‘నా కోచ్‌లో మగవాళ్లు మద్యం తాగుతున్నారు’ అంటూ కుటుంబ సభ్యులకు చెప్పిన అస్సాం యువతి తర్వాతి రోజు శవంగా కనిపించారు..

ఫొటో సోర్స్, UGC
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అస్సాం నుంచి విశాఖపట్నం వచ్చిన హిమశ్రీ బోరో.. పరీక్షలు రాయడానికి తిరిగి స్వస్థలానికి బయలుదేరారు.
కన్యాకుమారి-దిబ్రూగఢ్ మధ్య నడిచే వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఆమె తాను ఎక్కిన కోచ్‌లో కొందరు పురుషులు మద్యం తాగుతున్నారని తనకు భయంగా ఉందని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు.
కొద్దిసేపటి తర్వాత ఆమె ఫోన్ అందుబాటులో లేకుండా పోయింది.
ఆ మరుసటి రోజు శ్రీకాకుళం జిల్లాలో రైలు పట్టాల పక్కన ఆమె మృతదేహం కనిపించింది.
ఈ ఘటనలన్ని అక్టోబర్ 5 సాయంత్రం నుంచి అక్టోబర్ 7 ఉదయం మధ్య జరిగాయని పోలీసులు తెలిపారు.

హిమశ్రీ ప్రమాదవశాత్తూ రైలు నుంచి పడిపోయారా? ఎవరైనా తోసేశారా? అసలు ఆ రాత్రి రైలులో ఏం జరిగింది?
రైల్వే భద్రతా సిబ్బందికి సమాచారం అందినప్పటికీ ఆమెను ఎందుకు గుర్తించ లేకపోయారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్, అస్సాం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హిమశ్రీ మరణంపై సమగ్ర విచారణ జరపాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు.

ఫొటో సోర్స్, facebook.com/Bodo Students Forum USTM
అస్సాం నుంచి విశాఖకు..
అస్సాంలోని గువాహటిలోని బోండా ప్రాంతానికి చెందిన హిమశ్రీ బోరో నృత్య కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బృందంతో కలిసి విశాఖపట్నం వచ్చారు.
బృందంలోని మిగతా సభ్యులు అక్కడే ఉండిపోగా మరుసటి రోజు పరీక్ష ఉందనే కారణంతో ఆమె స్వస్థలానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
అక్టోబర్ 5న గువాహటికి వెళ్లేందుకు రైలు టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ రిజర్వేషన్ దొరకలేదని శ్రీకాకుళం ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి తెలిపారు.
దీంతో జనరల్ టికెట్ తీసుకుని కన్యాకుమారి-దిబ్రూగఢ్ మధ్య నడిచే వివేక్ ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్లు ఆయన బీబీసీతో చెప్పారు.
రైలులో అప్పటికే రద్దీ ఎక్కువగా ఉండటంతో హిమశ్రీకి సీటు దొరకలేదని, ఆమె కోచ్ తలుపు సమీపంలోనే ఉండిపోయారని ఎస్పీ వివరించారు.
రిజర్వేషన్ లేని ప్రయాణికులు కూడా స్లీపర్ కోచ్‌లోకి ఎక్కడంతో ఆ బోగీలో రద్దీ ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందన్నారు.

