కొంగలా ఒంటికాలిపై నిల్చోవడం ప్రాక్టీస్ చేస్తే ముసలితనంలో తూలి పడిపోయే సమస్యలు తగ్గుతాయంటున్న నిపుణులు, ఇంకా ఏం చెప్పారంటే..

    • రచయిత, డేవిడ్ కాక్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పెద్దవాళ్లయ్యేకొద్దీ ఒక కాలుపై నిలబడడం కష్టంగా అనిపిస్తుంటుంది. అయితే దీన్ని సాధన చేస్తే అనేక ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.

దీనివల్ల మరింత బలంగా తయారవ్వొచ్చు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.

కొంగలాగా ఎక్కువసేపు మనుషులు ఒంటి కాలుపై నిలబడలేరు. వయసును బట్టి ఇది ఇంకా కష్టంగా అనిపిస్తుంది. చిన్నపిల్లలకు ఒకే కాలుపై నిలబడడంలో పెద్ద సమస్య అనిపించదు. తొమ్మిది, పదేళ్ల వయసొచ్చేటప్పటికి ఇలా నిలబడగలగడం చాలా తేలిగ్గా జరిగిపోతుంటుంది.

30ల చివర్లో ఇలా బ్యాలెన్స్ చేయగల సామర్థ్యం బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత తగ్గిపోతుంటుంది.

50దాటిన తర్వాత ఒకే కాలుపై కొన్ని సెకన్ల పాటు నిలబడగలగడం మన ఆరోగ్యం గురించి చాలా విషయాలు చెబుతుంది.

బ్యాలెన్స్ గురించి ఎందుకు శ్రద్ధ తీసుకోవాలంటే?

ఒంటి కాలుపై నిలబడే ఈ తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల వయసు పెరిగేకొద్దీ ఆరోగ్యంపై గట్టి ప్రభావం ఉంటుంది.

''ఇలా నిలబడడం కష్టంగా అనిపిస్తుందంటే మీరు దానిని సాధన చేయడం మొదలుపెట్టాల్సిన సమయం వచ్చేసిందని అర్ధం'' అని అమెరికన్ అకాడమీ ఫిజికల్ మెడిసిన్ అండ్ రీహాబిలిటేషన్‌లో మెడిసిన్ స్పెషలిస్ట్ ట్రేసీ ఎస్పిరిటు మెక్‌కే చెప్పారు.

ఒక కాలుపై నిల్చోవడాన్ని ఆరోగ్యం గురించి తేలిపే అంశంగా డాక్టర్లు భావించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వయసుతో పాటు వచ్చే కండరాల సమస్యలు.

30ఏళ్ల తర్వాత ప్రతి పదేళ్లకాలంలో కండరాల పటుత్వం 8 శాతం తగ్గిపోతుంటుంది.

ఓ పరిశోధన ప్రకారం మనం 80ల వయసుకు చేరుకునేటప్పటికీ సగం మందిలో కండరాల పటుత్వం బాగా తగ్గిపోతుంది.

రక్తంలో చక్కెర నియంత్రణ తగ్గడం నుంచి రోగనిరోధకశక్తి బలహీనమవడందాకా అన్ని సమస్యలూ కండరాల పటుత్వంతో ముడిపడిఉన్నాయి.

కండరాల బలహీనత వల్ల ఒక కాలుపై నిలబడే సామర్థ్యం తగ్గిపోతుంది. అయితే ఇలా బ్యాలెన్స్ చేయడం సాధన చేసేవారికి తర్వాతి దశాబ్దాల్లో కండరాల బలహీనత తగ్గిపోతుంది.

ఈ తేలికపాటి వ్యాయామం కాళ్లు, నడుము కండరాలను బలంగా ఉంచుతుంది.

మెదడు పనితీరుపై ప్రభావం

ఒక కాలుపై నిలబడగలిగే మన సామర్థ్యానికి, మన మెదడు పనితీరుకు కూడా సంబంధముంది.

అయితే, తేలిగ్గా అనిపించే ఈ భంగిమలో నిలబడటానికి కండరాల పటుత్వం ఒక్కటే సరిపోదు.

శరీరం ఏ స్థితిలో ఉందో, మన కళ్లు, చెవి లోపలి భాగం, నాడుల వ్యవస్థ ఇచ్చే సమాచారాన్ని మెదడు గ్రహించగలిగే సామర్థ్యానికీ, ఈ వ్యాయామానికీ సంబంధముంది.

''ఇవన్నీ వయసు పెరిగేకొద్దీ అనేక రకాలుగా బలహీనపడుతుంటాయి'' అని రోచెస్టర్‌లో మయో క్లినిక్‌లో మోషన్ ఎనాలసిస్ లాబొరేటరీ డైరెక్టర్ కెంటన్ కాఫ్‌మాన్ చెప్పారు.

