యువత ఆగ్రహం ఎవరి మీద? ఎన్నికల సంఘంపైనా, మోదీ పైనా?

దిల్లీ, సీజేపీ నిరసనలు, జంతర్‌ మంతర్, భారత ఎన్నికల సంఘం, అభిజిత్ దీప్కే, జ్ఞానేశ్ కుమార్, నరేద్ర మోదీ
ఫొటో క్యాప్షన్, దిల్లీలో నిరసన తెలుపుతున్న యువతిని అదుపులోకి తీసుకుంటున్న భద్రతా సిబ్బంది
ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

2026లో యువత చేపట్టిన నిరసనలు కేవలం ఉద్యోగాలు, పరీక్షలకే పరిమితం కాలేదు. పరీక్షలు, ఉద్యోగాల అంశాలతో మొదలైన యువత ఆందోళనలు ఇప్పుడు ఓటరు జాబితా, ఎన్నికల సంఘం అంశాల వరకు విస్తరించాయి.

వీటిపై యువజన సంఘాలు, ప్రతిపక్షాలు కూడా నిరసనలు చేపడుతున్నాయి.

ఇప్పుడు యువత ఏయే సమస్యలపై రోడ్డెక్కుతోంది? ఎందుకు ఆందోళన చేస్తోంది? అనేది ప్రశ్న

ఉద్యోగాల సమస్యతో మొదలైన ఆందోళనలు ఇప్పుడు వ్యవస్థపై నమ్మకం అనే అంశానికి చేరుకున్నాయా? పరీక్షలు, ఎన్నికలు రెండూ న్యాయంగా జరుగుతున్నాయా లేదా అనే ప్రశ్న ముందుకు వస్తోందా?

లేకపోతే, వేర్వేరు అంశాలపై జరుగుతున్న ఆందోళనలను విశ్లేషకులు ఒకే ఉద్యమంగా చూస్తున్నారా?

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇది ప్రభుత్వానికి కూడా ఎదురయ్యే ప్రశ్నే. ప్రతి నిరసనను కేవలం రాజకీయ ప్రేరణతో జరిగిందని లేదా ప్రతిపక్ష రాజకీయంగా మాత్రమే చూడటం సరైందేనా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు ఉన్న ప్రశ్న కూడా ఇదే. ఇన్ని సంవత్సరాలుగా ఆయనకు ఉన్న ప్రజా మద్దతు తగ్గుతోందా? భవిష్యత్తులో ఓటర్లుగా మారనున్న యువతను ఆకర్షించడం బీజేపీకి సవాలుగా మారుతోందా?

ఈ అన్ని అంశాలను పరిశీలించేందుకు సీఎస్డీఎస్‌కు చెందిన రాజకీయ విశ్లేషకుడు సంజయ్ కుమార్, బీజేపీ నాయకుడు ప్రొఫెసర్ గౌరవ్ వల్లభ్, అలాగే రాజకీయ విశ్లేషకురాలు నీర్జా చౌధరితో కలెక్టివ్ న్యూస్‌రూమ్ డైరెక్టర్ ఆఫ్ జర్నలిజం ముకేశ్ శర్మ మాట్లాడారు.

'ఈ ప్రభుత్వం ప్రజల మాట వినడం లేదు'

ఉద్యోగాలు, ఇతర అంశాల విషయంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కసారిగా వచ్చినవి కావు. ఇవి గత 10-15 ఏళ్లుగా, అంతకంటే ముందు నుంచే ఉన్నాయి. కానీ ఇప్పుడు వరుసగా ఆందోళనలు జరుగుతున్నాయి. యువత కోణంలో చూస్తే, ఏం మారింది? లేదా ఇప్పుడు ఏం మారుతోంది?

దీనికి సమాధానంగా "మీకు లేదా దేశానికి ఎదురవుతున్న అతి పెద్ద సమస్య ఏంటి?" అనే ప్రశ్న గత 30-35 ఏళ్లుగా నిర్వహిస్తున్న సర్వేల్లో తప్పకుండా అడుగుతారని సంజయ్ కుమార్ చెప్పారు.

