లైవ్, బీజేపీ వ్యతిరేక ఓట్లనే తొలగిస్తున్నారు: రేవంత్ రెడ్డి

బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అమలుచేసిన రాష్ట్రాలలోనే ఆ పార్టీ గెలిచిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

సారాంశం

  • నేడు సుప్రీంకోర్టుకు పాదయాత్రగా వెళ్లి ప్రధాన న్యాయమూర్తికి వినతి పత్రం సమర్పించనున్నట్టు విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు.
  • భద్రతా కారణాలతో సోమవారం నాడు ఆరు మెట్రో స్టేషన్లను దాదాపు 10 గంటల పాటు మూసివేయనున్నట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ప్రకటించింది.
  • నేపాల్‌లోని మధ్య ప్రాంతంలో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరదల ధాటికి ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి.
  • నేపాల్‌లో అతిపెద్ద, సుదీర్ఘమైన పండుగ దశైన్‌ తొలి రోజు వేడుకలకు చిన్నారులు, స్థానికులు సిద్ధమవుతున్న సమయంలో గోర్ఖా జిల్లాలో ఈ వరదలు సంభవించాయి. వరదల్లో చిక్కుకున్న సుమారు 50 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
  • జిబూటి తీరంలో పడవ మునిగిపోవడంతో కనీసం 139 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారని, అందులో 15 మంది పిల్లలున్నారని ఐక్యరాజ్యసమితి వలసల విభాగం తెలిపింది.
  • పలువురి ఆచూకీ ఇంకా తెలియడం లేదని సంస్థ తెలిపింది.

లైవ్ కవరేజీ

  1. బీజేపీ వ్యతిరేక ఓట్లనే తొలగిస్తున్నారు: రేవంత్ రెడ్డి

    కాంగ్రెస్ తెలంగాణ, రేవంత్ రెడ్డి
    ఫొటో క్యాప్షన్, సోమవారం జరగనున్న ర్యాలీ కోసం దిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

    బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అమలుచేసిన రాష్ట్రాలలోనే ఆ పార్టీ గెలిచిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

    సోమవారం జరగనున్న కాంగ్రెస్ పాదయాత్ర కోసం దిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

    "ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకిస్తున్నది ఎవరంటే..దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మైనార్టీలు, యువత. బీజేపీని ఓడించాలనుకున్న ప్రజల ఓటు హక్కును తొలగించడానికి కుట్ర చేశారు. జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కమిషన్ సభ్యులు చెప్పారు. తప్పులు జరుగుతున్నాయని తెలిసినపుడు, ఆ అధికారిని తొలగించడానికి మోదీకి అభ్యంతరం ఏమిటి?, ఆయనకు అండగా ఎందుకు నిలబడుతున్నారు" అని రేవంత్ రెడ్డి అన్నారు.

  2. ఒమన్‌ సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న ట్యాంకర్‌పై డ్రోన్‌ దాడి

    ఒమన్, భారత నౌకలపై డ్రోన్ దాడి
    ఫొటో క్యాప్షన్, ఇద్దరు భారతీయులు గల్లంతైనట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ఆదివారం రాత్రి ధ్రువీకరించారు (ప్రతీకాత్మక చిత్రం).

    ఒమన్‌ సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న ట్యాంకర్‌పై ఆదివారం డ్రోన్‌ దాడి జరిగింది. నౌకలో ఉన్న 11 మంది భారతీయ నావికుల్లో తొమ్మిది మందిని రక్షించగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఇద్దరు నావికులు కనిపించకుండా పోయిన విషయాన్ని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ఆదివారం రాత్రి ధ్రువీకరించారు.

    "అక్టోబర్ 11న సోహార్ యాంకరేజ్ వద్ద భారతీయ ట్యాంకర్ ఎం.టి. పెట్రో డాల్ఫిన్‌పై డ్రోన్ దాడి జరిగింది. ట్యాంకర్‌పై 11 మంది భారతీయ నావికులు ఉన్నారు. తొమ్మిది మందిని రక్షించారు, ఇద్దరు గల్లంతయ్యారు" అన్నారు.

    స్థానిక తీర రక్షక దళం గాలింపు, సహాయక చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు.

    గల్లంతైన వారిని గుర్తించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సహాయక చర్యలకు పూర్తి మద్దతు అందించేందుకు సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని సర్బానంద సోనోవాల్‌ పేర్కొన్నారు.

  3. విపక్ష ఎంపీలతో భేటీకి సీజేఐ సూర్యకాంత్ నిరాకరణ

    సీజేపీ, ప్రతిపక్షాలు
    ఫొటో క్యాప్షన్, ప్రతిపక్ష పార్టీల ఎంపీలను కలవకపోవడానికి సీజేఐ కొన్ని కారణాలు చెప్పారు (ఫైల్ ఫోటో).

