You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యూజీసీ కొత్త నిబంధనలపై వివాదం ఏంటి? జనరల్ కేటగిరీ వర్గాలు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి?
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నగర మేజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
అయితే తన రాజీనామాకు కారణాల గురించి అలంకార్ అగ్నిహోత్రి ఇచ్చిన వివరణ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త నిబంధనలపై చర్చకు దారి తీసింది. ఉత్తర ప్రదేశ్‌లో 'బ్రాహ్మణ వ్యతిరేక ప్రచారం' జరుగుతోందని ఆయన ఆరోపించారు.
"నా రాజీనామాకు మరో కారణం యూజీసీ నియమాలు. ఇవి ఒక రకంగా జనరల్ కేటగిరీ విద్యార్థులందరూ నేరస్థులని చెబుతున్నాయి. ఈ నియమాలు జనరల్ కేటగిరీకి వ్యతిరేకం" అని అగ్నిహోత్రి అన్నారు.
ఇంతకీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నోటిఫికేషన్‌లో ఏముంది? దీనిపై ప్రజల నుంచి ఎందుకింత స్పందన వస్తోంది?
ఈ నియమాలకు వ్యతిరేకంగా ప్రజలు ఎందుకు సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు? వీటికి వ్యతిరేకంగా వీధుల్లోకి రావాలని కర్ణిసేన వంటి సంస్థలు ఎందుకు నిర్ణయించాయి?
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త నిబంధనల ప్రకారం ప్రతి కాలేజ్, అది ప్రభుత్వ లేదా ప్రైవేట్ కాలేజ్ అయినా ఈక్విటీ సెల్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఈ కమిటీలో ఓబీసీలు, వికలాంగులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మహిళలు ప్రతినిధులుగా ఉంటారు.
ఈ సెల్ కోర్టులాగా పనిచేస్తుంది. విద్యార్థుల్లో ఎవరైనా తమకు వివక్ష ఎదురైందని భావిస్తే వారు ఈక్విటీ సెల్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
ఈ కమిటీ వివక్షకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలిస్తుంది. కమిటీ సిఫార్సులపై ఈక్విటీ సెల్ వెంటనే చర్య తీసుకోవలసి ఉంటుంది.
కొత్త నియమాలు, వివాదం
ఉన్నత విద్యా సంస్థలలో కుల ఆధారిత వివక్షకు తొలగించేందుకు యూజీసీ తన నియమావళిని మరింత కఠినతరం చేసింది.
జనవరి 13న, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రెగ్యులేషన్స్ 2026ను విడుదల చేసింది.
ఇందులో భాగంగా ఉన్నత విద్యా సంస్థలలో సమానత్వాన్ని ప్రోత్సహించడం, విద్యార్థులు ఏ వర్గానికి చెందినవారైనా సరే, వారికి వివక్ష ఎదురు కాకుండా చూడటమే లక్ష్యంగా పెట్టుంది. ఇందులో పేర్కొన్న ప్రకారం...
- మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం, వైకల్యం ఆధారంగా విద్యార్థుల పట్ల వివక్ష చూపకుండా చూసుకోవడం
- ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా బలహీన వర్గాలు, వికలాంగుల పట్ల వివక్షను తొలగించడం.
- ఉన్నత విద్యా సంస్థలలో సమానత్వాన్ని ప్రోత్సహించడం.
ఇందులో పేర్కొన్న దాని ప్రకారం కుల ఆధారిత వివక్ష అంటే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల సభ్యులపై కులం లేదా సమాజం ఆధారంగా వివక్ష చూపడం.
కుల ఆధారిత వివక్ష నిర్వచనంలో ఇతర వెనుకబడిన తరగతులను చేర్చడం వివాదానికి దారి తీసింది.
గతంలో విడుదల చేసిన ముసాయిదాలో కుల ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా కల్పించే రక్షణ పరిధిలో ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే ఉండేవారు.
అయితే ఇప్పుడు అందులో ఓబీసీలను కూడా చేర్చడాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు.
ఇది జనరల్ కేటగిరీకి వ్యతిరేకమనేది వారి వాదన. దీనిని వ్యతిరేకిస్తున్నవారి అభిప్రాయం ప్రకారం ‘‘తాజా నియమావళి ప్రకారం జనరల్ కేటగిరీ విద్యార్థులపై తప్పుడు ఆరోపణలు చేయవచ్చు. దాని వల్ల వారి కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది’’
ఈక్విటీ కమిటీలో జనరల్ కేటగిరీకి ప్రాతినిధ్యం లేదని వాదిస్తున్నారు. జనరల్ కేటగిరీ సభ్యుడు లేకపోవడం వల్ల దర్యాప్తు నిష్పాక్షికంగా జరగదనేది వారి వాదన.
ఈ మార్పు ఎందుకు?
ఉన్నత విద్యా సంస్థల్లో ఓబీసీ విద్యార్థులు వివక్షను ఎదుర్కొంటున్నారని, వారికి రక్షణ కల్పించడం చాలా ముఖ్యమని ప్రభుత్వం చెబుతోంది.
కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ విద్యా కమిటీ ఈ విషయంలో ఒక సిఫార్సు చేసింది.
ఆ సిఫార్సు ఆధారంగా ఓబీసీలకు కూడా వివక్ష నుంచి రక్షణ కల్పించాలని నిర్ణయించారు.
"క్యాంపస్‌లో ఏ రకమైన కుల వివక్షత అయినా తప్పు, భారతదేశంలో చాలామంది విద్యార్థులు ఇప్పటికే దాని పరిణామాలను అనుభవించారు. కానీ చట్టం అందరినీ కలుపుకుపోవాలి. అందరికీ సమానంగా రక్షణ కల్పించాలి కదా? అలాంటప్పుడు చట్టం అమలులో ఈ వివక్ష ఎందుకు? తప్పుడు కేసుల విషయంలో ఏం జరుగుతుంది? తప్పును ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు?" అని శివసేన ( యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
"వివక్షను పదాలు, చర్యలు లేదా అవగాహనల ద్వారా ఎలా నిర్వచించాలి? చట్టాన్ని అమలు చేసే ప్రక్రియ స్పష్టంగా, కచ్చితమైనదిగా, అందరికీ సమానంగా ఉండాలి. క్యాంపస్‌లో ప్రతికూల వాతావరణాన్ని సృష్టించే బదులు, యూజీసీ ఈ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలి లేదా అవసరమైన సవరణలు చేయాలని కోరుతున్నాను" అని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.
బీజేపీ నాయకుడు నిషికాంత్ దూబే ఈ నియమాలను సమర్థించారు.
"ప్రధాన మంత్రి మోదీ స్వయంగా పేద అగ్రవర్ణ సమాజానికి 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. యూజీసీ నోటిఫికేషన్‌లో తప్పుగా భావించాల్సింది ఏముంది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఈ దేశంలో కులం, తరగతి, రంగు, మతం లేదా వర్గం ఆధారంగా వివక్షను వ్యతిరేకిస్తోంది. యూజీసీ నియమావళి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు అలాగే అగ్రవర్ణాలకు సమానంగా వర్తిస్తుంది. ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండవచ్చు. ఇది రాజకీయం కాదు. దేశం రాజ్యాంగం ఆధారంగా నడుస్తుంది" అని ఆయన తన సందేశంలో రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)