తను తిరిగి తీసుకురావాలని ఆమె ఆయనను కోరారు. రెండు రోజుల తర్వాత నగరానికి అవతలి వైపున ఉన్న సైనిక నియామక కేంద్రం నుంచి ఫ్యో వై ఆమెకు ఫోన్ చేశారు.

వార్డు కార్యాలయానికి తన భర్తను తీసుకెళ్లిన బంధువు, ఆ వార్డుకు కేటాయించిన సైనిక నియామకాల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు మరో వార్డుకు విక్రయించారని మో మో సాన్ పాన్ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై స్పందన కోసం బీబీసీ ఆమె బంధువును సంప్రదించలేకపోయింది.

భర్తను తిరిగి తీసుకురావాలనే ఆత్రుతతో ఆమె మరోసారి మోసానికి గురయ్యారు. ఆయనను విడిపిస్తామని నమ్మించిన కొందరు వ్యక్తులు ఆమె నుంచి పెద్ద ఎత్తున డబ్బును వసూలు చేశారు.

ఫ్యో వైను తీసుకెళ్లిన వార్డుకు చెందిన పరిపాలనా అధికారి యూ మాంగ్ మాంగ్ ల్విన్, ఆయనను సైనిక నియామక అధికారులకు అప్పగించడంలో తన పాత్ర ఉందని తర్వాత బీబీసీతో అంగీకరించారు.

స్థానిక పట్టణ పరిధికి వెలుపల ఉన్న వ్యక్తులను సైన్యంలోకి తీసుకుంటున్నారనే ఆరోపణలపై ప్రశ్నించగా, స్థానికంగా నిర్దేశించిన నియామకాల లక్ష్యాలను పూర్తి చేయలేనప్పుడు ఇతర పట్టణాల నుంచి వ్యక్తులను తీసుకొస్తుంటారని చెప్పారు.

అయితే, ఇలాంటి సందర్భాల్లో లేదా ఫ్యో వైను బలవంతంగా సైన్యంలోకి తీసుకునే ప్రక్రియలో డబ్బు చేతులు మారిందన్న ఆరోపణలను ఆయన ఖండించారు.

"తనకు సహాయం చేస్తామని చెప్పి కొన్ని పత్రాలపై సంతకాలు చేయించారని నా భర్త నాకు చెప్పారు" అని మో మో సాన్ పాన్ గుర్తుచేసుకున్నారు.

"సాధారణ చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా నా భర్త సైనిక సేవకు ఎంపికై ఉంటే నేను అంగీకరించగలిగేదాన్ని. కానీ మా వార్డు పరిపాలనా కార్యాలయమే ఆయనను మరో వార్డుకు విక్రయించిందన్న మాటను నేను అంగీకరించలేను’’ అని ఆమె అన్నారు.

"నా బంధువును నమ్మినందుకు కూడా బాధపడుతున్నా" అని ఆమె చెప్పారు.

భర్తను తీసుకెళ్లిన తర్వాత మో మో సాన్ పాన్ రెండు అంశాలపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఒకటి, తన భర్తను సైనిక సేవ కోసం విక్రయించారనే ఆరోపణ. రెండోది, మోసగాళ్లకు తాను కోల్పోయిన డబ్బుకు సంబంధించిన ఫిర్యాదు.

పోలీసులు తన ఫిర్యాదును స్వీకరించారని ఆమె చెబుతున్నారు. అయితే, మానవ అక్రమ రవాణా ఆరోపణలను కూడా అందులో చేర్చాలన్న తన అభ్యర్థనను తిరస్కరించారని తెలిపారు. ఒక వ్యక్తిని విదేశాలకు విక్రయించినప్పుడు మాత్రమే మానవ అక్రమ రవాణా కేసు నమోదు చేయగలమని పోలీసులు చెప్పినట్లు ఆమె వెల్లడించారు.

ప్రస్తుతం తన భర్త ఎక్కడ ఉన్నారో ఆమెకు తెలియదు.

