ఎవరీ నేహా బోరా? బీజేపీకి మద్దతు ఇచ్చే కుటుంబం నుంచి వచ్చి ఉద్యమాల ముఖచిత్రంగా ఎలా మారారు?

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అక్టోబర్ 10వ తేదీన జరిగిన నిరసనలలో అఖిల భారత విద్యార్థి సంఘం (ఏఐఎస్ఏ) జాతీయ అధ్యక్షురాలు నేహాబోరాను నిర్బంధించారు.
దీంతోపాటు ఆదివారం (11వ తేదీ) కూడా ఆమె దిల్లీలోని ఆర్కే ఆశ్రమం సమీపంలో మరోసారి సర్‌కు వ్యతిరేకంగా, జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను కోరుతూ నిరసనకు దిగితే పోలీసులు నిర్బంధించారు.
అంతకుముందు నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూలైలో అభిజీత్ దీప్కే, సోనమ్ వాంగ్చుక్లు నిరాహార దీక్షకు దిగినప్పుడు .వారితో పాటు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి నేహా బోరా. నేహా కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ విద్యార్థి సంఘం ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా ఆ తర్వాత కూడా మరోసారి వార్తల్లో నిలిచారు. ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై జరిగిన విద్యార్థుల నిరసనలో పాల్గొనడానికి ఆమె రాంచీ వెళ్లారు.
ఆ సమయంలో నేహా ముఖంపై ఎవరో సిరా చల్లారు. అయితే "నా ముఖంపై సిరా చల్లినంత మాత్రాన భయపడను. దిల్లీలో జరిగిన ఆందోళన సమయంలో నేను పెల్లెట్ల దాడిని, లాఠీచార్జ్‌ను కూడా ఎదుర్కొన్నా" అని నేహా అన్నారు.

"దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువత ఆగ్రహాన్ని సిరాతో అణచివేయవచ్చని మీరు అనుకుంటున్నారా?" అని నేహా ప్రశ్నించారు.
తర్వాత నిరసన సమయంలో అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె బీహార్‌కు వెళ్లారు. గత కొన్నేళ్లుగా విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా ఉన్న నేహా ఇప్పుడు దేశంలో జరుగుతున్న యువత, విద్యార్థుల ఉద్యమాలకు ముఖచిత్రమయ్యారు.
దూకుడైన వైఖరి, ముక్కుసూటి ప్రసంగాలు, పోరాటపటిమ కారణంగా నేహా బోరా ప్రస్తుతం మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె ప్రసంగాలకు సంబంధించిన అనేక రీల్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మరోసారి దిల్లీలో తన మద్దతుదారులతో కలిసి నేహా నిరసనకు దిగారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈసారి నేహా, ఆమె మద్దతుదారులు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దేశంలో కొనసాగుతున్న 'సర్' ప్రక్రియలో జరిగిన అవకతవకలకు జ్ఞానేశ్ కుమార్ బాధ్యుడని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రక్రియ కారణంగా కోట్లాది మంది తమ ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వారు అంటున్నారు.
ఇటీవల ఆంగ్ల దినపత్రిక 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' తన పరిశోధనాత్మక కథనం(ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్)లో 'సర్' ప్రక్రియ విషయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్, మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయని పేర్కొంది.
నేహా ఉత్తరాఖండ్‌కు చెందినవారు. దిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత దిల్లీలోని అంబేడ్కర్ యూనివర్సిటీ లో ఎంఏ చదివారు. ప్రస్తుతం దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నారు.
దిల్లీ, జేఎన్యూలలో వామపక్ష విద్యార్థి ఉద్యమానికి ముఖచిత్రంగా ఉన్నారు నేహా. ఏఐఎస్ఏకు నాయకత్వం వహిస్తూ ఆమె యూనివర్సిటీలో చురుకుగా పనిచేస్తున్నారు. నిజానికి ఇప్పుడు ఆమె దేశంలో ఆమె ప్రజా, వామపక్ష ఉద్యమాల గళంగా కనిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘మీకు నాకు అదే తేడా’
నేహా కిందటి నెలలో ఫ్రంట్‌లైన్‌కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘మీరు గాడ్సేను నమ్ముతారు, మేం భగత్ సింగ్‌ను నమ్ముతాం. ఇదే మీకు, నాకు మధ్య ఉన్న ప్రాథమిక తేడా. అందుకే మీరు (అధికారం నుంచి) వెళ్లిపోవాలి' అని జంతర్ మంతర్‌లో అనేక పోస్టర్లు పెట్టారు . 'గాడ్సేను నమ్మే వారు ఈ దేశాన్ని పాలించకూడదు' అని ప్రజలు పదేపదే చెబుతున్నారు’’ అని నేహా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
"ఈ నిరసనలు ప్రస్తుత అధికార వ్యవస్థ నుంచి దేశ యువత ఏం కోరుకోవడం లేదో చూపించాయని భావిస్తున్నా. ఫాసిస్ట్ల నుంచి కూడా జవాబుదారీతనం కోరవచ్చనే విషయాన్ని మించి, ఈ ఉద్యమం మనందరికీ ఎన్నో పాఠాలు నేర్పిందని అనుకుంటున్నా. అందుకే నేను నిరాహార దీక్ష నుంచి తిరిగి వచ్చి మైక్‌లో మాట్లాడుతున్నప్పుడు, యువత ఈ భావనను గుర్తుంచుకోవాలని చెప్పా. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు కాకుండా, ఒకరి కోసం మరొకరు పోరాడాలనే భావనను గుర్తుంచుకోవాలి" అని నేహా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కుటుంబంలో సైద్ధాంతిక విభేదాలు
నేహా బీజేపీకి మద్దతు ఇచ్చే కుటుంబం నుంచి వచ్చారు.