ప్రతి సర్వేలోనూ నిరుద్యోగం ప్రధాన సమస్యగా కనిపిస్తుందని ఆయన చెబుతున్నారు. "ఉద్యోగాలు లేకపోవడమే పెద్ద సమస్య" అని యువత చెబుతుందని ఆయన అన్నారు.

అందుకే, దిల్లీతోపాటు దేశంలోని వివిధ నగరాల్లో ఇంత పెద్ద ఎత్తున నిరసనలు ఒక్కసారిగా మొదలయ్యాయని చెప్పడం సరైంది కాదంటున్నారు సంజయ్ కుమార్.

దిల్లీ, సీజేపీ నిరసనలు, జంతర్‌ మంతర్, భారత ఎన్నికల సంఘం, అభిజిత్ దీప్కే, జ్ఞానేశ్ కుమార్, నరేద్ర మోదీ
ఫొటో క్యాప్షన్, దిల్లీలో నిరసన తెలుపుతున్న యువతిని అదుపులోకి తీసుకుంటున్న భద్రతా సిబ్బంది

యువత మాత్రమే కాదు, వివిధ రంగాల్లో పని చేస్తున్నవారు, సాధారణ ప్రజల్లో కూడా ప్రభుత్వం తమ మాట వినడం లేదనే భావన పెరుగుతోందని సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

దీని ఫలితంగానే దిల్లీతోపాటు ఇతర నగరాల వీధుల్లో ప్రజల ఆగ్రహం కనిపిస్తోందని ఆయన అంటున్నారు.

అయితే అధికార బీజేపీకి చెందిన ప్రొఫెసర్ గౌరవ్ వల్లభ్ మాత్రం వేరే అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యార్థులకు కొన్ని సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం వాటిని విన్నదని, అంగీకరించిందని చెప్పారు. నిజమైన సమస్యల పరిష్కారం కోసం ఒక శక్తివంతమైన కమిటీని ఏర్పాటు చేసి, వాటిని పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు.

దీంతోపాటు, కొన్ని రాజకీయ పార్టీలు ప్రజల అసంతృప్తిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నాయని కూడా ఆయన అన్నారు.

"ఇది భారత యువత. వాళ్లకు అన్ని విషయాలు తెలుసు. వారు తప్పుదారి పట్టరు. దేశ అభివృద్ధిని అడ్డుకోవాలనుకునే వారి విషయంలో, అలాంటి భావజాలం కలిగిన వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి" అని అభిప్రాయపడ్డారు.

పరిస్థితులు మారుతున్నట్టు కనిపిస్తున్నాయనీ, అటల్ బిహారీ వాజ్‌పేయి కాలం నుంచి మధ్యతరగతి వర్గం బీజేపీకి బలమైన మద్దతుదారుగా ఉన్నా, ఇప్పుడు ఆ వర్గంలో అసంతృప్తి కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకురాలు నీర్జా చౌధరి అంటున్నారు. నరేంద్ర మోదీ ఒక ప్రత్యేక రాజకీయ శక్తిగా నిలిచినా, ఇప్పుడు రాజకీయంగా ఒక కీలక మలుపు దగ్గరపడుతున్నట్టు అనిపిస్తోందని ఆమె తెలిపారు.

ఓటు హక్కు కోల్పోతే, లేదా వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిస్తే, పేదలకు ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా లభించే ప్రయోజనాలు కూడా ఆగిపోతాయనే భయం ఉందని, ఇది ప్రజలకు పెద్ద ఆందోళనగా మారిందని ఆమె చెబుతున్నారు.

