టీ20 వరల్డ్ కప్‌: ఇందులో ఆడకపోతే బంగ్లాదేశ్‌‌ క్రికెట్ బోర్డుకు, ఆటగాళ్లకు ఎంత నష్టం వస్తుందంటే...

దేశంలోని తాత్కాలిక ప్రభుత్వం, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)తో అనేక రౌండ్ల సమావేశాల తర్వాత భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఆడకూడదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిర్ణయించుకుంది.

తమ చర్చలు, ప్రయత్నాలు కొనసాగిస్తామని బీసీబీ పేర్కొన్నప్పటికీ, టోర్నీ ప్రారంభానికి ఇంకా రెండు వారాలు మాత్రమే ఉండటంతో షెడ్యూల్‌లో ఇప్పటికిప్పుడు మార్పు సాధ్యం కాదని ఐసీసీ స్పష్టంచేసింది.

చాలావరకు క్రికెట్ బోర్డులు, క్రికెటర్లకు ఐసీసీ టోర్నీలే ప్రధాన ఆదాయ వనరు. ఈ టీ20 ప్రపంచకప్‌లో ఆడకపోతే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో పాటు ఆ దేశ క్రికెటర్లు, సంబంధిత వ్యక్తులందరూ ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది.

ఈ టోర్నీలో పాల్గొంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, దాని క్రికెటర్లు, కోచింగ్ సిబ్బంది, మేనేజ్‌మెంట్‌కు దాదాపు 3 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 2.74 కోట్లు) లభిస్తాయి.

అంతేకాదు, టోర్నీలో టాప్-12లోకి ప్రవేశించే ఏ జట్టుకైనా దాదాపు 4.5 లక్షల డాలర్లు (రూ.4.12 కోట్లు) లభిస్తాయి. ఇది బంగ్లాదేశ్ కరెన్సీలో 5.5 కోట్ల టాకాలకు సమానం.

స్పాన్సర్‌షిప్ ఆదాయాలపై ప్రభావం

బంగ్లాదేశ్ ఆటగాళ్లు మ్యాచ్ ఫీజులు, పెర్ఫార్మెన్స్ బోనస్‌లు, ప్రైజ్‌మనీని కూడా కోల్పోతారు. దీని ఫలితంగా జాతీయ జట్టులోని క్రికెటర్లకూ ఆర్థికపరంగా నష్టమే.

బీసీబీ కూడా ఈ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో పాల్గొంటే, ఐసీసీ నుంచి బీసీబీ 3-5 లక్షల డాలర్లు పొందే అవకాశం ఉంది.

టీ20 ప్రపంచకప్ అత్యధికంగా సంపాదించే టోర్నీలలో ఒకటి. బంగ్లాదేశ్ పాల్గొనకపోతే ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్ ఆదాయాలు కూడా ప్రభావితమవుతాయి. భారత ఉపఖండంలో ఆడే బంగ్లాదేశ్ మ్యాచ్‌లు టీవీలో ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షిస్తాయి.

ఇప్పుడు, బంగ్లాదేశ్ ఆడకపోతే టీఆర్పీలు తగ్గుతాయి. ఇది ప్రకటనదారులు, స్పాన్సర్ల ఆసక్తిని కూడా తగ్గించవచ్చు. బంగ్లాదేశ్ మ్యాచ్‌లను తగ్గిస్తే, టోర్నీ వాణిజ్య ప్రభావం కూడా తగ్గుతుందని చాలామంది మాజీ క్రికెటర్లు, వ్యాఖ్యాతలు ఆందోళన వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్ క్రికెటర్లు అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడటం ద్వారా కనీసం 2.5 లక్షల టాకాలు(రూ. 1.8 లక్షలు) సంపాదిస్తారు. గణాంకాలను పరిశీలిస్తే, 2024లో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ప్రైజ్‌మనీనే ఇప్పటివరకు టోర్నీ చరిత్రలో అత్యధికం. ఈ 9వ ఎడిషన్ ప్రపంచకప్ వెస్టిండీస్, అమెరికాలోని తొమ్మిది వేదికలలో జరిగింది. ఇందులో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. ఆ సమయంలో టీమ్స్ పార్టిసిపేషన్ పరంగా ఇదే అతిపెద్ద టీ20 ప్రపంచకప్.

