‘‘డాక్టర్లపై నమ్మకం పోయింది.. కన్నీటితో కుంగిపోయి వేడుకుంటే కానీ స్కానింగ్ తీయలేదు’’

    • రచయిత, లూసీ వ్లాదెవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న మహిళ ఒకరు రోగ నిర్థరణ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిన తర్వాత "నాకు డాక్టర్లపై నమ్మకం పోయింది" అని చెప్పారు.

యోనిలో నొప్పి, రక్తస్రావం, వాపుతో జెస్సికా మేసన్ డాక్టర్ల వద్దకు అనేకసార్లు తన కుటుంబ వైద్యుడిని, ఆసుపత్రిని సంప్రదించినా తనకు సరైన చికిత్స అందించకుండా సాకులు చెప్పారని ఆమె అన్నారు. చివరకు తనకు స్కానింగ్ చేయమని తాను వేడుకోవాల్సి వచ్చిందని, ఆ స్కాన్‌లో తక్షణ చికిత్స అవసరమైన క్యాన్సర్ బయటపడిందని ఆమె చెప్పారు.

ఓ డాక్టర్ వద్ద ‘‘కన్నీళ్లతో కూలబడిపోయినప్పుడు మాత్రమే’’ఎంఆర్‌ఐకు సిఫార్సు చేశారని 44ఏళ్ల జెస్సికా నమ్ముతున్నారు ‘‘నా ఆరోగ్యం విషయంలో ఏదో జరుగుతోందనిపించింది’’ అన్నారు జెస్సికా.

గైనికాలజీ క్యాన్సర్లపై ‘వేల్స్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం వల్లే’ మహిళలు నిరాశకు గురయ్యారని సెనెడ్ హెల్త్ కమిటీ నివేదిక తెలిపింది.

గైనకాలజికల్ క్యాన్సర్‌ ఫలితాలను మెరుగుపరిచేందుకు తాము నేషనల్ హెల్త్ స్కీమ్‌తో కలిసి పని చేస్తున్నామని వేల్స్ ప్రభుత్వం తెలిపింది.

"నన్ను నమ్మలేదు"

వేల్ ఆఫ్ గ్లామమోర్గాన్‌లో ఉన్న పెనార్త్‌లో నివసించే జెస్సికా యోనిలో రక్తస్రావం, నొప్పితో బాధ పడేవారు. 2019లో ఇది చాలా తీవ్రంగా మారింది.

"ఏదో తీవ్రమైన సమస్య ఉందని నాకు అర్థమైంది" అని ఆమె చెప్పారు.

వైద్యులు తనకు చాలా సార్లు అల్ట్రా సౌండ్ టెస్టులు చేయించారని, అందులో ఎలాంటి సమస్యలు బయటపడలేదని ఆమె చెప్పారు. అల్ట్రా సౌండ్‌తో పాటు, కణితి, గర్భాశయం, అవయవాలు జారిపోవడం లాంటి సమస్యలు ఉన్నాయోమో తెలుసుకోవడానికి పరీక్షలు జరిపారు. వీటి ఆధారంగా పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజులు చేయమని సూచించారు.

‘‘మనం డాక్టర్లను నమ్ముతాం. ఏదైనా సమస్య ఉంటే వారికి తెలియకుండా ఉంటుందా అనుకుంటాం. అందుకే ఇది చాలా తికమకగా ఉండేది’’ అని ఆమె చెప్పారు.

తనకు క్యాన్సర్ నిర్థరణ జరగడానికి ఆరు నెలల ముందు జరిగిన స్మియర్ టెస్ట్‌లో ఏమీ బయటపడలేదని జెస్సికా చెప్పారు.

ఆల్ట్రాసౌండ్ ఫలితాల కోసం ఆమె మే 2022లో యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ వేల్స్‌కు వెళ్లిన సమయంలో ఆమె భావోద్వేగాలతో కుంగిపోయి కన్నీళ్లు పెట్టుకున్నారు.

"గర్భాశయం చుట్టూ ఉన్న పొర అంచున ఏదో ఉందన్నారు. కానీ అంతా బాగానే కనిపిస్తోందని వాళ్లు చెప్పారు" అని జెస్సికా అన్నారు. తన లక్షణాలకు కారణం ఏమిటో తెలుసుకోవడానికి మరిన్ని పరీక్షలు చేయమని వేడుకున్నానని, తనను ఎవరూ నమ్మడం లేదనే భావన కలిగిందని ఆమె చెప్పారు.