"నా కుటుంబంలోనే బీజేపీకి గట్టి మద్దతుదారులు ఉన్నారు. మా ఇంట్లో చాలా విభేదాలు ఉన్నాయి. నేను దిల్లీకి వచ్చి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్నప్పటినుంచి మా ఇంట్లో ఈ విభేదాలు కొనసాగుతున్నాయి" అని నేహా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
"కొన్నిసార్లు పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారుతుంది. ఆర్థికంగా, నా జీవితానికి సంబంధించి నిర్ణయాలు నేనే తీసుకునేంత స్వేచ్ఛ నాకు చాలావరకు ఉందనుకుంటున్నాను. డిగ్రీ రెండో లేదా మూడో ఏడాది నుంచే నాకు ఈ స్వేచ్ఛ లభించింది. ఎందుకంటే అది నా జీవితంలో ఒక కీలక మలుపు" అని నేహా చెప్పారు.
నీట్ పేపర్ల లీకేజీపై జంతర్ మంతర్ వద్ద జరిగిన ఉద్యమం గురించి బీబీసీతో మాట్లాడిన నేహా ఈ ఉద్యమాన్ని ఏ ఒక్క వర్గం లేదా కేటగిరీలోనూ పెట్టలేమని అది చూపించిందని అన్నారు. అదే ఈ ఉద్యమ బలమని, అది ఇలాగే కొనసాగాలని ఆమె పేర్కొన్నారు.
"జంతర్ మంతర్ ఉద్యమ సమయంలో చాలామంది తమ తల్లులు 'నిరసనకు వెళ్లండి' అని చెప్పారని అన్నారు. ఇంకొందరు నిరసనకు రావాలనే ఉద్దేశంతో పాఠశాలకు వెళ్లలేదని చెప్పారు. ద్వేషం కోసం శిక్షణ పొందినట్లుగా మారిన దేశంలో ప్రజలు ఇప్పుడు ఒకరి చేతిని మరొకరు పట్టుకోవడం నేర్చుకున్నారనడానికి ఇది ఒక సంకేతం" అని ఆమె చెప్పారు.
బీజేపీకి మద్దతు ఇచ్చే పేరెంట్స్ ,గ్రాండ్ పేరెంట్స్ కూడా నిరసన సమయంలో తన దగ్గరకు వచ్చారని, కొందరు కన్నీళ్లు పెట్టుకుని విద్యార్థుల పరిస్థితికి క్షమాపణలు చెప్పారని నేహా తెలిపారు.
'ఫ్రంట్‌లైన్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేహా తన కుటుంబాన్ని ఉదాహరణగా చెబుతూ, బీజేపీకి మద్దతు ఇచ్చే తన తల్లి పోలీసుల చర్యలను చూసిన తర్వాత నిరసనకారుల ప్రయత్నాలను ప్రశంసించారని అన్నారు. ఇలాంటి మార్పులు ఉద్యమానికి విస్తృతమైన సామాజిక ప్రభావాన్ని తీసుకొచ్చాయని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
దీప్కేతో పోలిక
ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో నేహా బోరాను పోలుస్తూ, ఎవరు ఎక్కువ పరిణితి కలిగినవారు అనే విషయంపై కొందరు చర్చించుకున్నారు.
"అభిజీత్ దీప్కే కంటే నేహా బోరా ఎక్కువ ప్రతిభావంతురాలని మీరు గుర్తిస్తే అదే పరిణితి. ఆమె జెన్ జీకి నిజమైన ఐకాన్, ఆమె స్వాగ్ అద్భుతంగా ఉంది" ఒక ఎక్స్ యూజర్ నేహా బోరా ఫొటోను పోస్ట్ చేశారు.ఈ పోస్టును రీపోస్ట్ చేస్తూ అభిజీత్ "నేను ఏకీభవిస్తున్నా" అన్నారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే నేహా ఎక్స్‌లో "పోలిక కాదు, ఐక్యత. దీనికి వ్యతిరేకంగా మనం కలిసి పోరాడుతున్నాం" అని రాశారు.
దీనికి అభిజీత్ సమాధానంగా "ఇంక్విలాబ్ జిందాబాద్" అని రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























