‘ఆ పుట్టగొడుగులు తిన్నాక మాకు ఎక్కడ చూసినా మరగుజ్జు మనుషులు కనిపిస్తున్నారు’ అంటూ ఆసుపత్రులకు వస్తున్న పేషెంట్లు, ఏంటీ సమస్య?

    • రచయిత, రాచెల్ న్యూయర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇటీవలే శాస్త్రవేత్తలు గుర్తించిన వింత పుట్టగొడుగులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిని తిన్నవారందిరికీ ఒకేరకమైన భ్రమలు కలిగిస్తాయి.

చైనాలోని యునాన్ ప్రావిస్స్‌లో ఉన్న ఒక ఆస్పత్రిలో డాక్టర్లు ప్రతి సంవత్సరం తమ దగ్గరకు వచ్చే ఒక అసాధారణమైన సమస్య బాధితులకు చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉంటారు.

ఓ విచిత్రమైన లక్షణంతో రోగులు ఆస్పత్రికి వస్తారు.

చిట్టిపొట్టి మనుషుల ( ఇంగ్లీషులో ఎల్ఫ్ అంటారు) ఆకారాలు తమ తలుపుల కింద నుంచి దూరి వస్తున్నట్లు, గోడలపై పాకుతున్నట్టు, ఇంట్లోని వస్తువులకు వేలాడుతున్నట్టు తమకు కనిపిస్తున్నాయని వాళ్లు డాక్టర్లకు చెబుతుంటారు.

ఇలాంటి సమస్యతో అక్కడి డాక్టర్ల దగ్గరకు వచ్చేవారి సంఖ్య ఏటా వందల్లో ఉంటుంది.

ఆ పుట్టగొడుగు ఏదంటే...

దీనికి కారణం లాన్‌మోవ ఏసియాటికా అనే పుట్టగొడుగు. ఇది సమీపంలోని అడవుల్లో పైన్ చెట్లలో మొలుస్తుంది.

స్థానికంగా ఈ పుట్టగొడులకు చాలా ఆదరణ ఉంటుంది. బాగా రుచిగా ఉంటాయి కూడా. యునాన్‌లో ఈ పుట్టగొడుగులు మార్కెట్లలో దొరుకుతాయి.

రెస్టారెంట్లలోనూ వీటితో వండిన డిష్ దొరుకుతుంది. పుట్టగొడుగులు ఎక్కువగా దొరికే జూన్, ఆగస్టు నెలల మధ్య వీటిని స్థానికులు ఇళ్లల్లో వండుకుంటారు.

ఈ పుట్టగొడుగులను తినాలంటే బాగా ఉడికించాలి. సరైన విధంగా వండాలి. లేదంటే ఇది తిన్నవారిలో కొందరికి రకరకాల భ్రమలు మొదలవుతాయి.

''అక్కడ ఉన్న మష్‌రూమ్ హాట్ పాట్ రెస్టారెంట్‌లో సర్వర్ 15నిమిషాల టైమ్ సెట్ చేశారు. టైమర్ ఆగిపోయేదాకా దాన్ని తినవద్దని, లేదంటే మరుగుజ్జు మనుషులు కనిపిస్తారని హెచ్చరించారు'' అని యూనివర్సిటీ ఆఫ్ యుటాకు చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియంలో బయాలజీ డాక్టోరల్ విద్యార్థి కోలిన్ డోమ్నావర్ చెప్పారు. ఆయన లాన్‌మోవ ఏసియాటికాపై పరిశోధన జరుపుతున్నారు.

''అక్కడి సంస్కృతిలో ఇది అందరికీ తెలిసిన విషయంలా కనిపిస్తోంది'' అని కోలిన్ అన్నారు.

కానీ యునాన్ వెలుపల అనేక ప్రాంతాల్లో ఈ పుట్టగొడుగు వ్యవహారం ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే ఉంది.

