బోర్డ్ ఆఫ్ పీస్: ఐక్యరాజ్య సమితిని బలహీనపరిచేందుకు ట్రంప్ దీన్ని తీసుకొస్తున్నారా? మిగతా దేశాలు ఏమంటున్నాయి...

దావోస్‌లో ప్రపంచ వార్షిక ఆర్థిక సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన ‘బోర్డ్ ఆఫ్ పీస్‌’ను (శాంతి బోర్డును) ‌ ఆవిష్కరించారు.

దీని పాత్రపై ప్రపంచ నేతల నుంచి ఆందోళనలు వినిపిస్తున్నవేళ, ఆయన దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ బోర్డు డోనల్డ్ ట్రంప్ అధ్యక్షతన పనిచేయనుంది. ఆయన అమెరికా అధ్యక్షుడిగా కొనసాగినా లేకున్నా దానితో సంబంధం లేకుండా ఆయన చైర్మన్‌గా ఉంటారు.

అనేక దేశాల నాయకులను ఈ బోర్డులో చేరాలని ఆయన ఆహ్వానించారు.

"ఒక్కసారి ఈ బోర్డు పూర్తిగా ఏర్పాటైతే… మనకు నచ్చింది మనం చేయొచ్చు. ఐక్యరాజ్య సమితితో కలిసి మేం పనిచేస్తాం" అని ట్రంప్ అన్నారు.

ఐక్యరాజ్య సమితి చేసే పనులు చేయడానికే ఈ బోర్డును ఏర్పాటు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ బోర్డు ఏర్పాటు ఆలోచన… మొదట గాజా కోసం ట్రంప్ తీసుకొచ్చిన 20- పాయింట్ల శాంతి ప్రతిపాదనలో ఉంది.

అయితే, అమెరికా ఇప్పుడు దీన్ని సంఘర్షణలను పరిష్కరించడానికి ఉద్దేశించిన ఒక కొత్త అంతర్జాతీయ సంస్థగా అభివర్ణిస్తోంది.

ఈ బోర్డులో శాశ్వత సభ్యత్వం పొందాలంటే ఒక బిలియన్ డాలర్లను చెల్లించాలి. భారతీయ కరెన్సీలో దాని విలువ సుమారు రూ. 9,185 కోట్లు.

ఇజ్రాయెల్ సహా సౌదీ అరేబియా, ఈజిప్ట్, తుర్కియే, అర్జెంటీనా, ఇండోనేషియా దేశాలు ఈ బోర్డులో సభ్యులుగా చేరతామని ప్రకటించాయి.

అయితే, ఇప్పటివరకు అమెరికా మినహా ఐకరాజ్య సమితి భద్రతా మండలిలోని ఏ శాశ్వత సభ్యదేశం కూడా ఇందులో సభ్యత్వం తీసుకోలేదు.

2003లో అమెరికా నేతృత్వంలో జరిగిన ఇరాక్ ఆక్రమణకు బ్రిటన్ బలగాలను పంపిన ఆ దేశ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్‌లు ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యులు.

అయితే, పాలస్తీనా ప్రతినిధులెవరూ ఇందులో లేరు.

'బోర్డ్ ఆఫ్ పీస్‌'లో చేరేందుకు అంగీకరించింది ఎవరంటే..

  • అల్బేనియా - ప్రధాన మంత్రి ఏడీ రామా
  • అర్జెంటీనా - అధ్యక్షుడు జేవియర్ మిలే
  • హంగేరీ - ప్రధాన మంత్రి విక్టోర్ ఆర్బాన్
  • ఇజ్రాయెల్ - ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూ
  • ఖతార్- ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌ రెహ్మాన్
  • కజకిస్తాన్‌ - అధ్యక్షుడు కాసిం జోమార్ట్ టోకాయెవ్
  • పరాగ్వే- అధ్యక్షుడు శాంటియాగో పెనా
  • ఉజ్బెకిస్తాన్- అధ్యక్షుడు షావ్‌కత్ మిర్జియోయెవ్

వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రెటరీ టో లామ్ కూడా ఇందులో చేరేందుకు అంగీకరించారని తెలుస్తోంది.