"దీంతో వాళ్లు నాకు ఎంఆర్ఐ చేసేందుకు అంగీకరించారు. అది తనకు మనశ్శాంతి కలిగించేందుకు మాత్రమే చేశారనే భావన తనకు ఉందని ఆమె తెలిపారు.

ఎంఆర్ఐ చేసిన రెండు వారాల తర్వాత 2022 జూన్‌లో ఫలితాలు వచ్చాయి.

"నిజానికి క్యాన్సర్ అనే ఆలోచన నాకు ఎప్పూడు రాలేదు. ఏదో ఇన్ఫెక్షన్ కావచ్చనుకున్నాను. అది ఇంత తీవ్ర అనారోగ్యం అని ఎప్పుడూ అనుకోలేదు" అని జెస్సికా చెప్పారు.

ఆమెకు స్టేజ్ 1బి3 సర్వికల్ క్యాన్సర్ ఉందని, వెంటనే చికిత్స ప్రారంభించాలని డాక్టర్ ఆమెతో చెప్పారు. ట్యూమర్ 4 సెంటిమీటర్లకంటే ఎక్కువే ఉన్నప్పటికీ, ఇంకా గర్భాశయ ముఖద్వారానికే పరిమితమై ఉందని వివరించారు.

దీంతో జెస్సికా 2022 ఆగస్టులో ఐదు వారాల పాటు కీమో థెరపీ, రేడియో థెరపీ తీసుకున్నారు.

ఈ చికిత్స తన 13 ఏళ్ల కుమారుడిపై ప్రభావం చూపాయని, తనకు ముందుగానే మెనోపాజ్ వచ్చిందని ఆమె చెప్పారు. మరో బిడ్డను కనాలన్న తన ఆశ నెరవేరలేదని ఆమె తెలిపారు.

"నేను వంట చేయలేకపోయాను, ఇల్లు శుభ్రం చేయలేకపోయాను. నా కుమారుడి స్కూలు యూనిఫామ్‌ను ఇస్త్రీ చేయలేకపోయాను. వాడిని స్కూలుకు తీసుకెళ్లలేకపోయాను " అని ఆమె వాపోయారు.

తనకు ముందుగానే ఎంఆర్ఐ చేసి ఉంటే బావుండేదని ఆమె అన్నారు.

"ఎంఆర్ఐ చేయడానికి అయ్యే ఖర్చు మహా అయితే నేను డాక్టర్ల అపాయింట్‌మెంట్ల కోసం చేసినంత ఉంటుందేమో" అని జెస్సికా చెప్పారు.

అయితే దీంతోనే ఆమె కష్టాలు తీరిపోలేదు. 2023 ఫిబ్రవరిలో చేసిన మరో ఎంఆర్ఐ స్కాన్‌లో ఆమె శరీరంలో క్యాన్సర్ ఇంకా ఉన్నట్లు తేలింది. దీంతో 2023 జులైలో ఆమెకు హిస్టరెక్టమీ చేయాలని చెప్పారు.

"నాకు డాక్టర్ల మీద నమ్మకం పోయింది. ఇది చాలా దారుణం. నేను వైద్య నిపుణురాలిని కాదు. అందుకే వాళ్లు ఏం చెబితే అది నమ్మాల్సి వచ్చేది. అయితే వాళ్ల పని తీరు ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉండేది" అని జెస్సికా అన్నారు.

క్యాన్సర్ సోకడానికి ముందు జెస్సికా పూర్తి స్థాయిలో పని చేసేవారు. అయితే ఇప్పుడామె వారంలో మూడు రోజులు మాత్రమే పని చేస్తున్నారు.

"ఇది మా జీవితాలను ఆక్రమించింది. నాకు ఎదురైన పరిస్థితులతో శారీరకంగా, మానసికంగా బాగా దెబ్బతిన్నా. నా స్నేహితులు, కుటుంబం, నా జీవితం అన్నీ దీని చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి" అని ఆమె అన్నారు.

