You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఓ అపార్థం కారణంగా రష్యా అధ్యక్షుడు ‘న్యూక్లియర్ బ్రీఫ్‌కేసు’ను యాక్టివేట్ చేశారా? 30 ఏళ్ల కిందట అసలేం జరిగింది?
- రచయిత, గ్రెగ్ మెక్‌కెవిట్
నార్వే 1995 జనవరి 25న ప్రయోగించిన ఓ రాకెట్‌ను చూసి, మాస్కోవైపు నేరుగా వస్తున్న అణుక్షిపణిగా పొరబడిన ఘటన ఓ పెద్ద ఉపద్రవానికి దారితీసే పరిస్థితి కల్పించింది.
ఈ ప్రయోగం ఫలితంగా ప్రపంచం కొన్నిగంటలపాటు ప్రచ్ఛన్నయుద్ధంనాటి భయానక అనుభవాలను గుర్తుచేసుకోవాల్సి వచ్చింది.
ఈ అపార్థం ఎలా మొదలైంది?
జనవరి 25, 1995 చలికాలపు రోజు మధ్యాహ్నం ఉత్తర రష్యాలోని రాడార్ స్టేషన్ల వద్దనున్న మిలటరీ టెక్నిషియన్లు తమ రాడార్ స్క్రీన్లపై అసాధారణంగా మెరుస్తున్న ఒక 'చుక్క'ను గమనించారు.
నార్వే తీర ప్రాంతం నుంచి ప్రయోగించిన రాకెట్ అది. క్షణాల్లోనే చాలా వేగంగా పైకి ఎగిసింది. అది ఎక్కడికి వెళుతోంది? అది ముప్పు కలిగిస్తుందా? బెర్లిన్ గోడ కూలిన తరువాత అణుఉద్రిక్తతలు ఆవిరైపోయాయని అప్పటికే చాలామంది భావించారు.
కానీ గగనతలాన్ని పర్యవేక్షిస్తున్న రష్యా రాడార్ సిబ్బందికి మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా కనిపించాయి. ఎందుకంటే రాకెట్ ఎగిసిన జలాల నుంచి అమెరికా జలాంతర్గమి ఒక క్షిపణిని ప్రయోగిస్తే చాలు కేవలం 15 నిమిషాల్లో మాస్కోపై 8 అణువార్ హెడ్స్‌ను పడేయగలదని వారికి తెలుసు. ఈ సందేశాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారు పై అధికారులకు పంపారు. చివరకు ఆ సంగతి అప్పటి రష్యా అధ్యక్షుడు బోరిస్ యెల్సిన్ వద్దకు చేరింది.
ఈ పరిణామాలు బోరిస్ యెల్సిన్‌ను ''న్యూక్లియర్ బ్రీఫ్‌కేసు''ను యాక్టివేట్ చేసిన తొలి ప్రపంచ నేతగా మార్చాయి. ఈ బ్రీఫ్‌కేసులో అణుబాంబు ప్రయోగానికి ఆదేశాలు ఎలా జారీ చేయాలనే సమాచారం, టెక్నాలజీ ఉంటుంది.
రెండో ప్రపంచయుద్ధం ముగిసిన తరువాత అణ్వాయుధాలు కలిగిన దేశాలు పాలసీ ఆఫ్ డిటెరెన్స్‌ను అనుసరించాయి. అంటే ఒకదేశం అణుదాడిచేస్తే, మరో దేశం కూడా అణుదాడి చేస్తుంది. దాంతో రెండు దేశాలూ పరస్పరం నాశనం అవుతాయి. అలాంటి ఉద్రిక్త క్షణంలో యెల్సిన్, ఆయన సలహాదారులు ప్రతీకారానికి దిగాలా వద్దా అని వేగంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
అయితే తీవ్ర ఉద్రిక్తతలన్నీ ఓ చిన్నపాటి వార్తగా మారి తేలికపరిచాయి.
బీబీసీ న్యూస్‌నైట్ ప్రజెంటర్ జెరెమీ పాక్స్‌మాన్ ‘‘మనమీ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక విషయం చెప్పాలి. ఈ రోజు అణుయుద్ధం జరగలేదు. అయితే ఒక రష్యన్ వార్తా సంస్థ చేసిన ప్రయత్నాల వల్ల అది జరగబోతోందేమో అన్నంత గందరగోళం నెలకొంది’’ అన్నారు.
ఆ రోజు మధ్యాహ్నం మాస్కో వార్తా సంస్థ ఇంటర్‌ఫాక్స్‌ను ఉటంకిస్తూ రష్యా తనవైపు వస్తున్న ఒక క్షిపణిని కూల్చివేసిందనే వార్తలు రావడం ప్రారంభమైంది. ఇక ప్రపంచం అంతమైపోతోందేమోనని భావించిన బ్రిటీషు విలేకరులు వెంటనే రక్షణమంత్రికి ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొంత గందరగోళానికి గురైనప్పటికీ ఒక బ్రిటిషు అధికారి ‘‘బ్రిటన్ రష్యాపై ఎలాంటి క్షిపణులు ప్రయోగించలేదని’’ చెప్పగలను అని నిబ్బరంగా తెలిపారు.