మరోవైపు, తాను ఇందులో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ప్రకటించారు.

కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ తాము సూత్రప్రాయంగా అంగీకరించామని చెబుతున్నారు.

అయితే, ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరేందుకు కెనడాకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కూడా ఈ బోర్డులో చేరేందుకు అంగీకరించారు.

ఇప్పటివరకు చేరని దేశాలేవి?

రష్యా నేత వ్లాదిమిర్ పుతిన్ ఇందులో చేరే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళనల నేపథ్యంలో… బ్రిటన్ ఇంకా ఈ బోర్డులో చేరేందుకు సంతకం చేయలేదని బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి యివెట్ కూపర్ (British Foreign Secretary Yvette Cooper) అన్నారు.

బ్రిటన్‌కు ఆహ్వానం అందినప్పటికీ… "ఈరోజు వరకు సభ్యత్వం తీసుకోలేదు" అని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక వద్ద బీబీసీతో చెప్పారు కూపర్.

స్లోవేనియా ప్రధానమంత్రి రాబర్ట్ గోలోబ్ ఈ ఆహ్వానాన్ని తిరస్కరించారు.

ఇంకా చేరని దేశాల్లో… ఫ్రాన్స్, జర్మనీ, నార్వే, స్వీడన్, డెన్మార్క్ లు ఉన్నాయి.

'బోర్డ్ ఆఫ్ పీస్‌'లో చేరాలంటే ఏం కావాలి?

లీక్ అయిన బోర్డు వ్యవస్థాపక (ఫౌండింగ్) ఛార్టర్ ప్రకారం… మూడు దేశాలు అధికారికంగా దీనికి కట్టుబడి ఉంటామని అంగీకరించిన తర్వాత చార్టర్ అమల్లోకి వస్తుంది.

సభ్య దేశాలు మూడేళ్ల కొకసారి తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవచ్చు.

1 బిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో రూ.9,185 కోట్లు) చెల్లించినవారికి శాశ్వత సభ్యత్వం ఇస్తారు.

ఇందులో చేరేందుకు ఎలాంటి నిబంధనలు లేవని అమెరికాకు చెందిన ఓ అధికారి సీబీఎస్ న్యూస్‌తో చెప్పారు.

అయితే, మూడేళ్లకు బదులుగా శాశ్వత సభ్యదేశంగా ఉండాలనుకునేవారు మాత్రమే బిలియన్ డాలర్లు చెల్లించాలని చెప్పారు.

ఈ డబ్బులు గాజా పునర్నిర్మాణం కోసం సాయపడతాయని అధికారులు చెప్పారు.

రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ పరిశీలించిన ముసాయుదా చార్టర్‌, లెటర్ కాపీ ప్రకారం… ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిలో లేకున్నా.. శాశ్వత అధ్యక్షుడిగా ఉండే ఈ బోర్డు, ఇతర సంఘర్షణలను కూడా పరిష్కరించేందుకు విస్తరించనుంది.

ఐక్యరాజ్య సమితిని ట్రంప్ బోర్డు బలహీనపరుస్తుందా?

"ప్రపంచ సంఘర్షణలను పరిష్కరించడానికి సాహసోపేతమైన కొత్త విధానాన్ని ప్రారంభిస్తుంది" అని ఈ లెటర్‌లో ట్రంప్ పేర్కొన్నారు.

అయితే, ఈ సంస్థ శాంతి స్థాపన, శాంతి పరిరక్షణతో పాటు అంతర్జాతీయ ఆంక్షలకు ప్రస్తుతం బాధ్యత వహిస్తున్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని బలహీనపరిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ చార్టర్ ప్రారంభంలోనే… అంతర్జాతీయ శాంతిని కాపాడటానికి మరింత చురుకైన, ప్రభావవంతమైన సంస్థ కావాల్సి ఉందని నొక్కి చెప్పినట్లుగా ఇజ్రాయెలీ వార్తా పత్రిక హారీట్జ్ తన కథనంలో తెలిపింది.

