‘‘నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోవడం మీ దేశానికే మచ్చ’’ అంటూ నార్వేపై ట్రంప్ విమర్శలు

డోనల్డ్ ట్రంప్, నోబెల్ శాంతి బహుమతి
ఫొటో క్యాప్షన్, గతేడాది కూడా తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంపై ట్రంప్ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
    • రచయిత, ట్యాబి విల్సన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

నోబెల్ శాంతి బహుమతిని తనకు ప్రకటించకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది బహుమతి కోసం చేసిన ఎంపికను "అవమానకరం, ఇబ్బందికరం" అని విమర్శించారు.

భారతీయ మూలాలున్న అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు మాజీ న్యాయమూర్తి నవీ పిళ్లైకి శుక్రవారం ఈ బహుమతిని ప్రకటించారు. ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడిన ట్రంప్, సదరు వ్యక్తి గురించి తాను ఎప్పుడూ వినలేదని అన్నారు.

"ఇది నార్వే దేశానికి చెరగని మచ్చ" అని వ్యాఖ్యానించిన ఆయన "మేం దీన్ని మర్చిపోం" అని అన్నారు.

నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోవాలన్న తన ఆకాంక్షను ట్రంప్ బహిరంగంగానే వ్యక్తం చేస్తూ వచ్చారు. 2025లో వెనెజ్వెలా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోకు ఈ బహుమతి ప్రకటించినప్పుడు కూడా ఆయన ఇలాంటి విమర్శలే చేశారు.

నోబెల్ శాంతి బహుమతిని ఎవరికి ఇవ్వాలనేది నార్వేలో ఉన్న స్వతంత్ర కమిటీ నిర్ణయిస్తుందని, నార్వే ప్రభుత్వం కాదని గతేడాది నార్వే ప్రధానమంత్రి జోనాస్ గార్ స్టోరే ట్రంప్‌కు వివరించారు..

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డోనల్డ్ ట్రంప్, నోబెల్ శాంతి బహుమతి
ఫొటో క్యాప్షన్, ఐక్యరాజ్యసమితి హ్యూమన్ రైట్స్ చీఫ్‌గా, అంతర్జాతీయ న్యాయస్థానం మాజీ న్యాయమూర్తిగా పనిచేసారు పిళ్లై

న్యూయార్క్‌లోని సిరాక్యూస్‌లో జరిగిన ర్యాలీలో తన మద్దతుదారులతో మాట్లాడిన ట్రంప్, తాను ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని, మరో రెండు యుద్ధాలను పరిష్కరించబోతున్నానని లేదా వాటిలో విజయం సాధించబోతున్నానని మరోసారి పేర్కొన్నారు. అయితే, తన వాదనలకు ఆయన ఎలాంటి ఆధారాలనూ చూపలేదు.

"ప్రజాస్వామ్య వ్యతిరేకులు, నాగరికతకు నిజమైన శత్రువులైన కొందరు తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తుల వల్ల నోబెల్ శాంతి బహుమతి శాశ్వతంగా విశ్వసనీయతను కోల్పోయింది" అని ట్రంప్ అన్నారు.

ఐక్యరాజ్యసమితి హ్యూమన్ రైట్స్ చీఫ్, అంతర్జాతీయ న్యాయస్థానం మాజీ న్యాయమూర్తిగా పనిచేసిన పిళ్లైకి "శాంతి, అంతర్జాతీయ చట్టాలను ప్రోత్సహించేందుకు చేసిన కృషికి గాను" ఈ పురస్కారం ప్రకటించినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ఆమె కృషి మరింత మెరుగైన ప్రపంచ న్యాయ వ్యవస్థకు మార్గం సుగమం చేసిందని పేర్కొంది.

యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలు, మారణహోమాలకు పాల్పడినవారిపై విచారణ జరిగేలా చూడటంలో దక్షిణాఫ్రికాకు చెందిన పిళ్లై కృషి కీలక పాత్ర పోషించిందని నార్వే నోబెల్ కమిటీ అధ్యక్షుడు యోర్గెన్ వాట్నే ఫ్రైడ్నెస్ అన్నారు.

ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే, న్యూరెంబర్గ్‌లోని న్యాయ భవనం నుంచి స్పందించిన 85 ఏళ్ల పిళ్లై, "ఇది ఏదో జోక్ అయి ఉండాలి" అని అన్నారు. తనను అభినందించేందుకు అక్కడ గుమిగూడిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

"మీరు ఇంకాస్త గట్టిగా చప్పట్లు కొడితే, ఈ బహుమతిని ట్రంప్‌తో పంచుకోవచ్చేమో" అని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు.

గత ఏడాది తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంపై ట్రంప్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో శాంతి కంటే రాజకీయాలకే నోబెల్ కమిటీ ప్రాధాన్యం ఇచ్చిందని వైట్‌హౌస్ ఆరోపించింది.

ఈ ఏడాది జనవరిలో వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో మచాడో తన నోబెల్ పతకాన్ని ట్రంప్‌కు బహూకరించారు. తన దేశం స్వేచ్ఛ కోసం ట్రంప్ చూపిన నిబద్ధతకు గుర్తింపుగా ఈ పతకాన్ని అందించినట్లు ఆమె తెలిపారు.

ఈ చర్యను "పరస్పర గౌరవానికి అద్భుతమైన సంకేతం"గా ట్రంప్ సోషల్ మీడియాలో అభివర్ణించారు.

అయితే, నోబెల్ బహుమతిని మరొకరికి బదిలీ చేయడం సాధ్యం కాదని నోబెల్ కమిటీ ఆ తర్వాత స్పష్టం చేసింది.

"ఒకసారి నోబెల్ బహుమతిని ప్రకటించిన తర్వాత దాన్ని రద్దు చేయడం, ఇతరులతో పంచుకోవడం లేదా మరొకరికి బదిలీ చేయడం సాధ్యం కాదు. కమిటీ నిర్ణయం అంతిమమైంది. అది శాశ్వతంగా అమల్లో ఉంటుంది" అని ఒక ప్రకటనలో తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)