అదే సమయంలో అమెరికా రక్షణశాఖ ప్రతినిధి కూడా తనకేమీ స్పష్టంగా తెలియదని చెప్పారు.
‘‘మాకు తెలిసిందంతా కేవలం వార్తల ద్వారా తెలిసిన విషయమే’’ అన్నారు.
దీనివల్ల ప్రపంచ ఆర్థిక మార్కెట్లు కంపించిపోయాయి. రాబోయే విపత్తు ఏమిటో అర్థం చేసుకోగలిగిన రాజకీయనాయకులు, సైనికాధికారులు, జర్నలిస్టులు తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు.
కానీ తరువాత ఇంటర్‌ఫాక్స్ తన వార్తను సరిచేసుకుంది. నార్వే భూభాగంలో మిస్సైల్ రాకెట్ లాండ్ అయినట్టు రష్యా హెచ్చరిక వ్యవస్థ గుర్తించిందని పేర్కొంది.
తరువాత నార్వే రక్షణమంత్రి తమ ప్రయోగం శాంతియుతంగా జరిగిందని చెప్పారు. కేవలం నార్నర్త్ లైట్స్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ప్రయోగించిన రాకెట్ అని చెప్పారు. ఈ రాకెట్ దిగిన ప్రాంతం రష్యా గగనతలానికి అత్యంత సమీపంలో ఉంది.
రష్యా రక్షణ వ్యవస్థలను దాటేసిన యువకుడు
రష్యా తన గగనతల రక్షణ సామర్థ్యాల విషయంలో 1987 నుంచి చాలా జాగ్రత్తగా ఉంటోంది. ఎందుకంటే.. పశ్చిమ జర్మనీకి (అప్పుడు మిత్ర దేశాల ఆక్రమణలో ఉండేది) చెందిన మాథియాస్ రస్ట్ అనే యువకుడు సింగిల్ ఇంజిన్ విమానంలో 750 కి.మీలకు పైగా ప్రయాణించి, రష్యాకు చెందిన అన్ని రక్షణ వ్యవస్థలను దాటుకుని, క్రెమ్లిన్ గుమ్మం ముందుకు చేరుకున్నారు. అప్పటికే ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినా, ఆ ఘటన తర్వాత రష్యా చాలా జాగ్రత్తగా ఉంటోంది.
అందుకే, 1995లో బోరిస్ యెల్సిన్, ఆయన సలహాదారులు ప్రతిదాడిగా అణు బాంబులను ప్రయోగించాలా? అనేది నిర్ణయించాల్సి వచ్చింది.
తప్పు ఎక్కడ జరిగింది?
నార్వే శాస్త్రవేత్త కోల్బ్‌జార్న్ అడాల్ఫ్‌సన్‌కు పదేపదే ఫోన్లు వస్తున్నప్పుడు, ఆయనొక సమావేశంలో ఉన్నారు.
‘‘మేము రోజూ చేసే పరీక్షలకు ఇలాంటి స్పందన రావడం చూసి భయమేసింది’’ అన్నారు అడాల్ఫ్‌సన్. వరుసగా వచ్చిన ఫోన్ కాల్స్‌తో ఆయన దిగ్భ్రమ చెందారు. ఈ సంఘటనలో అన్నింటికంటే విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ రాకెట్ ప్రయోగం గురించి కొన్ని వారాల ముందే నార్వే మస్కోకు తెలియజేయడం.
నార్త్ పోల్ లైట్‌ను అధ్యయనం చేసేందుకు ప్రయోగించిన రాకెట్, మొదటిసారిగా బాలిస్టిక్ క్షిపణి ప్రయాణించగలిగే ఎత్తుకు (908 మైళ్లు, అంటే సుమారు 1450 కి.మీలు) చేరుకుందని.. అందుకే రష్యన్లు పొరపడి ఉండొచ్చని అడాల్ఫ్‌సన్ భావించారు.
''ఈ రాకెట్ ప్రయోగం గురించి అన్ని సంబంధిత దేశాలకు 1994 డిసెంబర్ 14నే నార్వే విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాచారం అందించింది'' అని కోల్బ్‌జార్న్ తెలిపారు. కానీ ఈ సమాచారం ఎవరి వద్దకు చేరాలో వారికి చేరలేదన్నారు.
ఓ సందేశం దారి తప్పితే ఎటువంటి విపరిణామాలకు దారితీస్తుందనడానికి ఇదో హెచ్చరిక.
ఇలాంటి పొరపాట్లు ఇంకా ఎన్ని జరిగాయి?