ఈ విషయంలో తరుచూ విఫలమవుతున్న సంస్థల నుంచి వైదొలగడానికి ధైర్యం అవసరం అని కూడా ప్రస్తావించినట్లు తెలిపింది.

"ఐకరాజ్య సమితి భద్రతా మండలి కీలక తీర్మానం 2803కి అనుగుణంగా ఈ సంస్థ ఉంటుంది" అని 'బోర్డ్ ఆఫ్ పీస్' గురించి విడుదల చేసిన ఓ ప్రకటనలో వైట్‌హౌస్ తెలిపింది.

"ఇది ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది"

"ఈ చార్టర్ గాజా నిర్మాణాన్ని మించి పనిచేస్తుంది" అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌‌తో సన్నిహితంగా పని చేసే ఒక సోర్స్ ఏఎఫ్‌పీ న్యూ స్ ఏజెన్సీతో తెలిపింది.

"ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నించడానికి వీల్లేని ఐక్యరాజ్యసమితి సూత్రాలు, స్వరూపం పట్ల గౌరవానికి సంబంధించి.." అని పేర్కొన్నట్లు రిపోర్టు చేసింది.

అదే సమయంలో… "బోర్డ్ ఆఫ్ పీస్‌ను విస్తరించే ఉద్దేశం అడ్మినిస్ట్రేషన్‌కు ఉన్నట్లుగా కనిపిస్తోంది. వాళ్లు ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి వ్యవస్థను కూడా మార్చే ప్రయత్నాల గురించి మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది" అని రాయ్‌టర్స్‌తో క్విన్సీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రెస్పాన్సిబుల్ స్టేట్‌క్రాఫ్ట్‌కు చెందిన ఖాలీద్ ఎల్జిందీ చెప్పారు.

"కాబట్టి, గాజాతో ఇది ప్రారంభమవుతుందని స్పష్టంగా తెలుస్తోంది. కానీ, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి ఇదే చివరిదైతే కాదు" అని అన్నారు.

ట్రంప్ ప్రభుత్వం.. ఇప్పటికే ఐక్యరాజ్యసమితికి అమెరికా అందించే నిధుల్లో కోత విధించింది.

గాజాలో యుద్ధాన్ని ముగించేలా తీసుకోవాల్సిన చర్యలపై అమెరికా వీటో, ఐక్యరాజ్య సమితి భద్రతామండలికి ఆటంకంగా నిలిచింది.

అలాగే, 31 ఐక్యరాజ్య సమితి విభాగాలు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేస్తున్నాయని పేర్కొంటూ, వాటి నుంచి వైదొలిగే ఓ మెమోరాండంపై 2026 జనవరి 7న ట్రంప్ సంతకం చేశారు.

ఇందులో యూఎన్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, యూఎన్ డెమోక్రసీ ఫండ్ వంటివి ఉన్నాయి.

పాలస్తీనియన్లు ఎవరూ లేరు

ఇక ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డులో పాలస్తీనియన్లు ఎవరూ లేరు. యాకిర్ గాబే అనే ఓ ఇజ్రాయెలీ మాత్రమే ఉన్నారు.

రియల్ ఎస్టేట్ బిలియనీర్ అయిన ఆయన ఇజ్రాయెల్‌లో పుట్టి, ప్రస్తుతం సైప్రస్‌లో ఉంటున్నారు.

అయితే ఇందులో గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ యుద్ధ వైఖరిని విమర్శించిన ఖతార్, తుర్కియే వంటి దేశాలకు చెందిన సీనియర్ రాజకీయ నేతలు ఉన్నారు.