''భ్రమలు కలిగించే ఈ పుట్టగొడుగు గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. దానికోసం చాలామంది వెతికారు. కానీ దాని జాతులను గుర్తించలేకపోయారు'' అని ఫంగీ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఫౌండర్, మైకాలజిస్ట్ జూలియానా ఫుర్సీ చెప్పారు. పుట్టగొడుగులను గుర్తించి, పరిరక్షించేందుకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థే ఫంగీ ఫౌండేషన్.

పరిశోధనలు ప్రారంభం

ఈ పుట్టగొడుగుల మిస్టరీని ఛేదించాలని, అది కలిగించే అసాధారణ భ్రమలకు కారణమైన రసాయనాన్ని గుర్తించాలని, అలాగే దాని ద్వారా మనిషి మెదడు గురించి ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలను పరిశీలించాలని డోమ్నావర్ దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నారు.

తన గ్రాడ్యుయేట్ రోజుల్లో మైకాలజీ ప్రొఫెసర్ ద్వారా లాన్‌మోవ ఏసియాటికా గురించి డోమ్నావర్ తొలిసారి విన్నారు.

''ప్రపంచంలో ఓ పుట్టగొడుగు ఉందని, అది కథల్లాగా అనిపించే దృశ్యాలను చూపుతుందని వినడానికి చాలా వింతగా అనిపించింది. అది నన్ను అయోమయానికి గురిచేసింది. అదే సమయంలో మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచింది'' అని డోమ్నావర్ చెప్పారు.

1991లో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ఇద్దరు పరిశోధకులు ఓ పరిశోధన పత్రం ప్రచురించారు. యునాన్ ప్రావిన్స్‌లో ఆ పుట్టగొడుగు తిన్న కొంతమంది ''లిల్లిపుటియన్ హాలూసినేషన్స్''( చిట్టి మనుషులు కనిపిస్తున్న భ్రమ) అనుభవించారని పరిశోధకులు తెలిపారు.

లిల్లిపుటియన్ హాలూసినేషన్స్ అనేది మానసిక ఆరోగ్యానికి సంబంధించిన పదం. చిన్నచిన్న మనుషులు, జంతువులు, కల్పిత పాత్రలు కనిపించడాన్ని ఇలా చెప్తారు.

గలీవర్స్ ట్రావెల్స్ నవలలో, కల్పత లిల్లీపుట్ ఐలాండ్‌లో ఉండే చిన్న చిన్న జనాలను వర్ణించడానికి ఈ పదం ఉపయోగించారు. అప్పటినుంచి ఈ పదం ప్రాచుర్యంలోకి వచ్చింది.

ఈ ''ఆకారాలు అంతటా తిరుగుతున్నట్టుగా'' రోగులకు కనిపించిందని పరిశోధకులు రాశారు. ఒకేసారి పదికి పైగా చిన్న ఆకారాలు కనిపించినట్లు వారు చెప్పేవారు.

''డ్రెస్ వేసుకునేటప్పుడు వారి దుస్తుల మీద, తినేటప్పుడు వారి ఆహారపదార్థాలోనూ వారు ఆ ఆకారాలను చూసేవారు. కళ్లుమూసుకున్నప్పుడు ఈ దృశ్యాలు మరింత స్పష్టంగా కనిపించేవి'' అని పరిశోధకులు తెలిపారు.

2015లో గుర్తింపు

1960ల్లోనే అమెరికా రచయిత గోర్డాన్ వాసన్, ఫ్రెంచ్ వృక్షశాస్త్రవేత్త రోగర్ హైమ్ ఈ వింత పుట్టగొడుగులను పాశ్చాత్య ప్రేక్షకులకు పరిచయం చేశారు. పపువా న్యూగినియాలో ఇలాంటిదాన్ని వారు గుర్తించారు.

అంతకు 30ఏళ్ల ముందు మనుషులు పిచ్చివాళ్లగా మారడానికి కారణమవుతున్న ఓ పుట్టగొడుగు ఉందని మిషనరీల బృందం చెప్పింది. ఆ పుట్టగొడుగును వెతికే క్రమంలో వారు దీన్ని గుర్తించారు. తర్వాత దీన్ని ''మష్‌రూమ్ మ్యాడ్‌నెస్‌''గా పిలిచారు.