"నాకు సమస్యలు ఉన్నా, నాకు రావాల్సిన హక్కులు లేదా ప్రయోజనాలు అందకపోయినా, ఆ ప్రభుత్వాన్ని మార్చేందుకు నేను ఓటు కూడా వేయలేని పరిస్థితి వస్తుంది, ముఖ్యంగా సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాల్లో, ఓటు హక్కు విషయంలో ఏదో జరుగుతోందనే అనుమానం, ఆందోళన పెరుగుతోంది. ఇదే ప్రజలను కలవరపెడుతోంది" అని ఆమె అన్నారు.

దిల్లీ, సీజేపీ నిరసనలు, జంతర్‌ మంతర్, భారత ఎన్నికల సంఘం, అభిజిత్ దీప్కే, జ్ఞానేశ్ కుమార్, నరేద్ర మోదీ
ఫొటో క్యాప్షన్, దిల్లీలో నిరసన తెలుపుతున్న యువత

'వాళ్లు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచాలని కోరుకుంటున్నారు'

జంతర్ మంతర్‌లో జరుగుతున్న నిరసనలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నాలపై ప్రశ్నలు వస్తున్నాయి. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి చర్యలు ఎంత వరకు సమంజసం?

అయితే, ప్రతి యువకుడికి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పూర్తి హక్కు ఉందని గౌరవ్ వల్లభ్ అన్నారు. తమ సమస్యలను లేవనెత్తాలని, నిర్మాణాత్మక చర్చలు, వాదోపవాదాలు జరపాలని, తమ అభిప్రాయాలను చెప్పాలని సూచించారు. అలాంటి సూచనలను ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుని అమలు చేస్తుందని ఆయన చెప్పారు.

"నేను ఎవరి గురించి ప్రత్యేకంగా వ్యాఖ్యానించడం లేదు. సీజేపీలో ఉండే యువతను కూడా నేను చెప్పేది ఒక్కటే. మీరు మీ ఆందోళనలను వ్యక్తం చేశారు. మేం మిమ్మల్ని పిలిచి మాట్లాడాం. ఇప్పుడు మీ వేదికను భారత్ వ్యతిరేక శక్తులు ఉపయోగించుకునేలా అనుమతించొద్దు" అన్నారు గౌరవ్ వల్లభ్.

‘సర్’ పై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కూడా విచారణ జరుగుతోందని ఆయన చెప్పారు. అలాగే రాజకీయ పార్టీల అభిప్రాయాలు, ఫిర్యాదులు వినేందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని కూడా తెలిపారు.

"ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం చేసి, కన్నాట్ ప్లేస్‌లోని ఖరీదైన హోటళ్లలో తిని రోడ్లపైకి వచ్చి అల్లర్లు సృష్టించడం సరైంది కాదు. రాజ్యాంగ సంస్థలను దూషించడం, వాటిని బలహీనపర్చే ప్రయత్నం చేయడం కూడా తప్పు. కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? వారికి రాజ్యాంగ సంస్థల పట్ల నిజమైన ఆసక్తి లేదు. వారు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచాలనుకుంటున్నారు" అని అన్నారు.

దిల్లీ, సీజేపీ నిరసనలు, జంతర్‌ మంతర్, భారత ఎన్నికల సంఘం, అభిజిత్ దీప్కే, జ్ఞానేశ్ కుమార్, నరేద్ర మోదీ
ఫొటో క్యాప్షన్, దిల్లీలో నిరసన తెలుపుతున్న యువతిని అదుపులోకి తీసుకుంటున్న భద్రతా సిబ్బంది

రాజకీయ విశ్లేషకురాలు నీర్జా చౌధరి ఈ మొత్తం వ్యవహారాన్ని మరో కోణంలో చూస్తున్నారు. ఆమె అభిప్రాయం ప్రకారం, పరిస్థితులు మారుతున్నాయి. జూన్, జూలై నెలల్లో జరిగిన నిరసనలు, అలాగే జూలై 20న పార్లమెంట్ ముందు జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత ప్రభుత్వంపట్ల ప్రజల్లో ఉన్న భయం క్రమంగా తగ్గుతున్నట్టు కనిపిస్తోందని అన్నారు.

