You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైదరాబాద్‌ను మూడు నగరాలుగా విభజించబోతున్నారా?
హైదరాబాద్ మహానగరం మూడు ముక్కలు కాబోతోందా?
శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల విలీనంతో జీహెచ్ఎంసీ పరిధి పెరగడంతో దాన్ని మూడు భాగాలుగా విభజించడంపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందంటూ 2025 డిసెంబర్ చివర్లో కొన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి.
అయితే ఈ కథనాలను ప్రభుత్వం కొట్టిపారేయలేదు, అలాగని అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఫిబ్రవరి 10తో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ పదవీకాలం ముగియబోతోంది. ఆ తర్వాత విభజన పరంగా కీలక నిర్ణయానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ వినిపిస్తోంది.
హైదరాబాద్ మహానగర విభజన విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ బీబీసీతో చెప్పారు.
విభజనపై అధికారిక ప్రకటన ఏమీ లేకపోయినా.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో జరుగుతున్న మార్పులు ఆ దిశగా సంకేతాలు ఇస్తున్నాయి.
ఫిబ్రవరి 10న దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ జనవరి 21న ప్రకటించారు.
డివిజన్ల సంఖ్య 150 నుంచి 300కు పెంపు
2011 జనాభా లెక్కల ప్రకారం, హైదరాబాద్ మహా నగర జనాభా 67.31 లక్షలు. ప్రస్తుతం ఆ సంఖ్య కోటి దాటినట్లు అంచనా. త్వరలో జరిగే జనగణన తర్వాత అధికారిక డేటా వెల్లడికానుంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఏర్పాటు తర్వాత 2009, 2016, 2021.. మొత్తం మూడుసార్లు ఎన్నికలు జరిగాయి.
ఈ ఏడాది ఎన్నికల లోపు.. 2025 డిసెంబరు 3న 20 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆ తర్వాత వార్డుల (డివిజన్ల) సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ముసాయిదాను జీహెచ్ఎంసీ విడుదల చేసింది.
అభ్యంతరాల స్వీకరణ తర్వాత, వార్డుల సంఖ్యను 300గా నిర్ణయిస్తూ 2025 డిసెంబరు 25న తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల సంఖ్యను 200కు పెంచాలని 2016లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది.
డివిజన్లపై కసరత్తు కూడా జరిగింది. చివరి నిమిషంలో ఆ ప్రతిపాదన పట్టాలెక్కలేదు. అప్పటికే ఉన్న 150 డివిజన్లతోనే ఎన్నికలకు వెళ్లింది.
జీహెచ్ఎంసీ విభజన జరుగుతుందా?
గ్రేటర్ హైదరాబాద్ పరిధిని గతంలో ఉన్న 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2053 చదరపు కిలోమీటర్లకు పెంచింది ప్రస్తుత ప్రభుత్వం.
12 జోన్లు, 60 సర్కిళ్లకు పెంచింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధికి ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారి కమిషనర్‌గా ఉన్నారు.
కొత్తగా వచ్చి చేరిన శేరిలింగంపల్లి, మల్కాజిగిరి జోన్లకు అదనపు కమిషనర్లను నియమించింది.
రానున్న రోజుల్లో శేరిలింగంపల్లి కేంద్రంగా సైబరాబాద్, మల్కాజిగిరి కేంద్రంగా మల్కాజిగిరి కార్పొరేషన్లు ఏర్పాటు అవుతాయని రాజకీయవర్గాల్లో ప్రచారం నడుస్తోంది.
''భవిష్యత్తులో శేరిలింగంపల్లి కేంద్రంగా ఒక కార్పొరేషన్, మల్కాజిగిరి కేంద్రంగా మరో కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా అదనపు కమిషనర్ల నియామకం జరిగినట్లుగా తెలుస్తోంది'' అని ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి చెప్పారు.
దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ బీబీసీతో మాట్లాడారు.
''ఈ అంశాలపై ఇప్పుడే మాట్లాడలేను. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తుంది'' అని అన్నారు.
