జస్టిస్ సుదర్శన్ రెడ్డి: ఉప రాష్ట్రపతి పదవికి విపక్షాల అభ్యర్థిగా తెలంగాణకు చెందిన సుప్రీంకోర్ట్ మాజీ న్యాయమూర్తి

భారత ఉప రాష్ట్రపతి పదవికి ఇండియా కూటమి తరపున అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పేరు ప్రతిపాదించాయి ప్రతిపక్షాలు.
కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటించారు. ఎన్డీయే తరపున తమిళనాడుకు చెందిన సీపీ రాధాకష్ణన్‌తో సుదర్శన్ రెడ్డి పోటీ పడనున్నారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు దగ్గరలోని ఆకులమైలారం గ్రామానికి చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రం చదివారు.
1971లో న్యాయవాద వృత్తి ప్రారంభించారు, పలు ప్రభుత్వ విభాగాలకు న్యాయవాదిగా పని చేశారు. 1995 మే లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.
2005 డిసెంబరులో గువాహటీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2007లో జనవరిలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
2011 జూలైలో ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పదవీ విరమణ చేశారు.
2013లో స్వల్పకాలం గోవా లోకాయుక్తగా పనిచేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటైన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ శాశ్వత ట్రస్టీగా బాధ్యతలు తీసుకున్నారు.
హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీలు నడిపే ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శిగా కూడా కొంతకాలం పనిచేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది


ఫొటో సోర్స్, ANI
సంచలన తీర్పులు, నిర్ణయాలు
సుప్రీం కోర్టు జడ్జిగా సుమారు నాలుగున్నరేళ్ల పదవీ కాలంలో అనేక కీలకమైన తీర్పులను ఇచ్చారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టలకు వ్యతిరేకంగా గిరిజన యువత అక్కడి ప్రభుత్వం మద్దతుతో ఏర్పాటు చేసిన సల్వాజుడుం చట్ట విరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు.
విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కు తెప్పించే విషయంలో కేంద్ర నిర్లక్ష్యంగా ఉందంటూ విమర్శించిన ఆయన, దీనిపై విశ్రాంత సుప్రీం న్యాయమూర్తి ఆధ్వర్యంలో సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను వేయాలని తీర్పునిచ్చారు.
మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న హసన్ అలీని ఈడీ విచారించేలా, సుదర్శన్ రెడ్డి ఉన్న బెంచ్ తీర్పునిచ్చింది.
సైనిక మెడికల్ కాలేజీలో సైనిక కుటుంబాల వారికి మాత్రమే సీట్లిచ్చే నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు.
ఉన్నత న్యాయ స్థానాలకు వచ్చే లేఖలను పిల్‌గా పరిగణించే పద్ధతి, సుమోటో విచారణకు ఆదేశాలపై కూడా కొన్ని నిబంధనలు ఏర్పాటు చేశారు.
రిటైర్ అయిన తరువాత కూడా హైదరాబాద్ కేంద్రంగా పలు ప్రజా సంఘాలతో కలసి వివిధ సామాజిక అంశాలపై మాట్లాడుతుంటారు సుదర్శన రెడ్డి.
పోలీస్ ‘ఎన్‌కౌంటర్’లో దిశ అత్యచారం, హత్య నిందితులు చనిపోయిన సమయంలో, ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా ఆయన బహిరంగంగా మాట్లాడారు. అదే సమయంలో న్యాయ వ్యవస్థలో సంస్కరణలు కావాలని ఆయన చెప్పారు.
న్యూస్ క్లిక్ వ్యవస్థాపకులు ప్రబీర్ పురకాయస్థ రాసిన ‘ది గుడ్ ఫైట్’ పుస్తకం, మావోయిస్టులతో శాంతి చర్చలు సహా పలు అంశాలపై ప్రొఫెసర్ హరగోపాల్ రాసిన పుస్తకం, ప్రముఖ పాత్రికేయులు కె.శ్రీనివాస్ రాసిన ‘అనేక సందర్భాలు’ పుస్తకావిష్కరణ సహా పలు పుస్తకావిష్కరణ సభలకు హాజరై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
లౌకికవాదం, ప్రజాస్వామిక స్ఫూర్తి, ప్రజాస్వామ్యంలో అసమ్మతి, పత్రికా స్వేచ్ఛ, న్యాయ-పోలీసు వ్యవస్థలాంటి పలు అంశాలపై ఆయన మాట్లాడావారు.
తెలంగాణలో ఇటీవల జరిగిన కులగణనను అధ్యయనం చేయడానికి సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో ఒక స్వతంత్ర నిపుణుల వర్కింగ్ గ్రూప్‌ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దానికి అధ్యక్షులుగా పనిచేసిన ఆయన 300 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.
కులగణను జస్టిస్ సుదర్శన్ రెడ్డి సమర్థించారు. అదే సమయంలో 2018లో కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను ఎత్తిచూపుతూ రాసిన ఒక పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఆయన, నాటి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై కొన్ని విమర్శలు కూడా చేశారు.

ఫొటో సోర్స్, X/CPRGUV
ఎన్డీయే అభ్యర్థిది తమిళనాడు.. ఇండియా కూటమి అభ్యర్థిది తెలంగాణ
కాగా బీజేపీ నేతృత్వంలోని పాలక ఎన్డీయే కూటమి ఉప రాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరు ఇప్పటికే ప్రకటించింది.
తమిళనాడు నుంచి ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఉండగా, అదే రాష్ట్రం నుంచి ఇండియా అభ్యర్థి ఉండాలని డీఎంకే కోరినట్టు నిన్న వార్తలు వచ్చాయి.
తిరుచ్చి శివ దాదాపు విపక్షాల అభ్యర్థిగా ఖరారయ్యారని మీడియా అంతా రిపోర్టు చేసింది.
ఈ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో సుదర్శన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