    విపక్ష పార్టీల ఎంపీలతో సమావేశమయ్యేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ నిరాకరించారు. వారిని కలవలేకపోవడానికి కొన్ని కారణాలను సీజేఐ వివరించినప్పటికీ, లేఖ గోప్యతను దృష్టిలో ఉంచుకుని వాటిని బహిర్గతం చేసేందుకు నిరాకరించారు.

    “విపక్ష నేతల లేఖ నాకు నిన్న అందింది. దానికి నిన్న రాత్రే సమాధానం ఇచ్చాను. కొన్ని కారణాలను వివరిస్తూ వారిని కలవలేనని తెలియజేశాను” అని సీజేఐ సూర్యకాంత్ సోమవారం మీడియాతో చెప్పారు.

    ‘వన్ నేషన్‌–వన్‌ ఎలక్షన్‌’పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సుప్రీంకోర్టు పర్యటన రద్దు కావడంపై కూడా సీజేఐని ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ.. “ఆ విషయంలో కోర్టులో విరుద్ధ ప్రయోజనాల (కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. అందుకే, మేం దీనిపై చర్చించాం. ఎలాంటి విరుద్ధ ప్రయోజనాలకైనా దూరంగా ఉండాలని నా సీనియర్ న్యాయ సహచరులు, నేను ఒకే అభిప్రాయానికి వచ్చాం” అని తెలిపారు.

    సీజేఐను కలిసేందుకు సమయం కోరుతూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి లేఖ రాసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం తెలిపారు.

  4. 24 గంటల్లోగా నిరసనకు అనుమతి ఇవ్వకపోతే మరో ఆందోళన: సీజేపీ

    కాక్రోచ్ జనతా పార్టీ, దిల్లీ
    ఫొటో క్యాప్షన్, జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు తేదీ ఖరారు చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నట్లు సీజేపీ తెలిపింది.

    దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు పోలీసులు 24 గంటల్లోగా అనుమతి ఇవ్వకపోతే మరో ఆందోళనకు పిలుపునిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రకటించింది.

    సీజేపీ అధికారిక ఎక్స్ ఖాతాలో తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం ఉదయం 10 గంటలకు పార్టీ సహ కన్వీనర్లు ఆశుతోష్ రాంకా, సౌరవ్ దాస్, సీజేపీ లీగల్ హెడ్ రత్నా సింగ్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు.

    జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు తేదీ ఖరారు చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నట్లు సీజేపీ తెలిపింది.

    “మా శాంతియుత నిరసనకు తేదీ ఖరారు చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్‌కు వెళ్తాం. దిల్లీ పోలీసులు 24 గంటల్లోగా తేదీని కేటాయించాలి. లేకపోతే మేమే నిరసన తేదీని ప్రకటిస్తాం” అని పేర్కొంది.

  5. నేహా బోరా గురించి దర్శకుడు దేవా కట్టా ట్వీట్

    దేవా కట్టా, నేహా బోరా
    ఫొటో క్యాప్షన్, దేవా కట్టా

    అఖిల భారత విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా గురించి టాలీవుడ్ దర్శకుడు దేవా కట్టా 'ఎక్స్' వేదికగా స్పందించారు.

    "ఆమెతో మీరు ఏకీభవించవచ్చు, లేకపోవచ్చు... ఆమె పోరాట స్ఫూర్తితో మీరు మమేకం కావచ్చు, కాకపోవచ్చు... కానీ, మన రాజకీయాలు, రాజకీయ నాయకుల నేరపూరిత, నిరంకుశ పోకడలు సాధారణ విషయంగా మారిపోతుండటంపట్ల ఆమె వ్యక్తం చేస్తున్న ఆక్రోశం, ఆగ్రహాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే... అప్పుడు నిజమైన 'యాంటీ-నేషనల్’ మీరే!!" అంటూ ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

  6. నేడు ప్రతిపక్షాల మార్చ్: భద్రతా కారణాలతో దిల్లీలో 6 మెట్రో స్టేషన్లు మూసివేత

    దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్
    ఫొటో క్యాప్షన్, ఆరు మెట్రో స్టేషన్లను దాదాపు 10 గంటల పాటు మూసివేయనున్నట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ప్రకటించింది

    భద్రతా కారణాలతో సోమవారంనాడు ఆరు మెట్రో స్టేషన్లను దాదాపు 10 గంటల పాటు మూసివేయనున్నట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ప్రకటించింది. ఈ స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకలను అనుమతించబోమని డీఎంఆర్‌సీ తెలిపింది.

    “భద్రతా కారణాల దృష్ట్యా 2026 అక్టోబర్ 12న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్‌లను మూసివేస్తాం” అని ఓ ప్రకటనలోపేర్కొంది.