ఇప్పటికీ తనకు అప్పుడప్పుడు రక్తస్రావం అవుతోందని, మరిన్ని బయాప్సీ పరీక్షలు చేయాలని, ఇదెప్పటికి ముగింపులేని సమస్య అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

" ఈసారి డాక్టర్లు రోగ నిర్థరణలో ఏదైనా కనుక్కోలేకపోతే నేను బతుకుతానా?’’ ఈ శంక నా మనసును తొలుస్తూనే ఉంటుంది.

తన అనారోగ్య పరిస్థితులకు సంబంధించిన రికార్డులను ఇవ్వకుండా హెల్త్ బోర్డు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసిందని ఆమె ఆరోపించారు. వాళ్లపై చట్టపరంగా చర్య తీసుకునే అంశం గురించి తాను ఆలోచిస్తున్నట్లు చెప్పారు.

"మహిళలకు సంబంధించి అనేక ఆరోగ్య సమస్యల్ని త్వరగా గుర్తించడం లేదు. వాళ్లు నెలసరి అని, మహిళల సమస్యలని చాలా తేలికగా తీసిపడేస్తున్నారు" అని జెస్సికా అన్నారు.

"మా సంరక్షణలో జెస్సికాకు ఎదురైన అనుభవాల పట్ల మేం చింతిస్తున్నాము. ఆమె క్యాన్సర్‌ నిర్థరణలో ఎదురైన సవాళ్లను మేము అంగీకరిస్తున్నాము" అని కార్డిఫ్ అండ్ వేల్ యూనివర్సిటీ హెల్త్ బోర్డ్ ప్రతినిధి చెప్పారు.

"ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. ఒక పేషెంట్ గురించి వ్యాఖ్యానించడం సరికాదు. మేమిక ఏమీ చెప్పలేం" అని ఆయన అన్నారు.

"కీలక వైఫల్యాలు"

"వేల్స్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మహిళలు ఇప్పటికీ నిరాశ చెందుతున్నారు" అని వేల్స్‌లోని గైనకాలజికల్ క్యాన్సర్ సంరక్షణపై సెనెడ్ హెల్త్ కమిటీ రిపోర్ట్ వ్యాఖ్యానించింది.

"కీలక వైఫల్యాల" గురించి వివరిస్తూ 2023 డిసెంబర్‌లో చేసిన సూచనలను అమలు చేయడంలో విఫలమైందని సెనెడ్ హెల్త్ కమిటీ రిపోర్ట్ గుర్తించింది.

2023 కమిటీ నివేదికలో సిఫార్సుల్లో ఎక్కువ భాగం ఆమోదించినా, గైనకాలాజికల్ క్యాన్సర్ సేవలకు నిధులను కేటాయించలేదని సెనెడ్ హెల్త్ కమిటీ రిపోర్ట్ తెలిపింది.

వేల్స్‌లో రోగులు వేచి ఉండే సమయాన్ని తగ్గించడంలో వైఫల్యం కనిపిస్తోందని, 62 రోజుల వ్యవధిలో చికిత్స అందించాలనే నిర్దేశిత సమయాన్ని 2025 అక్టోబరులో కేవలం 41శాతం మంది మాత్రమే పొందగలిగారని నివేదిక తెలిపింది.

గైనకాలజికల్ క్యాన్సర్ విషయంలో జరుగుతున్న పురోగతి నెమ్మదిగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని క్యాన్సర్ ఛారిటీ సంస్థ టెనొవస్ తెలిపింది.

"స్త్రీ జననేంద్రియ క్యాన్సర్ కేసుల్లో సకాలంలో రోగ నిర్ధరణ, చికిత్స అందించేందుకు ఎన్‌హెచ్‌ఎస్‌తో కలిసి పని చేసేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు" వేల్స్ ప్రభుత్వం చెప్పింది.

"గతంలో సర్వికల్ క్యాన్సర్ కేసులకు అండగా నిలవడానికి, కొత్త పరికరాల కొనుగోలు, కొత్త రకాల చికిత్స అందించడానికి అనుగుణంగా మేం మార్పులు చేశాం" అని వెల్లడించింది.

"ప్రస్తుతమున్న 62 రోజుల లక్ష్యానికి తగ్గట్లుగా మా పని తీరు సరిపోదు. మేమింకా మెరుగుపడాలి. మహిళల ఆరోగ్య ప్రణాళిక వేల్స్‌లో మహిళ ఆరోగ్య సంరక్షణలో నిజమైన మార్పును తెస్తుంది" అని వేల్స్ ప్రభుత్వం తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)