ఫొటో సోర్స్, facebook.com/Bodo Students Forum USTM
రైలులో భయంగా ఉందని ఫోన్ కాల్ ..
హిమశ్రీ ఎస్-2 కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఆమె కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. కోచ్‌లో కొందరు పురుషులు మద్యం తాగుతున్నారని, తనకు భయంగా ఉందని చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
రాత్రి 2.30 గంటల తర్వాత ఆమెకు తాము ఫోన్ చేసినప్పటికీ స్పందన రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు రైల్వే హెల్ప్‌లైన్ 139తో పాటు గౌహతి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
హిమశ్రీ తన స్నేహితురాలికి కూడా కోచ్‌లోని పరిస్థితులను చూపించే వీడియో పంపారని, ఆ వీడియోలో మద్యం తాగుతున్నట్లు కనిపించిన వ్యక్తులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ తెలిపారు.
అయితే ఆ వీడియోలో అంత అనుమానస్పద విషయాలేమి కనిపించలేదన్నారు. అయినప్పటికీ ఆ వీడియోలోని వ్యక్తులను ట్రాక్ చేస్తున్నామని తెలిపారు.
అయితే, హెల్ప్‌లైన్‌కు సమాచారం అందిన సమయంలో హిమశ్రీ ఏ కోచ్‌లో ప్రయాణిస్తున్నారనే వివరాలు స్పష్టంగా ఇవ్వలేదని శ్రీకాకుళం ఎస్పీ చెప్పారు.
"విజయనగరం స్టేషన్ దాటిన తర్వాత ఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాతి స్టేషన్ ఆమదాలవలస కావడంతో అక్కడి రైల్వే భద్రతా సిబ్బంది ఆమెను గుర్తించే ప్రయత్నం చేశారు. అయిననప్పటికీ ఆచూకీ లభించలేదు" అని ఎస్పీ మహేశ్వరరెడ్డి బీబీసీకి వివరించారు.

ఫొటో సోర్స్, UGC
పట్టాల పక్కన మృతదేహం..
అక్టోబర్ 7న శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస-పొందూరు రైల్వే సెక్షన్ పరిధిలోని బొడ్డేపల్లి పేట సమీపంలో పట్టాల పక్కన హిమశ్రీ మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు.
ఆమె రెండు బ్యాగులు ప్రయాణిస్తున్న రైలు కోచ్‌లోనే ఉన్నట్లు గుర్తించారు.
మృతదేహం వద్ద లభించిన ఆధార్ కార్డు వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు శ్రీకాకుళం చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు.
అనంతరం ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డిని కలిసి తమ అనుమానాలను వివరించారు.
రైలులో భయంగా ఉందని చెప్పిన తమ కుమార్తెకు ఏం జరిగిందో తేల్చాలని, సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.

ఫొటో సోర్స్, UGC
'ప్రమాదమా...ఎవరైనా తోసేశారా?'
హిమశ్రీ మరణానికి గల కారణాలపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఆమె ప్రమాదవశాత్తూ రైలు నుంచి పడిపోయారా? ఎవరైనా కావాలనే తోసేశారా? రైలులో ఆమెకు ఏదైనా వేధింపు ఎదురైందా? అనే అంశాలను పరిశీలిస్తున్నారు.
శ్రీకాకుళం ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పోస్టుమార్టం నివేదికలో ఆమెపై భౌతిక దాడి జరిగినట్లు ఆధారాలు లేవు.
అయితే ఆమె ప్రమాదవశాత్తూ రైలు నుంచి పడిపోయారా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని ఆయన చెప్పారు.
రైలులో ప్రయాణించిన కొందరిని పోలీసులు ప్రశ్నించారు. ఇప్పటివరకు విచారించిన ప్రయాణికులెవ్వరూ అక్కడ ఏదైనా ఘటన జరిగినట్లు చెప్పలేదని ఎస్పీ వివరించారు.
రిజర్వేషన్ లేకుండా ప్రయాణించిన వారిని గుర్తించడం కష్టంగా ఉందని, వారిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
'కోచ్‌లో ఎక్కువమంది పురుషులు ఉండటంతో భయపడి ఉండొచ్చు'
ఈ ఘటనపై అస్సాం ప్రభుత్వం ప్రత్యేక విచారణాధికారిని నియమించింది.
అస్సాం ఐజీ జీవీ శివప్రసాద్ శ్రీకాకుళం చేరుకుని స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
"వివిధ కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. కోచ్‌లో ఉన్న ప్రయాణికులందరినీ సంప్రదించాం. ఇప్పటివరకు అనుమానాస్పదంగా కనిపించే అంశాలేవీ బలంగా బయటపడలేదు. కోచ్‌లో ఎక్కువమంది పురుషులు ఉండటంతో ఆమె భయపడి ఉండొచ్చు. ఇది ప్రమాదమా, ఎవరైనా కావాలనే చేశారా అనేది దర్యాప్తులో తేలాలి" అని జీవీ శివప్రసాద్ తెలిపారు.
హిమశ్రీ ఫోన్లోని వీడియోను కూడా పరిశీలించినట్లు ఆయన చెప్పారు.
ఆ వీడియోలోని అంశాలపై దర్యాప్తు పూర్తయ్యే వరకు మరణానికి గల కారణంపై తుది నిర్ణయానికి రాలేమని స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, UGC
డ్యాన్స్ బృందంలో పారితోషికం వివాదం ఉందా?
హిమశ్రీ మరణానికి ముందు నృత్య బృందంలో పారితోషికం చెల్లింపునకు సంబంధించి వివాదం తలెత్తినట్లు అస్సాంలోని దిమోరియా శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ తపన్ దాస్ పేర్కొన్నారు.
విశాఖలో కార్యక్రమ నిర్వాహకుల నుంచి తమకు రావాల్సిన పారితోషికాన్ని అడిగినందుకు బృందంలోని ఇద్దరు యువకులపై దాడి జరిగిందని చెప్పినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.
ఆ ఘటన తర్వాత డ్యాన్స్ బృందం తాము ఉంటున్న హాస్టల్ నుంచి వెళ్లిపోయి రైల్వే స్టేషన్‌కు చేరుకుందని ఆయన వివరించారు.
దాడికి గురైన యువకుల్లో ఒకరు హిమశ్రీకి వివేక్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు సహాయం చేశారని, ఈ విషయం స్టేషన్ సీసీటీవీ దృశ్యాల్లో కనిపించిందని కూడా ఆయన పేర్కొన్నారు.
అయితే, పారితోషికం వివాదానికి, హిమశ్రీ మరణానికి మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే విషయం ఇంకా నిర్ధరణ కాలేదు.
ఈ ఆరోపణలపై కార్యక్రమ నిర్వాహకుల స్పందన, పోలీసుల విచారణలో వెల్లడైన వివరాలు తెలియాల్సి ఉంది.
హిమశ్రీ బోరో దిమోరియా శాసనసభ నియోజకవర్గానిక చెందిన వారే.

