ఆంగ్ సాన్ సూచీ: గృహ నిర్బంధానికి మారుస్తున్నామన్న సైనిక ప్రభుత్వం.. అసలు జీవించి ఉన్నారో లేదో అంటున్న కుమారుడు

ఫొటో సోర్స్, Myanmar state TV
- రచయిత, రాబర్ట్ గ్రీనాల్, జొనాథన్ హెడ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- చదివే సమయం: 3 నిమిషాలు
నిర్బంధంలో ఉన్న మియన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీని హౌస్ అరెస్ట్‌కు మార్చినట్టు అక్కడి ప్రభుత్వ మీడియా తెలిపింది.
2021లో జరిగిన సైనిక తిరుగుబాటు సమయంలో ఆమెను పదవి నుంచి తొలగించిన తర్వాత సైనిక జైలులో ఆమెను నిర్బంధంలో ఉంచారు. నోబెల్ బహుమతి గ్రహీత అయిన సూచీ వయసు 80 ఏళ్లు.
మిగిలిన శిక్షను ఆమె ఇంటి నుంచి అనుభవించేలా మార్పులు చేసినట్టు సైనిక తిరుగుబాటుకు నేతృత్వం వహించిన సైనిక నాయకుడు మిన్ ఆంగ్ హ్లెయింగ్ ప్రకటించారు.
మియన్మార్‌లో ప్రజాస్వామ్య సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత 2015లో ఆంగ్ సాన్ సూచీ అధికారంలోకి వచ్చారు. అంతకుముందు ఆమె దశాబ్దాల మిలటరీ పాలనలో ప్రజాస్వామ్య అనుకూల కార్యకర్తగా ఉన్నారు.
అంతకుముందు 15 ఏళ్లపాటు గృహ నిర్బంధంలో గడిపారు.

‘ఆ ఫోటో ఇప్పటిది కాదు’
ప్రభుత్వ మీడియా విడుదల చేసిన ఫోటోలో యూనిఫాంలో ఉన్న సిబ్బందితో కలిసి ఆమె కూర్చుని ఉన్నట్టు కనిపిస్తోంది.
అయితే ఈ ఫోటోపై ఆమె కుమారుడు కిమ్ ఆరిస్ అనుమానం వ్యక్తంచేశారు. ఆమె జీవించి ఉన్నట్టు కూడా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఈ ఫోటో ‘అర్ధరహితమైనదని’, దాన్ని 2022లో తీశారని చెప్పారు.
''ఇది నిజం కావాలని కోరుకుంటున్నా. ఆమెను తరలించినట్టు ఇప్పటికీ నిజమైన ఆధారాలు కనిపించలేదు'' అని ఆయన బీబీసీతో చెప్పారు.
''కాబట్టి తనతో మాట్లాడడానికి నాకు అనుమతించేంతవరకు లేదా వేరే ఎవరైనా స్వతంత్రంగా ఆమె పరిస్థితిని, ఆమె ఎక్కడున్నారేది పరిశీలించేవరకు నేనేదీ నమ్మను'' అని ఆయన అన్నారు.
ఈ ప్రకటన తప్ప ఆమె ఆరోగ్యం, ఆమె నివసిస్తున్న పరిస్థితుల గురించి ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. చాలా ఏళ్లుగా తల్లి గురించి తనకేమీ తెలియదని కిమ్ ఆరిస్ డిసెంబరులో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా అభిమానులు
ఆంగ్ సాన్ సూచీ గృహనిర్బంధం గురించి తమకు నేరుగా ఎలాంటి సమాచారం అందలేదని ఆమె న్యాయవాదులు రాయిటర్స్‌తో చెప్పారు.
ఆంగ్ సాన్ సూచీ ప్రభుత్వాన్ని కూల్చివేసి, ఆమెను అరెస్టు చేసి అయిదేళ్లు దాటింది. అప్పటినుంచి ఆమె గురించి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.
ఆమె లాయర్లు కూడా ఆమెను చూసి మూడేళ్లు దాటింది. రెండేళ్లకుపైగా సమయం నుంచి కుటుంబసభ్యులకు కూడా ఆమెతో కమ్యూనికేషన్ లేదు.
గురువారం(ఏప్రిల్ 30) విడుదల చేసిన ఫోటోకు ముందు ఆమె చివరిసారిగా కనిపించింది 2021 మేలో కోర్టుకు హాజరయినప్పుడు. ఆ సమయంలో సైన్యం ఆమెపై పలు ఆరోపణలు చేసి విచారణ ప్రారంభించింది. ఆ ఆరోపణలన్నీ నిరాధరణమని తర్వాత తేలింది.
అప్పటినుంచి ఆమె 33ఏళ్ల జైలు శిక్షను అనేకమార్లు తగ్గించారు.
ఆమె పరిస్థితిలో మార్పులు తెచ్చేందుకు బహుశా ఆమెను పాక్షికంగా లేదా పూర్తిగా విడుదల చేసేందుకు మిలటరీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారని ఆ క్రమంలోనే ప్రభుత్వ మీడియాలో ఆమె ఫోటో కనిపించిందని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
అంతర్జాతీయంగా ఉన్న ఒత్తిడికి ముగింపు పలకాలని తిరుగుబాటు నేత మిన్ ఆంగ్ హ్లెయింగ్ ఎదురుచూస్తున్నారు. సాయుధ గ్రూపులపై వరుస విజయాలతో ఆయన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు.
సైనిక ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం ఒక ఎన్నికను కూడా నిర్వహించింది. కానీ ఆ ఎన్నిక కూడా అదే మిలటరీ నాయకులకు అధికారం అప్పగించింది.
తొలిరోజుల్లో నిర్బంధంలో ఉన్న సమయంలో అహింసా పోరాటంతో ఆంగ్ సాన్ సూచీ మియన్మార్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమె తన ఇంటినుంచి మద్దతుదారుల కోసం ప్రసంగాలు చేస్తూ ప్రాముఖ్యం పొందారు. 1991లో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
అయితే 2017లో మియన్మార్ సైన్యం ముస్లిం రోహింజ్యాలపై చేసిన దాడులకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానంలో మియన్మార్ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా ఆమెకున్న ప్రతిష్టను తీవ్రంగా మసకబార్చింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