ప్రజలతోపాటు ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ కూడా ఈ ఉద్యమాలకు మద్దతుగా నిలుస్తూ ముందుకు వస్తోందని నీర్జా పేర్కొన్నారు.

"రాహుల్ గాంధీ అరెస్టుకు కూడా సిద్ధంగా ఉంటూ, రోడ్లపై పడుకొని నిరసనలు చేస్తున్నారు. ఇతర ప్రతిపక్షాలు కూడా వీధుల్లోకి వచ్చి ఆందోళనల్లో పాల్గొంటున్నాయి" అని ఆమె అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ రెండు ప్రధాన శిబిరాలకు దూరంగా ఉన్న నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతా దళ్ కూడా ఈ ఉద్యమంలో చేరింది. అలాగే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కూడా ఇందులో భాగమైంది.

"ఇలా ఒక్కో పార్టీ, ఒక్కో వర్గం చేరుతూ ఈ ఉద్యమం క్రమంగా పెద్దదవుతోంది" అని నీర్జా చౌధరి అన్నారు.

అయితే సంజయ్ కుమార్ ఈ విషయాన్ని మరో విధంగా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశాలు ప్రధాన చర్చగా ఉన్నప్పటికీ, ఎన్నికలు వచ్చే నాటికి ఇదే రాజకీయ పార్టీలు నిరసనల నుంచి దృష్టి మళ్లించి ఎన్నికల ప్రచారంపై దృష్టి పెడతాయని అంటున్నారు. ఎందుకంటే చివరకు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది.

ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ అంశాలు క్రమంగా వెనక్కి వెళ్లిపోతాయని, ఆ సమయంలో ఎన్నికలకు సంబంధించిన అంశాలే ప్రధాన చర్చనీయాంశం అవుతాయని పేర్కొన్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించి రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన వారిలో చాలా మంది బీజేపీ ఓటర్లు కూడా ఉండవచ్చు. కానీ పోలింగ్ రోజున ఒకే అంశాన్ని బేస్ చేసుకొని ఓటు వేసే పరిస్థితి ఉండకవచ్చు.

వారి ముందు చాలా ముఖ్యమైన అంశాలు ఉంటాయి. కాబట్టి ఓటు వేయాల్సిన సమయంలో ఈ ఒక్క సమస్యను మాత్రమే కాకుండా ఇతర విషయాలు కూడా పరిగణలోకి తీసుకొని ఓటు వేయవచ్చు.

దిల్లీ, సీజేపీ నిరసనలు, జంతర్‌ మంతర్, భారత ఎన్నికల సంఘం, అభిజిత్ దీప్కే, జ్ఞానేశ్ కుమార్, నరేద్ర మోదీ
ఫొటో క్యాప్షన్, దిల్లీలో నిరసన తెలుపుతున్న యువతిని అదుపులోకి తీసుకుంటున్న భద్రతా సిబ్బంది

'ఓటు ప్రాధాన్యత కాపాడేందుకు పోరాటం'

ఇప్పుడు జరుగుతున్న పోరాటాలు ప్రభుత్వం వ్యతిరేకతంగా చూడాలా? వ్యవస్థలపై అసంతృప్తిగా భావించాలా?

దీనిపై స్పందించిన సంజయ్ కుమార్ " ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నట్టు అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే సంకేతాలు నాకు కనిపించడం లేదు. అలాగే సంస్థలపై కోపం ఉందా అనే ప్రశ్న వస్తే, దేశాన్ని నడిపేందుకు ఎన్నో సంస్థలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఏదైనా అసంతృప్తి కనిపిస్తే, అది ప్రధానంగా ఎన్నికల సంఘం పట్లే కనిపిస్తోంది" అని అన్నారు.