అప్పటికీ ఏమీ తెలియకుండా వారు చూసిన లక్షణాలు చైనాలో ఇప్పుడు కనిపిస్తున్నవాటివలే ఉన్నాయి. వాళ్లు ఆ పుట్టగొడుగుల నమూనాలను సేకరించి, పరీక్షల కోసం అల్బర్ట్ హోఫ్మాన్‌కు పంపించారు.

అల్బర్ట్ హోఫ్మాన్ స్విస్ కెమిస్ట్. ఎల్‌ఎస్‌డీని కనుగొన్నది ఆయనే. అయితే ఆ పుట్టగొడుగుల్లో ఎలాంటి రసాయన పదార్థాన్ని హోఫ్మాన్ గుర్తించలేకపోయారు. తాము విన్న కథలకు ఎలాంటి ఆధారాలు లేవని, అవి సాంస్కృతిక కథలై ఉండొచ్చని ఆ బృందం అంచనాకొచ్చింది. ఆ తర్వాత ఎలాంటి పరిశోధనా జరగలేదు.

2015 వరకు పరిశోధకులు ఎల్. ఏసియాటికా గురించి వివరించి పేరు పెట్టలేదు. ఆ ఏడాదే పేరు పెట్టారు. అయితే అది మనుషుల మనసుపై చూపే ప్రభావం లక్షణాలను పెద్దగా వివరించలేదు.

చైనా మార్కెట్‌ను జల్లెడ పట్టి...

డోమ్నావర్ మొదటి లక్ష్యం ఈ పుట్టగొడుగులు అసలు ఏ జాతివో గుర్తించడం. 2023లో పుట్టగొడుగులు సమృద్ధిగా దొరికే సీజన్‌లో ఆయన యునాన్ వెళ్లారు. ''మరుగుజ్జు మనుషులను చూడగలిగే'' పుట్టగొడుగులు ఏవని ఆయన మార్కెట్‌లో వ్యాపారులను అడిగారు.

పుట్టగొడుగుల మార్కెట్‌ను జల్లెడ పట్టారు. అక్కడి వ్యాపారులు చూపించిన పుట్టగొడుగులను కొని వాటిని ల్యాబ్‌కు తీసుకెళ్లి పరిశోధనలు జరిపారు.

ఆ పరీక్షల ద్వారా ఎల్. ఏసియాటికాను నిర్ధరించుకున్నానని ఆయన చెప్పారు. ల్యాబ్‌లోని పుట్టగొడుగుల నుంచి తీసిన రసాయనాలు ఎలుకలపై ప్రయోగిస్తే వాటి ప్రవర్తనలో కూడా మనుషుల్లోలాగే మార్పువచ్చిందనే పరిశోధనను ప్రచురించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.

ఆ రసాయనాలు ఇచ్చిన తర్వాత ఎలుకలు ముందు చాలా చురుగ్గా ప్రవర్తించాయి. తర్వాత చాలాసేపు కదలకుండా మత్తుగా పడిఉన్నాయి.

చైనా, పపువా న్యూగినియాలోలాగే ఇలాంటి లక్షణాలు కలిగించే పుట్టగొడుగులు ఉన్నాయన్న పుకార్లు వినిపించే ఫిలిప్పీన్స్‌కు కూడా వెళ్లారు డోమ్నావర్.

అక్కడ ఆయన సేకరించిన రకాలు చైనాతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉన్నాయి. చైనా పుట్టగొడుగులు పెద్దగా, ఎర్రగా ఉంటే, ఫిలిప్పీన్స్‌లోవి చిన్నగా, లేత గులాబీ రంగులో ఉన్నాయని ఆయన చెప్పారు.

అయితే జన్యు పరీక్షలో అవి ఒకేరకం జాతికి చెందినవని తేలింది.