ఆ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన జట్టు దాదాపు 12.80 లక్షల డాలర్లు అందుకుంది. సెమీఫైనల్‌లో ఓడిన రెండు జట్లకు చెరో 7,87,500 డాలర్లు లభించాయి. రెండో రౌండ్ తర్వాత ఎలిమినేట్ అయిన జట్లకు 3,82,500 డాలర్లు దక్కాయి. ఆ సమయంలో, 9 నుంచి 12వ స్థానంలో ఉన్న జట్లు 2,47,500 డాలర్లు అందుకున్నాయి. 13 నుంచి 20వ స్థానంలో ఉన్న జట్లకు 2,25,000 డాలర్లు దక్కాయి.

ఇది కాకుండా, సెమీఫైనల్స్, ఫైనల్స్ మినహా ప్రతి మ్యాచ్‌లో గెలిచిన జట్టు అదనంగా 31,154 డాలర్లు సంపాదించింది.

ఐసీసీకి ఎంత నష్టం?

బంగ్లాదేశ్ లేకుండా ప్రపంచకప్ వంటి టోర్నీ నిర్వహించడం ఐసీసీకి కూడా నష్టమేనని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ బుల్బుల్ అభిప్రాయపడ్డారు. అది దాదాపు 20 కోట్ల మంది ప్రేక్షకులను కోల్పోవలసి ఉంటుందని గుర్తుచేశారు. అయితే, ఈ టోర్నీ ప్రసార హక్కులు ముందుగానే అమ్ముడవుతాయి. దీంతో, ఐసీసీ కంటే ప్రసారకులు, ప్రకటనదారుల నష్టాలు భారీగా ఉంటాయి.

బంగ్లాదేశ్, భారత్‌ల మధ్య పెరిగిన రాజకీయ ఉద్రిక్తతలతో, ఇరు దేశాల మధ్య పర్యటక వీసా సేవలు కూడా నిలిపివేశారు. ఒకవేళ, బంగ్లాదేశ్ ప్రపంచకప్‌లో పాల్గొన్నప్పటికీ, ఆ దేశ క్రికెట్ అభిమానులు మ్యాచ్ చూడటానికి భారత్ రావడం కష్టం.

ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్ కోల్‌కతాలో మూడు, ముంబయిలో ఒక మ్యాచ్ ఆడుతుంది. కానీ, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు నుంచి ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించిన తర్వాత, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఒక క్రికెటర్ భద్రతకు గ్యారంటీ లేనపుడు, టోర్నీ సమయంలో ఇతర ఆటగాళ్లు, జర్నలిస్టులు, ప్రేక్షకుల భద్రతకు ఎలా గ్యారంటీ ఇస్తారని ప్రశ్నించింది.

పట్టు విడవని బంగ్లాదేశ్

ఇండియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనబోదని గురువారం సాయంత్రం బీసీబీ, అంతకుముందు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పష్టంచేశాయి.

ఐసీసీ నిర్ణయంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలో క్రీడా సలహాదారైన ఆసిఫ్ నజ్రుల్, బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

"ప్రభుత్వ నిర్ణయం స్పష్టంగా ఉంది. బంగ్లాదేశ్ జట్టు ఇండియాలో జరగబోతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లలో పాల్గొనదు" అని ఆసిఫ్ నజ్రుల్ మీడియా సమావేశంలో ప్రకటించారు.

"ఐసీసీ మాకు న్యాయం చేయలేదు. మా భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడాలనే మా అభ్యర్థనను అంగీకరిస్తుందని ఆశిస్తున్నాం" అన్నారు.

