‘నొప్పి తగ్గడానికంటూ తల్లిదండ్రులకు ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది.. ప్రేమ వివాహం వద్దన్నందుకు హత్య’.. వికారాబాద్ జంట హత్యలపై పోలీసులు చెప్పిన వివరాలివీ..

''ఒళ్లు నొప్పులు ఉన్నాయంటున్నారు కదా, ఇదిగో ఈ ఇంజెక్షన్ ఇస్తే హాయిగా నిద్ర పడుతుంది'' అని నమ్మించి తల్లిదండ్రులను కన్నకూతురే హత్య చేశారని వికారాబాద్ పోలీసులు చెప్పారు.

ప్రేమ వివాహం వద్దని వారించినందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా చెబుతున్నారు.

వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారంలో జరిగిన ఈ ఘటన.. తల్లిదండ్రుల మృతిపై సందేహంతో వారి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.

''ఇంట్లో ఇంజెక్షన్లు దొరకడం, వాటిలో రక్తం ఉండటంతో అనుమానం వచ్చి విచారించగా సురేఖ అనే యువతి తాను నేరం చేసినట్లు అంగీకరించారు'' అని బంట్వారం ఎస్ఐ విమల బీబీసీతో చెప్పారు.

ఆమె ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్స్

వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి 'మీడియా'కు వెల్లడించిన వివరాల ప్రకారం... బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కలి దశరథ్, లక్ష్మి దంపతులకు కుమార్తె సురేఖ, కుమారుడు అశోక్ ఉన్నారు.

సురేఖ సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. అశోక్ వికారాబాద్‌లో ఉంటున్నారు.

ఈ నెల 24వ తేదీ రాత్రి తల్లిదండ్రులిద్దరూ చనిపోయారంటూ సురేఖ తన అన్న అశోక్‌కు ఫోన్ చేసి చెప్పారు.

''నాన్న ఉన్నట్టుండి కుప్పకూలిపడిపోయాడు. అది చూసి అమ్మకు గుండెనొప్పి వచ్చింది'' అని ఆమె అశోక్‌తో చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

అయితే, తల్లిదండ్రుల మృతిచెందిన తీరుపై అనుమానంతో అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో, దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సురేఖ ప్రేమ విషయంలో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవని గుర్తించారు.

''మేం ఇంటికి వెళ్లి పరిశీలించాం. తల్లిదండ్రులు ఇద్దరూ ఒకేసారి చనిపోవడంతో , సందేహించి ఆ కోణంలో దర్యాప్తు చేపట్టాం.

సురేఖ ప్రేమ వ్యవహారంపై తరచూ గొడవలు జరుగుతున్న విషయం కూడా మా దృష్టికి వచ్చింది'' అని ఎస్ఐ విమల చెప్పారు.

ఇంట్లో సోదా చేస్తే రెండు ఇంజెక్షన్లు, వాటిలో రక్తం కనిపించిందని వెల్లడించారు.

''ముందుగా తల్లికి ఇంజెక్షన్, తర్వాత తండ్రికి''

సురేఖను అదుపులోకి తీసుకుని విచారించినప్పుడు, ఆమె ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

''జనవరి 24వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు సురేఖ ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చారు. రాత్రికి ఇంట్లో తల్లి అన్నం వండి పెట్టారు. తనకు ఒళ్లు నొప్పులుగా ఉంటోందని లక్ష్మి తరచూ చెబుతుండటంతో సురేఖ దాన్ని అవకాశంగా తీసుకున్నారు. ఒళ్లు నొప్పులు తగ్గేందుకు డాక్టర్‌ను అడిగి మత్తు ఇంజెక్షన్ తెచ్చానని చెప్పారు. ఇంజెక్షన్ ఓవర్ డోస్ కారణంగా ఆమె కాసేపటికే చనిపోయారు'' అని డీఎస్పీ చెప్పారు.

''కాసేపటికి ఇంట్లోకి వచ్చిన తండ్రి దశరథ్‌కు, ''ఒళ్లు నొప్పులంటే అమ్మకు ఇంజెక్షన్ ఇచ్చాను. నిద్రపోతోంది. నాన్నా, నీకు నడుము నొప్పి ఉంది కదా, నీకూ ఇంజెక్షన్ ఇస్తాను'' అంటూ సురేఖ ఇంజెక్షన్ చేశారు. దీంతో దశరథ్ కూడా చనిపోయారు'' అని పోలీసులు చెప్పారు.

ఇంజెక్షన్ ఓవర్ డోస్ ఇస్తే చనిపోతారనే తెలిసే, ఆమె ఆ విధంగా నేరానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు.

ఇన్ స్టాలో పరిచయం.. ప్రేమగా మారి..

సురేఖకు నిరుడు ఇన్ స్టాలో సంగారెడ్డికి చెందిన యువకుడితో పరిచయం ప్రేమకు దారి తీసినట్లుగా వికారాబాద్ జిల్లా పోలీసులు చెబుతున్నారు.

''ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో వారి పెళ్లికి సురేఖ తల్లిదండ్రులు నిరాకరించారు'' అని బంట్వారం ఎస్ఐ విమల బీబీసీతో చెప్పారు.

పెళ్లికి వద్దని చెప్పినందుకే తల్లిదండ్రుల అడ్డు తొలగించుకోవాలని సురేఖ నిర్ణయించుకుని ఘాతుకానికి పాల్పడినట్లుగా తమ విచారణలో తేలిందని ఆమె వెల్లడించారు.

తన చెల్లి ఇలాంటి ఘాతుకానికి పాల్పడుతుందని ఊహించలేదని అశోక్ మీడియాకు చెప్పారు.

ఈ వ్యవహారంపై మీడియా ఎదుట ప్రవేశపెట్టిన సమయంలో సురేఖ మాట్లాడేందుకు నిరాకరించారు. అలాగే ఆమె బంధువులను ఫోన్ కాల్ ద్వారా సంప్రదించగా, ఘటనపై మాట్లాడేందుకు ఇష్టపడలేదు.

‘సొంతవాళ్లనే చంపుకొంటున్నారు’

ఈ మధ్యకాలంలో కుటుంబసభ్యులను హత్య చేస్తున్న ఘటనలు తరచూ చూస్తున్నామని, ఒకరిపై ప్రేమ చూపిస్తున్నారే తప్ప అదే సమయంలో సొంతవారిపై ద్వేషం పెంచుకుంటున్నారని మనస్తత్వ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

''భావోద్వేగాలను నియంత్రించుకోలేని స్థితిలో హత్యలకు పాల్పడుతున్నారు. ఆ సమయంలో మానసికంగా తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లి నియంత్రణ కోల్పోతున్నారు'' అని తెలంగాణ సైకాలజిస్టుల అసోసియేషన్ డాక్టర్ రాంచందర్ బీబీసీతో చెప్పారు.

''మెదడులో కాటిజాల్ లెవల్స్ తగ్గిపోయి బంధాలను కూడా పట్టించుకోవడం లేదు. ఏ స్థితిలో ఉన్నారో.. ఏం చేస్తున్నారనేది పట్టించుకోకుండా క్షణికావేశంలో సొంతవాళ్లనే చంపుకుంటున్నారు'' అని రాంచందర్ విశ్లేషించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)