పుట్టగొడుగులపై విస్తృత పరిశోధనలు

వాసన్, హైమ్ రికార్డుల్లో ఉన్న పుట్టగొడుగుల కోసం 2025 డిసెంబరులో డోమ్నావర్ సూపర్ వైజర్ కూడా పపువా న్యూగినియా వెళ్లారు.

అక్కడ అవి ఉన్నాయా లేదా అన్నది 'పెద్ద ప్రశ్న' అని డోమ్నావర్ చెప్పారు. అక్కడ వారికి ఏమీ కనిపించలేదు. మిస్టరీ అలాగే ఉండిపోయింది.

''ఆ పుట్టగొడుగులు కూడా అవే జాతులకు చెందినవయితే అది ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎందుకంటే చైనా, ఫిలిప్పీన్స్‌లో కనిపించే రకాలు అక్కడ మామూలుగా ఉండవు. అవి ఇతర జాతులకు చెందినవి కావొచ్చు. పరిణామక్రమంలో అవి అలా రూపాంతరం చెంది ఉంటే అది మరింత ఆసక్తికరం. అంటే ఇదే లిల్లీపుట్ ప్రభావం ప్రపంచంలోని విభిన్న ప్రాంతాల్లో రకరకాల పుట్టగొడుగుల్లో దానంతటదే పరిణామం చెందిందని అనుకోవాలి'' అని డోమ్నావర్ తెలిపారు.

ప్రకృతిలో ఇలా జరుగుతుందనడానికి ఇంతకుముందే ఉదాహరణ ఉంది. డోమ్నావర్‌లాగే అదే లాబొరేటరీలో పనిచేసే శాస్త్రవేత్తలు తాజాగా మ్యాజిక్ పుట్టగొడుగుల్లో సిలోసైబిన్‌ను కనుగొన్నారు.

ఇది మ్యాజిక్ మష్‌రూమ్‌ల్లో కనిపించే భ్రమను కలిగించే అణువు. పూర్తిగాభిన్నమైన రెండు రకాల పుట్టగొడుగుల్లో ఇది స్వతంత్రంగా పరిణామం చెందింది.

కానీ ఎల్. ఏసియాటికా పుట్టగొడుగుల్లో కనిపించే లిల్లీపుటియన్ ప్రభావానికి సిలోసైబిన్ కారణం కాదని డోమ్నావర్ చెబుతున్నారు.

ఎల్. ఏసియాటికా కలిగించే భ్రమలకు కారణమైన రసాయన సమ్మేళనాన్ని గుర్తించడానికి ఆయన, ఆయన బృందం ఇంకా ప్రయత్నిస్తున్నారు.

చిత్ర విచిత్ర భ్రమలు

ప్రస్తుత పరీక్షల ప్రకారం దానికి ఏ ఇతర సైకెడెలిక్‌ సమ్మేళనంతోనూ సంబంధం ఉన్నట్టు కనిపించడం లేదు. ఇది కలిగించే అనుభూతులు ఎక్కువ కాలం ఉంటాయి.

సాధారణంగా ప్రభావం మొదలుకావడానికి 12 నుంచి 24 గంటలు పడుతుంది. ఆ భ్రాంతులు ఒకటినుంచి మూడు రోజులపాటు ఉంటాయి.

కొన్ని కేసుల్లో అయితే ఆస్పత్రిలో ఓ వారం పాటు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది.

ఈ భ్రమలు అసాధారణంగా ఎక్కువకాలం ఉండడం, అయోమయం, తలతిరగడం వంటి దుష్ప్రభావాలు ఎక్కువకాలం కొనసాగే అవకాశం ఉండడంతో ఆ పచ్చిపుట్టగొడుగులను తినే ప్రయత్నం డోమ్నావర్ ఇప్పటిదాకా చేయలేదు.

ఇలా ఎక్కువరోజులు కొనసాగే భ్రమల కారణంగానే చైనా, ఫిలిప్పీన్స్, పపువా న్యూ గినియాలోని వీటిని మత్తు ప్రభావాల కోసం వాడకపోవడానికి కారణం కావచ్చని డోమ్నాయర్ చెబుతున్నారు.