"ఇంతకంటే విస్తృతమైన ప్రాతినిధ్యం ఉండాలని పాలస్తీనియన్లు ఆశించారు" అని బీబీసీ న్యూస్ వరల్డ్ సర్వీస్ వీకెండ్ ప్రోగ్రామ్‌లో రాజకీయ నేత ముస్తాపా బార్ఘౌటీ చెప్పారు.

"ఇది కొన్ని అంతర్జాతీయ అంశాలతో కూడిన అమెరికన్ బోర్డులా మాత్రమే కనిపిస్తోంది" అని ఆయన అన్నారు.

"ఈజిప్ట్‌లో జరిగిన శాంతి చర్చలో ఆమోదం తెలిపిన పాలస్తీనియన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రూప్ పాత్రపై స్పష్టత లేదు, ఇది సమస్యాత్మకంగా మారుతుంది" అని బార్ఘౌటీ అన్నారు.

అలాగే, గాజా పునర్నిర్మాణం కోసం రఫా సరిహద్దును తెరవడం విషయంలో ఇజ్రాయెల్ ఎంత మేరకు సుముఖత వ్యక్తం చేస్తుందనే విషయంలోనూ ఆయన తన సందేహాన్ని వెలిబుచ్చారు.

మరోవైపు, ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్మాణానికి సంబంధించిన చర్చల నుంచి తమను దూరం పెట్టారని ఇజ్రాయెల్ చెప్పింది.

‘‘ఇది ఇజ్రాయెల్‌తో సమన్వయం లేకుండా జరిగింది. మా పాలసీకి విరుద్ధంగా ఇది ఉంది" అని ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం తెలిపింది.

ఈ ప్రకటనను "ఇది ఇజ్రాయెల్ దౌత్య పరాజయం" అని ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేత యాయిర్ లాపిడ్ తెలిపారు.

"గాజా పునరావాసాన్ని పర్యవేక్షించడానికి ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ కమిటీ గాజా స్ట్రిప్‌కు అవసరం లేదు. దాన్ని హమాస్ ఉగ్రవాదుల నుంచి ప్రక్షాళన చేయాలి" అని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్- గ్విర్ ఎక్స్‌లో రాశారు.

ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్' ఎలా పని చేస్తుందంటే..?

'బోర్డ్ ఆఫ్ పీస్‌'తో పాటు, మరో రెండు అనుబంధ సీనియర్ బోర్డులను కూడా ప్రకటించారు.

  • ఒకటి.. "ఫౌండింగ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు". ఇది పెట్టుబడులు, దౌత్యంపై ప్రధానంగా దృష్టి పెడుతుంది.
  • మరొకటి "గాజా ఎగ్జిక్యూటివ్ బోర్డు". ఈ బోర్డు గాజాకు సంబంధించి క్షేత్రస్థాయి పనులను పర్యవేక్షిస్తుంది. ఈ బోర్డులో గాజా తాత్కాలిక పాలన, పునర్నిర్మాణ బాధ్యతలను నిర్వర్తించే టెక్నోక్రాట్స్ ఉంటారు.

"ఈ బోర్డుల్లో ఎంపికైన వారు గాజా ప్రజల శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును ముందుకు తీసుకువెళ్లే, ప్రభావవంతమైన పాలన, అత్యుత్తమైన సేవల అందించేందుకు పని చేస్తారు" అని వైట్‌హౌస్ పేర్కొంది.

వైట్‌హౌస్ సమాచారం ప్రకారం… గాజా పునర్నిర్మాణాన్ని తదుపరి దశలోకి నడిపించే ఏడుగురు సభ్యులతో కూడిన 'ఫౌండింగ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు'కు ట్రంప్ అధ్యక్షత వహిస్తారు.

ఇందులోని మిగతా సభ్యులు...

  • అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
  • పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్
  • ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్

అలాగే ఈ బోర్డులో యూకే మాజీ ప్రధాని సర్ టోనీ బ్లెయిర్ కూడా ఉన్నారు.