స్పందించే వేగం, రోజువారీపనుల్లో కనబరిచే సామర్థ్యం, ఇంద్రియవ్యవస్థలనుంచి వచ్చే సమాచారాన్ని క్రోడీకరించుకోగలగడం వంటివి సహా మెదడు ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలను ఒకే కాలుపై నిలబడగలిగే శక్తి ద్వారా అంచనావేయొచ్చని మెక్‌కే చెప్పారు.

వయసు పెరిగే కొద్దీ మెదడు స్పందన వేగం తగ్గిపోతుంటుంది. కానీ ఇది వేగంగా జరిగితే, శారీరకంగా చురుగ్గా ఉండడం, తర్వాతి సంవత్సరాల్లో స్వతంత్రంగా జీవించగలగడంపై ప్రభావం పడుతుంది.

నిలబడలేక పడిపోవడం లాంటి ప్రమాదాన్ని పెంచుతుంది. 65ఏళ్లు పైబడినవారిలో బ్యాలెన్స్ కోల్పోవడం వల్లే అనుకోకుండా పడిపోయి గాయపడడం వంటివి జరుగుతుంటాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సేకరించిన సమాచారంలో తేలింది.

ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి ఒంటికాలిపై సాధన చాలా మంచి మార్గమని పరిశోధకులు చెబుతున్నారు.

మన ప్రతిస్పందన వేగం తగ్గడం మనం పడిపోవడానికి చాలాసార్లు కారణమవుతుందని కాఫ్‌మాన్ చెప్పారు.

''నడిచివెళ్లేటప్పుడు రోడ్డు మీద పగులు ఉన్న చోట కాలేసినట్టు ఊహించుకోండి. అలాంటి సందర్భాల్లో మన బలం కాకుండా కాలిని ఎంత వేగంగా కదిలించగలగడమన్నదే మనం పడిపోకుండా ఉండడానికి కారణమవుతుంది'' అని తెలిపారు.

ఆరోగ్యానికి సంకేతం

ఒక కాలిపై నిలబడగలగడం అనేది అకాలమరణం ప్రమాదాన్ని కూడా తెలియజేస్తుంది.

10 సెకన్ల పాటు నిల్చోలేని మధ్య వయసు వారు, అంతకన్నా ఎక్కువ వయసున్నవారు ఏడేళ్లలో ఏదో ఒక కారణంతో మరణించే అవకాశం 84శాతం కన్నా ఎక్కువ ఉన్నట్టు 2022లో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది.

మరో అధ్యయనంలో భాగంగా 50ల వయసులో ఉన్న 2,760మంది పురుషులు, మహిళలకు మూడు పరీక్షలు నిర్వహించారు.

చేతిలో పటుత్వం, ఒక్క నిమిషంలో ఎన్నిసార్లు కూర్చోగలుగుతున్నారు, లేవగలుగుతున్నారు, కళ్లుమూసుకుని ఒంటికాలిపై ఎంత సేపు నిలబడగలుగుతున్నారు అన్నది పరిశీలించారు.

వ్యాధుల ప్రమాదాన్ని అంచనావేయడంలో ఒక కాలిపై నిల్చోవడమనే పరీక్ష అత్యంత కీలకమైనదిగా గుర్తించారు.

రెండు సెకన్లు లేదా అంతకంటే తక్కువ సేపు మాత్రమే ఒక్కకాలుపై నిలబడగలిగినవారు 10సెకండ్లుకన్నాఎక్కువ సేపు నిలబడగలిగినవారితో పోలిస్తే తదుపరి 13ఏళ్లలో చనిపోయే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది.

డిమెన్షియా(ఎక్కువగా మర్చిపోవడం, ఆలోచనాశక్తి తగ్గడం) ఉన్నవారిలో సైతం ఇది కనిపిస్తుందని మెక్‌కే చెప్పారు.

ఒక కాలుపై నిల్చోగలిగిన డిమెన్షియా రోగుల్లో వ్యాధి తీవ్రత పెరగడం తక్కువగా ఉంటుందని తెలిపారు.

అల్జీమర్స్‌తో బాధపడేవారు ఒంటికాలిపై ఐదు సెకన్లు కూడా నిల్చోలేకపోతే వారి ఆరోగ్యం వేగంగా క్షీణిస్తున్నట్టని ఆమె అంటున్నారు.

‘ఎంత సాధన చేస్తే అంత మంచిది’

ఒంటి కాలిపై నిల్చోవడం బాగా సాధన చేయడం ద్వారా వయసు సంబంధిత సమస్యలను తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

శాస్త్రవేత్తలు ''ఒంటి కాలిపై సాధన''(సింగిల్ లెగ్ ట్రైనింగ్)‌గా పిలిచే ఈ వ్యాయామం నడుము, కాళ్ల కండరాలతో పాటు మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెప్పారు.