అణు యుగం ప్రారంభమైనప్పటి నుంచి అపాయానికి దగ్గరగా వచ్చిన అనేక ఘటనలు మనం గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడని స్థాయిలో జరిగాయి.
బీబీసీ ఫ్యూచర్ 2020 నాటి నివేదిక ఆకాశంలో ఎగిరే హంసలనుంచి, చంద్రుడు, కంప్యూటర్ లోపాలు, అంతరిక్ష వాతావరణ మార్పులు వంటి అనేక కారణాల వల్ల కూడా ఇలాంటి పొరపాటు అభిప్రాయాలు కలిగాయయని తెలిపింది.
ఓ విమానం 1958లో పొరపాటున అణు బాంబును ఓ ఇంటి తోటలోకి జారవిడిచింది. అదృష్టవశాత్తూ ఆ ఘటనలో ఆ కుటుంబానికి చెందిన కోళ్లు మాత్రమే మృతి చెందాయి.
అమెరికాకు చెందిన రెండు సైనిక విమానాలు 1966లో స్పెయిన్‌లోని ఓ మారుమూల పల్లె పైన ఢీకొన్నాయి. ఆ విమానాల్లో ఒకటి నాలుగు అణ్వాయుధాలను మోసుకెళ్తోంది.
ఇంకా ఇటీవలి కాలంలోనే, 2010లో, అమెరికా వైమానిక దళం కొద్దిసేపు 50 క్షిపణులతో సంబంధాన్ని కోల్పోయింది. దాంతో,వాటిని గుర్తించడానికి లేదా ఆపడానికి ఎలాంటి మార్గం లేకుండా పోయింది.
న్యూక్లియర్ బ్రీఫ్‌కేసు యాక్టివేట్ చేశారా?
న్యూక్లియర్ బ్రీఫ్‌కేసు యాక్టివేట్ చేసినట్లు వచ్చిన కథనాలను కొందరు రష్యన్లు ఖండిస్తూ.. ''చెచెన్యా ఘర్షణల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, తన ధైర్యసాహాసాలను ప్రదర్శించేందుకు యెల్సిన్ ఈ ప్రకటన చేశారు'' అని చెప్పారు.
''బటన్లతో ఉన్న నల్లటి బ్రీఫ్‌కేసు ఎప్పుడూ నాతోనే ఉంది. నిన్ననే మొదటిసారి దీన్ని వాడాను'' అని రష్యా వార్తా సంస్థ ఇంటర్‌ఫాక్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు యెల్సిన్.
''కొందరు మమ్మల్ని పరీక్షించాలనుకున్నారు. ఎందుకంటే, మా సైన్యం బలహీనమైందని మీడియా చెప్పడం వల్లనే..'' అన్నారు.
అణు క్షిపణి యుగంలో ఇదొక అత్యంత భయంకరమైన సంఘటన అని మాజీ సీఐఏ అధికారి ఒకరు అన్నారు.
''నిజంగా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తినప్పుడు కూడా ప్రపంచంలో అణు శక్తి ఉన్న మరే ఇతర నాయకుడు కూడా 'న్యూక్లియర్ బ్రీఫ్‌కేసు'ను యాక్టివేట్ చేసిన లేదా ఇలాంటి వ్యవస్థను వాడిన దాఖలాలు లేవు'' అని సైనిక సలహాదారు పీటర్ ప్రే రాశారు.
''ఈ ఘటనకు ర్యాంకు ఇవ్వాలనుకుంటే, నేను పదికి మూడే ఇస్తాను. ఎందుకంటే, ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఇలాంటి మరిన్ని ప్రమాదకర ఘటనలు నెలకొన్నాయి'' అని ఐక్యరాజ్యసమితి అణు నిరాయుధీకరణ పరిశోధకులు పావెల్ పాడ్విగ్ అన్నారు.
అమెరికా వార్తాపత్రిక 'వాషింగ్టన్ పోస్టు'కు 1998లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్యా అణు నిపుణుడు వ్లాదిమిర్ డ్వోర్కిన్.. '' నార్వే పరీక్ష ఎలాంటి ప్రమాదాన్ని తేలేదు. న్యూక్లియర్ బ్రీఫ్‌కేసుపై వచ్చిన కథనం ఆ తర్వాత రోజు సృష్టించి ఉండొచ్చు'' అన్నారు.
'' నార్వే రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారమే వ్యహరించింది. ఈ విషయంలో ఎలాంటి ప్రమాదం లేదు. అపార్థం చోటు చేసుకోవడం వల్లనే ఈ అలర్ట్ జారీ అయింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాం'' అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అప్పటి అధికార ప్రతినిధి తెలిపారు.
అణ్వాయుధాలు ఉన్న ఈ కాలంలో.. కేవలం ఒక చిన్న సందేశం చేరకపోయినా.. అది ఎంతటి భయంకరమైన పర్యవసనాలకు దారితీసే ప్రమాదం ఉందో గుర్తు చేసే హెచ్చరిక ఇది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)