మో మో సాన్ పాన్ ఉదంతం తప్పనిసరి సైనిక నియామకాల చట్టం కారణంగా ఏర్పడిన మరో తీవ్రమైన పరిణామాన్ని బట్టబయలుచేస్తోంది. పాలక వ్యవస్థలో ఉన్నత స్థాయి అధికారులు విధిస్తున్న ఒత్తిడి, కింది స్థాయిలో పనిచేసే అధికారులకు అక్రమాలకు పాల్పడే ప్రేరణగా మారుతోంది.

మియన్మార్, అంతర్యుద్ధం
ఫొటో క్యాప్షన్, చట్టం ప్రకారం ప్రతి గ్రామం, వార్డు లేదా పట్టణం నుంచి జనాభా ప్రాతిపదికన నిర్దేశిత సంఖ్యలో యువకులను సైన్యంలోకి పంపాల్సి ఉంటుంది.

సైనిక నియామకాల కోసం డిమాండ్ పెరుగుతుండగా, అర్హులైన యువకుల సంఖ్య తగ్గుతోంది. దీంతో వారిని అక్రమంగా సమకూర్చే వ్యవస్థ ఏర్పడింది. డబ్బు సంపాదించే అవకాశం ఉండటంతో భద్రతా అధికారులు రహదారి తనిఖీ కేంద్రాల వద్ద యువకులను అరెస్టు చేయడం, రోజువారీ ప్రయాణాల్లో కార్మికుల కదలికలను గమనించి వారిపై దాడి చేయడం, నకిలీ ఉద్యోగ ప్రకటనల ద్వారా ఉచ్చులోకి లాగడం, ఇళ్లలోకి బలవంతంగా చొరబడటం వంటి చర్యలకు పాల్పడుతున్నారని నాంగ్ యో చెబుతున్నారు.

"సైనిక నియామకాల చట్టం పేరుతో జరుగుతున్న ఈ బలవంతపు అరెస్టులు, నియామకాలు ఆధునిక కాలపు బానిసత్వం, మానవ అక్రమ రవాణా వ్యవస్థగా మారిపోయాయి" అని ఆయన పేర్కొన్నారు.

ఆగస్టు చివర్లో యాంగూన్‌లో పోలీసులు నలుగురు యువకులను అపహరించి, సైనిక నియామకాల కోసం విక్రయించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అగ్నిమాపక శాఖ ఉద్యోగిని, అతని అల్లుడిని అరెస్టు చేశారు. అగ్నిమాపక శాఖ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది.

రిజర్వ్ అగ్నిమాపక దళ విభాగ కమాండర్‌గా ఉన్న నిందితుడు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని నమ్మించి యువకులను తన ఇంటికి రప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పలు నిర్బంధ గదుల్లో వారిని బంధించినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 25న ఆయన నివాసంపై దాడి చేసి అరెస్టు చేశారు.

ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించేందుకు అపహరించినట్లు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ నేరం రుజువైతే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆయనను నిర్బంధించిన పోలీస్ స్టేషన్‌ను సంప్రదించేందుకు బీబీసీ బర్మీస్ పలుమార్లు ప్రయత్నించినప్పటికీ స్పందన లభించలేదు.

"కింది స్థాయి పరిపాలనా సంస్థలు, సైనిక సిబ్బంది, స్థానిక నేరగాళ్ల ముఠాలు యువకులను బలవంతంగా సైన్యంలోకి చేర్చేందుకు, అరెస్టు చేసేందుకు వివిధ పద్ధతులను అనుసరిస్తున్నాయి" అని నాంగ్ యో చెప్పారు.

"మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్న సైనిక విభాగాలకు, ప్రాంతీయ కమాండ్లకు ఈ వ్యక్తులను విక్రయిస్తున్నారు. మరోవైపు, డబ్బు చెల్లించి సైనిక సేవ నుంచి తప్పించుకోవాలనుకునే సంపన్నుల తరఫున వారి స్థానంలో పనిచేసే ప్రత్యామ్నాయ సైనిక ఉద్యోగులను కూడా అక్రమంగా సమకూరుస్తున్నారు" అని వివరించారు.