''మన మెదడు స్థిరంగా ఉండదు. అనేక మార్పులకు లోనవుతుంటుంది. ఒంటికాలిపై సాధన బ్యాలెన్స్‌ను నియంత్రిస్తుంది. మెదడు నిర్మాణాన్ని మారుస్తుంది. కదలికలు, ఇంద్రియాల సమాచారం, చుట్టుపక్కల పరిసరాలపై అవగాహన వంటివాటిలో కీలకపాత్ర పోషిస్తుంది'' అని మెక్‌కే చెప్పారు.

యువతపై కూడా ఈ వ్యాయాయం ప్రభావం ఉంటుందని, పనిచేసే సామర్థ్యాన్ని, జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుందని ఓ అధ్యయనంలో తేలింది.

65ఏళ్లు దాటిన వారు వారానికి కనీసం మూడుసార్లు ఒంటికాలిపై నిల్చోవడం సాధన చేయాలని, దీనివల్ల వారి కదలిక మెరుగుపడుతుందని, పడిపోయే ప్రమాదం తగ్గుతుందని మెక్‌కే సూచిస్తున్నారు.

అసలు ఈ వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకుంటే మరీ మంచిదని ఆమె చెబుతున్నారు.

‘పళ్లు తోముకునేటప్పుడైనా చేయొచ్చు’

చిన్నవయసులోనే ఈ వ్యాయామం చేయడం మొదలుపెడితే చాలా ప్రయోజనాలుంటాయి.

2022లో జరిగిన అధ్యయనానికి రియో డి జెనిరోలోని క్లినిమెక్స్ క్లినిక్ ఎక్సర్‌సైజ్ మెడిసన్ పరిశోధకులు క్లాడియో గిల్ అరౌజో నేతృత్వం వహించారు.

50ఏళ్ల దాటిన ప్రతి ఒక్కరూ ఒంటి కాలిపై 10సెకన్లపాటు నిలబడగలమా లేదా అనేది పరీక్షించుకోవాలని సూచించారు.

''చాలా తేలికగా దీన్ని దినచర్యలో భాగం చేసుకోవచ్చు. పళ్లు తోముకునేటప్పుడు పది సెకన్ల పాటు ముందు ఒక కాలిపై నిల్చోవాలి. తర్వాత ఆ కాలిని మామూలుగా ఉంచి, మరో కాలిపై నిల్చోవాలి. చెప్పుల్లేకుండానూ, చెప్పులు వేసుకునీ ఇది చేయాలి. ఎందుకంటే రెండింటికీ కొంచెం తేడా ఉంటుంది'' అని ఆయన చెప్పారు.

ఖాళీ పాదాలతో నిలబడినప్పటితో పోలిస్తే, చెప్పులు వేసుకుని నిలబడినప్పుడు స్థిరత్వం భిన్నంగా ఉంటుంది.

సింక్ దగ్గర గిన్నెలు కడిగేటప్పుడు, బ్రష్ చేసుకునేటప్పుడు ఒంటి కాలిపై నిల్చునే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

వీలయినంతవరకు స్థిరంగా నిలబడడం సాధన చేయాలి. రోజుకు పదినిమిషాలు ఈ వ్యాయామానికి కేటాయిస్తే కలిగే ప్రయోజనాలు అపారం.

‘అన్ని వయసులవారూ చేయాల్సిన వ్యాయామం’

నడుమును బలంగా చేసే తేలికపాటి వ్యాయామాలు కూడా ఒంటికాలిపై నిలబడే సామర్థ్యాన్ని పెంచుతాయి.

బలాన్ని పెంచే, ఏరోబిక్, బ్యాలెన్స్ ట్రైనింగ్ వ్యాయామాలు పడిపోయే ప్రమాదాలను 50శాతం మేర తగ్గిస్తాయని అధ్యయనాల్లో తేలింది.

ఒంటికాలితో నిలబడే వ్యాయామాలున్న యోగా, తామ్ చి వంటివి వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండడానికి కారణమవుతున్నాయి.

తాయ్ చి వల్ల పడిపోయే ప్రమాదం 19శాతం తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలినట్టు కాఫ్‌మన్ చెప్పారు.

నిరంతరం సాధన చేస్తే 90ఏళ్లు, అంతకు పైబడిన వయసులో కూడా మంచి బ్యాలెన్స్ తెచ్చుకోవచ్చని గిల్ అరౌజో చెప్పారు.

''మా క్లినిక్‌లో 95ఏళ్ల వయసున్న మహిళను పరీక్షించాం. ఆమె ఉత్తపాదాలతో పది సెకన్లపాటు ఒంటికాలిపై నిల్చోగలుగుతున్నారు. వందేళ్ల వయసు ఉన్నప్పటికీ మన జీవితం చివరి రోజుల్లో శరీర వ్యవస్థల పనితీరును మెరుగుపర్చుకోవచ్చు'' అని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)