''అది ఒక తినే ఆహారం. భ్రమలు అనుకోకుండా కలిగే దుష్ప్రభావాలు'' అని ఆయన తెలిపారు.

ఇంకొక ఆసక్తికరమైన అంశం. ఇప్పటివరకు తెలిసిన సైకెడెలిక్ సమ్మేళనాలు ఒక్కొక్కరిలో ఒక్కోలాంటి చిత్రవిచిత్ర భ్రమలను కలిగించడమే కాదు..ఒకే వ్యక్తిలోనూ విభిన్నరకాల భ్రాంతిని ఏర్పరుస్తాయి.

అయితే ఎల్.ఏసియాటికా విషయం దీనికి భిన్నం. ''మరగుజ్జు మనుషులు కనిపించడం నమ్మశక్యంగా అనిపిస్తుంది. పదే పదే దీని గురించి వినిపిస్తుంటుంది. ఇలా ఒకే రకమైన భ్రమలు ఎప్పుడూ కలిగించే పదార్థం నాకు మరొకటి తెలియదు'' అని డోమ్నావర్ తెలిపారు.

మనసుపై చూపించే ప్రభావమేంటి?

ఈ పుట్టగొడుగును అర్ధం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ ఇతర సైకెడెలిక్ సమ్మేళనాలపై జరిగిన అధ్యయనాల్లానే దీనిపై జరిగిన శాస్త్రీయ అధ్యయనం కూడా చైతన్యం అంటే ఏంటి? మనసుకు, వాస్తవికతకు మధ్య ఉండే సంబంధం ఏంటి వంటి పెద్ద పెద్ద ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేయొచ్చు.

ఎల్.ఏసియాటికాను తినని వాళ్లల్లో కూడా కనిపించే లిల్లీపుటియన్ భ్రమలకు కారణమేంటనేదానిపైనా ముఖ్యమైన ఆధారాలను ఇది ఇవ్వగలదు.

అయితే ఇది అరుదైనది. 1909లో లిల్లీపుటియన్ భ్రమల గురించి మొదటిసారి వివరించిన తర్వాత పుట్టగొడుగులకు సంబంధం లేకుండా ఇలా కనిపించిన కేసులను 2021 వరకు గమనిస్తే 226 మాత్రమే ఉన్నాయి.

అయితే ఆ కొద్దిమందిలో కూడా పరిణామాలు తీవ్రంగా ఉండిఉండొచ్చు. పుట్టగొడుగులతో సంబంధం లేకుండా అలాంటి భ్రమలు కలుగుతున్నాయని వచ్చిన రోగుల్లో మూడోవంతుమంది పూర్తిగా కోలుకోలేదు.

ఇలా సహజంగా కనిపించే లిల్లీపుటియన్ దృశ్యాల వెనక మెదడు పనితీరును శాస్త్రవేత్తలు అర్ధం చేసుకోవడానికి ఎల్.ఏసియాటికాపై అధ్యయనం ఉపయోగపడుతుందని డోమ్నావర్ అంటున్నారు.

నాడీ సంబంధిత సమస్యలకు కొత్త చికిత్సలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముంటుందని తెలిపారు.

''ఈ లిల్లీపుటియన్ భ్రమలు మెదడులో ఎక్కడినుంచి మొదలవుతాయో అర్ధం చేసుకోవచ్చు'' అని అమెరికాలోని కాలిఫోర్నియాలో నేచురల్ ఫిలాసఫీ మెక్‌కెన్నా అకాడమీ డైరెక్టర్ డెన్నిస్ మెక్‌కెన్నా చెప్పారు.

పుట్టగొడుగుల సమ్మేళనాన్ని అర్ధం చేసుకోవడం వల్ల దీనికి మార్గం సుగమమవుతుందని ఆయన అంగీకరిస్తున్నారు. దీనికి వైద్యపరమైన ఉపయోగం ఉందా లేదా చూడాల్సి ఉందన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)