ఫొటో సోర్స్, x.com/himantabiswa
దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలు
ఈ కేసులో శ్రీకాకుళం జిల్లా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (ఎస్ఐటీ) ఏర్పాటు చేశారు.
ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి నేతృత్వంలో పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.
నలుగురు ఆర్పీఎఫ్ సిబ్బంది కూడా విచారణలో పాల్గొంటున్నారు.
ఘటనాస్థలాన్ని ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, డ్రోన్ బృందాలు పరిశీలించాయి.
విశాఖపట్నం రైల్వే స్టేషన్ సీసీటీవీ దృశ్యాలు, హిమశ్రీ ఫోన్ కాల్ రికార్డులు, ప్రయాణ వివరాలు, స్నేహితురాలికి పంపిన వీడియోను పోలీసులు పరిశీలిస్తున్నారు.
రైలులో మద్యం తాగినట్లు హిమశ్రీ చెప్పిన వ్యక్తులను గుర్తించి విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదును కూడా దర్యాప్తులో భాగంగా పరిగణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్- అస్సాం పోలీసుల మధ్య సమన్వయంతో విచారణ కొనసాగుతోంది.
హిమశ్రీ మరణం ప్రమాదవశాత్తూ జరిగిందా, ఎవరైనా కారణమయ్యారా అనే ప్రశ్నలకు ఇంకా స్పష్టమైన సమాధానం లభించలేదని దీనిపైనే దర్యాప్తు కొనసాగుతోందని అస్సాం ఐజీ శివప్రసాద్ తెలిపారు.
హిమశ్రీ బోరో మరణంపై సమగ్ర, నిష్పక్షపాత, కాలపరిమితితో కూడిన దర్యాప్తు జరపాలని కోరుతూ అక్టోబర్ 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌లకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వేర్వేరుగా లేఖలు రాశారు.
హిమశ్రీ రైలు ప్రయాణం, ఆమె అదృశ్యం కావడం, అనంతరం మృతదేహం లభించిన పరిస్థితులపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























