You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘ప్రేమించిన వ్యక్తి భార్యకు హెచ్ఐవీ వైరస్ ఎక్కించిన మహిళ’- ఈ కేసులో అసలేం జరిగింది?
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
తాను ప్రేమించిన వ్యక్తి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడనే అక్కసుతో అతని భార్యకు ఓ మహిళ హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ ఉన్న రక్తం ఇంజెక్ట్ చేసిన ఘటన కర్నూలులో జరిగింది.
బాధితురాలు డాక్టర్. ఆమె భర్త ఫిర్యాదు ఆధారంగా కర్నూల్ త్రీ టౌన్‌లో కేసు నమోదయింది.
ఈ ఘటనను పోలీసులు ధ్రువీకరించారు. జనవరి 9న ఇది జరిగిందని తెలిపారు.
కర్నూలులోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యురాలు ఆస్పత్రి నుంచి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా కేసీ కెనాల్ గట్టు దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను ఢీకొట్టారని, కింద పడిపోయిన వైద్యురాలికి సాయం చేస్తున్నట్టు నటించిన ఓ ఇద్దరు వ్యక్తులు ఆమెకు ఇన్ఫెక్షన్ ఉన్న రక్తాన్ని ఇంజెక్ట్ చేశారని పోలీసులు చెప్పారు.
కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఈ కేసు గురించి బీబీసీకి వివరించారు.
కేసు వివరాలు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ మాటల్లోనే...
‘‘ఓ మహిళా డాక్టర్ కేసీ కెనాల్ రోడ్డులో స్కూటీపై వెళ్తున్నారు. వేరే వాహనం ఆమె స్కూటీకి తగలడంతో, అది స్కిడ్ అయి ఆమె పడిపోయారు. స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే అక్కడే ఉన్న ఇద్దరు మహిళలు మిమ్మల్ని ఆస్పత్రికి తీసుకెళ్తామంటూ ఆటోలో ఎక్కించారు. ఆ సమయంలో తనకు వాళ్లు ఇంజెక్షన్ ఇచ్చినట్టు మహిళా డాక్టర్ గుర్తించారు. దీనిపై వైద్యురాలి భర్త ఫిర్యాదు చేశారు''
‘‘నిందితుల్లో ఒకరు నర్సు. తను ప్రేమించిన డాక్టర్ తనను కాదని మరో డాక్టరును పెళ్లి చేసుకోవడంతో ప్రేమించిన డాక్టర్‌పై పగతో ఆయన భార్యకు ఇంజెక్షన్ ఇవ్వాలని సదరు నర్స్ ప్లాన్ చేశారు’’
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెచ్‌ఐవీ రోగుల నుంచి వేరే నర్సు సాయంతో హెచ్‌ఐవీ వైరస్‌తో కూడిన రక్తాన్ని ఆమె సేకరించినట్టు తెలిసిందని పోలీసులు వెల్లడించారు.
''తన ఫ్రెండ్, వారి ఇద్దరు పిల్లల సహకారంతో ఆమె ఇంజెక్షన్ ఇచ్చి పారిపోయారు. పోలీసుల విచారణలో విషయాలన్నీ బయటికి వచ్చిన తర్వాత ఆ నలుగురినీ అరెస్ట్ చేశాం. ఇందులో వీరి అసలు ఉద్దేశం ఏంటి, ఆ ఇంజెక్షన్‌లో ఎలాంటి రకం వైరస్ ఉంది అనేది కూడా పరిశీలిస్తాం. ఇందులో ఇంకా ఎవరిదైనా ప్రమేయం ఉందా అనేది దర్యాప్తు చేసి వారిపై కూడా చార్జ్‌షీట్ ఫైల్ చేస్తాం. ఇందులో సాంకేతిక ఆధారాలు ప్రధాన పాత్ర పోషించాయి. సీసీ కెమెరాల నుంచి విజువల్స్ పక్కాగా సేకరించాం'' అని డీఎస్పీ చెప్పారు.
‘అసూయతో ఇంజెక్షన్ ప్లాన్’
ప్రేమికుడు దూరమైన మహిళ అసూయతో ఈ పనికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
''చదువుకునే సమయంలో డాక్టర్‌కు తన క్లాస్‌మేట్‌తో స్నేహం మొదలైంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. తర్వాత వాళ్లు విడిపోయారు. ఆయన వేరే డాక్టర్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే నర్సుగా ఉన్న ఆమె మాత్రం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయారు.
పెళ్లి చేసుకున్న డాక్టర్ భార్యపై నిందితురాలు అసూయ పెంచుకున్నారు. ఆమెను ఆయనకు దూరం చేయాలనే ఉద్దేశంతో ఆమెకు తెలీకుండా ఇంజెక్షన్ ఇవ్వాలనుకున్నారు.ఆస్పత్రిలో తనకున్న పరిచయాలతో హెచ్ఐవీ వైరస్‌ను సేకరించారు. దానిని ఆరోజు ఆమెకి ఇంజెక్ట్ చేశారు.
అవసరమైన పనులు చేస్తానన్న హామీతో నిందితురాలు తన స్నేహితురాలు, ఆమె పిల్లల సాయం తీసుకున్నారు. ఈ నేరంలో వాళ్లను కూడా భాగస్వాములను చేశారు'' అని డీఎస్పీ చెప్పారు.
నిందితురాలు ఎలా దొరికారు?
నిందితురాలు ఆదోనిలో ఉండే తన ఫ్రెండ్, వారి పిల్లల ద్వారా దీనిని ప్లాన్ ప్రకారం చేశారని కర్నూలు త్రీటౌన్ సీఐ శేషయ్య బీబీసీతో చెప్పారు.