"గాజా స్థిరత్వానికి కీలకం"గా నిలిచేలా ప్రతి సభ్యుడికి సొంత పోర్ట్‌ ఫోలియో ఉంటుంది’’ అని వైట్‌హౌస్ తెలిపింది.

గాజా సమస్యను 'బోర్డ్ ఆఫ్ పీస్' పరిష్కరిస్తుందా?

ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం.. గాజాలోని 80శాతం మేర భవనాలు ధ్వంసమయ్యాయి. 60 మిలియన్ టన్నుల శిథిలాలతో ఉంది.

చెల్లాచెదురైన కుటుంబాలు చలికాలంలో ఇబ్బంది పడుతున్నారు. నివాస సౌకర్యం పరిమితంగా ఉంది. ఆహార కొరత విపరీతంగా ఉంది.

గతంలో కంటే పరిస్థితి కాస్త మెరుగైందని సహాయ సంస్థలు చెబుతున్నాయి. అయితే, తమ కార్యక్రమాలపై ఇజ్రాయెల్ ఆంక్షలు కొనసాగుతున్నాయని ఆ సంస్థలు చెబుతున్నాయి.

ఇజ్రాయెల్ తాము మానవతా సహాయాన్ని అందిస్తున్నామని తెలిపింది.

ఇప్పటివరకు ఏవైనా ఆంక్షలు ఉన్నట్లయితే.. అవి హమాస్ చొరబడకుండా, సహాయక చర్యలకు భంగం కలగకుండా నిరోధించడానికేనని చెప్పింది.

గాజాలో ఇప్పటికే సామగ్రిని పంపిణీ చేయడంలో ఐక్యరాజ్యసమితి విఫలమైందని ఆరోపించింది.

అయితే, బహుశా అతిపెద్ద సవాలు… కాల్పుల విరమణను కొనసాగించడమే అవుతుంది.

పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేసే ఒక విస్తృత ఒప్పందం కుదిరితేనే తాము ఆయుధాలను వదిలేస్తామని హమాస్ చెప్పింది.

మరోవైపు, ఇప్పటికీ తమ పదాతి దళం ‌నియంత్రణలో ఉన్న గాజా స్ట్రిప్‌లోని అనేక ప్రాంతాల నుంచి హమాస్ నిరాయుధీకరణ చేస్తేనే వెనక్కి తగ్గుతామని ఇజ్రాయెల్ చెప్పింది.

ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్'.. ఎంత వేగంగా మార్పును తీసుకురాగలదో, అంతకంటే ముఖ్యంగా… శాశ్వత శాంతి దిశగా కొన్ని నిర్దిష్ట చర్యలను ఎంతవరకు ముందుకు తీసుకెళ్లగలదో వేచి చూడాలి.

ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్‌'కు ఎవరెవరికి ఆహ్వానం అందిందంటే..

ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్‌'లో చేరాలని పదుల సంఖ్యలో ప్రపంచ నేతలకు లేఖలు అందినట్లు పలు కథనాలు చెబుతున్నాయి.

ఈ ఆహ్వానం అందిన వారిలో ఉన్నవారు…

  • ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని ఆల్బనీస్
  • బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా
  • సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడీస్
  • ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతహ్ అల్-సీసీ
  • యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ దేర్ లెయెన్
  • గ్రీస్ ప్రధానమంత్రి కరియాకోస్ మిస్తోతాకీస్
  • భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
  • జోర్డాన్ ప్రధానమంత్రి జాఫర్ హసన్
  • పోలండ్ అధ్యక్షుడు కరోల్ నవరోకి
  • రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
  • తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోవాన్
  • యూకే ప్రధాన మంత్రి సర్ కీర్ స్టార్మర్

న్యూజీలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సాన్‌కు కూడా ఆహ్వానం అందింది. ఆయన దీన్ని పరిశీలిస్తాం అని చెప్పారు.

థాయిలాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా తాము ఈ అంశాన్ని సమీక్షిస్తున్నట్లు తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)