మా పౌరుల భద్రతకు ముప్పు వాటిల్లితే దాని వల్ల కలిగే పరిణామాలపై తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయం గురించి క్రికెటర్లతో ప్రైవేట్‌గా మాట్లాడానని ఆసిఫ్ చెప్పారు.

ఆటగాళ్ల భద్రతపై ఆసిఫ్ ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇది ఊహాజనిత సమస్య కాదన్నారు. దీని వెనుక బలమైన కారణం ఉందన్నారు.

"మా దేశంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరైన ముస్తాఫిజుర్ రెహమాన్ భద్రతకు గ్యారంటీ ఇవ్వలేకపోయారు. అటువంటి పరిస్థితిలో ఇతర ఆటగాళ్లు, జర్నలిస్టులు, ప్రేక్షకుల భద్రత ఎలా అన్న డౌట్ కూడా వస్తుంది" అని ఆసిఫ్ అన్నారు.

మరోవైపు, బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్ మాట్లాడుతూ "మేం బంగ్లాదేశ్ క్రికెట్ పట్ల గర్విస్తున్నాం, కానీ ఐసీసీ పాత్రపై సందేహాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ప్రజాదరణ తగ్గుతోంది. అటువంటి పరిస్థితిలో 20 కోట్ల మందిని విస్మరించడం నిరాశపరిచింది" అన్నారు.

కానీ, బోర్డు ఇంకా ఆశ వదులుకోలేదని ఆయన అన్నారు.

"మేం మళ్లీ ఐసీసీని సంప్రదిస్తాం. మేం ఇండియాలో కాదు, శ్రీలంకలో ఆడాలనుకుంటున్నాం" అని బుల్బుల్ అన్నారు.

తటస్థ వైఖరిపై ప్రతికూల ప్రభావం: ఐసీసీ

అయితే, షెడ్యూల్ ప్రకారం ఇండియాలోనే బంగ్లాదేశ్ తన మ్యాచ్‌లను ఆడాల్సి ఉంటుందని ఐసీసీ బుధవారం జరిగిన సమావేశం తర్వాత పేర్కొంది. ఒకవేళ, బంగ్లాదేశ్ అంగీకరించకపోతే టోర్నీ నుంచి ఆ జట్టును తొలగించి, మరొక జట్టును ఎంపిక చేసే అవకాశముంది.

టోర్నీ ప్రారంభానికి ముందు షెడ్యూల్‌ను మార్చడం సాధ్యం కాదని ఐసీసీ చెబుతోంది. భద్రతా ప్రమాదాలు లేకుండా మ్యాచ్‌లను మార్చడమనేది భవిష్యత్ ఐసీసీ టోర్నమెంట్‌లకు తప్పుడు సంకేతంగా నిలుస్తుందని, ఐసీసీ తటస్థ వైఖరిపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. ఈ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి బీసీబీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఐసీసీ తెలిపింది.

టోర్నీ పూర్తి భద్రతా ప్లాన్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర బలగాల భద్రతా ఏర్పాట్లపై కూడా ఐసీసీ సమాచారం ఇచ్చింది.

"నిష్పాక్షిక భద్రతా అంచనాలు, ఆతిథ్య దేశం ఇచ్చిన హామీలు, టోర్నమెంట్ షరతులపై షెడ్యూల్, వేదికల ఎంపిక ఆధారపడి ఉంటుంది. ఇవి టోర్నమెంట్‌లో పాల్గొనే 20 జట్లకు సమానంగా వర్తిస్తాయి. భద్రతాపరమైన భయాలకు సంబంధించి కచ్చితమైన, స్పష్టమైన ఆధారాలు లేనప్పుడు మ్యాచ్‌లను వేరే దేశానికి మార్చడం సాధ్యం కాదు" అని ఐసీసీ తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)