"మూడు కంటే ఎక్కువ చేయాలి"
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అంతర్భాగంగా ఉంది సైబరాబాద్.
ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న ప్రాంతమంతా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కిందకు రానుంది.
గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాన్ని మూడు కంటే ఎక్కువ కార్పొరేషన్లు చేయాల్సిన అవసరం కనిపిస్తోందని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి అన్నారు.
''హైదరాబాద్ నగరంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా అవసరాలున్నాయి, వసతుల కల్పన అవసరం ఉంది. అలా చూస్తే, మూడు కార్పొరేషన్లకే పరిమితం చేయడం కూడా సహేతుకం కాదు. మూడు కంటే ఎక్కువ కార్పొరేషన్లను చేయాలి'' అని అన్నారు.
శివార్లలోని ఏడు కార్పొరేషన్లు.. బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేట, జవహర్ నగర్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట, బడంగ్‌పేట గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం అయ్యాయి.
అయితే, ఈ కార్పొరేషన్లలో ఇప్పటికే 20-25డివిజన్లు ఉండేవి. తాజాగా ఆయా కార్పొరేషన్ల పరిధిలో డివిజన్‌ల సంఖ్యను రెండు, మూడింటికే పరిమితం చేశారు.
''హైదరాబాద్ కోర్ ఏరియాలో జనాభా స్థిరీకరణ జరిగింది. ఇప్పుడు శివారు ప్రాంతాల్లో జనాభా బాగా పెరుగుతోంది. రోడ్లు, తాగునీరు, మురుగునీరు వంటి వసతులు శివారు ప్రాంతాల్లో కల్పించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఉన్న కార్పొరేషన్ల పరిధిని రెండు డివిజన్లకే పరిమితం చేయడంతో వసతుల కల్పనపై ప్రభావం పడుతుంది'' అని జక్కా వెంకట్ రెడ్డి చెప్పారు.
"పరిధులు సరే, బడ్జెట్ మాటేంటి?"
హైదరాబాద్ విస్తీర్ణం పెంచడంతోపాటు నిధులు విడుదల చేయడం కూడా ఎంతో ముఖ్యమని చెప్పారు 'ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్' అధ్యక్షుడు పద్మనాభ రెడ్డి.
''శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేశాక జనాభా దాదాపు కోటిన్నర వరకు చేరిందని ప్రభుత్వం చెబుతోంది. జనాభా, పరిధిని పెంచుకోవడమే కాదు, అందుకు తగ్గ నిధుల కేటాయింపు జరగాలి'' అని బీబీసీతో చెప్పారాయన.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ 2026-27 సంవత్సరానికి రూ.11,460 కోట్ల బడ్జెట్ ఆమోదం తీసుకుంది. ఇందులో రూ. 2,260 కోట్లను జీహెచ్ఎంసీలో విలీనం జరిగిన శివారు మున్సిపాలిటీల కోసం కేటాయించింది.
ముంబయి, హైదరాబాద్ నగరాల బడ్జెట్‌లు పరిశీలిస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తోందని, ముంబయి తరహాలో బడ్జెట్ కేటాయింపులు హైదరాబాద్‌లోనూ పెరగాలని పద్మనాభ రెడ్డి అభిప్రాయపడ్డారు.
గ్రేటర్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ 2025-26 సంవత్సరానికి రూ.74,427 కోట్ల బడ్జెట్ ఆమోదించిందని 'ది హిందూ' కథనం రాసింది.
జీహెచ్ఎంసీతో పోల్చితే గ్రేటర్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కూడా తక్కువ. ముంబయి కార్పొరేషన్ 437.71 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.
''గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాన్ని మూడుగా విభజిస్తే తప్పు లేదు, ప్రజలకు తగ్గట్లుగా సౌకర్యాల కల్పన వేగంగా జరగాలి. అందుకు తగ్గట్టుగా బడ్జెట్ పెరగాలి'' అని పద్మనాభ రెడ్డి అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)