చట్టం ప్రకారం ప్రతి గ్రామం, వార్డు లేదా పట్టణం నుంచి జనాభా ప్రాతిపదికన నిర్దేశిత సంఖ్యలో యువకులను సైన్యంలోకి పంపాల్సి ఉంటుంది. అయితే, సంపన్నులు డబ్బు చెల్లించి సైనిక సేవ నుంచి తప్పించుకుని తమ స్థానంలో ఆర్థికంగా వెనుకబడిన వారిని పంపగలుగుతున్నారు. దీంతో ఈ భారాన్ని పేదలే అధికంగా మోయాల్సి వస్తోంది.

ప్రతి నెలా నిర్దేశించిన సైనిక నియామకాల లక్ష్యాలను పూర్తి చేయడం కష్టమవుతుండటం, క్షేత్రస్థాయిలో యువకులను విక్రయించడం ద్వారా భారీగా డబ్బు సంపాదించగలగడం వల్ల ఈ అక్రమాలు పెరుగుతున్నాయని నాంగ్ యో బీబీసీకి తెలిపారు.

బలవంతపు సైనిక నియామకాలు పెరుగుతుండటం పాలకుల వద్ద సైనిక బలం తగ్గిపోవడాన్ని, మరింతమంది సైనికుల కోసం వారు ఎంతగా తహతహలాడుతున్నారో కూడా వెల్లడిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.

"అంతర్యుద్ధంలో సైనిక పాలకులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. తమకు ఇష్టం లేని ఘర్షణలో పాల్గొనేందుకు యువతను బలవంతంగా సైన్యంలో చేర్చేందుకు పాలకులు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది మరో అడుగు" అని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో సైనిక అధ్యయనాలు బోధిస్తున్న పరిశోధకులు డాక్టర్ సందీప్ సింగ్ అన్నారు.

తరచూ జరుగుతున్న అపహరణల కారణంగా ఇప్పటికే అనేక ఏళ్ల అంతర్యుద్ధంతో ప్రభావితమైన మియన్మార్ యువత, వారి కుటుంబాలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు.

మియన్మార్‌లో రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఆందోళనలకు తోడు, సైనిక నియామకాలకు అర్హులైన యువకులు ఇప్పుడు ప్రాణాంతకమైన యుద్ధంలోకి బలవంతంగా వెళ్ళాలనే భయంతో జీవిస్తున్నారు. వారు నమ్మని యుద్ధంలో పాల్గొనడమే కాకుండా, చాలామంది యువకులు దానిని వ్యతిరేకిస్తున్నారు కూడా.

ఈ నిరంతర భయం కారణంగా దేశంలోనే పెద్ద ఎత్తున ప్రజలు వలస వెళ్తున్నారు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలో కార్మికుల కొరత మరింత తీవ్రంగా మారుతోంది. అనేకమంది పొరుగు దేశాలకు పారిపోతున్నారు.

అర్ధ దశాబ్దానికి పైగా తన సొంత ప్రజలపైనే యుద్ధం సాగించిన మియన్మార్ సైనిక పాలకులు, ప్రజలను అణచివేసేందుకు మరో సాధనంగా తప్పనిసరి సైనిక నియామకాల చట్టాన్ని ఉపయోగిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు.

జూన్‌లో ఎండీఎస్‌ఐ ప్రచురించిన ఒక ప్రకటనలో ఈ పరిస్థితిని వివరిస్తూ, "ప్రజలు ఒకరితో ఒకరు పోరాడేలా చేయడానికి సైనిక చట్టాన్ని ఉపయోగించడం ద్వారా జనరల్స్ ప్రయోజనం పొందారు" అని పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)