    ఆ తర్వాత భద్రతా సంస్థలు పరిస్థితిని సమీక్షిస్తాయని, అవసరాన్ని బట్టి తదుపరి సమాచారం అందిస్తామని తెలిపింది. అయితే, సంబంధిత అన్ని మెట్రో స్టేషన్లలో రైళ్లు మారేందుకు ప్రయాణికులకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.

    మూసివేసిన ఆరు మెట్రో స్టేషన్లు:

    పటేల్ చౌక్, జన్‌పథ్, రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, బారాఖంబా రోడ్.

    మరోవైపు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు సోమవారం మార్చ్ నిర్వహించనున్నారు.

  7. నేపాల్: గోర్ఖా జిల్లాలో విరుచుకుపడిన వరదలు

    నేపాల్ వరదలు
    ఫొటో క్యాప్షన్, నేపాల్‌లోని గోర్ఖా జిల్లా సల్లారి చుమ్నుబ్రిలో భవనాలను ముంచెత్తుతూ ధ్వంసం చేస్తున్న వరద నీరు.

    నేపాల్‌లోని మధ్య ప్రాంతంలో ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో ఐదుగురు గల్లంతయ్యారు. వరదల ధాటికి ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. గల్లంతైన వారి కోసం అధికారులు ఇంకా గాలిస్తున్నారు.

    నేపాల్‌లో అతిపెద్ద, సుదీర్ఘమైన పండుగ దశైన్‌ తొలి రోజు వేడుకలకు చిన్నారులు, స్థానికులు సిద్ధమవుతున్న సమయంలో గోర్ఖా జిల్లాలో ఈ వరదలు సంభవించాయి. వరదల్లో చిక్కుకున్న సుమారు 50 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.

    తాజా వరదల్లో ప్రాణనష్టంపై అధికారులు ఇంకా ఎలాంటి నిర్ధరణ చేయలేదు. అయితే, ప్రాథమిక సమాచారం ప్రకారం చుమనుబ్రి గ్రామీణ మున్సిపాలిటీ పరిధిలో అత్యధిక నష్టం జరిగింది. కనీసం రెండు గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోగా, పలు వంతెనలు కూడా వరదలకు ధ్వంసమయ్యాయని ఆ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ నిమా లామా తెలిపారు.

    గల్లంతైన ఐదుగురు పశువుల కాపరులని భావిస్తున్నట్లు నిమా చెప్పారు. సుమారు 100 ఆవులు కూడా కనిపించడం లేదని తెలిపారు. గోర్ఖా జిల్లా వ్యాప్తంగా వందలాది మంది నిరాశ్రయులయ్యారని జిల్లా సహాయ ప్రధాన అధికారి నేత్ర ప్రసాద్ శర్మ వెల్లడించారు.

    రెండు నెలల క్రితం ముంచెత్తిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల నుంచే నేపాల్‌ ఇంకా కోలుకోలేదు. ఆ విపత్తులో వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.వేలమంది మరణించగా, మరికొందరు గల్లంతయ్యారు.

  8. జిబూటి తీరంలో పడవ మునగడంతో పిల్లలు సహా 139 మంది మృతి, హఫ్సా ఖలీల్

    జిబూటి తీరం, పడవ మునిగిపోవడం
    ఫొటో క్యాప్షన్, ఓబాక్ ఓడరేవు పట్టణానికి ఉత్తరాన ఉన్న గుహెరె సమీపంలో వలసదారులకు సహాయం చేస్తున్న ఐఓఎం సిబ్బంది

    జిబూటి తీరంలో పడవ మునిగిపోవడంతో కనీసం 139 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారని, అందులో 15 మంది పిల్లలున్నారని ఐక్యరాజ్యసమితి వలసల విభాగం తెలిపింది. పలువురి ఆచూకీ ఇంకా తెలియడం లేదని తెలిపింది.

    305 మందితో జిబూటి నుంచి యెమెన్‌కు బయల్దేరిన పడవ.. గురువారం రాత్రి ఓబాక్ ఓడరేవు పట్టణం సమీపంలో తిరగబడింది.

    ఈ ఘటనలో సుమారు 82 మందిని రక్షించినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) తెలిపింది.

    ఆఫ్రికా ఖండంలోని హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతం నుంచి ఏటా వేలమంది వలసదారులు ప్రాణాలకు తెగించి ఈ ప్రయాణం సాగిస్తున్నారనీ, భద్రత, ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు చేరుకోవాలనే ఆశతో ప్రమాదకరమైన మార్గంలో వెళ్తున్నారని ఐఓఎం తెలిపింది.

  9. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం,

    నేను బీబీసీ ప్రతినిధి వద్ది ప్రభాకర్. మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.