ఆదోని నుంచి వచ్చిన నిందితురాలి స్నేహితురాలు, ఆమె కొడుకు మొదట ఒక బైక్‌లో వెళ్తూ స్కూటీని ఢీకొని మహిళా డాక్టర్ కిందపడేలా చేస్తే, స్నేహితురాలి కూతురు, నిందితురాలు ఇద్దరూ వారి వెనకే వచ్చి ఇంజెక్షన్ చేశారని సీఐ వివరించారు.
''తనకు వాళ్లు ఇంజెక్షన్ ఇచ్చారు అనే సందేహం రాగానే మహిళా డాక్టర్ వాళ్ళ ముఖాలు కనిపించేలా తన ఫోన్లో ఫోటోలు తీశారు. వాటి ఆధారంగానే, వాళ్ళ దుస్తులు చూసి, సీసీ కెమెరాలు బేస్ చేసుకుని దర్యాప్తు చేశాం. ఆ వాహనం నంబర్ ట్రేస్ చేసి, అది ఎవరి పేరుతో ఉందో దాన్ని పట్టుకున్నాం. అది నిందితురాలి పేరుతోనే ఉంది. కానీ ఆమెని ఎంత ప్రశ్నించినా నేరం ఒప్పుకోలేదు'' అని సీఐ శేషయ్య తెలిపారు.
తర్వాత నిందితురాలు తన నేరాన్ని ఎలా అంగీకరించారో కూడా శేషయ్య చెప్పారు.
‘‘ఆమె కాల్ లిస్ట్ వెరిఫై చేసాం. ఆమె 17 మందితో మాట్లాడితే 15 మంది మా కాంటాక్ట్‌లోకి వచ్చారు. ఇద్దరు మాత్రం రాలేదు. అందరూ మామూలుగా చెబితే, ఒక్కరు మాత్రం అబద్ధాలు చెప్పారు. ఆయన్ను విచారించి, కాంటాక్ట్‌లోకిరాని మిగతా ఇద్దరిని కూడా పట్టుకున్నాం.
ఆయన బైకును నిందితురాలు వేరేవారికి ఇప్పించారు. ఆయన తన బైకు ఎవరికి ఇచ్చారో దర్యాప్తు చేస్తే, మరొక కాంటాక్ట్ నెంబర్ దొరికింది. ఆ నంబర్ ఆమె కాల్ లిస్టులో కూడా ఉంది. కాంటాక్ట్‌లోకి రాని వాళ్ళ నంబరుతో ఈమె నంబర్ సింక్ అయ్యింది. వీళ్ళందరూ సీన్ ఆఫ్ అఫెన్స్‌లో ఉన్నట్టు ట్రేస్ చేశాం.
దాంతో వాళ్ళని తీసుకొచ్చి నిందితురాలు ముందు నిలబెడితే అప్పుడు ఆమె నేరం ఒప్పుకున్నారు'' అన్నారు.
హెచ్ఐవీ శాంపిల్ బయటకెలా వెళ్లింది?
నిందితురాలైన నర్సు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే మరో నర్సు సాయంతో హెచ్ఐవీ శాంపిల్ సేకరించారని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్ వెంకటేశ్వర్లు బీబీసీకి చెప్పారు.
‘‘ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే ఒక స్టాఫ్ నర్స్ ద్వారా ఆమె హెచ్ఐవీ శాంపుల్ కలెక్ట్ చేశారు. వారిద్దరికీ గతంలో ఎక్కడో ట్రైనింగ్‌లో పరిచయం ఉంది. నైట్ డ్యూటీలో ఉన్నసమయంలో హెచ్ఐవీ శాంపిల్‌ను నిందితురాలికి ఇచ్చారు నర్స్. దీంతో ఆమెకి కూడా మేం నోటీసులు జారీ చేశాం. ఈ నర్సును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. బాధితురాలు కూడా మా ఆసుపత్రిలోనే పని చేస్తారు. ప్రస్తుతం ఆమె లీవులో ఉన్నారు’’ అని కర్నూలు ప్రభుత్వాసుపత్రి సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
అడిగితే వైరస్ ఇచ్చేస్తారా?
నిందితురాలికి ఆమె స్నేహితురాలైన మరో నర్సు హెచ్ఐవీ వైరస్ ఎందుకు ఇచ్చారు అనేది దర్యాప్తులో తేలుతుందని, దానిని బట్టి ఆమెపై చర్యలు తీసుకుంటామని సీఐ శేషయ్య చెప్పారు.
''నిందితురాలికి డాక్టర్‌పై ప్రేమ ఉంది. తనను చేసుకోకుండా మహిళా డాక్టర్‌ను చేసుకున్నారనే అసూయ ఉంది. వీళ్ళిద్దరూ స్కూలు నుంచే క్లాస్‌మేట్స్. ఆమె ఎంఎస్సీ నర్సింగ్ చేశారు. గతంలో నర్సుగా పనిచేసినా ఇప్పుడు ఖాళీగా ఉన్నారు.
ప్రభుత్వాసుపత్రిలో పని చేసే నర్సు ఆమెకు శాంపిల్స్ ఎందుకు ఇచ్చారు అన్నది దర్యాప్తులో తేలుతుంది''అని సీఐ తెలిపారు.
బాధితురాలి భర్తతో మాట్లాడేందుకు బీబీసీ పలు మార్లు ఫోన్‌లో ప్రయత్నించింది. కానీ, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
నిందితురాలి బంధువులతో మాట్లాడడానికి ప్రయత్నించాం. వారెవరూ అందుబాటులోకి రాలేదు.
(గోప్యత దృష్ట్యా ఈ కేసులో మరిన్ని వివరాలు, సంస్థలు, వ్యక్తులు, వారి పదవులను పేర్కొనలేదు.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)