"మొత్తంగా చూస్తే ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఒకే అంశంపై కేంద్రీకృతమైంది. ‘సర్’ ప్రక్రియలో ఎన్నికల సంఘం ఓటర్ల పేర్లను చేర్చడం, తొలగించడం వంటి పనులు సక్రమంగా చేసిందా లేదా అనేదే ప్రధాన ప్రశ్న. ప్రస్తుతం కనిపిస్తున్న ఆగ్రహం, అసంతృప్తి ప్రభుత్వ పనితీరు లేదా ఇతర సంస్థలపై కాకుండా, ప్రధానంగా ఎన్నికల సంఘం వైపే మళ్లినట్టు కనిపిస్తోంది" అని అభిప్రాయపడ్డారు.

అయితే, ఈ నిరసనల ప్రభావం చాలా విస్తృతంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆందోళనల్లో పాల్గొంటున్న తరం గతం కంటే భిన్నమైందని నీర్జా చౌధరి అంటున్నారు.

"ఈ కొత్త తరం, ముఖ్యంగా చదువుకున్న మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి యువత ప్రశ్నించడం నేర్చుకుందని నాకు అనిపిస్తోంది. వారు ప్రశ్నలు అడుగుతున్నారు. సంప్రదాయంగా ఉన్న అభిప్రాయాలను సవాలు చేస్తున్నారు. అయితే ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఏబీవీపీకి చెందిన యువతకు ప్రశ్నించడం నేర్పించలేదేమో? వారికి నిర్దేశించిన మార్గంలోనే నడవాలని చెబుతారేమో" అని ఆమె అన్నారు.

"ఆ యువత మాట వినండి. వారు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. దేశ భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తున్నారు. అందుకే రోడ్లపైకి వస్తున్నామని చెబుతున్నారు. అరెస్టు చేస్తే చేసుకోండి. ప్రభుత్వం ఏం చేయాలనుకుంటే అది చేయనీ. కానీ మా గళం వినిపిస్తాం. ఓటు హక్కు పవిత్రతను కాపాడేందుకు పోరాడుతామని అంటున్నారు" అని ఆమె పేర్కొన్నారు.

విద్య, ఆరోగ్యం, పరీక్షల వ్యవస్థలో సీజేపీ సంస్కరణలు కోరుతోంది. ప్రస్తుతం అది రాజకీయ పార్టీ కాదు, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ఒత్తిడి వర్గంగా పని చేస్తోంది. దీనికి ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా మద్దతు ప్రకటించాయి అని అన్నారు.

దిల్లీ, సీజేపీ నిరసనలు, జంతర్‌ మంతర్, భారత ఎన్నికల సంఘం, అభిజిత్ దీప్కే, జ్ఞానేశ్ కుమార్, నరేద్ర మోదీ
ఫొటో క్యాప్షన్, దిల్లీలో నిరసన తెలుపుతున్న యువతను అదుపులోకి తీసుకుంటున్న భద్రతా సిబ్బంది

దీని ప్రభావం ఎలా ఉంటుంది?

"ఈ ఆందోళనల ప్రభావం అన్ని సంస్థలపైనా పడుతుందని భావిస్తున్నాను. ప్రజలు శాంతియుతంగా రోడ్లపైకి వస్తున్న కొద్దీ, అధికారులు కూడా అప్రమత్తమవుతారు. రాజకీయ పార్టీలు కూడా జాగ్రత్త పడతాయి. అలాగే న్యాయవ్యవస్థ కూడా ఈ పరిస్థితుల్లో తన పాత్ర ఏంటన్న దానిపై మరింత సీరియస్‌గా ఆలోచించే పరిస్థితి ఏర్పడవచ్చు" అని నీర్జా చౌధరి చెప్పారు.

"ఈ ప్రక్రియలన్నీ ఒకేసారి కొనసాగుతున్నాయి. ఇవి చివరకు ఎక్కడికి దారి తీస్తాయో, ఎలా ముగుస్తాయో ఇప్పుడే చెప్పడం చాలా కష్టం. అయితే ప్రస్తుతం ఇది బీజేపీకి పెద్ద సవాలుగా మారిందని నేను భావిస్తున్నాను" అని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)